ఫోన్‌లోనే ఉంటున్నారా?

స్నేహితులంతా కలిసి గడపాలనుకున్నారు. కానీ కెఫెకి వెళ్లాక అంతా ఎవరి ఫోనులో వాళ్లు బిజీ.

Updated : 09 Jan 2022 08:55 IST

ఫోన్‌లోనే ఉంటున్నారా?

స్నేహితులంతా కలిసి గడపాలనుకున్నారు. కానీ కెఫెకి వెళ్లాక అంతా ఎవరి ఫోనులో వాళ్లు బిజీ. ఒకరిద్దరు మాత్రం వాళ్ల ప్రవర్తన చూసి నిరాశతో ఇంటిముఖం పట్టారు. ఇలాంటి సంఘటనలు ఈమధ్య అంతటా చోటుచేసు కుంటున్నట్లు జార్జియా విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ రకంగా ఫోనులో ఉంటూ స్నేహితుల్నీ కుటుంబసభ్యుల్నీ నిర్లక్ష్యం చేయడాన్నే ఫోన్‌ స్నబ్బింగ్‌గా పిలుస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగాలు చాలానే ఉన్నాయి. కానీ అది మనుషుల మధ్య ఉండే బంధాల్ని దారుణంగా దెబ్బతీస్తున్నట్లు అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు, స్నేహితులతో ఉన్నప్పుడూ భోజనం చేస్తున్నప్పుడూ కూడా ఫోనుతోనే ఉండేవాళ్లలో డిప్రెషన్‌, ఆందోళన... వంటి లక్షణాలు ఉంటున్నాయట. వాళ్లు మనుషులతో నేరుగా మాట్లాడలేకపోతున్నారనీ ఇదో రకమైన ప్రవర్తనాలోపమనీ అంటున్నారు. అదే ఫోనులోకన్నా స్నేహితులతో ఎక్కువగా గడిపేవాళ్లు ఇతరులతో సౌమ్యంగానూ మర్యాదగానూ వ్యవహరిస్తుంటే, ఫోనుతోనే ఉండేవాళ్లు మాత్రం దురుసుగా ఉంటున్నారట. పైగా స్నేహితులతో గడిపేటప్పుడు- ఫోనుని పక్కన పెట్టేసి లేదా స్విచాఫ్‌ చేసేవాళ్లు ఆ బంధానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వాళ్ల అధ్యయనంలో తేలింది. కాబట్టి ఫోనుతో గడిపేవాళ్లు ఇప్పటికైనా జాగ్రత్తపడండి అని హెచ్చరిస్తున్నారు సదరు పరిశీలకులు.


దంత సమస్యలుంటే...

చిగుళ్ల వ్యాధులూ దంత సమస్యలూ ఉంటే ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అని ఈమధ్య తరచూ చెబుతున్నారు. ఎందుకంటే దంత వ్యాధులున్నవాళ్లు హృద్రోగాలకీ ఆటోఇమ్యూన్‌ వ్యాధులకీ గురవుతున్నట్లు బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలిందట. దంత ఆరోగ్యం క్షీణించేకొద్దీ దీర్ఘకాలిక మానసిక సమస్యలకు గురవుతున్నారట. ముఖ్యంగా బీపీతోపాటు ఆల్జీమర్స్‌ వంటి వ్యాధులు తలెత్తుతున్నాయి. ఈ విషయమై వీళ్లు దాదాపు 64 వేలమందిని ఎంపికచేసి సుమారు ఐదారేళ్లపాటు గమనిస్తూ వచ్చారట. అందులో 33 శాతం మందికి ఆర్ద్రయిటిస్‌, సొరియాసిస్‌... వంటి వ్యాధులు తలెత్తితే, 18 శాతం మందిలో హృద్రోగాలు, పక్షవాతం వంటివి గమనించారట. చిగుళ్ల వ్యాధులు ఉన్నవాళ్లలో 37 మందికి ఆందోళన, డిప్రెషన్‌... వంటి మానసిక సమస్యలు కనిపించాయట. మొత్తమ్మీద దంత సంబంధిత ఇన్ఫెక్షన్లు మెదడులోని రోగనిరోధక వ్యవస్థమీద ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. కాబట్టి దంత ఆరోగ్యాన్ని ఎంతమాత్రం అశ్రద్ధ చేయవద్దని బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.


గుండె రేటు తెలుసుకోవాలంటే..!

ప్పటికే రకరకాల ఆక్సీమీటర్లు మార్కెట్లో ఉన్నాయి. అయితే కొత్తగా వచ్చిన టింకె మరింత క్షుణ్ణంగా గుండె పనితీరు గురించి సమాచారాన్ని అందిస్తుంది. శ్వాస, గుండె వేగంతోపాటు రక్తంలోని ఆక్సిజన్‌ శాతాన్ని సైతం లెక్కిస్తుందట. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌లతో పనిచేసే ఈ పరికరం మీద వేలుని పెడితే చాలు... అది గుండె, శ్వాసలకు సంబంధించిన అన్ని అంశాలనూ పరీక్షించి, ఆ సమాచారాన్ని ఆప్‌ ద్వారా ఫోన్‌కి పంపించేస్తుంది. కాబట్టి రక్తంలో ఆక్సిజన్‌ ఎంత ఉందీ గుండె ఎలా కొట్టుకుంటోందీ... తదితర వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకుని వైద్యుల్ని సంప్రదించడం ద్వారా ముందే జాగ్రత్తపడవచ్చు.


బి-12 లోపిస్తే...

మధ్య కాలంలో చాలామందిలో డి-విటమిన్‌ తోపాటు మరో విటమిన్‌ లోపం కనిపిస్తోంది. అదే బి-12. శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేయడానికి ఇది ఎంతో అవసరం. ముఖ్యంగా మెదడు, ఎముకల పనితీరులో ఇది కీలకం. రక్తకణాల వృద్ధికీ డీఎన్‌ఏ తయారీకీ ఇది అత్యవసరం. పైగా మన శరీరం దీన్ని  సహజంగా ఉత్పత్తి చేసుకోలేదు సరికదా, ఎక్కువకాలం నిల్వ ఉంచుకోలేదు. శాకాహార ఉత్పత్తుల్లో ఇది చాలా తక్కువ కాబట్టి అవి మాత్రమే తినేవాళ్లలో ఈ లోపం తలెత్తే అవకాశం ఎక్కువ. అలాగే పొట్టలోని గోడలు పలుచబారినా రోగనిరోధక వ్యవస్థలో లోపాలు తలెత్తినా ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకున్నా ఈ లోపం తలెత్తవచ్చు. అయితే ప్రాథమిక దశలో బి-12 లోపాన్ని అంతగా గుర్తించలేం. ఒత్తిడి, అలసట... వంటి సాధారణ లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. గుడ్లు, చేపలు, మాంసం, చికెన్‌లలో ఇది ఎక్కువగా ఉంటుంది. అలసట, చర్మం పాలిపోవడం, నీరసంగా అనిపిస్తున్నా, నాలుక నున్నగా మారినా, మలబద్ధకం, డయేరియా తగ్గకున్నా, ఆకలి లేకపోవడం, కండరాలు బలహీనంగా మారడం, నడవలేకపోవడం, కంటిచూపు మందగించడం, డిప్రెషన్‌, జ్ఞాపకశక్తి తగ్గడం, ప్రవర్తనలో లోపాలు... రక్తహీనత ఉన్నా, నాలుక ఎర్రబారినా బి-12 లోపం ఉందని గ్రహించవచ్చు. అంతేకాదు, దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా కూడా అనిపించవచ్చు. కాబట్టి లోపాన్ని నిర్లక్ష్యం చేయ కుండా తృణధాన్యాలూ పాల ఉత్పత్తులూ గుడ్లూ చేపలూ మాంసాహారం... వంటివి తీసుకుంటే బి-12 లోపం తలెత్తకుండా ఉంటుంది. ఇవేవీ కుదరకపోతే సప్లిమెంట్లు తప్పనిసరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..