‘స్మార్ట్‌’గా అనుకోండి... అయిపోతుంది!

జనవరి ఫస్ట్‌... తీర్మానాల రోజు! బరువు తగ్గాలనుకుని అప్పుడే ఏడాదైంది గుర్తుందా! మందు బంద్‌ చేయాలని రెండేళ్ల కిందట ఇదే రోజున నిర్ణయించుకున్నారు మర్చిపోయారా!

Published : 01 Jan 2023 01:35 IST

‘స్మార్ట్‌’గా అనుకోండి... అయిపోతుంది!

జనవరి ఫస్ట్‌... తీర్మానాల రోజు! బరువు తగ్గాలనుకుని అప్పుడే ఏడాదైంది గుర్తుందా! మందు బంద్‌ చేయాలని రెండేళ్ల కిందట ఇదే రోజున నిర్ణయించుకున్నారు మర్చిపోయారా! ఇవేనా... గతంలోకి వెళ్లాలే కానీ ఇలాంటి వీగిపోయిన, మధ్యలోనే వదిలేసిన తీర్మానాలెన్నో! కానీ, డోంట్‌ వర్రీ... ఇది మీ ఒక్కరి లోపం కాదు. మార్పు ఎవరికైనా కష్టమే. అందుకే సగానికిపైగా న్యూ ఇయర్‌ తీర్మానాలు జనవరిలో పుట్టి ఫిబ్రవరికి మాయమైపోతాయి. ఈసారి అలా కాకూడదంటే...

తీర్మానాన్ని నిలబెట్టుకోవడంలో మొదటి మెట్టు మీకు సరిపడే లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడం. అది జీవితానికి చాలా ముఖ్యమైందైతే సాధించడం ఏమంత కష్టం కాదు. అలా కాకుండా ఎక్కువమంది ఎంపిక చేసుకుంటున్నారనో... కొత్త సంవత్సరం కాబట్టి ఏదో ఒకటి ఉండాలనో... తీర్మానించుకోవద్దంటున్నారు నిపుణులు.


‘స్మార్ట్‌’ తీర్మానం...

మేనేజ్‌మెంట్‌ నిపుణుల భాషలో చెప్పాలంటే మీ తీర్మానం ‘స్మార్ట్‌’గా ఉండాలి. స్పెసిఫిక్‌(నిర్దిష్ట), మెజరబుల్‌(కొలవదగిన), అచీవబుల్‌(అందుకోగల), రిలవెంట్‌ (అవసరం), టైమ్‌-బౌండ్‌(నిర్ణీత కాలం)... పదాలకు సంక్షిప్త రూపమే స్మార్ట్‌. ‘ఆరోగ్యం మెరుగు పరుచుకోవాలి’ అని కాకుండా.. మీ ప్రధాన సమస్య ఏదైతే అది.. బరువు తగ్గడం, సిగరెట్‌, మందు మానేయడం... ఇలా నిర్దిష్టంగా ఎంపిక చేసుకోవాలి. మీ లక్ష్యం బరువుకి సంబంధించిందైతే... ఎంత తగ్గాలనే స్పష్టత ఉండాలి. పొదుపునే తీసుకుంటే... జీతంలో 20-30 శాతం పొదుపు లక్ష్యం కావాలి. అది 50 శాతమైతే అందుకోలేక మధ్యలోనే వదిలేయొచ్చు. అలాగే మిత్రులంతా చేస్తున్నారని జిమ్‌లో చేరడం, ఆన్‌లైన్‌ కోర్సు చేయడం కాకుండా మీ అనుభవాల నుంచి లక్షాన్ని పెట్టుకోండి. అవసరమైతే ఓ జాబితా రాసుకోండి. ఒకరి ప్రోద్బలంతో పెట్టుకున్న లక్ష్యమైతే సాధనకు అవసరమైన స్ఫూర్తి కొరవడుతుంది. ఏ మార్పూ ఏ అలవాటూ, వారంలోనో, నెలలోనో గాడిలో పడదు. ముఖ్యంగా కొత్తవాటికి నెలలు పడుతుంది. నెలలవారీగా చిన్న లక్ష్యాలు పెట్టుకుని సాధిస్తూ దీర్ఘకాలంలో గమ్యాన్ని చేరుకోవాలి.


పక్కా ప్రణాళికతోనే...

లక్ష్యం నిర్దేశించుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని అందుకోవడానికి ప్రణాళికా అంతే ముఖ్యం. ముఖ్యంగా అవరోధాల్ని ముందే పసిగట్టి వాటిని అధిగమించడానికి మీ దగ్గర పరిష్కారాలు ఉండాలి. సోషల్‌ మీడియాకి దూరంగా ఉండటం మీ లక్ష్యం అయితే... ఆ ఆప్స్‌ గుర్తొచ్చినప్పుడల్లా ఆఫీసులో అయితే సహోద్యోగులతో, బయట అయితే స్నేహితులూ, కుటుంబ సభ్యులతో మాట్లాడ్డానికి కేటాయించండి. సిగరెట్‌కి దూరంగా ఉండాలంటే.. ఆ టైమ్‌లో గ్రీన్‌ టీ లాంటి ప్రత్యామ్నాయాలు చూడండి. రన్నింగ్‌ అలవాటు కావాలంటే... ముందు కొద్దిరోజులు నడకకు వెళ్లండి. బయటకు వెళ్లే సమయం, దారి.. అలవాటవుతాయి. తర్వాత పరుగు దిశగా అడుగులు పడతాయి. మొదటిరోజే పరుగు అంటే మెదడు ఆ మార్పుని అంగీకరించదు. అలాగే చెడ్డ అలవాట్లు మానేయాలంటే..
ఆ వాతావరణానికీ దూరంగా ఉండాలి.ఎంత ప్రణాళికతో వెళ్లినా కొన్నిసార్లు అడ్డంకులు తప్పవు. ఫలితం కనిపించడంలేదన్న ఆలోచనలూ మొదలవుతాయి. అలాంటప్పుడు మీ లక్ష్యాన్ని అందుకుంటే జీవితంలో వచ్చే మార్పులేంటి... లాంటి ప్రశ్నలు వేసుకుని చూస్తే- వచ్చే జవాబు మీలో స్ఫూర్తిని నింపొచ్చు. అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకోకుండా తొందర్లో సర్దుబాటు చేసుకోవాలి. 2015లో రెండు బృందాలు జిమ్‌కు వెళ్లే అలవాటుపైన నెలపాటు
అధ్యయనం చేశారు. ఒక బృందానికి రోజూ నిర్దేశిత సమయం ఇచ్చి అప్పుడే వెళ్లాలనే నిబంధన పెట్టారు. రెండో బృందానికి రోజులో ఎప్పుడైనా వెళ్లొచ్చనే సడలింపు ఇచ్చారు. నెల తర్వాత రెండో బృందంలో ఉన్నవారే జిమ్‌కి వెళ్లే అలవాటుని కొనసాగించారట. కాబట్టి పూర్తిగా మానేయడంకంటే సమయాన్ని సర్దుబాటు చేసుకోవడం మంచిది. పరుగులాంటి అంశాల్లో బృందంతో కలిసి చేయడమూ అలవాటుని కొనసాగించడానికి మంచి మార్గమే. అలాగే మీ లక్ష్యం గురించి మీకు నచ్చిన వ్యక్తులకు చెప్పడమూ
ఆ దిశగా నడిచేలా ప్రేరేపిస్తుంది.


అంతం కాదు ఆరంభమే...

లక్ష్యాన్ని చేరుకోలేకపోతే చాలామంది తమను తాము ద్వేషించుకుంటారు. అలా చేయొద్దు. లక్ష్యాన్ని అందుకోలేకపోయినంత మాత్రాన విఫలమైనట్టు కాదు. ఓ ప్రయత్నం చేశారు, మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నారు. ఆ స్ఫూర్తితో మరోసారి ప్రయత్నం చేయండి. ఆ వారం వీలు కాకపోతే, వచ్చే వారమో, వచ్చే నెలలోనో, మీ పుట్టిన రోజునాడో... ఏదో ఒక సందర్భంలో మళ్లీ పట్టాలెక్కించండి. అంతే తప్ప మళ్లీ కొత్త సంవత్సరం వచ్చేదాకా వాయిదా వేయొద్దు. ఈ సంవత్సరాన్నే జీవితానికి మలుపు సంవత్సరంగా మార్చుకోండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..