ఇల్లే అందాల హరివిల్లు..!

‘ఆకాశంలో హరివిల్లు విరిస్తే ఎంత ఆనందపడిపోతామో... పెరట్లో రంగురంగుల పూలు పూస్తే మరెంత సంబరపడిపోతామో... మరి ఆ రంగులన్నీ ఇంట్లోకొచ్చేస్తే ఇంకెంత బాగుంటుందో కదూ... అందుకే ఈ వర్షాకాలం రెయిన్‌బో కలర్స్‌తో మీ ఇంటిని మేకోవర్‌ చేసేయండి అంటున్నారు డిజైనర్లు..!

Updated : 26 Jun 2022 00:45 IST

ఇల్లే అందాల హరివిల్లు..!

‘ఆకాశంలో హరివిల్లు విరిస్తే ఎంత ఆనందపడిపోతామో... పెరట్లో రంగురంగుల పూలు పూస్తే మరెంత సంబరపడిపోతామో... మరి ఆ రంగులన్నీ ఇంట్లోకొచ్చేస్తే ఇంకెంత బాగుంటుందో కదూ... అందుకే ఈ వర్షాకాలం రెయిన్‌బో కలర్స్‌తో మీ ఇంటిని మేకోవర్‌ చేసేయండి అంటున్నారు డిజైనర్లు..!

చినుకు పడింది... నింగిలో ఇంద్రధనుస్సు విరిసింది... ఆ దృశ్యం చూడగానే చిన్నాపెద్దా అందరి ముఖాల్లోకీ తెలియకుండానే ఒకలాంటి ఆనందం వస్తుంది. పిల్లలైతే ఒకటీ రెండూ మూడూ అంటూ అందులోని రంగుల్నీ లెక్కించి సంబరపడుతుంటారు. కానీ ఆ హరివిల్లును తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోలేం కదా... అందుకే ఇంటినే ప్రకాశవంతమైన రంగులతో అలంకరించుకుంటే ఉత్సాహంగానూ ఉత్తేజపూరితంగానూ ఉంటుంది అంటున్నారు మానసిక నిపుణులు. అదీగాక వర్షాకాలంలో షికార్లకి బయటకు వెళ్లలేం. మబ్బులతో నిండిన ఆకాశంతో బయటి వాతావరణం ఒకింత చీకటిగా ఉండటంతో డల్‌గానూ అనిపిస్తుంటుంది. అందుకే ఇంట్లోని లివింగ్‌రూమ్‌, డైనింగ్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌... అన్నింటినీ రంగురంగుల ఫర్నిచర్‌తోనో డెకరేటివ్‌ యాక్సెసరీలతోనో అలంకరిస్తే ఆనందంగానూ అనిపిస్తుంది. ఇంటికి కొత్త లుక్కూ వస్తుంది అంటున్నారు ఇంటీరియర్‌ డెకరేటర్లు. అయితే ఈ రంగుల్లో కూడా అచ్చంగా ముదురుగా ఉండేవే కాకుండా లేలేత వర్ణాల్నీ జోడిస్తే ఇల్లు ఎంతో ఆకర్షణీయంగానే కాదు, ఆహ్లాదకరంగానూ ఉంటుందట. అంటే- ప్రకాశవంతమైన ఎరుపూ నారింజా పసుపూ; ప్రశాంతతకు సంకేతమైన ఆకుపచ్చా నీలం రంగులకి ఆనందాన్ని కలిగించే లేలేత నీలం గులాబీ ఊదా పీచ్‌ కలర్స్‌ని జోడించాలని చెబుతున్నారు.

ఏం చేయాలంటే...

ముందుగా లివింగ్‌రూమ్‌ లేదా హాలుని తీసుకుందాం... సాధారణంగా తెలుపూ లేదా గోధుమ రంగులతో గోడల్నీ, ముదురు గోధుమ రంగుల్లో ఉన్న లెదర్‌ లేదా చెక్కతో చేసిన ఫర్నిచర్‌తో హాలునీ ఎలిగెంట్‌ లుక్‌ వచ్చేలా అలంకరించుకుంటారు. అయితే ఎప్పుడూ ఆ వర్ణాల్నే చూస్తుంటే ఎవరికైనా బోరు కొట్టడం సహజం. అలాగని గభాల్న కొత్త ఫర్నిచర్‌ కొనలేం... గోడలకి మళ్లీ రంగుల్నీ వేయలేం. కానీ ఎరుపూ గులాబీ పసుపూ ఊదా నారింజా నీలం... వంటి రంగుల్లోని ముదురూ లేత ఛాయల్లో ఉండే సోఫా కవర్లూ కుషన్లూ కార్పెట్లని వేయడం ద్వారా హాలు లుక్కుని మార్చేయొచ్చు. గోడకు ఓ కలర్‌ఫుల్‌ మోడ్రన్‌ లేదా పాప్‌ ఆర్ట్‌ పెయింటింగ్‌నీ సప్త వర్ణాలతో నిండిన గడియారాన్నీ, కిటికీ కర్టెన్లనీ అమర్చుకున్నా హాలు వర్ణమయంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఇంటిని ఎప్పటికప్పుడు కొత్త ఫర్నిచర్‌తో అలంకరించుకోవాలి అనుకునేవాళ్లకి ఒకప్పటిలా నలుపూ ముదురు గోధుమ వన్నెలే కాకుండా ప్రకాశవంతమైన రంగుల్లోనూ సోఫాలూ, కుర్చీలూ, వాల్‌ టేబులూ, టీపాయ్‌లూ... వంటి ఫర్నిచర్‌నీ డిజైన్‌ చేస్తున్నారు. అలాగే పాప్‌ ఆర్ట్‌తో చేసిన కుషన్లూ పెయింటింగులూ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటితో కూడా ఇంటిగోడల రంగు మార్చకుండానే కలర్‌ఫుల్‌ లుక్‌ని సులభంగా తీసుకురావచ్చు. చూసీ చూసీ కొన్నాళ్లకి అవి బోర్‌ అనిపించగానే మళ్లీ తీసేయవచ్చు.

ఇదే తరహాలో పిల్లల, పెద్దల పడకగదుల్నీ అలంకరించుకోవచ్చు. నచ్చిన రెండు మూడు రంగుల్ని ఒకే గోడకు వేసినా కలర్‌ఫుల్‌ లుక్‌ వస్తుంది. రంగుల లైట్లూ పూలకుండీలూ దుప్పట్లతో కూడా పడకగదిలోనూ హరివిల్లుని విరిసేలా చేయవచ్చు. కిడ్స్‌ బెడ్‌రూమ్‌ని అయితే చాలామంది సహజంగానే రంగులతో డిజైన్‌ చేస్తారు. రకరకాల కార్టూన్‌ స్టైల్‌ డిజైన్లలో వస్తోన్న వినైల్‌ డెకాల్స్‌ లేదా పటకంలోని బ్యాండ్స్‌ మాదిరిగా చారలుచారలుగా ఉండే వాల్‌పేపర్లని అతికించడం ద్వారానూ రెయిన్‌బో లుక్‌ వచ్చేలా చేస్తున్నారు. అదీగాక పిల్లల ఫర్నిచర్‌ కూడా రంగురంగుల్లో దొరుకుతోంది. రెయిన్‌బో, యూనికార్న్‌ కుషన్లతో కూడా గదికి కొత్త లుక్‌ తీసుకురావచ్చు. కొందరైతే కిచెన్‌, బాత్‌రూమ్‌ల్ని సైతం ఆ రంగులతో నింపేస్తున్నారు. ఇవేవీ వద్దనుకుంటే ఇంట్లోని ఓ కార్నర్‌ని రంగులతో ప్రత్యేకంగా అలంకరించుకోవచ్చు. లేదా గోడకి ఓ రెయిన్‌బో చిత్రాన్ని పెట్టుకున్నా లేదా వేజ్‌లో అన్ని రకాల పూలనీ అలంకరించినా చాలు, వర్షాకాలాన్ని కలర్‌ఫుల్‌గా గడిపేయొచ్చు  అంటున్నారు ఆధునిక ఇంటీరియర్లు.

ఎందుకీ రంగులంటే...

రంగుల్ని చూసినప్పుడు తెలియకుండానే ఒకలాంటి ఆనందం కలుగుతుంది అంటున్నారు కలర్‌ థెరపిస్టులు. ఎందుకంటే సృష్టిలో సహజంగా ఉండే ఆ వర్ణవిన్యాసం మనిషిని ఎప్పుడూ చకితుల్ని చేస్తూనే ఉంటుంది. అందుకే హరివిల్లు వర్ణాలు ఒకలాంటి సంభ్రమాశ్చర్యాలతో నిండిన పాజిటివ్‌ ఫీల్‌ని కలిగిస్తాయనీ, ఇంకా చెప్పాలంటే స్తబ్దుగా ఉన్న వాతావరణంలో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపుతూ మనసుకి ఆనందానుభూతిని అందిస్తాయనీ అంటున్నారు. అదీగాక కరోనా కారణంగా ఇన్నాళ్లూ చాలామంది నాలుగు గోడలకే పరిమితమవ్వడంతో అందరిలో ఒకలాంటి నిరాశావాదం అలుముకుంది. దాన్ని రెయిన్‌బో ఎఫెక్ట్‌తో చాలావరకూ పొగొట్టవచ్చు అని మానసిక నిపుణులూ చెబుతున్నారు. అదెలా అంటే- అన్ని రంగుల్నీ ఒకేసారి చూడటం వల్ల ఎరుపు రంగులోని ఉత్తేజం, గులాబీలోని ఆనందం, నీలంలోని స్థిరత్వం, ఊదాలోని సృజన, ఆకుపచ్చలోని ప్రశాంతత... ఇవన్నీ కలిసి మనసుమీద అంతో ఇంతో ప్రభావాన్ని చూపిస్తాయట. ఈ వర్ణ సమ్మేళనం వ్యక్తుల్లో నిర్ణయాత్మక శక్తినీ పెంచుతుంది. మొత్తమ్మీద ఒత్తిడితో సతమతమవుతున్నవాళ్లలో ఈ రంగులు ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌నీ కలిగిస్తాయి. అంతేకాదు, హరివిల్లు రంగుల వల్ల బయటి వాతావరణం చల్లగా ఉన్నా నులివెచ్చని ఫీల్‌ వస్తుందనీ అంటున్నారు. అందుకే వర్షాకాలంలో ఇటలీలో కొన్ని వీధుల్లో రంగురంగుల గొడుగుల్ని అలంకరిస్తుంటారు. చూశారుగా  మరి... రంగులతో ఇంటికి ఎంత అందం వస్తుందో... కాబట్టి మీకు నచ్చిన పద్ధతిలో మీరూ ట్రై చేసి చూడండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..