దక్షిణకాశీ దర్శనం... మోక్షప్రదాయకం!

ఉభయరామక్షేత్రం... కృష్ణానదికి ఇరువైపులా కనిపించే ఈ రెండు ఆలయాల్లోని శివలింగాలను సీతారాములు స్వయంగా ప్రతిష్ఠించారని ప్రతీతి. ఈ ఆలయాలను దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు నెరవేరడమే కాదు, మోక్షం కూడా లభిస్తుందని స్కందపురాణం పేర్కొంటోంది.

Published : 08 May 2022 01:07 IST

దక్షిణకాశీ దర్శనం... మోక్షప్రదాయకం!

ఉభయరామక్షేత్రం... కృష్ణానదికి ఇరువైపులా కనిపించే ఈ రెండు ఆలయాల్లోని శివలింగాలను సీతారాములు స్వయంగా ప్రతిష్ఠించారని ప్రతీతి. ఈ ఆలయాలను దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు నెరవేరడమే కాదు, మోక్షం కూడా లభిస్తుందని స్కందపురాణం పేర్కొంటోంది.

పచ్చని ప్రకృతి మధ్య ప్రవహించే కృష్ణానదికి ఓ వైపు పరమేశ్వరుడు అనుగ్రహించిన శివలింగం.. మరోవైపు సైకత శివలింగం దర్శనమిచ్చే సన్నిధానమే ఉభయరామక్షేత్రం. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని ఐలూరులో - గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని చిలుమూరులో నిర్మించిన ఈ రామేశ్వరస్వామి దేవస్థానాలను దక్షిణకాశీగా పిలుస్తారు. త్రేతాయుగం నుంచీ ఉన్న ఈ ఆలయాల్లోని శివలింగాలను సీతారాములు స్వయంగా ప్రతిష్ఠించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.

స్థలపురాణం
ఒకప్పుడు రైభ్యుడనే రుషి ఉండేవాడు. శివభక్తుడైన ఈ ముని కృష్ణానది తీరంలో స్నానమాచరిస్తూ ఇసుకతో శివలింగాన్ని చేసి... ఆ నీటితోనే అభిషేకం చేశాడట. ఆ పూజకు మెచ్చి స్వామి ప్రత్యక్షమవడంతో... తాను చేసిన సైకత శివలింగంలో స్థిరంగా కొలువుదీరమంటూ రుషి వేడుకున్నాడట. కొన్నాళ్లకు... అంటే, రావణ సంహారం తరువాత రాముడు.. సీత, హనుమంతుడితో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడట. అయితే ఈ ప్రాంతానికి వచ్చేసరికి పుష్పక విమానం ఆగిపోయిందట. కిందకు దిగి... విమానం ఆగిపోవడానికి గల కారణాన్ని రాముడు ఆరాతీస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ఉండే కొందరు రుషులు వచ్చి స్వామిని పూజించారట. వారిలో ఓ ముని తన దివ్యదృష్టితో రైభ్యుని గురించి తెలుసుకుని ఆ విషయాన్ని స్వామికి చెబుతూనే కేవలం నాలుగు ఘడియల్లోగా ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పాడట. రాముడి ఆజ్ఞతో హనుమంతుడు శివలింగాన్ని తీసుకొచ్చేందుకు కైలాసానికి బయలుదేరాడు. ఈలోగా సీతాదేవి స్వామితో కబుర్లు చెబుతూ సైకత శివలింగాన్ని తయారుచేసిందట. హనుమంతుడు ఎంతకీ రాకపోవడంతో ఆలస్యమైపోతోందనే ఉద్దేశంతో తాను చేసిన లింగాన్ని ఇప్పటి చిలుమూరులో ప్రతిష్ఠించిందట. శివలింగంతో వచ్చిన హనుమంతుడు విషయం తెలిసి తన తోకతో సైకత లింగాన్ని ఎత్తేందుకు ప్రయత్నించడంతో ఆంజనేయుడు తెచ్చిన శివలింగం కిందపడిందట. ఆ లింగాన్నే రాముడు ప్రతిష్ఠించాడనీ అదే ఇప్పటి ఐలూరు క్షేత్రమనీ అంటారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై కృష్ణా నదికి రెండు వైపులా ఉన్న ఈ ఆలయాల్లో దర్శనమిచ్చే తాను రామలింగేశ్వరుడిగా విలసిల్లుతానని చెప్పి మాయమయ్యాడట. అప్పటినుంచే ఈ ప్రాంతం ఉభయరామ క్షేత్రంగా గుర్తింపు పొందిందని చెబుతారు.  

దక్షిణ కాశీగా...
కాశీకి వెళ్లలేనివారు ఈ ఉభయ రామక్షేత్రం దగ్గరున్న కృష్ణానదిలో స్నానమాచరించి రెండు శివలింగాలనూ దర్శించుకుంటే కాశీయాత్ర చేసిన ఫలితం కలుగుతుంది.  అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా పిలుస్తారు భక్తులు. ఇక్కడ శివరాత్రికి కల్యాణోత్సవం, దేవీ నవరాత్రుల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే ఐలూరులో మహాశివరాత్రి ఉత్సవాలూ... చిలుమూరులో కార్తికమాసం పూజలూ అత్యంత వైభవంగా నిర్వహించడం విశేషం.  

ఎలా చేరుకోవచ్చు
విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లే కరకట్ట రహదారి మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ క్షేత్రం వస్తుంది. విజయవాడ నుంచి బందరు రోడ్డు మీదుగా, బందరు నుంచి ఉయ్యూరు ద్వారా కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. విమానం, రైలు, బస్సు ద్వారా విజయవాడ వరకూ చేరుకుంటే అక్కడినుంచి ప్రైవేటు వాహనాలూ, బస్సులూ అందుబాటులో ఉంటాయి.  

- ముత్తా నారాయణరావు, ఈనాడు, అమరావతి
చిత్రాలు: పి.ఎల్‌.ఎన్‌.మూర్తి, న్యూస్‌టుడే, తోట్లవల్లూరు


ఇది విన్నారా...
ఏడాదికి ఒకరోజే ఆలయం తెరుస్తారు

ఏ ఆలయంలో అయినా... రోజు పొద్దున్నే తలుపులు తెరిచి దేవతామూర్తులకు పూజలు నిర్వహించి ఆ తరువాత భక్తుల దర్శనార్ధం కొన్ని గంటలపాటు అలాగే వదిలేస్తారు. కానీ ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర్‌ ఆలయం ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ ఆలయ ద్వారాలు ఏడాదికి ఒకరోజు అదీ శ్రావణ శుక్లపక్ష పంచమి నాడే తెరుచుకుంటాయి. నాగపంచమిగా పేర్కొనే ఆ రోజున రాత్రి పన్నెండు గంటలకు ఆలయ ద్వారాలను తెరిచాక ముందుగా అక్కడి కలెక్టర్‌ పూజల్ని నిర్వహిస్తారు.
ఆ తరువాత మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలవరకూ భక్తులు దర్శించుకోవచ్చు.
ఆ తరవాత మళ్లీ తలుపుల్ని మూసేస్తారట.
ఆ రోజున ఈ మందిరంలో శేషనాగుపైన కొలువైన శివపార్వతులను దర్శించుకునేందుకు సర్పరాజు అయిన తక్షకుడు స్వయంగా వస్తాడని ప్రతీతి.
ఆ కొన్ని గంటలకే వివిధ ప్రాంతాల నుంచి దాదాపు రెండుమూడు లక్షల మంది భక్తులు వస్తారని\ చెబుతారు ఆలయ నిర్వాహకులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..