దేవతలు కట్టిన ఆలయం ఇది!

తిరుపతి వేంకటేశ్వరస్వామిని పోలిన విగ్రహం... పూర్తిగా ఎర్రరాతితో నిర్మించిన ఆలయం... నిరంతరం 108 ప్రదక్షిణలు చేసే భక్తులు.... ఇవన్నీ సౌమ్యనాథస్వామి ఆలయంలో కనిపించే విశేషాలు.

Updated : 17 Apr 2022 04:31 IST

దేవతలు కట్టిన ఆలయం ఇది!

తిరుపతి వేంకటేశ్వరస్వామిని పోలిన విగ్రహం... పూర్తిగా ఎర్రరాతితో నిర్మించిన ఆలయం... నిరంతరం 108 ప్రదక్షిణలు చేసే భక్తులు.... ఇవన్నీ సౌమ్యనాథస్వామి ఆలయంలో కనిపించే విశేషాలు. పదకొండో శతాబ్దం నుంచీ ఉన్న ఈ ఆలయాన్ని ఒకప్పుడు అన్నమాచార్యులు కూడా దర్శించుకునేవాడని ప్రతీతి.

నారాయణుడు... సౌమ్యనాథస్వామిగా అవతరించి, చిరుమందహాసంతో, అభయహస్తంతో దర్శనమిస్తూ... కోరిన కోర్కెలు ఈడేర్చే స్వామిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం ఇది. కడప జిల్లా నందలూరులో ఉంటుందీ ఆలయం. విశాలమైన ప్రాంగణంలో... నాలుగు రాజగోపురాల మధ్య ఉన్న ఈ ఆలయాన్ని పది ఎకరాల విస్తీర్ణంలో, పూర్తిగా ఎర్రరాతిని ఉపయోగించి నిర్మించడం విశేషం. ఈ ఆలయంలో 108 స్తంభాలు ఉంటే... అన్నింటిపైనా భాగవతం రచించి ఉండటం చూడొచ్చు. పదకొండో శతాబ్దం నుంచీ ఉన్న ఈ ఆలయాన్ని దేవతలే కట్టించారని పురాణాలు చెబుతున్నాయి.

స్థలపురాణం  
పురాణాల ప్రకారం... ఓసారి నారద మహర్షి కోరిక మేరకు నారాయణుడు భూలోక వింతలు చూసేందుకు బయలుదేరాడట. ఈ పరిసర ప్రాంతాలకు చేరుకున్నప్పుడు ఇక్కడి వాతావరణాన్ని చూసి స్వామి ముగ్ధుడవడంతో గమనించిన నారదుడు... కలియుగంలో ఈ ప్రాంతంలోనే కొలువై భక్తులను కాపాడమంటూ స్వామిని ప్రార్థించాడట. నారదుడి కోరికను మన్నించిన స్వామి ఒకప్పుడు నెలందలూరుగా పిలిచే ఈ ప్రాంతంలోనే శిల రూపం దాల్చాడు. అది తెలిసిన దేవతలు ఇక్కడ చెయ్యేరు నది ఒడ్డున ఆలయాన్ని నిర్మిస్తే... నారదుడు స్వామి విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించాడట. క్రమంగా ఆ ఆలయం శిథిలమైపోగా 11వ శతాబ్దంలో కులోత్తుంగచోళుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడనీ... అలా పునఃప్రారంభమైన ఈ క్షేత్ర నిర్మాణంలో పాండ్య, కాకతీయ, విజయనగర రాజులు సైతం పాల్గొన్నారనీ చరిత్ర చెబుతోంది.

కోర్కెలు తీర్చే దేవుడు
ఇక్కడి గర్భగుడిలోని స్వామి విగ్రహం ఏడు అడుగుల ఎత్తుతో తిరుపతి వేంకటేశ్వరస్వామిని పోలినట్లుగా ఉంటుంది. గర్భగుడికీ ఆలయ ప్రధాన ద్వారానికీ మధ్య 120 గజాల దూరం ఉన్నా... ద్వారం నుంచి మూలవిరాట్టు రూపం చాలా స్పష్టంగా కనిపిస్తుందని అంటారు. అదే విధంగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో స్వామి పాదాలపైన సూర్యకిరణాలు కూడా పడటమూ ఇక్కడ చూడొచ్చు. ఆలయానికి వచ్చిన భక్తులు మనసులో ఏదయినా అనుకుని... స్వామిని ధ్యానిస్తూ తొమ్మిదిసార్లు మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే... ఆ కోరిక చాలా తక్కువ సమయంలో నెరవేరుతుందనీ.. ఆ తరువాత భక్తులు 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారనీ చెబుతారు ఆలయ పూజారులు. ఈ ప్రాంగణంలోనే యోగ నారసింహుడు, ఆంజనేయుడు, గరుత్మంతుడి ఉపాలయాలనూ దర్శించుకోవచ్చు. తాళ్లపాకకు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని ఒకప్పుడు అన్నమాచార్యులు రోజూ దర్శించుకునేవాడనీ, స్వామిపైన పదహారు కీర్తనలు కూడా రాశాడనీ అంటారు. ఇక్కడ స్వామికి ప్రతిరోజూ నిర్వహించే పూజలు ఒకెత్తయితే... ఆషాఢమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలూ ముక్కోటి ఏకాదశి నాడు చేసే లక్ష తులసీ అర్చనా మరొకెత్తు. ఇవే కాకుండా శ్రావణ, ధనుర్మాసాల్లో నిర్వహించే ఉత్సవాలను చూసేందుకు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన భక్తులు ఎక్కువగా వస్తారు.

ఎలా చేరుకోవచ్చు
రైలు, బస్సుల్లో రావాలనుకునే వారు నందలూరు రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌లో దిగితే... అక్కడి నుంచి ఆలయం ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా కడప నుంచి రాజంపేట, తిరుపతికి వెళ్లే బస్సులన్నీ నందలూరులో ఆగుతాయి. విమానంలో రావాలనుకునేవారు కడప విమానాశ్రయంలో దిగితే.. అక్కడి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి బస్సులో చేరుకోవచ్చు.

- జి.ప్రశాంత్‌, ఈనాడు పాత్రికేయ పాఠశాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..