నలుగురు ఉన్నా చాలు!

వయసులో ఉన్నప్పుడు ఎవరికైనా సంబంధ బాంధవ్యాలు అనేకం ఉంటాయి. అంటే- కుటుంబీకులూ బంధువులూ స్నేహితులూ సహచరులూ...

Published : 11 Dec 2022 00:03 IST

నలుగురు ఉన్నా చాలు!

వయసులో ఉన్నప్పుడు ఎవరికైనా సంబంధ బాంధవ్యాలు అనేకం ఉంటాయి. అంటే- కుటుంబీకులూ బంధువులూ స్నేహితులూ సహచరులూ... ఇలా ఎందరో ఉంటారు. అయితే వృద్ధాప్యం సమీపించేకొద్దీ కుటుంబీకులూ దగ్గరి బంధువులూ చిరకాల స్నేహితులతోనే ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడతారు. తెలియకుండానే పరిధి తగ్గిపోతుంటుంది. మనుషుల్లోని ఈ రకమైన సంబంధాలు పరిణామక్రమంలో భాగంగా కోతులనుంచే వచ్చి ఉంటాయని భావిస్తున్నారు ఎలెక్సర్‌, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ నిపుణులు. ఎందుకంటే- సుమారు రెండు వందల మెకాకే కోతుల్ని పదేళ్లపాటు నిశితంగా పరిశీలించినప్పుడు- ప్రత్యేకించి ఆడకోతులు- వయసుమీద పడే కొద్దీ అన్నింటితో కలవడం తగ్గించి కుటుంబంతోనూ చిరకాలం నుంచీ స్నేహంగా మెలిగే కోతులతోనే ఎక్కువ సమయం గడపసాగాయట. అంటే- వయసుని బట్టి సామాజిక బంధాల ప్రాధాన్యాలు మారుతుంటాయని చెబుతున్నారు. చిన్న వయసులో సామాజికంగా ఎంతమంది ఉంటే అంత లాభం. కానీ వయసు వచ్చే కొద్దీ ఆ సంఖ్యను తగ్గించుకోవడంవల్ల వ్యాధుల సంక్రమణ తగ్గుతుంది. కొత్త పరిచయాలు తగ్గడంతో మెదడుకి మరీ పని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ రకంగా అవి ఆరోగ్యంగా ఉంటున్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా వృద్ధాప్యంలో చుట్టూ వందమంది లేకున్నా ఆత్మీయులైనవాళ్లు నలుగురు ఉన్నా వాళ్లు హాయిగా జీవించగలరన్నది నిపుణుల అభిప్రాయం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..