ఊరికి పండగొచ్చింది!
నాలుగు నెలల ముందే టికెట్ల రిజర్వేషన్ అయిపోతుంది. రెండు నెలల ముందునుంచీ ‘పండక్కి వస్తాం కదా, మాట్లాడుకుందాం...’ అంటూ ఫోన్లు మొదలవుతాయి. కొత్త సంవత్సరం రావడం ఆలస్యం ఇక పండుగ మూడ్‌లోకి వచ్చేస్తారు అందరూ.
ఊరికి పండగొచ్చింది!
నాలుగు నెలల ముందే టికెట్ల రిజర్వేషన్ అయిపోతుంది. రెండు నెలల ముందునుంచీ ‘పండక్కి వస్తాం కదా, మాట్లాడుకుందాం...’ అంటూ ఫోన్లు మొదలవుతాయి. కొత్త సంవత్సరం రావడం ఆలస్యం ఇక పండుగ మూడ్‌లోకి వచ్చేస్తారు అందరూ. ‘ఎంతైనా పెద్ద పండుగ మరి’ అంటారు ఆ హడావుడిని సమర్థించుకుంటూ. పండుగంటే సొంతూళ్లకు వెళ్లడం, కొత్తబట్టలేసుకుని పిండివంటలు తినడమేగా, కాకపోతే ఈ పండక్కి ముగ్గులూ గొబ్బిళ్లూ గంగిరెద్దులూ లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇంకాస్త సందడి... అనుకుంటున్నారా? ఒకప్పుడు అంతే, ఇప్పుడు కాదు! పేరుకు తగ్గట్టే ఊళ్లకి కొత్త కాంతులు తెస్తోంది సంక్రాంతి. ఎలాగో చూడండి మరి..!
నగరంలోనే పుట్టి ఉండవచ్చు. చదువూ ఉద్యోగమూ అక్కడే కావచ్చు. ఏ కారణంగానైనా ఇప్పటివరకూ పల్లెటూరికి వెళ్లాల్సిన అవసరం రాకపోయి ఉండవచ్చు. అలాంటి వాళ్లు కూడా ఏడాదికోసారైనా పల్లెటూరికి వెళ్లాలి. అమ్మానాన్నలో, అత్తామామలో నడచి వచ్చిన ఆ మట్టి వాసన చూడాలి. అక్కడి బంధుత్వాల్ని కలుపుకోవాలి. వరసకట్టి పల్లె భాషలో నోరారా పలకరించాలి. అవును మరి, రేపు మన పిల్లలకు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకో, లక్షల జీతంతో పెద్ద ఉద్యోగమో వస్తే... మా ఊరి కుర్రాడే, మా వాళ్ల అమ్మాయే... అంటూ గర్వపడేది ఆ ఊరేగా..!
అలాంటి ఊరితో బంధాన్ని పెనవేసుకోవడానికి పెద్ద పండుగని మించిన సందర్భం ఏముంటుంది? అందుకే రైలు టికెట్ దొరక్కపోయినా, జనరల్ బోగీలో నిలబడేందుకు మాత్రమే చోటు దొరికినా, ఆర్టీసీ బస్సులో అదనంగా వేసిన కుర్చీలో కూర్చోవాల్సి వచ్చినా... పర్వాలేదు. సొంతూరికి వెళ్లి తీరాల్సిందే. ఏముంటుందక్కడా అంటే- పండుగకి మించి ఇంకా చాలా ఉంటుంది. కావాలంటే ఇది చూడండి..!
ఊరికోసం... ఒక తీర్మానం
నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో పెన్నా నది మధ్యన ఉంటుంది నడిగడ్డ అగ్రహారం. పేరుకే అగ్రహారం కానీ అన్ని కులాలవారూ ఇక్కడ ఉంటారు. దూరాన ఉన్న గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న పల్లె కావడంతో దీని గురించి పట్టించుకున్నవాళ్లెవరూ లేరు. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తూ పండుగకు ఊరికి వస్తున్న యువత దృష్టి నానాటికీ తీసికట్టుగా మారుతున్న ఊరి పరిస్థితి మీద పడింది. సొంతూరిని బాగు చేసుకుంటేనే తమ చదువుకు సార్థకత అనుకున్నవాళ్లంతా తలా కొంతా వేసుకుని ఊరి సంక్షేమానికి నిధులు సేకరించడం మొదలెట్టారు. ముందుగా ఊరంతటినీ ఒక్కటి చేయడానికి సంక్రాంతి పండుగనే వేదికగా మార్చుకున్నారు. పండుగ మూడు రోజులూ పెద్దా చిన్నా అందరూ పాల్గొనేలా రకరకాల కార్యక్రమాలతో సందడి చేస్తారు. పండుగ అయిపోయాక సేకరించిన నిధుల్ని బట్టి వచ్చే పండుగ లోపల ఊళ్లో చేపట్టాల్సిన మంచి పని గురించి ఒక తీర్మానం చేసుకుంటారు. మళ్లీ వచ్చే పండుగ నాటికల్లా ఊళ్లో ఉన్నవాళ్లు ఆ కార్యక్రమాన్ని అమలుచేస్తారు. అలా గత ఐదారేళ్లలోనే ముంపు గ్రామమైన ఆ ఊరిలో చక్కటి రోడ్లు వేసుకున్నారు. దేవాలయాలను బాగు చేసుకున్నారు. చిన్నప్పుడు తాము చదువుకున్న ప్రభుత్వ పాఠశాల మూతపడే స్థితికి చేరడం, ఊరి పిల్లలేమో దూరంగా ఉన్న మరో ఊరి బడికి వెళ్లాల్సి రావడం గమనించారు. వెంటనే దాన్ని పునరుద్ధరించి టీచర్లను నియమించి ఇంగ్లిషు మీడియం కూడా చెప్పే ఏర్పాటు చేయడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏటా రెండు లక్షల రూపాయల వరకూ గ్రామం కోసం వెచ్చిస్తున్న యువత ఈ ఏడాది ఊరికోసం కొత్తగా ఏం చేయబోతోందో వేచి చూడాల్సిందే.
యువచైతన్యం... పాచలవలస
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, దత్తిరాజేరు మండలం, పాచలవలస-రైల్వే ఉద్యోగుల గ్రామంగా పేరొందింది. విజయవాడ నుంచి ఒడిశాలోని టిట్లాగఢ్, భువనేశ్వర్ రైల్వేస్టేషన్ల వరకూ ఈ ఊరికి చెందినవారు వివిధ విభాగాల్లో పనిచేస్తుంటారు. ఈ ప్రాంతం అంతా వర్షాధార భూములు కావడంతో వ్యవసాయ పనులులేక వివిధ ప్రాంతాలకు వలస వెళ్లినవారంతా కూడా సంక్రాంతికి కచ్చితంగా సొంతూరు చేరుకుంటారు. పండుగ మూడురోజులూ పిల్లలూ, యువత ఎక్కువగా ఆటపాటలతో కాలక్షేపం చేస్తే, పెద్దలు చిన్ననాటి మిత్రుల్ని పలకరించి యోగక్షేమాలు తెలుసుకునేవారు. మహిళ లేమో వంటపనుల్లో బిజీగా ఉండేవారు. ఎవరి దారి వారిది అన్నట్లున్న ఈ పద్ధతి అక్కడి యువతరానికి నచ్చలేదు. తరాల మధ్య అంతరాల్ని పోగొట్టి అందరినీ కలపాలనుకున్నారు. ఊరంతా సంక్రాంతి సందడి కనిపించేలా చేయాలనుకున్నారు. అంతా కలిసి ఆలోచించి అయిదేళ్ల క్రితం ‘సంక్రాంతి సంబరాల’కు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అక్కడ పండుగ రోజుల్లో సాయంత్రం నాలుగు నుంచి నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో అందరూ వేదిక ఎక్కాల్సిందే. పిల్లలూ యువతా తమ ప్రతిభాపాటవాల్ని చూపుతుంటారు. గ్రామపెద్దలు ఊరి చరిత్రనూ, విశిష్టతల్నీ తెలుపుతూ తమ చిన్నప్పటి పరిస్థితుల్నీ, సంప్రదాయాల్నీ గ్రామ జీవితవిధానాన్నీ కథలు కథలుగా చెబుతుంటే నేటితరం ఆశ్చర్యంగా వింటూ సమాజంలో వస్తున్న మార్పుల్ని అర్థం చేసుకుంటోంది. చదువులో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఊరి విద్యార్థుల్నీ, ఉన్నత ఉద్యోగాలు సాధించిన యువతనీ ఊరి పెద్దల ముందు సత్కరిస్తున్నారు. ఈ చర్య పిల్ల్లలకీ యువతకీ ప్రోత్సాహకంగా నిలుస్తోంది. వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తారు. ఇది కళాకారుల గ్రామం కూడా. నిరక్షరాస్యులూ వయోజనులూ అయినా నాటి కళాకారులు ఇప్పటికీ ఎంతో ఉల్లాసంగా వేదికపైనుంచి శ్రీరామాంజనేయ యుద్ధం, సత్య హరిశ్చంద్ర నాటకాల్లోని పద్యాలు పాడుతుంటే ఊరంతా చప్పట్లతో మార్మోగుతుంటుంది. యువతే తలా కాస్త డబ్బు వేసుకుని ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం విశేషం.
గ్రామదీపం... కొవ్వలి
ఒకప్పుడు సంక్రాంతి పండుగ అంటే భోగి మంటలు, రంగవల్లులు, పిండి వంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలూ... ఇలా ఊరంతా సందడిగా ఉండేది. రాను రాను సంక్రాంతి పండుగంటే కోడి పందేలు, పేకాటలుగా మారింది. వీటి అనుమతుల కోసం భారీ ఎత్తున పైరవీలు జరిగే స్థాయికి ఈ వ్యసనం వేళ్లూనుకుపోయింది. పండుగ అంటే అది కాదని చెప్పే ప్రయత్నంలో ‘గ్రామదీప్’ స్వచ్ఛంద సంస్థ మంచి ఫలితాలను సాధించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి సంగతి ఇది. ఉపాధి పేరిట యువత ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో గ్రామాల్లోని ఇళ్లు ఖాళీగా ఉండేవి. అలా వెళ్లిన వాళ్లు పండుగకు ఊరికి వచ్చినా ఫోన్లూ ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోయేవారు. అంతకు మించి చేయడానికి మాత్రం ఏముందిలే అనుకునేవారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చింది ‘గ్రామదీప్’. ఇప్పుడక్కడ పండుగంటే- ఊరందరిదీ. ప్రతి ఒక్కరూ ఆ సంబరాల్లో పాల్గొనాల్సిందే.
గ్రామానికి చెందిన డాక్టరు వెలమాటి మనోహరి ‘గ్రామదీప్’ సంస్థను ఏర్పాటుచేశారు. గ్రామాభివృద్ధికి తలా ఒక చేయీ వేయాల్సిన అవసరాన్ని గుర్తించిన ఆమె కొత్తలో ఆహ్వానపత్రికలు ప్రచురించి మరీ అందరినీ ఆహ్వానించేవారు. ఫేస్‌బుక్, వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న గ్రామస్థులందరినీ ఒక్కతాటి మీదికి తెచ్చారు. సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో వివరిస్తూ వెళ్లడంతో తక్కువ సమయంలోనే ఈ సంస్థకు మంచి పేరు వచ్చింది. ఎక్కడెక్కడో ఉన్నవాళ్లంతా కనెక్ట్ అయ్యారు. తామూ భాగస్వాములవడం మొదలుపెట్టారు. పండుగ మూడు రోజులూ స్థానిక ఉన్నత పాఠశాలను వేదికగా చేసుకుని కార్యక్రమాలు చేపడుతున్నారు. భోగిమంటలతో మొదలుపెట్టి చిన్నారులకు భోగిపండ్లు పోయడం, ముగ్గుల పోటీలూ, గాలిపటాలూ పిండివంటలూ భోజనాల వరకూ... అన్నీ సామూహికంగా చేయాల్సిందే. తెల్లవారు ఝామున మొదలెడితే రాత్రి వరకూ ఒకదాని తర్వాత ఒకటి ఉత్సాహంగా చేస్తూనే ఉంటారు. ఇక్కడ సంక్రాంతి వేడుకలు చూడడానికి ఇప్పుడు పలు ప్రాంతాలనుంచి పర్యటకులు తరలిరావడం విశేషం. వారు ఎడ్లబండిలో ఊరంతా తిరిగి చూసేలా ఏర్పాట్లూ చేస్తున్నారు.
అంతటితో సరిపెట్టక గ్రామాభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తున్నారు ఈ సంస్థ సభ్యులు. ఖాళీ ప్రదేశాలన్నిటిలోనూ మొక్కల్ని పెంచి కొవ్వలి ఐక్యతా వనాన్ని తీర్చిదిద్దారు. రహదారులను బాగుచేసుకున్నారు. గోడల్ని అందమైన చిత్రాలతో అలంకరించారు. నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా వీధుల్లో అక్కడక్కడా సిమెంటు బెంచీలు ఏర్పాటుచేశారు. నేచర్ వాక్ పేరుతో మహిళలూ పిల్లలూ నడిచేందుకు బాట వేశారు. నిస్సహాయ, ఒంటరి మహిళల్ని దత్తత తీసుకుని వారికి ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ అండగా నిలుస్తున్నారు. అలా ఈ గ్రామదీపం పండుగను కేంద్రంగా చేసుకుని పనిచేస్తూ గ్రామానికి వెలుగిస్తోంది.
వంశకీర్తి... వందల ఏళ్లుగా..!
ఊరంతా కలిసి పండుగ చేసుకోవడం, ఊరి బాగుకోసం కృషిచేయడం కొంతకాలంగా పెరుగుతున్న ట్రెండ్ అయితే... ఒకే ఇంటిపేరుతో చలామణీ అవుతున్నవారంతా కూడా ఈ సంక్రాంతి సందర్భంగానే ఒకచోట కలుసుకోవడం ఎన్నో ఏళ్లుగా ఆచరణలో ఉంది ఉభయగోదావరి జిల్లాల్లో.
* ‘వక్కలంక’ అనే ఇంటిపేరున్న కుటుంబాలన్నీ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నా సంక్రాంతి నాటికి కోనసీమ జిల్లాలోని పుల్లేటికుర్రు గ్రామంలో కలుసుకోవడం కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. మూడు రోజులూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని చివరి రోజున తమ ఆధ్వర్యంలోనే స్థానికంగా ఉన్న అభినవ శ్రీ వ్యాఘ్రేశ్వరస్వామివారి ప్రభల వేడుకను ఘనంగా జరిపిస్తారు.
* పి.గన్నవరం మండలంలోని రాజులపాలెం గ్రామానికి వెళ్తే క్షత్రియ కుటుంబాలకు చెందిన నాలుగైదు తరాలవారిని ఒకేచోట చూడవచ్చు. విదేశాల్లో ఉన్నవారు కూడా పండుగకోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేస్తారు. దాదాపు 500 మంది ఒకేచోట వంటలు చేసుకుని ఒకే పంక్తిలో భోజనాలు చేస్తారు. పెద్దలను సత్కరిస్తారు. పిల్లలకు తమ వారసత్వాన్నీ బంధువుల్నీ పరిచయం చేస్తారు.
* ఒక ఇంట్లో పుట్టి మరో ఇంట్లో మెట్టినప్పుడు రెండు ఇంటిపేర్లతోనూ అనుబంధం ఏర్పడుతుంది. ఒక్కో తరం పెరుగుతున్నకొద్దీ ఆ అనుబంధాలు విస్తరిస్తాయి. తుమ్మల వారి విషయంలో జరిగిందీ అదే. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరులో ఉన్న తుమ్మల కుటుంబం ఎందరినో కలుపుకుని ఇంతింతై అన్నట్లుగా వ్యాపించింది. అందుకే ఇప్పుడా కుటుంబంలో సంక్రాంతి వచ్చిందంటే పూటకు రెండువేల విస్తళ్లు లేవాల్సిందే. నా వారు అనుకునేవారు ఇంతమంది ఒక్కచోట చేరినప్పుడు ఉండే ఆనందానికి సాటి రాగలది ఇంకేముంటుంది... అందుకే దూరాభారాలనుకోకుండా పండక్కి ఊరు వచ్చేస్తాం... అంటారు ఆ కుటుంబ సభ్యులు.
* ఎక్కడ ఉంటున్నా ఎప్పుడో ఓసారి పుట్టింటికి రావడం మామూలే. కానీ తొమ్మిదిమంది తోబుట్టువులు తలా ఒకసారీ వచ్చి వెళ్లేకంటే అందరూ ఒక్కసారే వస్తే- వారందరి పిల్లలూ మనవలూ... ఇలా అంతా ఒక్కచోట చేరితే బాగుంటుందనిపించింది బత్తుల సోదరులకు. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఆ ఆలోచనను క్రమం తప్పకుండా ఆచరణలో పెడుతున్నారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన బత్తుల సోదరులు. కుటుంబం ఒక్కటే కానీ మొత్తం 90 మంది ఉన్నారు. అందరూ కలిసి ఉండటానికి ఒక కల్యాణమంటపాన్ని అద్దెకు తీసుకుంటారు. పనులతో సతమతమవ్వకుండా అందరూ పండుగ సంబరాల్ని ఆస్వాదించేందుకు వీలుగా పనివాళ్లతో ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. అలాగని తమ సంతోషానికే పరిమితం కారు, ఊరి కోసం ఏటా ఏదో ఒక మంచి పని చేస్తారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం, పేదలకు దుస్తులు పంచడం లాంటి సేవాకార్యక్రమాలు చేపడతారు.
నోముల... తెలంగాణ!
తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతి అంటే ఊళ్లల్లో ఉన్న అన్ని వృత్తుల వారికీ చేతినిండా పని. కొత్తగా పెళ్లయిన యువతి నుంచి ఎనభయ్యేళ్ల అవ్వ వరకూ పుట్టింటికి ప్రయాణం కడతారు. బంధువులందరినీ ఓసారి పలకరించే సందర్భంగా దీన్ని ఎంచుకుంటారు. పైగా సంక్రాంతి సమయంలో పుట్టింట్లో మహిళలు నోచుకునే పలురకాల నోముల ఉద్దేశం సమాజహితమే. బంధుమిత్రులనీ, ఇరుగుపొరుగునీ, సమాజంలోని అన్ని వర్గాలవారినీ కలుపుకుంటూ వెళ్తారు ఈ నోములకోసం. పూజల కన్నా ఎక్కువ ప్రాధాన్యం సంప్రదాయాలకు ఇస్తారు. రకరకాల చెట్లనూ నీటి వనరులనూ గౌరవిస్తూ చేసే నోములు పర్యావరణ స్పృహను చాటుతాయి. గురుగులు, కుందెలు, గొల్లనోము, కుమ్మరివాము లాంటి నోముల్లో మట్టి కుండలూ వెదురు బుట్టలూ లాంటివి ఎక్కువ సంఖ్యలో ఉపయోగించడం వల్ల చేతివృత్తులవారికి పని దొరుకుతుంది.
నవ వధువులు నోచుకునే పెళ్లినోము అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ సందర్భంగా వధూవరులిద్దరి తరఫు బంధువులూ ఒక్కచోట కలుసుకోవడం వల్ల పరిచయాలు పెరిగి కుటుంబాల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఈ సందర్భంగా ఊరందరికీ భోజనాలు పెడతారు. బంధుత్వపు వరస కలిపి నోరారా పలకరిస్తారు. ‘సందె దీపాలనోము’ నోచుకున్న మహిళలు సంధ్య వేళ 75 ఇళ్లకు వెళ్లి తమ చేతులతో ఆ ఇళ్లలో దీపం పెడతారు. ఇంట్లో దీపం పెట్టిన ఆడపిల్ల పట్ల ఆ ఇంటివారికి బాధ్యతతో కూడిన బంధం ఏర్పడుతుంది. ఏ నోము నోచుకున్నా ఇంటింటికీ వెళ్లి నోచుకున్న వస్తువులను పంచడం మరో చక్కని సంప్రదాయం. దీనివల్ల చుట్టుపక్కల వారందరితోనూ సంబంధాలు మెరుగుపడతాయి. ఆడపిల్లల చేత నోములన్నీ చేయించే బాధ్యత పుట్టింటివారిదే. దాంతో పెళ్లి చేసి పంపించడంతో అమ్మాయి బాధ్యత తీరిపోలేదనీ, తల్లిదండ్రులతో పాటు ఆమెకు అమ్మమ్మ, తాతయ్య, మేనమామలూ ఎప్పుడూ అండగా నిలవాలనీ ఈ నోముల పరమార్థం. సంక్రాంతి సమయంలోనే చేసుకునే ఈ నోములు పండుగకు అదనపు సందడినీ శోభనూ తెస్తాయి. ఊరంతటినీ ఒక్కచోట చేరుస్తాయి.
చూశారుగా... సంక్రాంతి అంటే కేవలం ఎవరింట్లో వారు జరుపుకునే పండుగ కాదు, మమతలు పూసే బంధాలుంటే జనమంతా మనవారే, ఊరంతా మన ఇల్లే... అంటున్నాయి ఈ ఊళ్లన్నీ. మరి వచ్చే సంక్రాంతికి మీ ఊరినీ వీటి సరసన చేరుస్తారా..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..