Updated : 15 May 2022 02:31 IST

పెళ్లి ఆటంకాలు తొలగించే... నిమిషాంబాదేవి!

కావేరీ నది ఒడ్డున కొలువై... చల్లని చూపులతో భక్తులను అనుగ్రహించే దేవి నిమిషాంబ. పెళ్లిళ్ల విషయంలో ఎదురయ్యే ఆటంకాలను నిమిషాల్లో తొలగించే శక్తి స్వరూపిణిగా గుర్తింపు పొందిన ఈ అమ్మవారి క్షేత్రంలో ప్రతిరోజూ కాకులు వచ్చి ఆహారం స్వీకరించడం ఓ విశేషం.

ప్రశాంత వదనంతో చల్లని చూపులతో దర్శనమిచ్చే నిమిషాంబాదేవి భక్తుల కోరికల్ని నిమిషంలో తీరుస్తుందనీ అందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చిందనీ ప్రతీతి. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఆటంకాలు ఎదురవుతున్నవారు ఈ అమ్మను పూజిస్తే ఆ సమస్యలన్నీ పోతాయనేది భక్తుల నమ్మకం. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లా శ్రీరంగపట్నానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో గంజాం అనే ఊళ్లో కావేరీ నది ఒడ్డున కనిపిస్తుందీ ఆలయం.

స్థలపురాణం

ఒకప్పుడు జనుమండల అనే అసురుడు తనకు మరణం లేకుండా ఉండేలా బ్రహ్మ నుంచి వరం పొంది... దేవతల్ని వేధించడం మొదలుపెట్టాడట. దాంతో దేవతలు పరమేశ్వరుడిని వేడుకోవడంతో స్వామి తన అంశతో పుట్టిన ముక్తక అనే రుషిని యాగం చేయమంటూ ఆజ్ఞాపించాడట. అది తెలిసిన జనుమండలుడూ, అతడి అనుచరులూ యాగానికి ఆటంకం కలిగించడంతో దాన్నుంచి పార్వతీదేవి ఉద్భవించి అసురులను నిమిషంలో అంతమొందించిందట. దాంతో ముక్తక రుషి పార్వతీదేవిని నిమిషాంబగా కొలిచాడనీ అలా దేవిని ఆ పేరుతో పిలవడం మొదలుపెట్టారనీ పురాణగాథ. అలాగే మరో కథా ప్రాచుర్యంలో ఉంది. ముక్తకరుషి పరమేశ్వరుడి ఆజ్ఞతో లోకకల్యాణార్థం యాగం మొదలుపెట్టినప్పుడు అసురులు ఆటంకం కలిగించారట. సంవత్సరాలు గడుస్తున్నా దేవి అనుగ్రహించకపోవడంతో చివరకు ఆ ముని అగ్నికి ఆహుతి అయ్యేందుకు సిద్ధమయ్యాడట. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై అసురుల్ని వధించిందనీ ఆ సమయంలోనే రుషి అమ్మవారిని నిమిషాంబగా స్తుతించాడనీ అంటారు. అలా వెలసిన అమ్మవారికి నాలుగువందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించే కృష్ణరాజ ఉడయార్‌ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. బలిపీఠంపైన కాకులకు భోజనం నిమిషాంబాదేవి వైశాఖ శుక్లపక్ష దశమినాడు ఉద్భవించడం వల్ల ఆ రోజున అమ్మవారి జయంతిగా పరిగణించి విశేష పూజల్ని నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో బలిపీఠం ఉంటుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం ఆలయ పూజారి ఆ పీఠంపైన ఆహారాన్ని పెట్టి... ఇక్కడున్న గంటను కొడతాడు. దాంతో ఎక్కడెక్కడినుంచో పదుల సంఖ్యలో కాకులు వచ్చి ఆ ఆహారాన్ని తీసుకెళ్లడాన్ని భక్తులు చూడొచ్చు. ఇక... ఈ ఆలయం పక్కనే పరమశివుడి సన్నిధానం ఉంటుంది. అమ్మవారు-స్వామి దర్శనం అయిపోయాక ఈ ప్రాంగణంలోనే ఉన్న ఆంజనేయుడు, సూర్యనారాయణుడు, గణపతి, లక్ష్మీనారాయణస్వామి ఉపాలయాలను దర్శించుకోవచ్చు.
ఎలా చేరుకోవచ్చు ఈ ఆలయానికి విమానంలో రావాలనుకునే భక్తులు మైసూరు విమానాశ్రయంలో దిగితే... అక్కడి నుంచి ఆలయం 135 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్లో వచ్చే భక్తులు శ్రీరంగపట్న రైల్వేస్టేషనులో దిగొచ్చు. రోడ్డు మార్గంలో వచ్చేవారికి బెంగళూరు, మైసూరు నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.


ఉపవాసం రోజున ఏమీ తినకూడదా?

కొందరు ఉపవాసం రోజున పండ్లు తినొచ్చని చెబితే... మరికొందరు అసలేమీ తీసుకోకూడదని అంటారు. అసలు ఉపవాసం ఎలా చేయాలి?

* వారంలో ఒకరోజు ఉపవాసం ఉండేవారు కొందరైతే... మహాశివరాత్రి, ఏకాదశి తిథులూ, ఇతర ప్రత్యేక మాసాలూ, పర్వదినాల్లో ఉపవాస దీక్షను పాటిస్తారు మరికొందరు. నిజానికి ప్రత్యేక పర్వదినాలలో పూజలతో, స్తోత్ర పారాయణాలతో   దైవ చింతనలో గడపాలని మన పెద్దలు చెబుతారు. అలాంటప్పుడు ఆహారం తీసుకోకపోవడం ఉపవాసంగా భావించారు. కానీ అసలు ఉపవాసం అంటే.. ‘ఉపే- సమీపే వాసం’ ఉపవాసం... న తు కాయస్య శోషణమ్‌’ అని పెద్దలు సెలవిచ్చారు. అంటే.. దైవ చింతనకు దగ్గరగా ఉండటం ఉపవాసం అంతేకాని ఏమీ తినకుండా శరీరాన్ని శుష్కింపచేయడం కాదని మన సంప్రదాయం స్పష్టంగా చెప్పింది. కడుపునిండా తింటే కంటినిండా నిద్ర వస్తుంది. ప్రకృతి అవసరాల కోసం ఒకటికి రెండుసార్లు వెళ్లాల్సి వస్తుంది. భోజనం సిద్ధం చేసుకోవడానికీ కొంత సమయం పెట్టుకోవాలి. వీటన్నింటి కారణంగా దైవచింతనలో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండదు కాబట్టే ఉపవాసం రోజున భోజనం మానేసే ఆచారం మొదలయ్యింది. నేటి దేశకాల పరిస్థితుల దృష్ట్యా ఉపవాసం చేయాలనుకున్నప్పుడు పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం పరిమితంగా తీసుకుని వీలైనంత ఎక్కువ సమయం దైవచింతనలో గడపవచ్చు. కాకపోతే... ఉపవాసం పేరుతో ఒక రోజు భోజనం మానేయడం వల్ల  ప్రయోజనం లేకపోలేదు. మనిషికి విరామం అవసరమైనట్టే మన జీర్ణకోశానికి కూడా అప్పుడప్పుడూ విశ్రాంతి కల్పించడం తప్పనిసరి. వారానికో, పక్షానికో, నెలకో ఒక రోజు లేదా కనీసం ఒకపూట ఆహారం తీసుకోకుండా ఉంటే జీర్ణకోశానికి విశ్రాంతి లభిస్తుంది. తద్వారా జీర్ణప్రక్రియ మరింత చురుగ్గా సాగుతుంది. ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. ఈ కారణంతోనూ ఉపవాసం పేరిట అప్పుడప్పుడూ భోజనం మానుకోవడం మంచిదేగా.

- ఆచార్య మల్లాప్రగడ
శ్రీమన్నారాయణమూర్తి ప్రవచనకర్త


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని