ఈ స్వామికి కొబ్బరిమొక్కే ముడుపు!

బిల్వపత్ర ప్రియుడైన పరమేశ్వరుడు, ఆ ఆకుల రాశి అడుగున స్వయంభువుగా వెలసి వ్యాఘ్రేశ్వరుడిగా దర్శనమిస్తున్న క్షేత్రమే వ్యాఘ్రేశ్వరం. తనకు ముడుపులుగా కొబ్బరి మొక్కను స్వీకరిస్తూ కోరిన

Published : 06 Mar 2022 00:24 IST

ఈ స్వామికి కొబ్బరిమొక్కే ముడుపు!

బిల్వపత్ర ప్రియుడైన పరమేశ్వరుడు, ఆ ఆకుల రాశి అడుగున స్వయంభువుగా వెలసి వ్యాఘ్రేశ్వరుడిగా దర్శనమిస్తున్న క్షేత్రమే వ్యాఘ్రేశ్వరం. తనకు ముడుపులుగా కొబ్బరి మొక్కను స్వీకరిస్తూ కోరిన కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా పూజలు
అందుకుంటున్న ఈ స్వామి దర్శనం శుభాలను కలిగిస్తుందనేది భక్తుల నమ్మకం.

పరమేశ్వరుడు వివిధ పేర్లతో కొలువై, భక్తులను అనుగ్రహించడం పరిపాటే. అలాగే తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట మండలం పుల్లేటికుర్రు పంచాయతీ పరిధిలోని వ్యాఘ్రేశ్వరంలో స్వామి బాలా త్రిపుర సుందరితో వ్యాఘ్రేశ్వరస్వామిగా కొలువై... విశేష పూజల్ని అందుకుంటున్నాడు. ఈ క్షేత్రంలోని స్వామిని దర్శించుకుని మనసులో ఏదయినా అనుకుంటే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం.

ఆ తరువాత ముడుపుగా ఈ ఆలయం సన్నిధానంలో కొబ్బరిమొక్కను నాటి తమ మొక్కును చెల్లించుకుంటారు భక్తులు. అంతేకాదు... మాసశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం రోజున, లేదా పౌర్ణమి పర్వదినాలలో లక్షబిల్వార్చన చేయించి తమ భక్తిని చాటుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ ఆలయం ఏర్పాటు వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

స్థలపురాణం

స్వామి పులి రూపంలో దర్శనమిచ్చి శివలింగంగా మారడం వల్లే శివుడిని ఇక్కడ వ్యాఘ్రేశ్వరస్వామిగా పిలుస్తున్నారని చెబుతారు. పూర్వం పుల్లేటికుర్రు గ్రామం పెద్దాపురం సంస్థానంలో ఉండేది. పేరుకు అది గ్రామమే అయినా అప్పట్లో ఇది అడవి కావడంతో పులులు ఎక్కువగా తిరిగేవట. ఈ గ్రామానికి సమీపంలో శివభక్తుడైన ఓ బ్రాహ్మణుడు ఉండేవాడట. ఓసారి ఆ భక్తుడు శివరాత్రికి ముందురోజు మారేడు దళాలను సేకరించేందుకు పుల్లేటికుర్రుకు చేరుకున్నాడట. ఆ ఊళ్లోకి అడుగు పెట్టిన కాసేపటికే ఓ పులి అతడిని వెంబడించడంతో ప్రాణభయంతో పరుగుపెట్టి మారేడు చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడట. ఎంతసేపటికీ పులి వెళ్లకపోవడంతో ఆ భక్తుడు చెట్టుపైనే ఉండిపోయాడట. క్రమంగా శివరాత్రి ఘడియలు సమీపించడంతో ఆ బ్రాహ్మణుడు పరమశివుడిని మనస్సులో ధ్యానించుకుంటూ పులినే శివలింగంగా భావించి దానిపైన ఒక్కో బిల్వదళం వేయడం ప్రారంభించాడట. పూజంతా పూర్తయి... తెల్లారేసరికి మారేడు దళాలన్నీ ఓ గుట్టలా పేరుకున్నాయట. అయితే ఆ గుట్ట అడుగున పులి ఉందని భయపడిన బ్రాహ్మణుడు అటుగా వెళ్తున్న కొందరు రైతుల్ని పిలిచి తన పరిస్థితి వివరించడంతో వాళ్లు గునపంతో దాన్ని చంపేందుకు ప్రయత్నించారట.

ఆ సమయంలో రాయి ఉన్నట్లుగా శబ్దం రావడంతో దళాలను తొలగించిన ఆ రైతులకు అక్కడ శివలింగం కనిపించిందట. బ్రాహ్మణుడు చెట్టుదిగి రైతులతో కలిసి శివలింగాన్ని పూజించి వెళ్లిపోయాడట. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ ప్రాంతాన్ని పాలించే మహారాజుకు స్వామి కలలో కనిపించి తన ఉనికిని తెలియజేసి ఆలయం కట్టించమని చెప్పాడట. దీంతో రాజు ఆలయాన్ని నిర్మించాడనీ.. అప్పటినుంచీ స్వామిని వ్యాఘ్రేశ్వరుడిగా కొలుస్తున్నారనీ... స్వామి శివలింగంగా వెలసిన ప్రాంతాన్ని
వ్యాఘ్రేశ్వరంగా పిలుస్తున్నారనీ అంటారు.

స్వామి పేరు పెట్టుకుంటూ....

ఈ ఆలయం ఎప్పటినుంచి ఉందని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవనీ... ఎందరో రాజులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారనీ చెబుతారు. ఈ క్షేత్రంలో స్వామితోపాటూ బాలా త్రిపురసుందరీదేవిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి రుక్మిణీ -సత్యభామ సమేత మదనగోపాలస్వామి క్షేత్రపాలకునిగా ఉండటం విశేషం. స్వామి సన్నిధానానికి దగ్గర్లో వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ దేవతామూర్తుల నాభి పైభాగం మానవ రూపంలో, నాభి కింద భాగం సర్పరూపంలో కనిపించడం విశేషం. ఈ ఊరికి చుట్టుపక్కల ప్రాంతాల్లో పుట్టిన పిల్లల పేర్లకు కులమతాలతో సంబంధం లేకుండా వ్యాఘ్రేశ్వర అనే పేరు కలపడాన్ని ఓ ఆచారంగా భావిస్తారు భక్తులు. ఇక్కడ పర్వదినాల్లో నిర్వహించే ప్రత్యేక పూజలు చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు.

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేటకు ఏడు కిలోమీటర్లు, రావులపాలెం- అమలాపురం వెళ్లే మార్గంలో పుల్లేటికుర్రు నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజమండ్రి వరకూ రైల్లో వస్తే, అక్కడినుంచి అంబాజిపేటకు బస్సులు లేదా ప్రైవేటు వాహనాలు ఉంటాయి. కాకినాడ నుంచి రావాలనుకునే భక్తులు అమలాపురం వచ్చి అక్కడి నుంచి పుల్లేటికుర్రుకు చేరుకోవచ్చు.

- పళ్ళ శ్రీనివాసరావు, న్యూస్‌టుడే, అంబాజిపేట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..