హహ్హహ్హ

ఉద్యోగి: సర్‌ ఇక్కడ బాగా వర్షం పడుతోంది ఏం చేయమంటారు... బాస్‌: నువ్వే నిర్ణయించుకో. ఆఫీసులో నా దగ్గర పని చేయడం బెటరో, ఇంట్లో మీ ఆవిడ దగ్గర బెటరో!

Updated : 14 Aug 2022 12:19 IST

హహ్హహ్హ

నిర్ణయం నీదే!

ఉద్యోగి: సర్‌ ఇక్కడ బాగా వర్షం పడుతోంది ఏం చేయమంటారు...

బాస్‌: నువ్వే నిర్ణయించుకో. ఆఫీసులో నా దగ్గర పని చేయడం బెటరో, ఇంట్లో మీ ఆవిడ దగ్గర బెటరో!


టేస్ట్‌...

మాధవ్‌: రాధా... నీ పుట్టినరోజు వస్తోంది కదా. నీకోసం పట్టుచీర పట్టుకొచ్చాను. ఇదిగో.

రాధ: నాకు చెప్పకుండా ఎందుకు తెచ్చావు. ఈ రంగు నాకు అసలు నప్పదు. ఇంత పెద్ద బోర్డరు ఎప్పుడన్నా కట్టుకున్నానా? డిజైన్‌ అస్సలు బాలేదు. నీకు మంచి టేస్ట్‌ లేదు, సెలక్షన్‌ తెలియదు...

మాధవ్‌: సారీ. నీకు నచ్చకపోతే సరే. తిరిగిచ్చేసి వేరేది తెచ్చుకుందాం. షాపు వాళ్లకి ఆ మాట చెప్పే తెచ్చాలే.

కొన్నాళ్ల తర్వాత...

రాధ: హ్యాపీ బర్త్‌డే మాధవ్‌. నీకోసం ఈ టీషర్ట్‌ కొన్నా. ఇవాళ వేసుకో.

మాధవ్‌: టీషర్టుకి జేబులుంటే నాకు నచ్చదు రాధా. పైగా ఈ రంగూ...

రాధ: నీకు టేస్ట్‌ తెలియదు అసలు. జేబు ఉంటే సమస్యేంటి? ఈ రంగు నీకు చాలా బాగుంటుంది. ప్రైస్‌ ట్యాగ్‌ కత్తిరించి పసుపు బొట్టు కూడా పెట్టేశాను...
మాట్లాడకుండా వేసుకో...


ఎప్పుడూ లేవంటాడు?

శీను: (చిరాగ్గా) ఆ రాకేశ్‌ ఏంట్రా ఎప్పుడూ డబ్బుల్లేవ్‌ డబ్బుల్లేవ్‌ అంటాడు...

హరి: ఏమైంది. నిన్నేమన్నా డబ్బులు అడుగుతున్నాడా...

శీను: నేను అడిగిన ప్రతిసారీ లేవంటున్నాడు రా!


మాటంటే మాటే..!

వెంగళప్ప పది రూపాయలు పెట్టి లాటరీ టికెట్‌ కొన్నాడు. దానికి కోటి బహుమతి వచ్చింది. ట్యాక్సులవీ పోగా డెబ్భై లక్షలకు చెక్‌ ఇచ్చారు షాపు వాళ్లు.

కోటి అని చెప్పి 70 లక్షలే ఇచ్చి మాట తప్పారని వెంగళప్ప గొడవ మొదలెట్టాడు. ఎంత చెప్పినా అతనికి అర్థం కాకపోయేసరికి ‘అయితే ఇప్పుడేంటంటారూ’ అడిగాడు విసిగిపోయిన షాపు యజమాని.

‘మీరు ముందు చెప్పినట్లుగా కోటి రూపాయలూ ఇవ్వండి. లేదంటే నా పది రూపాయలు నాకు వాపస్‌ ఇవ్వండి’ చెప్పాడు వెంగళప్ప.


మళ్లీ నేర్పించాలా!

రాధ: జన్మజన్మలకీ మీరే నా భర్తగా దొరకాలి...

కృష్ణ: ఎందుకనోయ్‌. నేనంటే నీకంత ప్రేమా!

రాధ: మీకు అన్ని పనులూ నేర్పి సంసారాన్ని ఈదుతున్నా. మళ్లీ వచ్చే జన్మలో నేర్పించడం నా వల్ల కాదు బాబోయ్‌!


అబద్ధం కాదు!

రఘు: నిన్న ఆఫీసుకు ఎందుకు రాలేదు...

శివ: హాస్పిటల్‌కి వెళ్లా...

రఘు:అబద్ధం. నేను మిమ్మల్ని ఓ అమ్మాయితో సినిమా థియేటర్‌ దగ్గర చూశా...

శివ: మా ఆవిడ కూడా చూసింది. అందుకే హాస్పిటల్‌కు వెళ్లాల్సి వచ్చింది!


అప్పుడు నేను అడిగానా?

న పేషంట్‌కు ఫోన్‌ చేశాడు డాక్టర్‌...

డాక్టర్‌: ఏమయ్యా ఇదేమైనా నీకు పద్ధతిగా ఉందా?

పేషంట్‌: విషయం ఏంటో చెప్పండి డాక్టర్‌గారూ...

డాక్టర్‌: నువ్వు ఫీజుగా ఇచ్చినచెక్‌ బౌన్స్‌ అయి తిరిగి వచ్చింది. తెలుసా!!

పేషంట్‌: క్రితం సారి మీరు నయం చేసిన రోగం నాకు మళ్లీ తిరిగి వచ్చింది. అప్పుడు నేనేమన్నా అడిగానా?


షాపు మార్చండి!

కొత్తగా పెళ్లయిన జంట వేరు కాపురం పెట్టారు. పొద్దున్నే పాలపాకెట్‌ తెచ్చాడు భర్త. కాసేపటికి...

భార్య: ఏమండీ పాలు ఎక్కడ తెచ్చారు?

భర్త: పక్క వీధిలో ఉన్న షాపు నుంచి. ఏమైందీ?

భార్య: పొంగిపోతున్నాయండీ. రేపటి నుంచి వేరే షాపులో తీసుకురండి.


బజ్జీలు పెట్టొచ్చుగా...

‘సంఘసేవకి కూడా సీజన్‌ ఏంటో...’ చిన్నగా గొణుక్కుంటున్నాడు రమేశ్‌.

‘ఏమైందీ...’ అడిగాడు సురేశ్‌.

‘వేసవికాలం అంతా చలివేంద్రాలు పెట్టి చల్ల చల్లగా మంచినీళ్లూ మజ్జిగా పోస్తారు కదా. వానాకాలం రాగానే వాటిని తీసేయడం ఎందుకూ? ఎంచక్కా వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు వేసి పెట్టొచ్చుగా...’

నిరాశగా చెప్పాడు రమేశ్‌.



మీకు తెలుసా!

ఆటోగ్రాఫ్‌కి డబ్బు అడిగిన గాంధీజీ

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా వార్తలు రాయడానికి భారత్‌ వచ్చిన ఒక అమెరికన్‌ జర్నలిస్టు గాంధీని ఆటోగ్రాఫ్‌ అడిగాడట. అందుకు ఆయన ఇరవై రూపాయలు డిమాండ్‌ చేశారు. కాసేపు బేరమాడితే పదిహేనుకి ఒప్పుకున్నారు. ఆ డబ్బుని హరిజన సంక్షేమ నిధికి ఇచ్చారట గాంధీజీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..