విష్ణువు మెచ్చిన మాసం... వైశాఖం!

వరుస పర్వదినాలు....విశేష పూజాది కార్యక్రమాలు... దానధర్మాలకు అనువైన కాలం... ఇలా అన్నీ కలిసిన మాసం ఏదయినా ఉందంటే అది వైశాఖమే. మాధవ మాసంగానూ

Published : 01 May 2022 00:33 IST

విష్ణువు మెచ్చిన మాసం... వైశాఖం!

వరుస పర్వదినాలు....విశేష పూజాది కార్యక్రమాలు... దానధర్మాలకు అనువైన కాలం... ఇలా అన్నీ కలిసిన మాసం ఏదయినా ఉందంటే అది వైశాఖమే. మాధవ మాసంగానూ పిలిచే ఈ వైశాఖం అంటే... విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి.

చైత్రం తరువాత వచ్చే రెండో మాసమే వైశాఖం. చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు వైశాఖమనే పేరు వచ్చింది. ఈ మాసంలో లక్ష్మీదేవి సమేత మహావిష్ణువును తులసీదళాలతో పూజిస్తే మంచిది. వైశాఖం మొదలుకొని మరో మూడు నెలల వరకూ మహావిష్ణువు భూ సంచారానికి వస్తాడనీ అందుకే ఈ నెలలో స్వామి ఆరాధన సర్వ శుభాలనూ కలిగిస్తుందనీ చెబుతారు. శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన మాసాల్లో వైశాఖం కూడా ఒకటి కావడం వల్ల ఈ నెలను మాధవ మాసంగానూ పిలుస్తారనీ పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో వచ్చే వరుస పర్వదినాలు వివిధ దేవతారాధనలను సూచిస్తాయి.

తదియకు ప్రాధాన్యం

వైశాఖ శుక్ల తదియనాడు కృతయుగం ప్రారంభమైందని పురాణ ప్రవచనం. విష్ణుమూర్తి పరశురాముని అవతారాన్ని ధరించిన ఈ రోజును పరశురామ జయంతిగా పరిగణిస్తారు. అక్షయ తృతీయగానూ పరిగణించే ఈ పర్వదినం నాడే... సింహాచల క్షేత్రంలోని శ్రీలక్ష్మీ వరాహనృసింహుడి నిజరూపాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజున స్వామిపైన ఉన్న చందనం పూతను పూర్తిగా తొలగించి అభిషేక, పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం కేవలం కొద్దిగంటలు మాత్రమే స్వామి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యాన్ని కలిగిస్తారు. చందనోత్సవంగా పిలిచే ఈ వేడుకను చూసేందుకూ, స్వామిని దర్శించుకునేందుకూ సుదూర పాంతాల నుంచి ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి తరలి వచ్చి... మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక, అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించి...శక్తికొలదీ దానధర్మాలు చేయడం, బంగారం కొనుగోలు చేయడం వల్ల అక్షయమైన సిరిసంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలోనే బద్రీనాథ్‌లోని ఆలయం తలుపులు తెరుస్తారు. 

బుద్ధపౌర్ణమి విశిష్టత
ఇక... వైశాఖ శుద్ధ పంచమి రోజున జగద్గురువు ఆదిశంకరాచార్యుల జయంతిని ఓ పండుగలా జరుపుకోవడం విశేషం. అదేవిధంగా వైశాఖ శుక్ల త్రయోదశి నాడు... మహావిష్ణువు నరసింహుని రూపంలో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన్ని నృసింహ జయంతిగా జరుపుకుంటారు. హిరణ్యకశిపుని సంహరించిన తరవాత ఉగ్రరూపంలో తిరుగుతున్న స్వామిని శాంతింపజేయడానికి శివుడు శరభుడిగా సాక్షాత్కరించిన రోజు కూడా ఇదేననీ అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి... వ్రతం చేసి స్వామి ఉద్భవించిన స్తంభాన్నీ, ఇంటి గడపనూ పూజిస్తే మంచిదని అంటారు. వైశాఖ శుద్ధ పౌర్ణమిని మహావైశాఖి అంటారు. ఈ రోజున బుద్ధ భగవానుని జన్మదినం జరుపుకుంటారు భక్తులు. అదేవిధంగా ఈ నెల్లో వచ్చే బహుళ దశమి హనుమజ్జయంతి కావడం విశేషం. 

దానాలు చేయాలని...

ఈ వైశాఖమాస మహత్యం గురించి సాక్షాత్తూ మహావిష్ణువే లక్ష్మీదేవికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మాసంలో చేసే స్నాన, పూజ, జప-తప దానాలకు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదని అంటారు. ఈ నెలలో సూర్యుడు మేషరాశిలో సంచరించడం వల్ల ఎండలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఆ వేడి నుంచి ఉపశమనం కలిగించేవాటిని ఈ మాసంలో దానం రూపంలో ఇవ్వాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నీళ్లు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు... వంటివి ఎక్కువగా దానమివ్వాలని చెబుతారు. ఇక... వైశాఖ శుద్ధ దశమి నాడు... ఆకాశరాజు తన కుమార్తె పద్మావతీ దేవిని వేంకటేశ్వర స్వామికి ఇచ్చి వివాహం జరిపించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే తిరుపతిలో పద్మావతీ పరిణయోత్సవాలను నిర్వహిస్తారు. నిత్య వధూవరులైన వేంకటేశ్వరుడు అలమేలుమంగ-పద్మావతిలకు ఎదుర్కోలు, ఉత్సవాలు, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ.. ఇలా అన్నింటినీ మూడురోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించడం విశేషం. ఇవి కాకుండా రామానుజ జయంతి, వాసవీకన్యకాపరమేశ్వరి జయంతి, కూర్మజయంతి, కోటప్పకొండలో లక్షమల్లెల అర్చన, శని త్రయోదశి, జొన్నవాడ కామాక్షిదేవి కల్యాణోత్సవం... వంటివన్నీ ఈ వైశాఖంలోనే నిర్వహిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నెల్లో దాదాపు ప్రతిరోజునూ ఏదో ఒక పర్వదినంగానే పరిగణిస్తున్నాయి శాస్త్రాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..