Published : 29 May 2022 00:16 IST

రాక్షసులు కట్టిన ఆలయం!

దుష్టశిక్షణ శిష్టరక్షణకోసం దశావతారాలెత్తిన నారాయణుడు ఈ క్షేత్రంలో  లక్ష్మీసమేతుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్త సులభుడిగా పేరుపొందాడు. ‘సంతాన లక్ష్మీనారాయణుడి’గా కొలువుదీరి సంతానప్రదాతగా పూజలందుకుంటున్నాడు.

ఆదిలాబాద్‌ జిల్లా పచ్చనిచెట్లూ, వాగులూ, వంకలూ, జలపాతాలతోపాటు ప్రాచీన ఆలయాలకూ ప్రసిద్ధి. వాటిల్లో చూడదగ్గ ఒక దివ్య క్షేత్రం జిల్లాలోని జైనథ్‌లో ఉంది. అష్టకోణాకార మండపంతో, అద్భుతమైన శిల్పకళాసంపదతో కనువిందుచేస్తున్న ఈ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. విశాలమైన ప్రాంగణంలో ప్రత్యేకమైన నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయం జైన సంప్రదాయ పద్ధతిలో ఉండటం వల్లే ఈ ప్రాంతానికి జైనథ్‌ అనే పేరొచ్చిందని చెబుతారు. 

స్థల పురాణం..
పురాణాల ప్రకారం... ఒకప్పుడు దండకారణ్యంలో భాగమైన ఈ ప్రాంతంలో రాక్షసులు నివసించేవారట. తమ శక్తిసామర్థ్యాలు పెంచుకోవడానికి నారాయణుడిని భక్తితో పూజించేవారట. స్వామికి ఆ పూజలు నిత్యం జరగాలనే ఆలోచనతో ఆలయాన్ని కట్టాలని సంకల్పించారట. అలా అనుకున్నదే తడవుగా రాక్షసులు రాత్రికి రాత్రే ఈ గుడిని కట్టేశారన్నది స్థలపురాణం.

లక్ష్మీసమేతంగా..
ఇక్కడ లభించిన శిలాశాసనాల్ని బట్టి చూస్తే 12వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని జగద్దేవుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చాళుక్య త్రిభువనమల్లుడికి సామంతుడిగా ఉన్న ఈ జగద్దేవుడే ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది. ఆరడుగుల ఎత్తులో దివ్యరూపంతో గర్భగుడిలో కొలువుదీరిన స్వామి మూలవిరాట్టుకి దక్షిణ దిశలో లక్ష్మీదేవీ, ఆళ్వారులూ ఉంటే... మండపం లోపల అనంతపద్మనాభ స్వామి, చెన్నకేశవుడు, గదాధరుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు కొలువై ఉన్నారు. ఆలయం ముందు భాగాన గరుడ స్తంభం, అంతర్భాగంలోని స్తంభాలపైన హనుమంతుడి విగ్రహం కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో గణపతి, ఆదిశేషుడు, శివలింగం, మహానంది, నవగ్రహాలు దర్శనమిస్తాయి.

కోరికలు తీర్చే స్వామి..

సంతానంలేని వారు భక్తితో స్వామిని దర్శిస్తే చాలు, తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ క్షేత్రంలోని లక్ష్మీనారాయణుడు ‘సంతాన నారాయణుడి’గా పేరుపొందాడు. ఏటా కార్తిక మాసంలో శుద్ధ అష్టమి నుంచి బహుళ సప్తమి వరకూ ఇక్కడ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ వేడుకల్లో స్వామి ముందు ఉంచిన పూలదండలను ధరిస్తే సంతానం కలుగుతుందనే విశ్వాసంతో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఏటా కార్తికమాసంలో పౌర్ణమి నుంచి శ్రీవారి ఆలయంలో నిర్వహించే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొంటారు. 

సూర్యదేవాలయంగా..

దసరా తర్వాత వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి రోజు సూర్యకిరణాలు స్వామి పాదాలపైన పడతాయి. అందుకే ఈ ఆలయాన్ని సూర్యదేవాలయంగా కూడా పిలుస్తారు. సూర్యకిరణాలు స్వామి పాదాలపైన పడే ఆ అద్భుత దృశ్యాన్ని చూడ్డానికి ఆ రోజున ప్రత్యేకంగా రాష్ట్రంలోని నలుమూలల నుంచేకాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

ఎలా చేరుకోవచ్చు..

రైలూ, బస్సుల్లో వచ్చే భక్తులు ఆదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్లలో దిగితే, అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైనథ్‌ ఆలయానికి చేరుకోవడానికి బస్సులూ, ప్రయివేట్‌ వాహనాలూ అందుబాటులో ఉన్నాయి. 

- దాసరి సుభాష్‌, ఈనాడు జర్నలిజం స్కూల్‌ 


ఇది విన్నారా..

భక్తితో ఎలుగుబంట్లు!

మనుషుల్ని చూస్తే దాడికి పాల్పడే ఎలుగుబంట్లు ఈ చండీమాత ఆలయంలో మాత్రం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తాయి. పూజారి వద్ద తీర్థప్రసాదాలను స్వీకరించి మళ్లీ అడవిలోకి వెళుతుంటాయి. నిత్యం భక్తులతోపాటు ఎలుగుబంట్లు కూడా కొలిచే ఆ అమ్మవారు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా- ఛత్తీస్‌గడ్‌ రాష్ట్ర సరిహద్దులోని మహాసముంద్‌ జిల్లా గుంచపాలి గ్రామంలో కొలువై వుంది. దండకారణ్యానికి ఆనుకుని ఉన్న ఆ చండీమాత ఆలయాన్ని దర్శించుకునేందుకు తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌  రాష్ట్రాల నుంచి భారీగానే భక్తులు తరలివెళుతుంటారు. ప్రతిరోజూ అమ్మవారికి హారతి ఇచ్చే సమయంలో పూజారి శంఖం పూరించడం అక్కడ ఆనవాయితీ. దాంతో రోజూ ఆ శబ్దం వినిపించగానే అడవిలోని ఎలుగుబంట్లు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని, పూజారి అందించే తీర్థ ప్రసాదాలు తీసుకుని మరీ వెళతాయి. కొన్నేళ్లుగా అమ్మవారి సన్నిధికి వస్తున్న ఆ ఎలుగుబంట్లు భక్తులు ఏ ఆహారపదార్థాలు ఇచ్చినా స్వీకరిస్తాయి తప్ప ఎవరిపైనా దాడికి పాల్పడవు. నిత్యం ఎలుగుబంట్లు సంచరించే ఆ ఆలయాన్ని ‘బేర్‌ టెంపుల్‌’ అని కూడా పిలుస్తారు. 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని