Updated : 17 Oct 2021 14:42 IST

Wipro - Premji: విప్రో.. విలువల బాటలో 75 ఏళ్లు..!

దసరాకో దీపావళికో ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వడం ఆనవాయితీ. కానీ స్వాతంత్య్ర దినోత్సవానికి బోనస్‌ ఇచ్చిన కంపెనీ మీకు తెలుసా? అది ఒక నూనె మిల్లు. స్వాతంత్య్రానికి పూర్వం మహారాష్ట్రలోని ఓ మారుమూల పట్టణంలో ప్రారంభమైన ఆ నూనె మిల్లు స్వతంత్ర భారతదేశంతో పాటే అభివృద్ధి చెందింది. వివిధ రంగాలలోకి విస్తరించి, రెండు లక్షలకు పైగా  ఉద్యోగులతో భారతీయ మల్టీనేషనల్‌ కంపెనీగా పేరొందింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ సంపద సృష్టించిన సంస్థగా చరిత్రకెక్కి డెబ్భై ఐదేళ్ల పండుగ జరుపు కుంటున్న ‘విప్రో’ విశేషాల సమాహారం.

క పెద్దాయన కారులో వెళ్తున్నాడు. రోడ్డు మీద నీటిగుంట ఉండటంతో పక్కన నడిచి వెళ్తున్న వ్యక్తి దుస్తుల మీద బురద చిందింది. అది చూసి నొచ్చుకున్న పెద్దాయన కారాపి దిగి వెళ్లి ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పాడు. అతడిని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లి దించాడు. ఆ పెద్దాయన కుమారుడు... నలుగురినీ కలుపుకుని వెళ్లే చురుకుదనమూ తెలివితేటలూ ఉన్న వ్యాపారవేత్త. ‘మా దేశం వచ్చెయ్‌... నీకు ఆర్థికమంత్రి పదవి ఇస్తా’నన్నాడు పాకిస్తాన్‌ గవర్నర్‌ జనరల్‌ జిన్నా. ‘పదవి కోసం దేశాన్ని వదులుకోను. ఆమరణాంతం నాది భారతదేశమే...’ తేల్చి చెప్పాడు.

ఆ ఇద్దరి వారసుడు... తండ్రి నూనెమిల్లుతో మొదలుపెట్టి ఐటీ వరకూ ఎన్నెన్నో వ్యాపారాలతో వేల కోట్ల సంపద ఆర్జించాడు. తాను మాత్రం నిరాడంబరంగా జీవిస్తూ సంపదలో 70 శాతాన్ని దానధర్మాలకు ఇచ్చేశాడు. గతేడాది ఏకంగా రోజుకు 22 కోట్ల రూపాయల చొప్పున దానం చేసిన పెద్ద మనసు అతడిది.

తరాలు మారినా మారని విలువలకు ఉదాహరణ ప్రేమ్‌జీ కుటుంబమైతే, ఆ విలువలకు ప్రతిబింబం ‘విప్రో’ సంస్థ. చిన్న నూనెమిల్లు... పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారడం వెనక సామాన్యుల ఊహకందని కథ ఉంది. దాని సారథుల కలలూ కష్టాలూ ఉన్నాయి. నిబద్ధతతో పనిచేసిన ఉద్యోగులున్నారు. రాజీపడని సిద్ధాంతాలున్నాయి. అవన్నీ కలిసి దేశానికి అందించిన ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ కథ ఈ తరం వ్యాపారవేత్తలకు పెద్ద పాఠం. నాలుగు తరాల మనుషుల అనుబంధాలను పెనవేసుకుంటూ సాగిన ఏడున్నర దశాబ్దాల ప్రస్థానమిది.

బియ్యం వ్యాపారం
కచ్‌ ప్రాంతానికి చెందిన హాషం ప్రేమ్‌జీ తండ్రి బియ్యం వ్యాపారం చేస్తూ వారానికి రెండు రూపాయలు సంపాదించేవారట. ఆరోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. అప్పుడు బర్మా(మయన్మార్‌) హోల్‌సేల్‌ బియ్యం వ్యాపారానికి కేంద్రం. హాషం రంగూన్లో బియ్యం కొని పలు దేశాలకు రవాణా చేస్తూ ‘రైస్‌ కింగ్‌’ అన్న పేరు తెచ్చుకుని ముంబయిలో స్థిరపడ్డారు. ఆయన కొడుకు మహమ్మద్‌హుసేన్‌ డిగ్రీ పట్టా పుచ్చుకుని వచ్చాడో లేదో హాషం హఠాత్తుగా కన్నుమూశారు. పోయేముందు ఆయన చేసిన పని కొడుక్కి డాక్టర్‌ గుల్బానూ పటేల్‌తో పెళ్లి చేయడం. మహమ్మద్‌హుసేన్‌ ఆధునిక భావాలున్న యువకుడు. తండ్రి నుంచి వ్యాపారనైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలనూ అందిపుచ్చుకున్నాడు. ముప్పయ్యేళ్లకే ఇండియన్‌ మర్చంట్స్‌ ఛాంబర్‌కి అధ్యక్షుడయ్యాడు. పాకిస్థాన్‌ వస్తే ఆర్థికమంత్రి పదవి ఇస్తానని జిన్నా పిలిస్తే తిరస్కరించింది ఈయనే.

1940వ దశకమది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి రోజులు. దేశంలో స్వాతంత్య్రం కల సాకారమవుతున్న వేళ... మొత్తంగా ప్రపంచం మారబోతోందని గుర్తించిన మహమ్మద్‌హుసేన్‌ సొంతంగా పరిశ్రమ పెట్టాలనుకున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వేరుశనగ పంట ఎక్కువ కాబట్టి నూనెమిల్లు అయితే బాగుంటుందని 1945 డిసెంబరులో మహారాష్ట్రలోని అమల్నేర్‌లో వెస్ట్రన్‌ ఇండియా వెజిటబుల్‌ ప్రొడక్ట్స్‌ పేరుతో సంస్థని ప్రారంభించాడు. పెట్టుబడి కోసం పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లాడు. ఒక్కో షేరు విలువ వంద రూపాయలు... అంటే- అప్పట్లో 33 గ్రాముల బంగారం ఖరీదు. అయినా 17లక్షలు సేకరించాడు (ఆ తర్వాత మళ్లీ 2000లోనే విప్రో పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లి న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజిలో లిస్టయింది). స్వాతంత్య్రం వచ్చేనాటికల్లా సంస్థ నుంచి వనస్పతి మార్కెట్లోకి వచ్చింది. దాంతోపాటే 787 బట్టల సబ్బు కూడా. ఆ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించింది. దాంతో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా కార్మికులందరికీ నెల జీతం బోనస్‌గా ఇచ్చాడు మహమ్మద్‌ హుసేన్‌. పదేళ్లు తిరిగేసరికల్లా ఆసియాలోనే అతిపెద్ద నూనె మిల్లు అయింది వెస్టర్న్‌ ఇండియా వెజిటబుల్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ.

అలాగని అంతా సవ్యంగా సాగిందనుకుంటే పొరపాటే. స్వతంత్ర దేశంలో వేరుశనగ ధర పెరిగింది. నూనె ధర మీద మాత్రం ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. దానికి తోడు వరసగా మూడేళ్లు కరవు. పక్కన ధాన్యం వ్యాపారం ఉండబట్టి నష్టాలను పూడ్చుకోగలిగాడు మహమ్మద్‌హుసేన్‌. రాజకీయ, వ్యాపార రంగాల్లో అతనికి మంచి పలుకుబడి ఉండేది. 1960వ దశకంలో ప్రభుత్వం ధాన్యం వ్యాపారాన్ని జాతీయం చేయబోగా వ్యతిరేకిస్తూ ధాన్యం డీలర్ల తరఫున ఆందోళన చేసి అరెస్టయ్యాడు. 1965 నాటికి నూనె మిల్లు గాడినపడింది. ఆ తర్వాత ఏడాదే గుండెపోటుతో మరణించాడు మహమ్మద్‌హుసేన్‌.

తండ్రిలాగే..
పెద్ద కొడుకూ ఇద్దరు కూతుళ్లూ విదేశాల్లో స్థిరపడటంతో తల్లి గుల్బానూ కుటుంబ వ్యాపారానికి వారసుడిగా చిన్నకొడుకునే ఎంచుకుంది. దాంతో తండ్రిలాగే ఇరవై ఒక్కేళ్ల వయసులో వ్యాపార బాధ్యతలు అజీమ్‌ ప్రేమ్‌జీ భుజాల మీద పడ్డాయి. అమెరికాలో చదువుకుంటున్న అతడు వచ్చేవరకూ సంస్థ వ్యవహారాలు తల్లే చూసుకుంది. ఆరోజుల్లోనే పోలియో బాధితులైన పిల్లలకోసం దేశంలోనే తొలి ఆర్థోపెడిక్‌ ఆస్పత్రిని నిర్వహిస్తోందామె. మొదటిసారి షేర్‌హోల్డర్ల సమావేశానికి హాజరవగా వ్యాపారానుభవం ఏమాత్రం లేని తల్లీకొడుకుల వల్ల లాభం లేదనీ మంచి పేరున్నప్పుడే సంస్థను అమ్మేస్తే నయమనీ అభిప్రాయపడ్డారు కొందరు భాగస్వాములు. ఆ అవసరం రాకుండా చూస్తామని హామీ ఇచ్చింది గుల్బానూ.

ఒక పక్క తండ్రి పోయిన దుఃఖం. మరోపక్క ఏమీ తెలియని వ్యాపార బాధ్యతలు... అజీమ్‌ ప్రేమ్‌జీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చదువే పూర్తికాలేదంటే ఆ చదివిన చదువుకీ వ్యాపారానికీ సంబంధమూలేదు. ఇదీ నా బలం... అని చెప్పడానికేముంది? కానీ భాగస్వాముల అభిప్రాయం తప్పని నిరూపించాలంటే వ్యాపారాన్ని సవాలుగా తీసుకోవాలి. అమెరికా నుంచి వచ్చి అమల్నేర్‌ లాంటి చిన్న పట్టణంలో 40డిగ్రీల వేడిలో పనిలోకి దిగారు ప్రేమ్‌జీ. కంపెనీలో సమర్థులు ఎవరూ లేకపోయేసరికి అది అంతంతమాత్రంగా నడుస్తోంది. ఎండ ఎక్కువగా ఉందనీ, కరెంటు లేదనీ, రకరకాల కారణాలతో వేసవిలో ఉత్పత్తి నిలిచిపోయేది. పైగా రోజువారీ ఉత్పత్తిమీద పరిమితి ఉండడంతో లాభాలు రావాలంటే ఖర్చు తగ్గించుకోవడమొక్కటే మార్గం. బ్యాంకులో రుణం తీసుకుందామంటే బ్యాలన్స్‌షీటే లేదు. దాంతో దుకాణాల్లో మార్వాడీ వాళ్లు రాసుకునే లెక్కలు చూసి 13 అంశాలతో ఒక పట్టిక తయారుచేశారు ప్రేమ్‌జీ. లెక్కలన్నీ పక్కాగా నమోదయ్యేలా చూడటంతో సంస్థ పనితీరు గాడినపడింది. ఇక, వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవటానికి ఎంబీఏ కళాశాలకు వెళ్లి వాళ్లు సూచించిన పుస్తకాలన్నీ తెచ్చుకుని చదివేవారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను పరిచయం చేసుకుని తానూ వాళ్లలాగా ఎదగాలనుకుంటున్నాననీ సలహాలివ్వమనీ అడిగేవారు. వాళ్లు చెప్పిన మాటలన్నీ ఇంటికెళ్లేసరికి మర్చిపోతానేమోనని రెస్ట్‌రూమ్‌కి వెళ్లి గబగబా కాగితంమీద రాసుకునేవారట. అలా రెండేళ్లు కష్టపడ్డాక బోర్డు అతడి సత్తాని గుర్తించి ఎండీగా నియమించింది. ఇక ఆ తర్వాత సంస్థని ఆయన నడిపిన తీరు బహుళ జాతి సంస్థలను సైతం అబ్బురపరిచింది.

విలక్షణ వ్యక్తిత్వం
గుల్బానూ తండ్రి కూడా డాక్టరే. ఆ రోజుల్లోనే ఆయన పేదల ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్యం చేయడమే కాక ఖర్చుల కోసం కొంత డబ్బు కూడా వారి తలగడ కింద పెట్టి వచ్చేవారట. ఇద్దరు తాతల నుంచీ తల్లిదండ్రుల నుంచీ అందిపుచ్చుకున్న విలువలు ప్రేమ్‌జీ వ్యక్తిత్వాన్ని విలక్షణంగా తీర్చిదిద్దాయి. ఆ ప్రత్యేకత సంస్థ నిర్వహణలోనూ ప్రతిఫలించేది. ఇతర కుటుంబ వ్యాపార సంస్థలు అనుసరించే పద్ధతులకి ఆయన అనుసరించే పద్ధతులు పూర్తి భిన్నంగా ఉండేవి. యజమానిగా నిర్ణయాలన్నీ తానే తీసుకోవాలనుకోకుండా బహుళ జాతి సంస్థల్లాగా సమర్థులకు కీలక విభాగాలను అప్పజెప్పి సంస్థను ప్రొఫెషనల్‌గా నడపాలను కున్నారు. నూనె తయారీ సంస్థ నుంచి ఒక బ్రాండ్‌గా ఎదగాలనుకున్నారు. ఫలితంగా వనస్పతి సన్‌ఫ్లవర్‌ వనస్పతి అయింది. ఐఐటీలో చదివి ఇతర సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఇద్దరిని కీలక స్థానాల్లో నియమించుకున్నారు. 1970లో సంస్థ రజతోత్సవాల నాటికి ప్రేమ్‌జీ కలలు సన్‌ఫ్లవర్‌ బ్రాండ్‌ను దాటి ముందుకెళ్లాయి. కానీ వార్షిక టర్నోవరు కేవలం ఏడు కోట్లు ఉన్న కంపెనీకి అవి ఆచరణ సాధ్యం కానివి. అలాగని ఆశలు వదులుకోలేదు. నిపుణులైన ఉద్యోగులు తోడుంటే ఏదైనా సాధించవచ్చని నమ్మారు ప్రేమ్‌జీ. ఐఐఎం గ్రాడ్యుయేట్లతో టీమ్‌ని తయారుచేసుకోవాలనుకున్నారు. 300 దరఖాస్తుల్ని వడపోసి 65 ఇంటర్వ్యూలు చేసి మొత్తానికి ఒకరిని ఎంపిక చేశారు. ‘కంపెనీ ఏమంత పెద్దది కాదు, కానీ ఎండీ ఇంత శ్రద్ధగా ఇంటర్వ్యూ చేసి తీసుకుంటున్నారంటే విస్తరణ ప్రణాళిక ఏదో ఉండే ఉంటుందనుకున్నా, అందుకే చేరా’నంటాడు ఆరోజు ఎక్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌గా ఎంపికైన ప్రవీణ్‌ దేశాయ్‌. ఆ తర్వాత ఫైనాన్స్‌ మేనేజర్‌ పదవికి తగిన వ్యక్తిని ఎంపిక చేయడానికి
ప్రేమ్‌జీకి మూడేళ్లు పట్టింది.

నమ్మకం నిలబెట్టేవారు
అప్పటివరకూ హోల్‌సేల్‌ డీలర్లకు టోకున అమ్ముతున్న వనస్పతిని రీటైల్‌గా వినియోగదారులకు చేరువ చేసేందుకు కిలో, అరకిలో చొప్పున ఫ్లెక్సి ప్యాక్‌లను మార్కెట్‌లోకి తెచ్చింది విప్రో. అయితే ఆ ప్యాకెట్‌ రవాణాలో ఒత్తిడిని తట్టుకోదనీ చిరిగిపోతే నష్టపోతామనీ స్టాకిస్టులు అభ్యంతరం చెప్పారు. మరొకరెవరైనా అయితే వచ్చి ఆ విషయమే పైవాళ్లకు చెప్పి చేతులు దులుపుకునేవారు. కానీ బల్క్‌సేల్స్‌ హెడ్‌గా ఉన్న రామమూర్తి అలా చేయలేదు. ప్యాకెట్‌ ఎంత గట్టిగా ఉందో చెప్పడానికి దానిమీద తాను నిలబడి చూపించాడు. ఇంకేమంటారు, మాట్లాడకుండా తీసుకెళ్లారు. విప్రో ఉద్యోగులు ఎంత బాధ్యతగా ఉంటారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రతివాళ్లూ సంస్థ తమదే అన్నట్లుగా ఆలోచించి పనిచేస్తారు. 1973 నుంచి నేరుగా క్యాంపస్‌ నుంచి రిక్రూట్‌ చేసుకోవడం మొదలెట్టారు ప్రేమ్‌జీ. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీస్‌ కూర్చోవడానికి ఎప్పుడూ ఒక కుర్చీ తక్కువగా ఉండేదట. అన్ని విభాగాల్లోనూ తిరుగుతూ పని నేర్చుకునేవారికి కుర్చీతో ఏం పని- కష్టపడి పనిచేయడం అక్కడినుంచే మొదలయ్యేది. యువ ఉద్యోగులతో ప్రేమ్‌జీ బాగా కలిసిపోయేవారు. సాయంత్రం పూట గంటలు గంటలు చర్చలు జరిగేవి. సినిమాలూ రాజకీయాలూ తప్ప పని గురించి ఎంతైనా మాట్లాడవచ్చు. నిస్సంకోచంగా అభిప్రాయాలు పంచుకోవచ్చు. అలా వారితో సన్నిహితంగా మాట్లాడుతూనే సామర్థ్యాలను కనిపెట్టి సాధారణ ఉద్యోగులనుంచి నాయకులనూ బృందాలనూ తయారుచేసుకునేవారాయన. తమది చిన్న సంస్థే అయినా, ఆచరణలో మార్వాడీ వ్యాపారుల పద్ధతులనే అవలంబిస్తున్నా, ప్రేమ్‌జీ చూపు మాత్రం ఎప్పుడూ హిందూస్థాన్‌ లీవర్‌వైపు ఉండేది. అవినీతిమయంగా ఉన్న పారిశ్రామిక వాతావరణంలో విలువలకు కట్టుబడి స్వయంకృషినే నమ్ముకున్న ప్రేమ్‌జీని హిందూస్థాన్‌ లీవర్‌ అధికారులూ ఎంతో గౌరవించేవారు.

వైవిధ్యం వైపుగా..
1974లో వేరుశనగ పంటకి నష్టం వాటిల్లడంతో మొత్తంగా నూనెల పరిశ్రమ దెబ్బతింది. దానికి ప్రభుత్వ ఆంక్షలూ తోడవడంతో అందరూ బ్లాక్‌మార్కెట్‌లో అమ్మేవారు. సన్‌ఫ్లవర్‌ బ్రాండ్‌ ఒక్కటే కచ్చితమైన ధరకి అందుబాటులో ఉండడం వల్ల గిరాకీ, దాంతోపాటే టర్నోవరూ పెరిగాయి. ఆ పరిస్థితులు విప్రోని కొత్త వ్యాపారాలవైపు మళ్లేలా చేశాయి. సాంకేతికత ఆధారంగా త్వరగా అభివృద్ధి సాధ్యమైన రంగం కోసం అన్వేషిస్తూనే అవకాశాలను సమయానికి అందిపుచ్చుకునేవారు ప్రేమ్‌జీ. 1986లో ప్రారంభించిన సంతూర్‌ సబ్బు వినియోగదారులను ఆకట్టుకుంది. 2000లో ఆదాయంలో సన్‌ఫ్లవర్‌ వనస్పతిని దాటిపోయిన ఈ సబ్బు ఇప్పుడు దేశంలో అమ్ముడుపోతున్న రెండో పెద్ద బ్రాండ్‌. మరో పోటీ సంస్థలో కార్మికులు సమ్మె చేస్తుండడంతో ఆ అవకాశాన్ని వాడుకుని విప్రో శీకాకాయ్‌ని తెచ్చారు. ఎప్పటికప్పుడు మార్కెట్‌ అవసరాలను గమనించుకుంటూ ఆ రంగంలోకి ప్రవేశిస్తూ వచ్చింది విప్రో. ఐబీఎం కంపెనీ ఇక్కడినుంచి వెళ్లిపోవడంతో మినీ కంప్యూటర్ల తయారీ చేపట్టింది. ఆ రంగం గురించి ఏమీ తెలియకపోయినా అమెరికా వెళ్లి పెద్ద పెద్ద కంపెనీలన్నీ చూసి తెలుసుకుని వచ్చి మరీ పనిచేశారు సిబ్బంది. ఒకదాని తర్వాత ఒకటిగా విద్యుత్‌ బల్బులు, వైద్య పరికరాలు, ఏరోస్పేస్‌... అసలు విప్రో చేయని వ్యాపారం లేదన్నట్లుగా సాగింది ఆ విస్తరణ. సాఫ్ట్‌వేర్‌తో తయారీ రంగం నుంచి సేవల రంగంలోకి వచ్చింది. వెస్టర్న్‌ ఇండియా వెజిటబుల్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ కాస్తా విప్రో కార్పొరేషన్‌ అయ్యి ముంబయి నుంచి బెంగళూరుకు మారింది. జీఈ లాంటి సంస్థలతో సంయుక్త భాగస్వామ్యాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది.

విలువలే ముఖ్యం
‘ఒక పనిచేయండి- కంపెనీ కారు ఇస్తాను, మా డ్రైవరు మిమ్మల్ని నేరుగా బ్రిడ్జిమీదికి తీసుకెళ్తాడు, అక్కడ దిగి నదిలోకి దూకండి...’

ఆహార ఉత్పత్తుల్లో కల్తీ జరగకుండా చూడాల్సిన ప్రభుత్వాధికారి అక్కడ కల్తీ ఏమీ జరగడం లేదని తెలిసి కూడా లంచం కోసం బ్లాక్‌ మెయిల్‌ చేస్తోంటే విప్రో అధికారి చెప్పిన జవాబిది.

మరోసారి... మధ్యప్రదేశ్‌లో ఒక మంత్రి సిఫార్సుచేసిన డీలర్లని నియమించుకోనందుకు విప్రో ఆస్తుల మీద 48 దాడులు జరిగాయి. కల్తీ చేస్తున్నారని కేసులు పెట్టారు. పేపర్లలో ఆ వార్తలు చూసి ఉద్యోగులు బెంబేలెత్తినా, ఆఖరికి తనమీదే అరెస్టు వారెంటు వచ్చినా ప్రేమ్‌జీ తొణకలేదు. పోరాడదామన్నారే తప్ప రాజీపడలేదు. అప్పుడు విప్రో ఉత్పత్తులకి 40శాతం మార్కెట్‌ వాటా ఆ రాష్ట్రానిదే. అంత సరకునీ అక్కడినుంచి వెనక్కి తెప్పించారు. దాంతో ఒక్కసారిగా అక్కడ తీవ్రకొరత ఏర్పడింది. విషయమేంటో కనుక్కోడానికి జిల్లా కలెక్టర్‌ ఫోన్‌ చేశాడు. కల్తీ సరకు అన్నారు కదా, దానిని ఎలా సరఫరాచేస్తామని ప్రశ్నించారు విప్రో సిబ్బంది. చేసేది లేక కేసులన్నీ వాళ్లే ఉపసంహరించుకున్నారట

ఇంకోసారి... అన్ని అనుమతులూ తీసుకునే కొత్తగా ఫ్యాక్టరీ పెట్టారు. కానీ లంచమివ్వలేదని అధికారులు కరెంటు కనెక్షన్‌ ఇవ్వలేదు. ఏకంగా ఏడాదిన్నర పాటు డీజిల్‌ జనరేటర్‌తో విప్రో ఫ్యాక్టరీ పనిచేసిందే తప్ప లంచం ఇవ్వలేదు.

పాతికకు పైగా రంగాల్లోకి విస్తరించిన విప్రో కథలో ఇలాంటి ఘటనలు ఎన్నో!

వారసత్వం కాదు..
అజీమ్‌ ప్రేమ్‌జీకి ఇద్దరు కొడుకులు. వాళ్లని సాధారణ పాఠశాలలో చదివించారు. వాళ్లంతట వాళ్లు తగిన అర్హతలతో వస్తేనే తప్ప- వారసత్వంగా విప్రో పదవి ఇవ్వాలని తండ్రీ అనుకోలేదు, పిల్లలూ ఆశించలేదు. డిగ్రీ చదవడానికి యూఎస్‌ వెళ్లిన పెద్ద కొడుకు రిషద్‌కి తండ్రి పంపించే డబ్బు సరిపోయేది కాదు. క్యాంపస్‌లోని పిజా కార్నర్‌లో పని చేశాడు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదివేటప్పుడు వేసవి సెలవుల్లో బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. కానీ సూటు కొనుక్కోడానికి డబ్బులేదు. తన అవసరాలన్నీ చెబుతూ తండ్రికి ఉత్తరం రాశాడు రిషద్‌. ఆయన స్పందించక పోవడంతో నాన్నమ్మే రిషద్‌ని ఆదుకుంది.చదువయ్యాక జీఈలో ఉద్యోగం చేస్తుండగా ప్రముఖ భారతీయ వ్యాపార వేత్తలంటూ నారాయణమూర్తి, ప్రేమ్‌జీల గురించి అక్కడి పత్రికల్లో పెద్ద వార్త వచ్చింది. అది చూసిన పై అధికారి రిషద్‌ని పిలిచి ‘మీ ఇంటిపేరులాగే ఉంది, ఈయన నీకు బంధువా’ అని అడిగాడట. అవునని చెబితే తనని ఎక్కడ వేరుగా చూస్తారోనని కాదని చెప్పాడట రిషద్‌. ప్రేమ్‌జీ కుమారుడిగా కాక తనను తాను నిరూపించుకోవాలని అనుకున్నానంటాడు రిషద్‌. పెళ్లయ్యాక కొన్నాళ్లకి తల్లిదండ్రుల దగ్గర ఉండాలనుకుని తనంతట తనే ఇండియా వచ్చేశాడు కానీ తండ్రి రమ్మని చెప్పలేదు. ఇక్కడికి వచ్చాక గొప్ప సంస్థగా పేరు తెచ్చుకున్న విప్రో ఉండగా మరో సంస్థలో ఉద్యోగం చేయడం భావ్యం కాదని విప్రోలో చేరాడట. అది కూడా బోర్డు సభ్యులూ ఉన్నతాధికారుల సలహా తీసుకుని తన సామర్థ్యానికి తగిన బ్యాంకింగ్‌ అండ్‌

ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగంలో చేరాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రెండేళ్ల క్రితం ఛైర్మన్‌ అయ్యాడు రిషద్‌. అతని తమ్ముడు తారిఖ్‌- ప్రేమ్‌జీ ఎండోమెంట్‌ ఫండ్‌కి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. హాషం ప్రేమ్‌జీ నుంచి రిషద్‌ వరకూ నాలుగు తరాలు మారినా మారని విలువలకు నిదర్శనంగా నిలుస్తోంది ‘విప్రో’.‘విజయం తాలూకు ఆనందాన్నీ గర్వాన్నీ తలకెక్కనివ్వకూడదనీ, కష్టపడటం తప్ప విజయానికి మరో దగ్గరిదారి లేదనీ, ఏ స్థాయి వారినుంచీ అయినా నేర్చుకోడానికి సుముఖంగా ఉండాలనీ... నాన్న నుంచి నేర్చుకున్నా. నా నలభై నాలుగేళ్ల జీవితంలో విప్రో ఆదాయం కొన్ని వందల రెట్లు పెరిగింది కానీ మా ఇంట్లో, స్వభావాల్లో, జీవనశైలిలో ఏమార్పూ లేదు. మా చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉన్నాం. ఇక ముందూ ఇలాగే ఉంటాం..!’ అనే రిషద్‌ మాటలు ఈ విలువల ప్రస్థానం మరెన్నో తరాలు కొనసాగుతుందనడానికి సాక్ష్యం..!


నిరాడంబరతకు నిలువెత్తు రూపం..!

ప్రేమ్‌జీ నిరాడంబరత గురించి ఎంత చెప్పినా తక్కువే. సొంత విమానం కొనుక్కోగల స్తోమత ఉన్నా, కంపెనీ తరఫున ఎవరైనా ఎకానమీలోనే ప్రయాణించాలన్న నియమం మేరకు ఛైర్మన్‌ పదవిలో ఉన్న తానూ దాన్నే అనుసరించిన వ్యక్తి.

* లగ్జరీ కార్ల జోలికి వెళ్లరు. ఒకసారి ఆయన వాడుతున్న కారు బాగా పాతదైపోగా అప్పుడు విప్రోలో పనిచేసే ఉన్నతోద్యోగి ఒకరు మెర్సిడెస్‌ కారును అమ్మాలనుకుంటున్నాడని తెలిసి దాన్ని కొనుక్కున్నారు ప్రేమ్‌జీ. కానీ కొన్నాళ్లకే మళ్లీ మామూలు కారుకి మారిపోయారు. 

* విదేశాలకు వెళ్లినా సాధారణ హోటళ్లలోనే బస చేయడం, కొడుకుతో కలిసి వెళ్తే ఒకే గది తీసుకోవడం ఆయనకు అలవాటు. 

* విమానాశ్రయం నుంచి ఆటోలో ఇంటికి వెళ్లడం, విదేశాల్లో లోకల్‌ ట్రైన్‌లో తిరగడం లాంటివి ఆయనకు మామూలే.

* కంపెనీ ఆఫీసుల్ని సందర్శించడానికి వెళ్లినపుడు ఇతర ఉద్యోగుల్లాగే సంస్థ గెస్ట్‌హౌస్‌లోనే దిగి అక్కడి క్యాంటీన్‌ నుంచే ఆహారం తెప్పించుకుంటారు.

* హోటల్లో తన దుస్తుల్ని తానే ఉతుక్కున్న సందర్భాలూ ఉన్నాయి. హోటళ్లలో లాండ్రీ ఛార్జీలు తన దుస్తుల ధరకన్నా ఎక్కువుంటాయనేవారట. అరుదుగా తప్ప ఖరీదైన బ్రాండెడ్‌ దుస్తుల్ని ఆయన వాడరు.

* ఆఫీసులో అవసరంలేని చోట ఫ్యాన్లూ లైట్లూ తీసేయడం, పేపరుకి రెండువైపులా ప్రింటు తీసుకోవడం, ఆఖరికి టాయ్‌లెట్‌ పేపరు విషయంలోనూ వృథా కాకుండా చూడమనడం.. లాంటివి చూసి పిసినారి అనుకున్నవాళ్లూ లేకపోలేదు.

* విప్రోకి పలు దేశాల్లో కార్యాలయాలున్నాయి. 93 శాతం వ్యాపారం విదేశాలనుంచే జరుగుతున్నా ప్రేమ్‌జీ మాత్రం ఎక్కడా ఎలాంటి ఆస్తులూ ఏర్పర్చుకోలేదు.

* కుటుంబసభ్యులూ అవే విలువలు పాటిస్తారు. భార్య యాస్మిన్‌ కూడా ఖరీదైన ఆభరణాలు ధరించరు. కుమారుడి పెళ్లి 200మంది అతిథులతో నిరాడంబరంగా చేశారు.


వెనక్కి తిరిగి చూస్తే...

డెభ్బై అయిదేళ్ల విప్రో ప్రస్థానంలో 53 ఏళ్లు పూర్తిగా అజీమ్‌ ప్రేమ్‌జీవే. పాతిక వ్యాపారాలు ఆయన మొదలుపెట్టినవే. సంస్థ ఛైర్మన్‌గా తప్పుకుని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటున్న ఆయన ఏమంటారంటే...

మిస్సయ్యాను: ఇన్ని రంగాల్లో ఉన్న విప్రో ఒక్క ఆహార రంగంలోకి మాత్రం రాలేకపోయింది. మంచి ఎదుగుదల ఉన్న రంగాన్ని పూర్తిగా మిస్సయ్యాను.

పొరపాటు: విప్రో ఫైనాన్స్‌ మేం చేసిన పెద్ద పొరపాటు. మంచి డిమాండ్‌ ఉందని మొదలెడితే దిగాక తెలిసింది దాని లోతు. చాలామంది మోసం చేశారు. విడిగా పెట్టిన కంపెనీనే కాబట్టి దివాలా తీసిందని ప్రకటించొచ్చు కానీ, నా ప్రతిష్ఠా సంస్థ పరువూ దెబ్బతింటాయని అందరికీ మా డబ్బే ఇచ్చేశాం. దానివల్ల విప్రో నికరవిలువలో మూడోవంతు నష్టపోయాం.

ఆనందం: సంతూర్‌, సన్‌ఫ్లవర్‌ లాంటి బ్రాండ్లని సృష్టించడంలోని ఆనందాన్ని ఎంతగానో ఆస్వాదించాను. ఒక దశలో  సంతూర్‌ని అమ్మమని యూనిలీవర్‌ అడిగింది. నేను ఒప్పుకోలేదు. తర్వాత మా సంస్థ విలువ బాగా పెరిగాక నేనే సరదాగా యూనిలీవర్‌ని అమ్మితే కొంటానని చెప్పా. 

వారసత్వం: నాకు వారసత్వం ఇష్టం లేదనీ నా తర్వాత కుటుంబంలో ఇంకొకరెవరూ విప్రోలోకి రారనీ గతంలో చెప్పాను. కానీ సంపద అంతా ఫౌండేషన్‌కి రాసివ్వాలనుకున్నాక ఫౌండేషన్‌ కార్యక్రమాలన్నీ నిరాటంకంగా, నిష్పక్షపాతంగా కొనసాగాలంటే ఎవరో ఒకరు ఉండాలన్న శ్రేయోభిలాషుల సూచన మేరకు ఆలోచన మార్చుకున్నా. రిషద్‌ రాక దాని ఫలితమే.

ప్లేట్లు శుభ్రం చేశా: ఏం చదవాలో నాన్న చెప్పలేదు. అందరూ వెళ్తున్నారు కాబట్టి నేనూ అమెరికా వెళ్లి స్టాన్‌ఫర్డ్‌లో చేరా. చదువయ్యాక వరల్డ్‌బ్యాంక్‌లో ఉద్యోగం చేద్దామనుకున్నా. పార్ట్‌టైమ్‌గా క్యాంపస్‌లోని హోటల్లో ప్లేట్లూ, డస్ట్‌బిన్లూ శుభ్రం చేసేవాడిని. నేను చేసిన మొట్టమొదటి పని అదే. అప్పుడే శ్రమ విలువ తెలిసింది. రాత్రిపూట ఫోన్లు తీసుకునే పని కూడా చేసేవాడిని. నాన్న చనిపోయారని వచ్చిన ఫోను నా జీవితాన్ని మార్చేసింది. అప్పుడు ఆపేసిన చదువుని కొన్నేళ్ల తర్వాత కరెస్పాండెన్స్‌ ద్వారా పూర్తిచేసి డిగ్రీ సర్టిఫికెట్‌ పొందాను.

అమ్మే స్ఫూర్తి: మా తాతల గురించి వినడమే కానీ చూడలేదు. చిన్నప్పుడు నాన్నకి మాతో గడిపే తీరికుండేది కాదు. అమ్మే నాకు స్ఫూర్తి. ఆమెకి బిజినెస్‌ తెలియదు కానీ మనుషుల్ని సరిగ్గా అంచనా వేసేది. సమాజం గురించి ఆలోచించేది.


విద్యారంగానికి ఊతం... ఫౌండేషన్‌!

సంపాదనలో సగం దానం చేస్తామని చెప్పే ‘గివింగ్‌ ప్లెడ్జ్‌’ మన దేశం నుంచి చేసిన మొదటి వ్యక్తి ప్రేమ్‌జీ. ఏకంగా లక్షా 57 వేల కోట్ల రూపాయలు ఇచ్చేశారాయన. విప్రోలో దాదాపు 70శాతం షేర్ల మీద వచ్చే ఆదాయం ఫౌండేషన్‌కే వెళ్తుంది. సంపదని సృష్టించడం ఎంత ముఖ్యమో దాన్ని తెలివిగా వితరణ చేయడం అంతకన్నా ముఖ్యమని భావించే ఆయన ఆ పని కోసం అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ని ప్రారంభించారు. దాదాపు ఇరవై ఏళ్లుగా ఈ ఫౌండేషన్‌ ప్రాథమిక విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు శిక్షణ ఇవ్వడానికే వందలాది నిపుణులను తయారుచేసింది. ఏడు రాష్ట్రాల్లో మూడున్నర లక్షల మంది పిల్లలు దీనివల్ల లబ్ధిపొందుతున్నారు. పెద్ద పెద్ద జీతాలొచ్చే కార్పొరేట్‌ ఉద్యోగాలను వదులుకుని వచ్చి మరీ ఫౌండేషన్‌లో ఉద్యోగం చేస్తున్నారు చాలామంది. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ విద్యార్థులను విద్య, వైద్యం, ఉపాధి తదితర రంగాల్లో సమాజానికి సేవ చేసేలా తీర్చిదిద్దుతుంది. దాదాపు 70 శాతం విద్యార్థులకు ఎదురు స్కాలర్‌షిప్‌ ఇచ్చి మరీ చదివిస్తుంది. 

సంస్థ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద నిర్వహిస్తున్న విప్రో ఫౌండేషన్‌ వేరే ఉంది. ఇవి రెండూ కాకుండా ‘విప్రో కేర్స్‌’ ట్రస్టు ఉంది. దానికి సిబ్బంది ఇచ్చే విరాళాలకు సమానంగా సంస్థ కూడా ఇస్తుంది. తీరిక ఉన్నవాళ్లు కార్యకర్తలుగా సేవలూ అందించవచ్చు. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సేవలందిస్తోంది. కరోనా సమయంలో ఉద్యోగుల మంచీ చెడూ చూసుకోవడమేకాక సమాజంకోసం 1125 కోట్లు ఖర్చుపెట్టింది విప్రో. కోల్‌కతా, బెంగళూరు లాంటిచోట్ల లాక్‌డౌన్‌ రెండున్నర నెలలూ రోజుకు 60వేల భోజనాల చొప్పున వండి పేదలకు పంచింది. పుణె క్యాంపస్‌ని 450 పడకల ఆస్పత్రిగా మార్చి మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పింది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని