హెచ్‌ఐవీ పాజిటివ్‌ గ్రామం!

అది ఆప్యాయతలూ, అనుబంధాలతో కట్టుకున్న పొదరిల్లు... అక్కడ అడుగుపెడితే నవ్వుతూ తుళ్లుతూ చదువుకునే పిల్లలు కనిపిస్తారు.

Updated : 21 May 2023 12:51 IST

హెచ్‌ఐవీ పాజిటివ్‌ గ్రామం!

అది ఆప్యాయతలూ, అనుబంధాలతో కట్టుకున్న పొదరిల్లు... అక్కడ అడుగుపెడితే నవ్వుతూ తుళ్లుతూ చదువుకునే పిల్లలు కనిపిస్తారు. ఆడుతూ పాడుతూ సాగు చేసే దంపతులు తారసపడతారు. హెచ్‌ఐవీతో బాధపడుతున్న వాళ్లందరూ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆనందంగా జీవిస్తున్నారంటే కారణం రవికాంత్‌ బాపట్లే. వ్యక్తిగత జీవితాన్ని వదులుకుని మరీ మానవతా దీపాలను వెలిగిస్తున్న రవి సేవా ప్రస్థానమిది.

త్రికా విలేకరిగా న్యూస్‌ కవరేజి కోసం ఓ పల్లెటూరికి వెళ్లాడు రవికాంత్‌ బాపట్లే. అక్కడ కాకులు పొడుచుకు తింటున్న ఓ చిన్నపిల్లాడి మృతదేహం అతని కంటపడింది. ఎయిడ్స్‌తో చనిపోయిన ఆ అనాథ చిన్నారికి అంత్యక్రియలు చేస్తే తమకీ ఆ జబ్బు అంటుకుంటుందన్న భయంతో గ్రామస్థులు మృతదేహాన్ని అలా వదిలేశారు. విషయం తెలిసి చలించిపోయిన రవి అంత్యక్రియలు చేశాడు. ఆ క్షణంలోనే తన జీవితానికి ఒక కొత్త గమ్యాన్నీ నిర్దేశించుకున్నాడు.

రవిది మహారాష్ట్రలోని ధోండి హిప్పరగకు చెందిన రైతు కుటుంబం. ఎత్తు తక్కువగా ఉన్న కారణంగా ఆర్మీలోకి వెళ్లలేకపోవడంతో జర్నలిస్ట్‌గా జీవితం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో 2006లో- అంత్యక్రియలకు సైతం నోచుకోని ఎయిడ్స్‌ చిన్నారి మరణ ఉదంతం- రవి జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఎయిడ్స్‌ రోగుల పట్ల జనాల తీరు, ఆ వ్యాధి గురించి అవగాహన లేని వైనం అతన్ని కలవరపరిచాయి. ఏది ఏమైనా ఎయిడ్స్‌ బాధిత చిన్నారులను చేరదీయాలనుకున్నాడు. తాను పనిచేస్తున్న మరాఠీ పత్రికలో ఉద్యోగం మానేశాడు. దానికి తల్లిదండ్రులు అడ్డుపడినా రవి వెనక్కి తగ్గలేదు. పైగా పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయమూ తీసుకున్నాడు. ఒక వేళ చేసుకుంటే వచ్చే అమ్మాయి తనని అర్థం చేసుకోలేదేమోనని భయపడ్డాడు. దగ్గర్లో ఉంటే తల్లిదండ్రులు మనసు మార్చేందుకు ప్రయత్నిస్తారని ఇంటికి దూరంగా తన స్నేహితుడి ఊరు హసేగావ్‌ వెళ్లాడు. రవి ఆశయం నచ్చి అతని స్నేహితుడి కుటుంబం పదెకరాల స్థలాన్నిచ్చింది. కానీ, అక్కడ కరెంటూ, నీళ్లూ లేవు. గ్రామస్థుల్ని అడిగితే ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో రవి కలెక్టర్‌ని సంప్రదించాడు. కరెంటూ, నీళ్లూ వచ్చాయి. అక్కడే ఓ చిన్న హాలూ, కొన్ని గుడిసెలూ నిర్మించి ‘సేవాలయం’ అని బోర్డు తగిలించాడు. రెండేళ్ల చిన్నారిని అక్కున చేర్చుకుని సేవకు శ్రీకారం చుట్టాడు. ఆ విషయం తెలిసిన చుట్టుపక్కల జిల్లాల నుంచి హెచ్‌ఐవీ పాజిటివ్‌ పిల్లలు రావడం మొదలైంది. వారిలో అయిదేళ్లు నిండిన వారిని స్థానిక గవర్నమెంట్‌ స్కూలుకు పంపాడు. ఆ చిన్నారుల వల్ల తమ పిల్లలకు ఎయిడ్స్‌ సోకుతుందనే భయంతో మూడునెలలపాటు స్కూలునే మూసేశారు గ్రామస్థులు. వాళ్లని ఊళ్లోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. రవిపై దాడి చేశారు. దాంతో అతను ఇంటింటికీ వెళ్లి ఎయిడ్స్‌ గురించి అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు. పిల్లల నుంచి ఎవరికీ ఆ జబ్బు రాదనీ, ఒకవేళ ఎవరికైనా అలా వస్తే... తనను బహిరంగంగా ఉరితీయమనీ చెప్పి ఓ హామీ పత్రం రాసిచ్చాడు. దాంతో ఒక్కొక్కరుగా ఊరంతా రవి కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు. పిల్లలు ఊళ్లోకీ, బడికీ రావడానికి ఒప్పుకున్నారు. అలానే అతికష్టం మీద స్థానిక కాలేజీల్లో చదువుకోవడానికీ, హాస్టల్‌లో ఉండటానికీ అనుమతి సంపాదించాడు. ఎంతో పోరాడి గవర్నమెంట్‌ హాస్టల్స్‌లో హెచ్‌ఐవీ బాధితులకు 5శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకూ అధికారుల్ని ఒప్పించాడు.

అన్నీ తానై...

అనాథలైన పద్దెనిమిదేళ్లలోపు పిల్లలకు సేవాలయంలో ఆశ్రయమిస్తారు. ఆ వయసు దాటిన తరవాత సైతం వాళ్లు ఎక్కడికి వెళ్లినా సమాజం చిన్నచూపే చూస్తుంది. అది గమనించిన రవి.. చిన్నారులతో కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేసి, దాదాపు కోటిన్నర రూపాయలను సేకరించాడు. సేవాలయం పక్కనే మరికొంత స్థలం కొనుగోలు చేసి- అక్కడ అమ్మాయిలకూ అబ్బాయిలకూ విడివిడిగా హాస్టళ్లూ, పెళ్లైన వారికి కాటేజీలూ కట్టించి ‘హ్యాపీ ఇండియన్‌ విలేజ్‌’ అనే పేరు పెట్టాడు రవి. పిల్లలందరికీ అక్కడ వసతి కల్పించి-  సేవాలయం క్యాంపస్‌లో టైలరింగ్‌, మగ్గం వర్క్‌, బ్యుటీషియన్‌ కోర్సు, మెకానిక్‌ వర్క్‌, డ్రైవింగ్‌ వంటివి నేర్పిస్తున్నాడు. అలానే విలేజ్‌లో నివసించే దంపతులు పండ్ల తోటలూ పెంచుతుంటారు. వరి, కూరగాయలూ సాగుచేస్తుంటారు. ప్రస్తుతం 100 మంది చిన్నారులతోపాటు ఇరవైై కుటుంబాలు ఉంటున్నాయి. తనే పెంచి పెద్దచేసిన పదకొండు జంటలకు రవి పెళ్లిళ్లు చేశాడు. బయట నుంచి ఎవరైనా హెచ్‌ఐవీ బాధితులు పెళ్లి సంబంధాలకోసం సంప్రదిస్తే-వారి గురించి అన్ని వివరాలూ కనుక్కుని పెళ్లిళ్లు చేస్తున్నాడు. తమ తప్పేమీ లేకుండా పుట్టుకతో హెచ్‌ఐవీ కోరల్లో చిక్కుకుంటున్న అమాయకులకోసం ఊపిరి ఉన్నంత వరకూ చేతనైనంత సాయం చేయాలన్నదే తన సంకల్పమంటున్న రవికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..