బొబ్బట్లతో... ఏడాదికి రూ.18 కోట్లు!

అతడు... పన్నెండేళ్లకే పనిలో చేరాడు. వయసు పెరిగేకొద్దీ మనసుకు అనిపించింది చేయడం మొదలుపెట్టాడు. కానీ ఎందులోనూ ఊహించిన ఫలితం కనిపించలేదు సరికదా ఇంకా ఏం చేస్తే జీవితంలో స్థిరపడొచ్చు అనే తపన మొదలైంది.

Updated : 16 Jun 2024 11:32 IST

అతడు... పన్నెండేళ్లకే పనిలో చేరాడు. వయసు పెరిగేకొద్దీ మనసుకు అనిపించింది చేయడం మొదలుపెట్టాడు. కానీ ఎందులోనూ ఊహించిన ఫలితం కనిపించలేదు సరికదా ఇంకా ఏం చేస్తే జీవితంలో స్థిరపడొచ్చు అనే తపన మొదలైంది. చివరకు చిన్న ప్రయోగం చేశాడు. అదే ఇప్పుడతడికి కోట్ల రూపాయల్ని తెచ్చిపెడుతోంది. ఆ నిత్య శ్రామికుడి పేరు కేఆర్‌ భాస్కర్‌... అతడు చేసిన ప్రయోగం...బొబ్బట్ల తయారీ. అవును... బొబ్బట్లూ, సంప్రదాయ చిరుతిళ్లనూ అమ్ముతూ ఏడాదికి దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయల లాభాలను అందుకుంటూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నాడీ కన్నడ వ్యాపారి.

 ప్రాంతాన్ని బట్టి బొబ్బట్టును హోళిగె, ఒబ్బట్టు, పూరన్‌పోలీ, భక్ష్యం, పోలె... అంటూ రకరకాల పేర్లతో పిలుస్తాం. పండుగలూ, పూజలూ, ప్రత్యేక వేడుకల సమయంలో వడ్డించే ఈ బొబ్బట్టుపైన రెండు చెంచాల నెయ్యి వేసుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుందో భోజన ప్రియులకే తెలుసు. అలాంటి బొబ్బట్టును ‘భాస్కర్స్‌ మనె హోళిగె’ పేరుతో దాదాపు పాతిక రకాల రుచుల్లో అందిస్తూ ఏడాదికి పద్దెనిమిది కోట్ల రూపాయల టర్నోవరు సాధిస్తున్నాడు భాస్కర్‌. నిజానికి భాస్కర్‌ జీవితం చిన్నప్పటి నుంచీ ముళ్లదారే.

అతడి స్వస్థలం కర్ణాటకలోని కుందాపూర్‌. తండ్రి చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోవడంతో తల్లి లచ్చమ్మ షెట్టి భాస్కర్‌ను తీసుకుని బెంగళూరుకు మకాం మార్చింది. అప్పటికి కేవలం అయిదో తరగతి మాత్రమే పూర్తిచేసిన భాస్కర్‌ ఆర్థిక పరిస్థితుల కారణంగా తనకెంతో ఇష్టమైన చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి... ఓ హోటల్‌లో క్లీనర్‌గా చేరాడు. అక్కడ బల్లలు తుడుస్తూ, పాత్రలు తోముతూ తనకొచ్చిన జీతాన్ని తెచ్చి తల్లి చేతిలో పెట్టేవాడు. భాస్కర్‌కు డ్యాన్సంటే చాలా ఇష్టం. అందుకే రోజంతా హోటల్‌లో పనిచేస్తున్నా సరే.. ఖాళీ దొరికినప్పుడల్లా దగ్గర్లోని ఓ డ్యాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లి
సరదాగా నేర్చుకునేవాడు. బదులుగా తనకు వచ్చిన డ్యాన్స్‌ను అక్కడున్న పిల్లలకూ నేర్పించేవాడు. ఏడెనిమిదేళ్లు గడిచేసరికి సొంతంగా ఏదయినా చేయగలిగితే ఇంకాస్త ఎక్కువ సంపాదించొచ్చనే ఆలోచనతో చిన్న పాన్‌షాప్‌ను పెట్టాడు. ఎవరూ సరిగ్గా రాక దాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు మిగిలిన డబ్బుతో చిన్న బండిని పెట్టుకుని పానీపూరీ, చాట్‌ అమ్మేవాడు. వాటితోనూ పెద్దగా ఆదాయం రాలేదు. పైగా ఆ బండినీ ఎవరో దొంగిలించారట. ఉన్న ఒక్క ఆధారమూ పోవడంతో జీవితం మళ్లీ మొదటికి వచ్చింది. దాంతో ఏదయినా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయమే అతడి జీవితాన్ని మలుపుతిప్పింది.

పాతిక రుచుల్లో తయారుచేస్తూ...

తమ దగ్గర బొబ్బట్లకు ఉన్న ఆదరణను గుర్తించిన భాస్కర్‌ ఇంట్లోనే వీటిని తయారుచేసి ప్యాకెట్లలో పెట్టి బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని దుకాణాలకు వేయడం మొదలుపెట్టాడు. కొన్నిరోజులకు ఓ ఛానల్‌లో వంటలపోటీ జరుగుతుంటే సరదాగా పాల్గొన్నాడు. అక్కడ బొబ్బట్లను నాలుగైదు రుచుల్లో తయారుచేసి చూపించడంతో భాస్కర్‌ గురించి అందరికీ తెలిసింది. ఆ ప్రోగ్రాంను చూసిన స్నేహితుడు..రుచి, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూబొబ్బట్లకూ ఓ బ్రాండ్‌ సృష్టించమంటూ సలహా ఇవ్వడంతో ధైర్యం చేసి ‘భాస్కర్స్‌ మనె హోళిగె’ పేరుతో చిన్న స్టోర్‌ను తెరిచాడు. కల్తీలేని పదార్థాలతో రకరకాల రుచుల్లో బొబ్బట్లను చేయడంతో...ఆహార ప్రియులు ఫిదా అయిపోయారు. సంవత్సరాలపాటు తాను పడిన కష్టానికి ఫలితం కనిపించడంతో దీన్ని విస్తరించేందుకు సిద్ధమైన భాస్కర్‌... చాలా తక్కువ సమయంలోనే కర్ణాటకలో ఇరవైమూడు స్టోర్లను ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నాడు. తరువాత మహారాష్ట్రలోనూ ‘పూరన్‌పోలీ ఘర్‌’ పేరుతో ఆరు స్టోర్లను తెరిచి మరికొన్నింటిని ఫ్రాంచైజీలుగా ఇచ్చాడు. లైవ్‌ కిచెన్‌ ఏర్పాటు చేసి... పైనాపిల్‌, పనస, కొబ్బరి, డ్రైఫ్రూట్స్‌, కోవా, చాక్లెట్‌, స్పైసీదాల్‌.. ఇలా పాతిక రుచుల్లో అప్పటికప్పుడు వేడివేడిగా బొబ్బట్లు తయారుచేసేందుకు షెఫ్‌లను నియమించాడు. అదనంగా స్వీటూహాటూ కలిపి దాదాపు నాలుగు వందల రకాల చిరుతిళ్లనూ అమ్ముతున్నాడు. వీటన్నింటితోనే ఏడాదికి పద్దెనిమిది కోట్ల రూపాయల టర్నోవరును అందుకుంటున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు