హహ్హహ్హ

వదినా... మీ వాడికి ఆరేళ్లు వచ్చినా వేలు చప్పరించే అలవాటు పోలేదని బాధపడేదానివి. ఇప్పుడు ఎలా మానిపించావు?, రాగిణి: కాస్త లూజుగా ఉండే నిక్కర్లు కుట్టించానంతే.

Published : 09 Oct 2022 00:46 IST

హహ్హహ్హ

నిక్కరుతో మారిపోయింది!

సుధ: వదినా... మీ వాడికి ఆరేళ్లు వచ్చినా వేలు చప్పరించే అలవాటు పోలేదని బాధపడేదానివి. ఇప్పుడు ఎలా మానిపించావు?
రాగిణి: కాస్త లూజుగా ఉండే నిక్కర్లు కుట్టించానంతే. నిక్కరు జారిపోకుండా పట్టుకోవడంతోనే సరిపోయి వేలు చప్పరించడం మానేశాడు!


సగం జీతం నాకేగా

‘విడాకులు వచ్చాయని సంతోషిస్తున్నావు కానీ అమాయకురాలివి ఎలా బతుకుతావో ఏమో. స్వయంగా ఉప్మా చేసుకోవడం కూడా రాదు నీకు’ తాజా మాజీ భార్య మీద జాలిపడ్డాడు భర్త.

‘మీరు అంతగా జాలిపడక్కర్లేదు లెండి. మీ జీతంలో సగం నాకే వస్తుందిప్పుడు. దాంతో నేను స్విగ్గీలో ఆర్డరు పెట్టుకుని జీవితమంతా కాలు మీద కాలేసుకుని కూర్చుని తినొచ్చు...’ చెప్పింది తాజా మాజీ భార్య.


చూడలేను...

భార్య: ఏమండీ మీరు ఇంత కష్టపడి వంట చేస్తుంటే చూడలేకపోతున్నానండీ.
భర్త: (సంతోషంగా) అయితే రేపటి నుంచి నువ్వే చేసుకుంటావా మరి.
భార్య: మీరు మరీనూ...
దేనికైనా ఉపాయం ఉండాలండీ. వంటింటి తలుపు వేసుకుని చేసుకోండి.


ఆ పని నాది కాదు...

సువర్ణ: మీ అబ్బాయికీ, అమ్మాయికీ ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా...
రాధ: మా ఇంట్లో అమ్మకాలూ కొనుగోళ్ల వ్యవహారమంతా మా వారే చూసుకుంటారు వదినా!


హుండీ

కొత్తగా పెళ్లయిన స్నేహితుడిని ‘ఏమిటీ దిగులుగా ఉన్నావ్‌’ అని అడిగాడు ఫ్రెండు.

‘ఏం చెప్పను. హాలు ఖర్చు కలిసొస్తుందని గుడిలో పెళ్లి చేసుకుంటే వచ్చినవాళ్లంతా కట్నకానుకల్ని మాకు చదివించకుండా హుండీలో వేసి పోయారు’ విచారంగా చెప్పాడు ఆ ఫ్రెండ్‌.

 


ఎలా రాయాలి

వేగంగా వెళ్తున్న కారును ఆపాడు ట్రాఫిక్‌ పోలీసు. ‘60 కి.మీ. వేగంతో వెళ్లాల్సిన చోట నువ్వు వంద కి.మీ. స్పీడుతో వెళ్తున్నావు. చలాన్‌ కట్టక తప్పదు, నీ పేరేంటి...’ అంటూ చలాన్‌ రాయడానికి పుస్తకం తీశాడు పోలీసు.
‘యాజ్ఞవల్క్య విష్వక్సేన శర్మ’ చెప్పాడు కారులో వ్యక్తి.

‘సర్లే... ఇంకెప్పుడూ ఇలా చేయకండి. ఏదో పెద్దవారని ఈసారికి వదిలేస్తున్నా’ అంటూ పుస్తకం మూసేశాడు పోలీసు... ఆ పేరును ఎలా రాయాలో చేతకాక.


మీలాంటి వాడొద్దు

భర్త: కాస్త ఆలస్యమైనా- జాగ్రత్తగా వెతికి మనమ్మాయికో మంచి అందగాడినీ తెలివైనవాడినీ ధనవంతుడినీ తేవాలి కాంతం.
భార్య: అవును... మా నాన్నలా తొందరపడి పనికిమాలిన సంబంధం తేవద్దు.


చాలా గారాబం...

అమ్మాయి తండ్రి: కాస్త గారాబంగా పెంచామండీ. మా అమ్మాయికి వంట రాదు. మీరే అడ్జస్ట్‌ అవ్వండి...
అబ్బాయి తండ్రి: మా అబ్బాయినీ గారాబంగానే పెంచామండీ.
ఏ జాబూ చేయలేడు, మీరూ కాస్త సర్దుకుపోండి!


డబ్బుల్లేవ్‌!

 

వెంగళప్ప: లక్ష రూపాయలు ఇవ్వండి...
క్యాషియర్‌: డబ్బుల్లేవండీ...
వెంగళప్ప: ఎందుకుంటాయ్‌... వాళ్లకీ వీళ్లకీ తేడా లేకుండా అందరికీ లోన్లు ఇచ్చేస్తుంటే...
క్యాషియర్‌: డబ్బుల్లేనిది బ్యాంకులో కాదు. మీ అకౌంట్లో!


నేనంటేనే ఇష్టం!

వెంగళప్ప: నీకు నేనంటే ఇష్టమా... పిల్లలంటే ఇష్టమా...
భార్య: నాకు పిల్లలంటేనే ఇష్టం.
వెంగళప్ప: కాదు నీకు నేనంటేనే ఇష్టం.
భార్య: అది మీరెలా చెబుతారు.
వెంగళప్ప: ‘మీ పిల్లలు బుద్ధిమంతులు’ అని ఎవరైనా పొగిడితే-  మీ ఇంట్లో రెండ్రోజులు ఉంచుకోండి తెలుస్తుంది అనే దానివి. మొన్న పక్కింటావిడ ‘మీ ఆయన బుద్ధిమంతుడు’ అన్నప్పుడు-  మీ ఇంట్లో రెండ్రోజులు ఉంచుకోండి తెలుస్తుంది అనగలిగావా? లేదు కదా. అందుకే నీకు నేనంటేనే ఇష్టం.


జేబు తడపమన్నాడు

జడ్జి: ఆ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ జేబులో నీళ్లు ఎందుకు పోశావు?
వెంగళప్ప: నేను బండిమీద వస్తుంటే ఆపి, బండి పేపర్లు చెక్‌ చేసి, తాళం చెవి తీసుకుని, నా జేబు తడిపితేనే నీవి నీకిస్తా అన్నాడు... అందుకని...



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..