ఈ వెంకన్న గుడిలో భక్తుడికీ పూజలు!

సాధారణంగా ఆలయాల్లో సమాధుల్లాంటివి ఉండవు కానీ... ఈ వైకుంఠవాసుడి సన్నిధానంలో మాత్రం ఓ భక్తుడి సమాధి కనిపిస్తుంది. ఈ ఆలయంలో కొలువైన వేంకటేశ్వరుడిని గిరిజనులు బావుసింగ్‌ బావ్‌గా పిలుస్తూ... ఏడాది కోసారి స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు.

Published : 22 May 2022 01:12 IST

ఈ వెంకన్న గుడిలో భక్తుడికీ పూజలు!

సాధారణంగా ఆలయాల్లో సమాధుల్లాంటివి ఉండవు కానీ... ఈ వైకుంఠవాసుడి సన్నిధానంలో మాత్రం ఓ భక్తుడి సమాధి కనిపిస్తుంది. ఈ ఆలయంలో కొలువైన వేంకటేశ్వరుడిని గిరిజనులు బావుసింగ్‌ బావ్‌గా పిలుస్తూ... ఏడాది కోసారి స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. మీసాలతో కనిపించే ఈ స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయనేది స్థానికుల నమ్మకం.

విశాలమైన ప్రాంగణంలో కనిపించే మీసాలవెంకన్న ఆలయం తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా, మరిపెడ మండల కేంద్రం శివారులోని మాకుల తండాలో కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ దర్శించుకునే ఈ క్షేత్రాన్ని భక్తులే దాదాపు అయిదువందల సంవత్సరాల క్రితం కట్టారని అంటారు.  

స్థలపురాణం 

పురాణాల ప్రకారం.. గిరిజన కుటుంబానికి చెందిన బావుసింగ్‌ వేంకటేశ్వరస్వామి భక్తుడు. ఏడాదికి కనీసం ఏడెనిమిది సార్లు తిరుపతికి వెళ్లొచ్చే బావుసింగ్‌ తన వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా మరిపెడ ప్రాంతానికీ తరచూ వచ్చేవాడట. అలా ఓసారి మరిపెడ వచ్చినప్పుడే- అలసిపోయిన బావుసింగ్‌ నల్లాని చక్రవర్తుల లక్ష్మీనర్సింహాచార్యులు అనే వేంకటేశ్వరస్వామి భక్తుడి మామిడితోటలో విశ్రాంతి తీసుకున్నాడట. అతడికి కలలో స్వామి కనిపించి తనకోసం తిరుపతి వరకూ రావాల్సిన అవసరంలేదని చెప్పి... ఆ తోటంతా తిరిగి మాయమయ్యాడట. నిద్ర నుంచి మేల్కొన్న బావుసింగ్‌ ఈ విషయాన్ని మామిడి తోట యజమాని అయిన లక్ష్మీనర్సింహాచార్యులకు చెప్పాడు. దాంతో ఆయన తన వద్ద ఉన్న డబ్బుతో, స్థానికుల సాయంతో ఆలయ నిర్మాణం చేపట్టాడట. ఆలయం పూర్తయ్యేవరకూ అక్కడే ఉన్న బావుసింగ్‌ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాక మరణించాడట. దాంతో ఆయన కుటుంబ సభ్యులూ, తండావాసులూ బావుసింగే ఆలయం నిర్మించుకుని మరణించాడనే భావనతో ఈ ఆలయానికి ఉత్తర భాగంలో ఆ భక్తుడి సమాధిని కట్టించారు. అప్పటి నుంచీ వేంకటేశ్వరస్వామిని బావుసింగ్‌ బావ్‌గా పూజించడం ప్రారంభించారట. ఏటా ఈ సమాధి వద్దకు అతడి వంశీకులు వచ్చి గిరిజన సంప్రదాయం ప్రకారం వార్షిక తదియారాధన జరిపిస్తారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు
ఈ ఆలయంలో నేటికీ నల్లానిచక్రవర్తుల వంశీకులే అర్చకులుగా కొనసాగుతున్నారు. వైష్ణవ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షికోత్సవాలు నిర్వహిస్తారు. ప్రధానంగా చైత్రమాసంలో స్వామికి ఘనంగా జరిపే బ్రహ్మోత్సవాలు, కల్యాణం చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా భావించే బావుసింగ్‌ బావ్‌ను కొలిచేందుకు ఏడాదికి ఒక్కసారైనా ఇక్కడకు వస్తారు. ఓ రాత్రి నిద్రచేసి ఆ మర్నాడు ఇక్కడున్న బావిలో 6 చేదలు, 11 చేదలు, 21 చేదల చొప్పున నీటితో తమ మొక్కులకు అనుగుణంగా తలస్నానం చేస్తారు. ఆ తడి దుస్తులతోనే పాయసం చేసి అగ్నిహోత్రుడికి సమర్పిస్తారు. అదే ప్రసాదాన్ని తలపైన పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామికి అర్పించి, జెండాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటారు. ఇదంతా తమ పితృదేవుడిగా భావించే బావుసింగ్‌ బావ్‌కు సమర్పించినట్లుగా భావిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఆదివారం రాత్రి నిద్రచేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం.  

ఎలా చేరుకోవచ్చు..
ఈ ఆలయం మహబూబాబాద్‌ జిల్లాలోని మల్లంపల్లి-నార్కెట్‌పల్లి 365 జాతీయ రహదారిపై మరిపెడ పట్టణ శివారులో ఉంది. హైదరాబాద్‌ నుంచి బస్సులూ, వాహనాల్లో వస్తే నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. రైలు మార్గంలో రావాలంటే మహబూబాబాద్‌ లేదా ఖమ్మం రైల్వేస్టేషన్ల నుంచి 35 కి.మీ. దూరం ఉంటుంది.

- శ్రీరంగం శ్రీనివాస్‌, న్యూస్‌టుడే, మరిపెడ


ఇది విన్నారా
పొద్దున్న పురుషులకూ, రాత్రి స్త్రీలకూ దర్శనం

శబరిమలలో- పదేళ్లు దాటిన తరువాత... నెలసరి ఆగిపోయేవరకూ స్త్రీలకు ప్రవేశం ఉండదు. మరికొన్ని ఆలయాల్లో పురుషుల్ని అనుమతించరు. కానీ కేరళలోని కన్నూరుకు పాతిక కిలోమీటర్ల దూరంలో తాలిపరంబలోని రాజరాజేశ్వర ఆలయం ఇందుకు పూర్తిగా భిన్నం. శివుడు,  పార్వతీదేవి కొలువైన ఈ క్షేత్రంలో అన్ని దేవాలయాల్లోలానే రోజంతా పూజలు నిర్వహిస్తారు కానీ.. పొద్దుటిపూట పురుషులూ, సాయంత్రం పూట స్త్రీలూ దర్శించుకునేందుకు అనుమతిస్తారు. ఎందుకంటే.. సాయంకాలం పూజయ్యాక శివుడు పార్వతీదేవితో కలిసి ప్రశాంతవదనంతో దర్శనమిస్తాడనీ.. అప్పుడు స్త్రీలు పూజిస్తే మంచిదనేది ఇక్కడి ఆచారం. అదేవిధంగా బిల్వదళాలకు బదులుగా తులసి ఆకులతో స్వామిని పూజిస్తారు. ఇక్కడ రోజువారీ పూజలే తప్ప ఎలాంటి ఉత్సవాలూ జరగవు... స్వామికి అసలు ఊరేగింపులే జరగవట. ఇక్కడ శివుడికి ఇష్టమైన రోజు బుధవారమని నమ్ముతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు