ఓ పక్క పీర్లు, ఓ పక్క ఆంజనేయుడు..!

మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి కుళ్లాయిస్వామి-హనుమాన్‌ ఆలయాలు. ఈ జంట ఆలయాలను దర్శించుకుంటే అనారోగ్యాలు దూరమై... కోరిన కోర్కెలు నెరవేరతాయనేది భక్తుల నమ్మకం. 

Updated : 31 Jul 2022 04:11 IST

ఓ పక్క పీర్లు, ఓ పక్క ఆంజనేయుడు..!

మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి కుళ్లాయిస్వామి-హనుమాన్‌ ఆలయాలు. ఈ జంట ఆలయాలను దర్శించుకుంటే అనారోగ్యాలు దూరమై... కోరిన కోర్కెలు నెరవేరతాయనేది భక్తుల నమ్మకం. 

కుళ్లాయిస్వామి క్షేత్రం... ఇక్కడ ఓ పక్కన ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే కుళ్లాయిస్వామి దర్శనమిస్తుంటే మరో పక్కన హనుమంతుడి ఆలయం కనిపిస్తుంది. అన్ని మతాలవారూ దర్శించుకునే ఈ జంట ఆలయాలు అనంతపురం జిల్లాలోని నార్పల మండలం, గూగూడు గ్రామంలో కనిపిస్తాయి. ఏటా మొహరం సమయంలో కుళ్లాయిస్వామికి నిర్వహించే బ్రహ్మోత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రావడం విశేషం.

స్థలపురాణం 

పురాణాల ప్రకారం రాముడు సీతను వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గుహుడు అనే భక్తుడి ఆతిథ్యాన్ని స్వీకరించాడట. ఇక్కడినుంచి వెళ్తూ సీత జాడ తెలిశాక సతీసమేతంగా దర్శనమిస్తానంటూ మాటిచ్చాడట. రావణ సంహారం జరిగాక గుహుడికి ఇచ్చిన మాటను మర్చిపోయిన రాముడు అయోధ్యకు వెళ్లిపోయాడు. ఇది తెలిసి గుహుడు ఆత్మాహుతికి సిద్ధమయ్యాడట. ఆ విషయాన్ని తన దివ్యదృష్టితో తెలుసుకున్న రాముడు సీత, లక్ష్మణ, ఆంజనేయుడి సమేతంగా వచ్చి గుహుడి ఆతిథ్యాన్ని స్వీకరించాడట. రాముడితో వచ్చిన ఆంజనేయుడ్ని ఈ ప్రాంతంలోనే ఉండమంటూ గుహుడు కోరడం వల్లే హనుమంతుడు ఇక్కడ వెలిశాడని చెబుతారు. క్రమంగా ఈ ప్రాంతమే గూగూడుగా మారింది. ఇక.... 19వ శతాబ్దంలో గూగూడు శివారులో ఉన్న చక్రాయపేటలో రామాచారి, లక్ష్మణాచారి అనే సోదరులు పంచలోహ పీర్లను తయారుచేసేవారు. అలా తయారుచేస్తున్న సమయంలో ఓసారి ఆ గ్రామం మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో అరిష్టంగా భావించిన ఊరివాళ్లు ఆ పీర్లను ఊరికి దూరంగా ఉన్న బావిలో పడేశారట. కొన్నాళ్లకు తిరుమల కొండన్న అనే గొర్రెల కాపరి ఆ బావి వద్దకు వెళ్లినప్పుడు... అక్కడున్న పీర్లను చూసి తన ఊరికి తీసుకెళ్లాడట. దాంతో ఇక్కడ ఆలయం కట్టి ఆ పీర్లను అందులో ఏర్పాటు చేశారట. ఆ పీర్లకు కుహుడ్లస్వామి అనే పేరు పెట్టారనీ క్రమంగా అదే కుళ్లాయి స్వామిగా మారిందనీ అంటారు. ఇక్కడ పదమూడురోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో ఈ పీర్ల నిజరూప దర్శనాన్ని భక్తులకు చూపిస్తారు. కొండన్న వంశీయులే బ్రహ్మోత్సవాల సమయంలో కీలక పాత్రను పోషిస్తారు. ఈ ఉత్సవాలను చూడాలనుకునే భక్తులు అనంతపురం వరకూ బస్సు లేదా రైల్లో చేరుకుంటే... అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు లేదా ప్రైవేటు వాహనాల్లో ఆలయానికి వెళ్లొచ్చు. 

- పెద్దిరెడ్డిగారి పవన్‌కుమార్‌రెడ్డి ఈనాడు పాత్రికేయ పాఠశాల   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..