Published : 28 Nov 2021 00:19 IST

స్వామికి అభిషేకించే నెయ్యి కరగదట!

ఆ ఆలయంలోని శివలింగంపైన అభిషేకించే నెయ్యి అస్సలు కరగదని అంటారు. శివరాత్రి సమయంలో వెలిగించే లక్ష దీపాలూ..ప్రత్యేక ఉత్సవాల పేరుతో ఏనుగులకు చేసే అలంకరణలూ, సమర్పించే నైవేద్యాలూ.. ఇలా ఎన్నో విశేషాలున్న ఆ క్షేత్రమే భూతల స్వర్గంగా పిలిచే కేరళలోని వడక్కునాథన్‌ సన్నిధానం. ఈ స్వామి అనుగ్రహం వల్లే జగద్గురువు ఆదిశంకరాచార్యులు జన్మించాడని ప్రతీతి.

వడక్కునాథన్‌ ఆలయం.. కేరళలోని తిరుచ్చూరు పట్టణంలో ఉంటుంది. దాదాపు తొమ్మిది ఎకరాల్లో... చుట్టూ పచ్చని వాతావరణం మధ్య ఆకట్టుకునే కట్టడంతో కనిపించే ఈ క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. 2015లో యునెస్కో నుంచి ప్రత్యేక అవార్డు అందుకున్న ఈ ఆలయంలో ఏడాది మొత్తం జరిగే పూజల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆలయం బయట ఎంత ఎండ ఉన్నా సరే... ఇక్కడున్న శివలింగానికి నిత్యం అభిషేకించే నెయ్యి అస్సలు కరగదనీ, అలా కరిగిన రోజు ప్రళయం సంభవిస్తుందనీ భక్తుల నమ్మకం. పరశురాముడి కోరిక వల్లే శివుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని స్థల పురాణాలు చెబుతున్నాయి.

కేరళకి వచ్చిన శివుడు...

ఓ సారి పరశురాముడు శివుడి వద్దకు వెళ్లి... కేరళలో నివాసం ఏర్పరచుకోమని స్వామిని వేడుకున్నాడట. పరశురాముడి భక్తికి మెచ్చిన శివుడు... పార్వతి, వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఇతర గణాలతో కలిసి కేరళకు పయనమయ్యాడట. అయితే... కేరళలోని తిరుచ్చూరుకు రాగానే స్వామి మాయమై కాసేపటికి ఓ మర్రిచెట్టుకింద శివలింగం రూపంలో దర్శనమిచ్చాడట. ఆ మర్రిచెట్టునే స్వామి వెలసిన మూలస్థానంగా పిలుస్తారు. కొన్నాళ్లకు తిరుచ్చూరుని పాలించిన రాజు ఇక్కడ ఆలయాన్ని కట్టించడంతో అప్పటినుంచీ అందరికీ తెలిసిందని అంటారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు కూడా వడక్కునాథన్‌ అనుగ్రహం వల్లే జన్మించాడని చెబుతారు. జగద్గురువు తల్లి సంతానం కోసం ప్రతిరోజూ కాలడీ నుంచీ తిరుచ్చూరు వెళ్లి స్వామిని పూజించేదట. కొన్నాళ్లకు స్వామి ఆ దంపతులకు కలలో కనిపించి అనుగ్రహించాడనీ.. ఆ తరువాతే జగద్గురువు జన్మించాడనీ అంటారు.

ఏనుగులకు ఆహారం... ఓ వేడుక

ఈ ఆలయంలో శివుడు, పార్వతి, వినాయకుడు సుబ్రహ్మణ్యస్వామితోపాటూ రాముడు, కృష్ణుడిని కూడా దర్శించుకోవచ్చు. అదేవిధంగా శివాలయానికి పక్కనే శంకరనారాయణ ఆలయాన్ని కూడా చూడొచ్చు. ఈ ఆలయంలో ప్రతిరోజూ స్వామికి పద్దెనిమిదిన్నర కిలోల అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అదేవిధంగా రోజూ స్వామికి చేసే అభిషేకాన్ని ఓ వేడుకగా నిర్వహిస్తారు. అభిషేక సమయంలో శివలింగం చుట్టూ కొన్ని వందల దీపాలను వెలిగించి... ఆ తరువాత నేతి అభిషేక ప్రారంభిస్తారు. దీపాల వేడి ఎంత ఉన్నా, ఆలయం బయట ఎండ బాగా ఉన్నా  సరే... అలా అభిషేకించిన నెయ్యి అస్సలు కరగదని చెబుతారు. ఎన్నో ఔషధగుణాలున్న ఈ నెయ్యినే భక్తులకు ప్రసాదంగానూ ఇస్తారు. ఇక్కడ తిరుచ్చూరు పూరమ్‌ పేరుతో ఏప్రిల్‌/మే నెలలో ఓ రోజంతా పెద్ద ఎత్తున వేడుకను నిర్వహిస్తారు. విచిత్రం ఏంటంటే... ఈ ఉత్సవానికీ, ఆలయానికీ ఎలాంటి సంబంధం లేకపోయినా ఆ ప్రాంగణంలోనే వేడుకను జరుపుతారు. ఆ రోజున ఏనుగుల్ని బంగారు తాపడాలతో అలంకరించి, ఊరేగించే ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు లక్షల సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారు. శివరాత్రి సమయంలో ఆలయంలో వెలిగించే లక్ష దీపాలను చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. ఇక... జులైలో మలయాళ తొలి నెల ప్రారంభమయ్యే రోజున అనయొట్టు పేరుతో ఏనుగులకు భక్తులు ఆహారాన్ని సమర్పించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆ రోజున స్వామిని దర్శించుకుని, ఏనుగులకు ఆహారం పెట్టడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయనేది భక్తుల నమ్మకం.

ఎలా చేరుకోవచ్చు

రైల్లో రావాలనుకునేవారు తిరుచ్చూరు రైల్వేస్టేషన్‌లో దిగితే... మూడు కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి చేరుకోవచ్చు. విమానమార్గంలో రావాలనుకునేవారు కొచ్చి విమానాశ్రయంలో దిగితే అక్కడినుంచి ఆలయం దాదాపు యాభైఅయిదు కిలోమీటర్లు ఉంటుంది. బస్సుల్లో రావాలనుకునే భక్తులకు కేరళ, తమిళనాడు, కర్ణాటకల నుంచి బోలెడు బస్సులు అందుబాటులో ఉన్నాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని