Updated : 19 Feb 2023 03:57 IST

పాతవాటికి పుత్తడి పూత!

అమ్మ తెచ్చుకున్న ఇత్తడి సామగ్రికి పసిడి అందాల్ని అద్దేయొచ్చు...  నాన్న దాచుకున్న చిన్ననాటి బంగారుపతకాన్ని మళ్లీ తళతళా మెరిపించేయొచ్చు... ఇంతేనా... ఇంట్లోని రకరకాల వస్తువులన్నింటినీ మనకు నచ్చినట్టుగా బంగారూ, వెండీ కాంతులతో సరికొత్తగా చూపించేయొచ్చు... అది ఎలాగంటే...

అప్పట్లో రాజభవనాల్లో మాత్రమే తినే కంచమూ, తాగే గ్లాసూ మొదలు సేదతీరే కుర్చీ, పడుకునే మంచం వరకూ అన్నీ బంగారంతో ఉండేవి. తర్వాత్తర్వాత ఆ లోహం సామాన్యులకూ చాలా దగ్గరైంది. అన్నిరకాల ఆభరణాల్లోకీ చేరిపోయింది. ధగధగలాడే దాని వన్నెలకున్న క్రేజ్‌తో బంగారమనేది హోదాకు చిహ్నంగా మారిపోయి, అలంకరణ వస్తువుల్లోనూ వచ్చేసింది. పూజగదిలో దేవుని పటం ముందు ఉంచే పువ్వులతో మొదలైన ఆ బంగారు మెరుపులు... నెమ్మదిగా పూజ సామాన్లూ, విగ్రహాలూ, మండపాల వరకూ అన్నింటినీ తాకేశాయి. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి, బంగారు పళ్లాలూ, గిన్నెల్నీ చేయించుకుంటున్నారు. అలా పసిడి కాంతులు వెదజల్లే వస్తువులు ఇంట్లో ఉంటే బాగుంటుందని చాలామంది కోరుకున్నా... అది అందరికీ సాధ్యం కాదుగా. దానికి బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే మరి, అచ్చంగా బంగారు నగల్లా కనిపించే బంగారుపూతతో ఉండే జ్యువెలరీ వచ్చినట్టే గోల్డ్‌ ప్లేటెడ్‌ వస్తువులూ వచ్చాయి.
కొత్తగా ఇప్పుడు- మన ఇంట్లోని వస్తువుల్నే మనకు కావాల్సినట్టుగా బంగారూ, వెండీ, ఇత్తడీ, రాగీ... ఇలా రకరకాల లోహాలతో పూత పూయించుకునే వెసులుబాటూ అందుబాటులోకి వచ్చింది.
యాంటిక్‌ గోల్డ్‌ ఫినిషింగ్‌, గోల్డ్‌ ప్లేటింగ్‌, గోల్డ్‌ కోటింగ్‌ అంటూ రకరకాల పేర్లతో మంత్ర గోల్డ్‌ కోటింగ్స్‌ లాంటి సంస్థలూ, కొన్ని జ్యువెలరీ దుకాణాలూ వస్తువులపైన వెండీ బంగారాలతోపాటు ఇతర లోహాల పూతలూ వేసిస్తున్నారు.

ఎలా చేస్తారంటే...

ఏ లోహంతో చేసిన వస్తువు అయినా సరే, దాన్ని అచ్చంగా బంగారంతోనో, వెండితోనో చేశారా అన్నట్టుగా తీర్చిదిద్దడానికి నానో టెక్‌ గోల్డ్‌ డిపొజిషన్‌, ఎలక్ట్రోప్లేటింగ్‌ లాంటి టెక్నాలజీని వాడతారు. దీంతో ఆ వస్తువులు ధగధగా మెరిసిపోతూ కనిపించడమే కాదు, ఆ పూతలు పోకుండా ఉంటాయి కూడా. పైగా లోపలున్న లోహం తుప్పు పట్టకుండానూ ఉంటుందట.
24 క్యారెట్ల అసలైన లోహంతో మనం అడిగినట్టుగా... రకరకాల పొరల్లో కోటింగ్‌ వేసి ఇస్తారు. వస్తువు పరిమాణాన్ని బట్టి చదరపు అంగుళానికింత చొప్పున డబ్బులు తీసుకుంటారు.

అద్భుతంగా చెక్కిన అలనాటి దేవుళ్ల విగ్రహాలూ... వారసత్వంగా వస్తున్న దీపపు కుందెలూ, హారతి పళ్లెమూ, బిందెల్లాంటి రకరకాల ఇత్తడి సామాన్లూ భద్రంగా దాచుకున్న పతకాలూ, బహుమతి కప్పులూ, నాణేల్లాంటివీ... పాతబడ్డాయనో, మరకలతో వాటి అసలు రంగును పోగొట్టుకున్నాయనో అటకమీద పడేయక్కర్లేదు. ఎంతో కొంతకు అమ్మేసి ఒకనాటి జ్ఞాపకాల్ని వదిలేసుకోనవసరం లేదు. ఎంచక్కా బంగారూ, వెండీలాంటి లోహాల పూతలతో మళ్లీ వాటికి కొత్త రూపం ఇచ్చేసి, ఇంట్లో అందంగా పెట్టేసుకోవచ్చు. మిలమిల మెరుపుల యాంటిక్‌ లుక్కుతో ఉన్న ఆ వస్తువులు- చూసినవారి కళ్లను తక్షణం కట్టిపడేయవూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు