Published : 11 Jul 2021 01:39 IST

వాసన తెలీడం లేదా?

వృద్ధాప్యంలో వాసనల్ని సరిగ్గా గుర్తుపట్టలేరు. వయసు పెరిగేకొద్దీ అది సహజమే అనుకుంటాం. అయితే అన్ని వాసనల్లోనూ అలా జరగదనీ కొన్ని వాసనల్ని మాత్రమే గుర్తించలేరనీ కోపెన్‌హాగన్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు చెబుతున్నారు. 65 ఏళ్లు పైబడిన వ్యక్తుల్ని ఎంపిక చేసి రోజూ తినే పదార్థాల వాసనల్ని చూపించడం ద్వారా పరిశీలించారట. అందులో వాళ్లు మటన్‌ వేపుడు, మష్రూమ్స్‌, ఉల్లిపాయ వాసనల్ని గుర్తుపట్టలేకపోయారట. అదే కమలా, రాస్బెర్రీ, వెనీలా... వంటివయితే మామూలుగానే గుర్తుపట్టారట. దీన్నిబట్టి వాసన తెలీకపోవడం అనేది మొత్తంగా జరగడం లేదనీ ప్రత్యేకంగా కొన్ని వాసనలకు మాత్రమే అలా జరుగుతుందనీ అంటున్నారు. అదీ కాస్త ఉప్పగా ఉండే రుచులకు సంబంధించిన వాసనల్నే ఎక్కువగా మర్చిపోతున్నారట. వయసు పెరిగేకొద్దీ ఉప్పు రుచి తెలీకపోవడానికీ ఇదే కారణం కావచ్చు. ఎందుకంటే వాసనా రుచీ రెండింటికీ సంబంధం ఉంటుందనేది ఇప్పటికే పరిశోధనల్లోనూ తేలింది. కరోనాతో చాలామందికి అది అనుభవంలోకీ వచ్చింది. వాసన తెలిస్తేనే ఆ రుచినీ ఆస్వాదించగలం. అంతేకాదు, ఆఘ్రాణశక్తి పోవడం వల్ల వాళ్లు ఆహారాన్నీ సరిగ్గా తీసుకోలేక పోతున్నారనీ వృద్ధుల్లో పోషకాహార లోపానికి ఇదే ప్రధాన కారణమనీ చెబుతున్నారు. అదెలా అంటే- వాసనతో ఆహారంమీద ఇష్టం ఏర్పడుతుంది. తద్వారా ఆకలీ పెరుగుతుంది. కాబట్టి ఆ వయసులో వాళ్లకి ఏ వాసనైతే బాగా తెలుస్తుందో వాటినే ఆహారంలో భాగంగా చేర్చితే ఇష్టంగా తింటారు అని వివరిస్తున్నారు పరిశోధకులు.


కరోనా వచ్చినప్పటికీ..!

వ్యాక్సిన్‌ వేయించుకున్నాక చాలామందికి కరోనా రావడం చూస్తూనే ఉన్నాం. అయితే అలా వచ్చే కేసులు చాలా తక్కువనీ ఒకవేళ వచ్చినా వైరల్‌ లోడ్‌ తక్కువగా ఉంటుందనీ అధ్యయనాలు చెబుతున్నాయి. రెండు డోసులూ వ్యాక్సిన్‌ వేయించుకున్నాక కరోనా సోకినప్పటికీ జ్వరం, జలుబు, తలనొప్పి... ఇలా ఫ్లూ లక్షణాలే ఉంటాయనీ అవన్నీ వారం రోజుల్లోనే తగ్గి కోలుకుంటున్నట్లు వాళ్ల అధ్యయనంలో తేలిందట. అదీ రెండో డోసు వేయించుకున్న 14 రోజుల్లో కరోనా సోకిన వాళ్లలోనే లక్షణాలు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయట. ఆ తరవాత ఎవరికైనా కొవిడ్‌ సోకినా అధిక శాతం మందిలో లక్షణాలు కూడా కనిపించడం లేదట. ఇందుకోసం వీళ్లు వాక్సిన్‌ వేయించుకోకుండా కరోనా బారిన పడినవాళ్లనీ వేయించుకున్నాక కొవిడ్‌కి గురయిన వాళ్లనీ తీసుకుని - శరీరంలో ఏయే భాగాల్లో వైరస్‌ చేరిందీ ఎంత కాలం ఉందీ అనే విషయాన్ని నిశితంగా పరిశీలించారట. వాక్సిన్‌ వేయించుకోనివాళ్లలో అది రెండు వారాలపాటు ఉంటే వేసుకున్నవాళ్లలో ఒక వారం మాత్రమే ఉంటుందట. పైగా వ్యాక్సిన్‌ వల్ల వైరల్‌ లోడ్‌ 40 శాతం తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. దాంతో వీళ్ల నుంచి వేరేవాళ్లకు సోకే ప్రమాదమూ తక్కువే అంటున్నారు. కాబట్టి అందరూ వ్యాక్సిన్‌ రెండు డోసుల్నీ తప్పక వేయించుకుని తీరాలని వివరిస్తున్నారు పరిశోధకులు.


బియ్యంతో కలరా వ్యాక్సిన్‌!

వ్యాక్సిన్‌ అనేది ఇంజెక్షన్‌ లేదా చుక్కల మందు రూపంలో ఉంటుందనే తెలుసు. కానీ జపాన్‌ పరిశోధకులు వరి ధాన్యాన్నే కలరా వ్యాక్సిన్‌గా రూపొందించారు. ‘మ్యూకో రైస్‌-సీటీబీ’ అని పేరు పెట్టిన ఈ బియ్యాన్ని నూరి, పొడి చేసి నీళ్లలో కలుపుకుని తాగితే చాలట. వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లే. అంటే- జన్యుమార్పిడి ద్వారా కలరా యాంటిజెన్లు ఉన్న వరి వంగడాన్ని రూపొందించా రన్నమాట. బియ్యంలోని ప్రొటీన్‌ పొరల్లో కలరా యాంటిజెన్లు ఉండటం వల్ల దీన్ని తాగినప్పుడు- పొట్టలోని ఎంజైమ్‌ల కారణంగా అవి చనిపోకుండా ఉంటాయి. దాంతో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. అదే నోటి ద్వారా నేరుగా వ్యాక్సిన్‌ను ఇస్తే లోపలకు రాగానే ఆ యాంటిజెన్లను పొట్టలోని ఎంజైమ్‌లు నాశనం చేయడంతో యాంటీబాడీలు పెరగడం లేదట. అందుకే ఈ ప్రత్యామ్నాయం. ఇప్పటికే కొందరిలో ఈ రైస్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాన్ని చేశారట. ఎనిమిది వారాల్లో నాలుగు డోసులు ఇవ్వగా వాళ్లలో ఎలాంటి దుష్ఫలితాలూ తలెత్తలేదనీ రోగనిరోధక శక్తీ పెరిగిందని చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్‌ ప్రభావం పొట్టలోని మైక్రోబయోమ్‌మీదా ఆధారపడి ఉంటుందట. బ్యాక్టీరియా వైవిధ్యం తక్కువగా ఉన్నవాళ్లతో పోలిస్తే, ఎక్కువగా ఉన్న వాళ్లలో రోగనిరోధకశక్తి బాగున్నట్లు గుర్తించారు. కాబట్టి త్వరలోనే దీన్ని మార్కెట్‌లో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు.


చర్మమే రీఛార్జ్‌ చేస్తుంది!

ఎంతసేపు నిద్రపోతున్నాం, గుండె ఎలా కొట్టుకుంటోంది... వంటి  ఆరోగ్యకరమైన అంశాల కోసం వేరబుల్‌ టెక్నాలజీ వాడకం పెరుగుతోందనేది తెలిసిందే. అయితే పగలంతా పెట్టుకుని రాత్రిపూట ఛార్జింగ్‌కి పెడుతుంటారు. కానీ నిద్ర అన్నదే ఆరోగ్యంలో అత్యంత కీలకం. ఆ సమయంలోనే దాన్ని తీసి పక్కన పెట్టడం వల్ల ఉపయోగం ఉండటం లేదు. అందుకే మాసాచుసెట్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఓ విధానాన్ని కనుగొన్నారు. చర్మం ద్వారానే రీఛార్జ్‌ అయ్యేలా వాటిని డిజైన్‌ చేశారు. ఎలాగంటే ఈ కొత్త వాచీ లేదా ఫిట్‌బిట్‌లోని వైర్లు చర్మం నుంచే విద్యుచ్ఛక్తిని గ్రహిస్తాయట. కీబోర్డు, ఫోనుతో పనిచేసేటప్పుడూ వేళ్లూ చేతుల ద్వారా చర్మంలోకి ప్రసరించే విద్యుచ్ఛక్తిని మణికట్టు దగ్గరున్న వాచీలోని వైర్లు గ్రహించగలిగేలా దాన్ని రూపొందించారు. అలా ప్రసరించే విద్యుచ్ఛక్తి అది ఛార్జ్‌ కావడానికి సరిపోయిందట. కాబట్టి నిత్యం కీబోర్డుతో పనిచేసేవాళ్ల స్మార్ట్‌వాచీలకి ఛార్జింగ్‌ అవసరం లేదన్నమాట.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని