సింధూ నాగరికత... వారసత్వం బయటపడి వందేళ్లు!

పొలం దున్నుతుంటేనో ఇంటికి పునాది వేస్తుంటేనో లంకెబిందెలో బంగారునాణాలో దొరికాయంటూ వార్తలు వస్తుంటాయి.

Updated : 18 Dec 2022 09:26 IST

సింధూ నాగరికత... వారసత్వం బయటపడి వందేళ్లు!

పొలం దున్నుతుంటేనో ఇంటికి పునాది వేస్తుంటేనో లంకెబిందెలో బంగారునాణాలో దొరికాయంటూ వార్తలు వస్తుంటాయి. మన స్థలంలోనే దొరికినా చట్టప్రకారం ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుంది. పురాతత్త్వ శాస్త్రవేత్తలు వాటిని పరిశీలించి మనకు తెలియని మన తాతముత్తాతల కబుర్లెన్నో చెప్పగలుగుతారు. మానవాళి నడచి వచ్చిన దారుల గురించీ వదిలి వెళ్లిన జ్ఞాపకాల గురించీ తెలుసుకోవాలంటే తవ్వకాల్లో దొరికే అలాంటి వస్తువులే ఆధారం. చరిత్రలో విలసిల్లిన నాలుగు ప్రధాన నాగరికతల్లో ఒకటైన సింధూ నాగరికత తాలూకు మన వారసత్వ సంపదను శాస్త్రవేత్తలు వెలికితీయడం మొదలెట్టి వందేళ్లయింది. ఇప్పుడు మనం అభివృద్ధి చిహ్నాలుగా భావిస్తున్న ఎన్నో అంశాలు ఐదువేల ఏళ్ల క్రితమే అక్కడ ఆచరణలో ఉన్నాయని తెలిసి ప్రపంచమే నివ్వెరపోయింది.

కాటన్‌ దుస్తులు, చిరుధాన్యాలు, మట్టిపాత్రలు, యోగా... ప్రజాస్వామ్య పాలన, ప్రణాళికాబద్ధంగా కట్టిన నగరాలు, నీటి సంరక్షణ, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ... ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నవి. ఐదువేల ఏళ్ల క్రితం జీవించిన మనుషులకు వీటి గురించి ఏమాత్రం తెలిసే అవకాశం లేదనుకుంటాం. వందేళ్ల క్రితం వరకూ పరిశోధకులూ అలాగే అనుకున్నారు. కానీ, వేలాది సంవత్సరాలుగా మట్టి పొరల కింద మరుగున పడిపోయిన వాస్తవాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఇంకా పడుతూనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా ఆర్కియాలజీ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న ఈ సింధూ నాగరికత కథా కమామిషు ఏమిటో మనమూ చూద్దామా..!
1826... అంటే- దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం. చార్ల్స్‌ మాసన్‌ అనే ఓ బ్రిటిష్‌ వ్యక్తి ఈస్టిండియా కంపెనీ సైన్యం నుంచి చెప్పకుండా ఉద్యోగం మానేశాడు. అందుకు శిక్ష తప్పించుకోడానికి కంపెనీ వ్యతిరేక చర్యల రహస్య సమాచారాన్నీ, విలువైన కళాఖండాల్నీ సేకరించి అందిస్తానని ఒప్పందం చేసుకుని యాత్రికుడిలా పంజాబ్‌ ప్రాంతంలో పర్యటిస్తున్నాడు. ఆ క్రమంలో- ఒకచోట గుట్టలు గుట్టలుగా పడివున్న ఇటుకలు అతడిని ఆకట్టుకున్నాయి. చరిత్ర పట్ల ఆసక్తి కల అతడు మరింతగా శోధించి అక్కడో పెద్ద నగరం ఉండేదనీ అది హరప్పా కావచ్చనీ అనుకున్నాడు. పంజాబ్‌తో పాటు అఫ్గానిస్తాన్‌, బెలూచిస్తాన్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించి తాను తెలుసుకున్న విషయాలతో ఒక పుస్తకం రాశాడు. ఎక్కడే సంపద దొరుకుతుందా అని చూస్తున్న ఈస్టిండియా కంపెనీ ఆ ప్రాంతాన్ని పరిశీలించమని అలెగ్జాండర్‌ బర్న్స్‌కి అప్పజెప్పింది. అతడు వెళ్లేసరికి స్థానికులు ఆ ఇటుకలను తీసుకెళ్లి ఎడాపెడా వాడుకుంటున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు పంజాబ్‌ బ్రిటిష్‌ ఆధిపత్యంలోకి వచ్చింది. అప్పుడే కొత్తగా దేశంలో రైల్వే లైన్లు వేయడం మొదలెట్టారు. రైలు పట్టాల కింద పరవడానికీ హరప్పా ఇటుకలే శరణ్యమయ్యాయి. ముల్తాన్‌, లాహోర్‌ల మధ్య దాదాపు వందమైళ్ల పొడవు రైల్వే ట్రాక్‌కి ఆ ఇటుకలనే వాడారట. 1861లో పురావస్తు తవ్వకాల కోసం ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాని ప్రారంభించాక దాని మొదటి డైరెక్టర్‌ జనరల్‌ అలెగ్జాండర్‌ కన్నింగామ్‌ పలుసార్లు అక్కడ సర్వేలు నిర్వహించాడు కానీ చెప్పుకోదగ్గ పని జరగలేదు. రాఖల్‌దాస్‌ బందోపాధ్యాయ అనే ఆర్కిటెక్టు ఒక బౌద్ధ స్తూపాన్ని గుర్తించడానికి 1919లో హరప్పా వెళ్లాడు. అప్పుడు అతడికి కంచుయుగం నాటి ఒక పరికరం కన్పించింది. జంతుచర్మాన్ని శుభ్రం చేయడానికి వాడే ఆ పరికరం స్తూపం కన్నా పురాతనమైనదని గుర్తించిన రాఖల్‌ దాస్‌ ఆ విషయాన్ని అధికారులకు తెలిపాడు. దాంతో 1920లో ఆర్కియాలజిస్టు దయారామ్‌ సాహ్ని ఆధ్వర్యంలో తవ్వకాలు ఊపందుకుని సింధూ నాగరికత ఆనుపానులన్నీ ఒక్కటొక్కటిగా బయటపడడం మొదలెట్టాయి.
ఈజిప్టు వాళ్లలాగా పిరమిడ్లనో, చైనా వాళ్లలాగా గ్రేట్‌ వాల్‌నో సింధూ నాగరికత నాటి ప్రజలు నిర్మించలేదు కానీ, ఆధునిక సమాజ నిర్మాణానికి పునాదులు మాత్రం వేశారు. శాంతియుత సహజీవనం అంటే ఏమిటో చూపించారు. కాలానికి ఎంతో ముందున్న ఆనాటి పద్ధతులు ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి.

అసలేమిటీ సింధూ నాగరికత?

సింధూ, దాని ఉపనదుల పరీవాహక ప్రాంతమంతా సారవంతమైన ఒండ్రుమట్టి కావడంతో వ్యవసాయానికి అనువుగా ఉంటుందని ప్రజలు అక్కడ స్థిరపడ్డారు. క్రమంగా గ్రామాలకు అనుబంధంగా నగరాలూ ఏర్పడ్డాయి. పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్‌ నుంచి భారత్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌ దాకా, అఫ్గానిస్తాన్‌ నుంచి గుజరాత్‌ వరకూ విస్తరించిన సువిశాల ప్రాంతంలో క్రీ.పూ.3300 నుంచి క్రీ.పూ.1300 సంవత్సరాల దాకా సాగిన ప్రజాజీవనాన్ని సింధూ నాగరికత అంటారు. ఆ సమయంలో విలసిల్లిన నగరాలే హరప్పా, మొహెంజొ దారో లాంటివి.

ఎక్కడున్నాయివి?

సింధూ నాగరికతకి సంబంధించిన తవ్వకాల్లో మొట్టమొదట కనిపెట్టినది హరప్పా నగరం. అందుకే దీన్ని హరప్పా నాగరికత అనీ అంటారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు దాదాపు 1500 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. అందులో వెయ్యిదాకా మనదేశంలో ఉండగా మిగిలినవి పాకిస్తాన్‌లో ఉన్నాయి. ఆ కాలంలో గొప్ప నగరాలుగా పేరొంది వాణిజ్యంలో కీలకపాత్ర పోషించిన వాటిలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి- హరప్పా, మొహెంజొ దారో, రఖిగార్హి, ధోలావీరా, లోథాల్‌, కునాల్‌ తదితరాలు. హరప్పా, మొహెంజొ దారొ పాకిస్తాన్‌లో ఉండగా మిగిలినవి మనదేశంలో ఉన్నాయి.

హరప్పా: నాటి పంజాబ్‌ ప్రాంతంలో 370 ఎకరాల్లో విస్తరించిన హరప్పాలో పాతిక వేలకు పైగా జనాభా ఉండేదట. దాదాపు 900 ఏళ్లపాటు ఓ వెలుగు వెలిగి ఇప్పుడో చిన్న గ్రామంగా మిగిలిన ఈ నగరం అవశేషాలు బ్రిటిష్‌ పాలనలో చాలావరకూ ధ్వంసమయ్యాయి. ఎవరికి దొరికిన కళాఖండాలను వాళ్లు అమ్మేసుకున్నారు. కొండ గుట్టల్లాగా పడివున్న ఇటుకలన్నీ మటుమాయం అయ్యాయి. సోప్‌స్టోన్‌గా పేరొందిన స్టియాటైట్‌తో పూసలు చేసే పరిశ్రమ, టెక్స్‌టైల్స్‌, వ్యవసాయ ఉత్పత్తులకు హరప్పా పేరొందింది. ఇక్కడి వర్తకులు దక్షిణాది నుంచి బంగారం, రాగిలాంటివి కొని విదేశాలకు ఎగుమతులు చేసేవారట.

కునాల్‌: ఆరువేల ఏళ్లనాటి అతి పురాతనమైన నగరం కునాల్‌. 1986లో దీని తవ్వకాలు మొదలెట్టారు. ఇక్కడ ప్రధానంగా లభించింది ‘హాక్రావేర్‌’. చేత్తో తయారుచేసిన మట్టి పాత్రలమీద మరో రంగుతో ఆప్లిక్‌ వర్క్‌ చేసినట్లుగా డిజైన్లు వేయడం ఈ కళ ప్రత్యేకత. హాక్రా నది చుట్టుపక్కల దొరికే ఒండ్రుమట్టితో వీటిని తయారుచేస్తారు.

లోథాల్‌: ప్రపంచంలోనే పురాతన రేవు పట్టణం ఇది. సబర్మతి, దాని ఉపనది అయిన భొగావోల మధ్య నిర్మించిన లోథాల్‌ రేవు సముద్ర తీరానికి 19 కి.మీ.దూరాన ఉంటుంది. దీర్ఘచతురస్రాకారంలో పొడవుగా కట్టిన రిజర్వాయర్‌కి రెండుపక్కలా దిట్టంగా ఇటుకలతో గోడలు కట్టారు. పడవలు లంగరు వేసేందుకూ సరకు ఎక్కించడానికీ దించడానికీ ఏర్పాట్లు ఉన్నాయి. ఈ రేవు వల్ల లోథాల్‌ పట్టణం పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా విలసిల్లిందనీ సింధ్‌, పెన్సిల్వేనియా ప్రాంతాల మధ్య వాణిజ్యమార్గం ఏర్పడడానికి కారణమైందనీ తెలుస్తోంది. పూసలూ, విలువైన రత్నాలూ, నగలూ ఇక్కడినుంచి పలు దేశాలకు ఎగుమతి అయ్యేవట. రాగిని దిగుమతి చేసుకుని దానికి తగరం తదితరాలను కలిపి(బ్రాంజ్‌) రకరకాల పరికరాలను తయారుచేసి ఎగుమతి చేసేవారు. అందుకే సింధూ నాగరికతను ‘బ్రాంజ్‌ ఏజ్‌’ అని కూడా అంటారు. సరకు నిల్వ చేయడానికి నిర్మించిన పెద్ద గిడ్డంగి కూడా ఇక్కడ కన్పించింది.

రఖిగార్హి: సింధూ నాగరికతకు సంబంధించి ఇప్పటివరకు వెలికి తీసిన ప్రాంతాలన్నిటిలోకీ పెద్దదైన రఖిగార్హి హరియాణాలో ఉంది. ఐదున్నర చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. ఆరోజుల్లో ఇది ప్రాంతీయ వ్యాపారకేంద్రంగా పేరొందింది. ఒకే సమాధిలో స్త్రీపురుషుల జంట అస్థిపంజరాలు ఇక్కడ దొరకగా వాటిని మ్యూజియంలో భద్రపరిచారు.

ధోలావీరా: ప్రపంచ వారసత్వ నగరంగా గతేడాదే యునెస్కో గుర్తింపు పొందిన ధోలావీరా గుజరాత్‌లోని రాన్‌ ఆఫ్‌ కచ్‌లో ఉంది. చుట్టూ ఎత్తైన గోడలతో నాలుగు పక్కలా ద్వారాలతో ఉన్న నగరంలో నీటికోసం చేసిన ఏర్పాట్లు అబ్బురపరుస్తాయి. దూరంగా ఉన్న ఏటిపై పలు ఆనకట్టలు కట్టి కాలువల ద్వారా నీటిని నగరంలోకి మళ్లించేవారు. ఇక్కడ ఉన్నట్లు పూర్తిగా రాతితో నిర్మించిన మెట్లబావులూ, రిజర్వాయర్లూ ప్రపంచంలో మరెక్కడా కన్పించలేదట. ‘గ్రేట్‌ బాత్‌ ఆఫ్‌ మొహెంజొ దారో’ కన్నా మూడు రెట్లు పెద్దదైన మెట్లబావి ఇక్కడ ఉంది. 54 ఎకరాల్లో విస్తరించిన ఈ నగరం ముఖద్వారం వద్ద మూడు మీటర్ల పొడవైన ఫ్రేమ్‌ మీద చెక్కిన
సైన్‌ బోర్డ్‌ ఉండడం విశేషం.

ఎలా తవ్వుతారు?

పురావస్తు తవ్వకాలు జరపడం అంత తేలిక కాదు. ముందుగా నిపుణులు సర్వే చేసి ఎక్కడ తవ్వాలో నిర్ణయించి లేఅవుట్‌ రూపొందిస్తారు. పదిమీటర్ల కొలతతో గ్రిడ్స్‌ తయారుచేసి ఒక్కోదాన్నీ మళ్లీ నాలుగు భాగాలుగా విభజిస్తారు. యంత్రాలను వాడకుండా శిక్షణ పొందిన కార్మికులు చేత్తోనే మట్టిని పొరలు పొరలుగా నెమ్మదిగా తవ్వితీస్తారు. తవ్విపోసే మట్టిని జల్లెడపడతారు. తవ్వేటప్పుడు ఏవైనా వస్తువుల ఆనవాళ్లు కన్పిస్తే మరింత జాగ్రత్తగా వాటికి హాని కలగకుండా బయటకు తీస్తారు. అలా తీసిన వస్తువులన్నిటినీ శుభ్రం చేసి వివరాలతో ఒక లేబుల్‌ తయారుచేసి విడిగా భద్రం చేస్తారు.

ఏమేం దొరికాయి..?

పురావస్తు తవ్వకాల్లో లభించిన వాటి ఆధారంగానే ఆనాటి ప్రజల జీవనశైలి గురించి ఎన్నో విషయాలు తెలిశాయి.
* ఆ కాలంలో రాచరికం లేదు, పాలకులంటూ ఎవరూ లేరు, ఎన్నికైన కమిటీలు పాలనా వ్యవహారాలను నిర్వహించి ఉండవచ్చన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం.
* తూనికలూ కొలతల విషయంలోకచ్చితమైన ప్రమాణాలను పాటించేవారు. అందుకే ప్రపంచదేశాలతో వ్యాపార సంబంధాలు పెట్టుకోగలిగారు.
* చాలా ఇళ్లలో కొలిమి ఉన్న ఆనవాళ్లు ఉన్నాయి. లోహాలను కరిగించి వస్తువులను తయారుచేసే నిపుణులు ఉండేవారు.
* కులమతాల ఆనవాళ్లు లేవు కానీ భవనాలు మాత్రం మూడు వర్గాలుగా ఉండేవి. నగరాలన్నీ ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. ప్రతి నగరంలోనూ సంపన్నుల పెద్ద ఇళ్లు ఒక వైపున, సాధారణ పౌరుల చిన్న ఇళ్లు మరో వైపున ఉన్నాయి. ఇళ్లలోనే స్నానపు గదులున్నాయి. పాలన వ్యవహారాల కోసం పెద్ద భవనాలు విడిగా ఉన్నాయి. బావులే కాక నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు, స్నానఘట్టాలు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజి వ్యవస్థలను అద్భుతంగా ఏర్పాటుచేసుకున్నారు. రాతితోనూ కాల్చిన ఇటుకతోనూ నిర్మాణాలను చేపట్టేవారు. 
* క్రూరమృగాలనుంచి రక్షించమని పశుపతిని ఆరాధించేవారు.

* రంగురంగుల మట్టి- పింగాణీ పాత్రలు, పూసలు, మట్టి- బంగారు ఆభరణాలను తయారుచేసేవారు.

* ఇటుకతో కట్టిన ఏడు విభాగాలున్న పెద్ద ధాన్యాగారం కన్పించింది. నేలంతా మట్టితో నున్నగా అలికి, తేమ చేరకుండా కింద గడ్డిపరిచారు. పురుగు పట్టకుండా నిమ్మకాయలు వాడారు.

* ఆరోజుల్లోనే నూలు నేసేవారు, దానికి రంగులద్దేవారు. పురుషులు ధోతీ లాంటిది ధరిస్తే స్త్రీలు పై భాగాన్ని కేవలం నగలతో కప్పుకునేవారట. సెలడోనైట్‌, గ్లూకోనైట్‌ అనే రెండు ఖనిజాల మిశ్రమాన్ని నీటితో కలిపి ఐ-షాడోగా వేసుకునేవారట. మసితో చేసిన కాటుక పెట్టుకునేవారట.

* శిథిలాల్లో దొరికిన బొమ్మల్ని పరీక్షిస్తే వాటిల్లో పిల్లలు ఆడుకునే బొమ్మలే కాక యోగాసనాలకు చెందిన భిన్న ఆకృతులు కన్పిచాయి. పశుపతి విగ్రహం కూడా యోగాసనంలోనే కూర్చుని ఉంటుంది.

* అస్థిపంజరాలను పరిశోధించిన శాస్త్రవేత్తలు నాటి ప్రజల్ని క్షయ, కుష్టు వ్యాధులు బాధించేవని పేర్కొన్నారు.

* దాదాపు 600 బొమ్మలతో ఉన్న లిపి కన్పించింది కానీ అది ఏ భాషో తెలియలేదు, ఇప్పటివరకూ ఎవరూ
చదవలేకపోయారు.

* సైన్యం, ఆయుధాలూ ఎక్కడా కన్పించలేదు. దాన్నిబట్టి వారికి యుద్ధాలు తెలియవని అర్థమౌతోంది. దాదాపు రెండువేల ఏళ్ల పాటు శాంతి పరిఢవిల్లిన నేల అది.

సింధూ- సరస్వతి పేరెలా వచ్చింది?

త్రివేణిగా పిలిచే మూడు నదుల్లో గంగా యమునా కన్పిస్తాయి కానీ సరస్వతి కన్పించదు. దాన్ని అంతర్వాహినిగా పేర్కొంటారు. నిజానికి రుగ్వేదం మొదట్లో మహానదిగా వచ్చిన సరస్వతి ప్రస్తావన తర్వాత కాలంలో ఒక చిన్న నదిగా మాత్రమే ఉంటుంది. సింధూనదికి సమాంతరంగా మరో నది ఉండి ఉంటుందని పరిశోధకుల అభిప్రాయం. భారత్‌- పాకిస్తాన్‌లను కలుపుతూ ప్రవహించే గగ్గర్‌- హాక్రా నదిని భారత్‌లో గగ్గర్‌ అనీ పాకిస్తాన్‌లో హాక్రా అనీ అంటారు. ఇదే ఒకప్పటి సరస్వతీ నది కావచ్చని కొందరి అభిప్రాయం. అయితే రుగ్వేద కాలం కన్నా ముందే ఈ నది మహానది రూపం కోల్పోయింది కాబట్టి అది కాకపోవచ్చనీ, హిందుకుష్‌ పర్వత శ్రేణుల్లో పుట్టి అఫ్గానిస్తాన్‌లో ప్రవహిస్తున్న హెల్మండ్‌ నదే సరస్వతీ నది అనీ కొందరు అభిప్రాయపడుతున్నారు. గగ్గర్‌- హాక్రా, హెల్మండ్‌... రెండిటికీ సరస్వతీ నది లక్షణాలు ఉన్నాయంటారు కొందరు పరిశోధకులు. వేల ఏళ్ల క్రితం సట్లెజ్‌ నది దిశ మార్చుకున్న క్రమంలో ఏర్పడిందే గగ్గర్‌- హాక్రా. అందుకే ఇప్పుడీ చుట్టుపక్కల ఉన్న నదులన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవేనంటూ వాటికి అనుబంధంగా విలసిల్లిన నాగరికత కాబట్టి దీన్ని ‘సింధూ-సరస్వతీ నాగరికత’గా పేర్కొంటున్నారు.

ఇంత గొప్ప నాగరికత ఎలా ముగిసింది?

ఆ ప్రశ్నే పురావస్తు పరిశోధకులను చాలా కాలం వేధించింది. నగరాలకు పేరొందిన ఈ నాగరికత చివరి రోజుల్లో ప్రజలు హిమాలయ సానువుల్లోని పల్లెలకు వలస పోయినట్లు తెలుస్తోంది. అందుకు- ఇప్పటివరకూ గుర్తించిన ప్రధాన కారణాలు... జనాభా క్రమంగా పెరిగిపోవడంతో అంతస్తుల భవనాలు కట్టాల్సి వచ్చింది, నగరాల నిర్వహణ కష్టతరమైంది. నీటి సంరక్షణ, డ్రైనేజీ వ్యవస్థల సామర్థ్యం సరిపోలేదు. వాణిజ్య భాగస్వామిగా ఉన్న మెసపొటేమియాలో రాజకీయ కల్లోలం చెలరేగడంతో ఎగుమతులు ఆగిపోయాయి. వ్యాపారులకూ కార్మికులకూ పని దొరకలేదు. ఆ సమయంలో కొందరు వ్యాపారులు తమ సంపదని కాపాడుకోవడానికి నేలమాళిగల్లో దాచుకున్నారట. ఉష్ణోగ్రతలు పెరిగి రుతుపవనాల సమయంలో తేడా రావడంతో వానలు తగ్గాయి, నదులు చిక్కిపోయాయి. దాంతో రైతులు నీటి వనరుల్ని వెతుక్కుంటూ వలస వెళ్లారు. అలా ఒక్కో నగరమూ నిర్మానుష్యమై క్రమంగా కాలగర్భంలో కలిసిపోయాయి. ఎప్పుడో ఐదు వేల ఏళ్ల క్రితం అద్భుతమైన విలువలతో విలసిల్లిన సింధూ నాగరికత నుంచి నేటి సమాజాలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయంటారు పరిశోధకులు. అన్నిటికన్నా ముఖ్యంగా అంత గొప్ప నాగరికత అదృశ్యమవడానికి దారితీసిన కారణాలు పరోక్షంగా మనకు హెచ్చరికలేనన్నది కాదనలేని వాస్తవం.


వారసత్వ సంపద!

సింధూ నాగరికతతో సంబంధం ఉన్న ప్రాంతాలను వారసత్వ సంపదగా గుర్తించి ఆ సంస్కృతిని ముందుతరాలకు అందజేయడానికి పలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటిల్లో కొన్ని...

* ధోలావీరాకి వారసత్వ నగరంగా గుర్తింపు రావడంతో ఆ నగరాన్ని ఉన్నదున్నట్లుగా పరిరక్షిస్తున్నారు.

* లోథాల్‌లో 1976లో ఆర్కియోలాజికల్‌ మ్యూజియం ఏర్పాటుచేశారు. తవ్వకాల్లో దొరికిన వస్తువులన్నిటినీ అక్కడ భద్రపరిచారు. ఆనాటి నగరం ఎలా ఉండేదో పురావస్తు శాస్త్రవేత్తలు ఊహించి తయారుచేసిన చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. రూ.3,500 కోట్లతో నేషనల్‌ మారిటైమ్‌ హెరిటేజ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. అందులో సింధూ నాగరికత నాటి నిర్మాణాలూ జీవనశైలిని ప్రతిబింబించే మినీ నగరాన్ని నిర్మిస్తున్నారు. థీమ్‌ పార్కులూ భారత నౌకాయాన చరిత్రను తెలిపే పరిశోధనా కేంద్రం తదితరాలన్నీ ఇక్కడ ఉంటాయి.

* రఖిగార్హిలో ‘సింధూ సంస్కృతి’ని తెలియజేసే అతి పెద్ద మ్యూజియాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తి అయితే, ప్రపంచంలో ఇలా ఒక నాగరికత గురించి చెప్పే మ్యూజియం ఇదే అవుతుంది.


ఆహారమూ తెలిసింది!

స్పెయిన్‌కి చెందిన ఆర్కియోబొటానిస్ట్‌ హువాన్‌ హసె గుజరాత్‌లో తవ్వకాలు జరుగుతున్న మూడు ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ బయటపడిన వంట పాత్రల్ని అధ్యయనం చేశారు. మట్టి పాత్రలు వాటిల్లో వండిన వంటకాల్లోని నూనెల్ని పీల్చుకుంటాయి. సూక్ష్మక్రిముల ప్రభావం సోకకుండా ఆయా పదార్థాల అవశేషాలు పాత్ర గోడల్లో పదిలంగా ఉంటాయట. అందుకని సేకరించిన పాత్రల్ని పగలగొట్టి మెత్తటి పొడిగాచేసి లోపల ఉన్న నూనె కణాల్ని విశ్లేషించి ఏయే పదార్థాలను వారు తిన్నారో గుర్తించారు. సింధునాగరికత ప్రజలు వంటకీ వడ్డనకీ మట్టి పాత్రలే వాడేవారనీ, ధాన్యాన్ని వేయించడం, పిండిపట్టడం లాంటివి చేసేవారనీ ఆయన పేర్కొన్నారు. వారి ఆహారంలో తృణధాన్యాలూ, పప్పులూ, గోధుమా, బార్లీ, వరి, సెనగలు, ఉలవలు, అల్లం... ఉండేవట. వంటకాల్లో జంతువుల కొవ్వు ఆనవాళ్లున్నాయి. పశుపోషణ ప్రధాన వ్యాపకం అయినప్పటికీ పాలను ఆహారంగా ఉపయోగించిన దాఖలాలు లేవు. 2017లో రాజస్థాన్‌- పాకిస్తాన్‌ సరిహద్దు దగ్గర తవ్వకాల్లో దొరికిన లడ్డూలను పరిశీలించి పలురకాల చిరుధాన్యాల్ని కలిపి వాటిని తయారుచేసినట్లు- ఏఎస్‌ఐ, బీర్బల్‌ సాహ్ని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియోసైన్సెస్‌ నిపుణులు తెలిపారు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..