మన భారత్‌... ఇక జన భారత్‌!

అత్యధిక జనాభా గల దేశం అనగానే ఇన్నాళ్లూ చైనా పేరు చెబుతూ వచ్చాం. 2023 నుంచి ఆ స్థానంలో భారత్‌ నిలవనుంది.

Published : 01 Jan 2023 01:28 IST

మన భారత్‌... ఇక జన భారత్‌!

అత్యధిక జనాభా గల దేశం అనగానే ఇన్నాళ్లూ చైనా పేరు చెబుతూ వచ్చాం. 2023 నుంచి ఆ స్థానంలో భారత్‌ నిలవనుంది. మరికొద్ది నెలల్లో జనాభాలో చైనాను భారత్‌ అధిగమిస్తుంది. ఆపైన కొన్ని దశాబ్దాలపాటు ఇండియా అత్యధిక జనాభాగల దేశంగా కొనసాగుతుంది.

క్యరాజ్య సమితి(వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌) అంచనా ప్రకారం భారత జనాభా 2023 జులై 1 నాటికి 142.8 కోట్లు. అదే సమయానికి చైనా జనాభా 142.6 కోట్లు. ఆరు నెలల్లో చైనాకంటే మన జనాభా.20 లక్షలు అధికంగా ఉంటుందన్నమాట. ప్రపంచ జనాభా 800 కోట్లను దాటింది. ఆ లెక్కన ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయులే. చైనా జనాభా గతేడాదే 142.6 కోట్లు. కానీ అక్కడ జననాల రేటు తగ్గుతుండడంతో 2023 ఏప్రిల్‌ 14 నాటికి చైనా జనాభా 142,57,75,850 అవుతుంది. ఆరోజే చైనాను భారత్‌ అధిగమించి అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందంటోంది ఐరాస. 2050 నాటికి భారత జనాభా 168.8కోట్లకు చేరుతుందని అదే సమయానికి చైనా జనాభా 131.7కోట్లు అవుతుందని చెబుతోంది. భారత జనాభా 2064 నాటికి 170 కోట్లకు చేరి ఆపైన క్రమంగా తగ్గుతూ 2100 నాటికల్లా 153కోట్లు అవుతుందని అంచనా. అయితే, అప్పటికీ మనదే అత్యధిక జనాభా.


చైనాలో జననాలు తగ్గి...

1750 నాటికే చైనా జనాభా 22.5కోట్లు. ఆ సమయానికి భారత జనాభా 20 కోట్లని అంచనా. దాదాపు మూడు శతాబ్దాల తర్వాత ఈ స్థానాలు తారుమారు కానున్నాయి. ఇదంతా అంకెల వ్యవహారంలా కనిపిస్తున్నా దీని వెనక ఆర్థిక, రాజకీయ అంశాలెన్నో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ మనకంటే ఆరు రెట్లు పెద్దది. చైనా జనాభాలో ఉత్పాదక వయసు(15-64)లో ఉన్నవారి శాతం దశాబ్దం కిందట ఎక్కువగా ఉండేది. అది క్రమంగా తగ్గుతూ వస్తోంది. అక్కడ సగటు వయసు ప్రస్తుతం 39 ఏళ్లు ఉండగా, 2050 నాటికి 51 ఏళ్లు అవుతుంది. ప్రస్తుతం భారతీయుల సగటు వయసు 28. ఉత్పాదక దశలో ఉన్నవారి శాతం భారత్‌లో పెరుగుతోంది. వచ్చే నాలుగు దశాబ్దాలూ ఇది మనకి అనుకూలం కానుంది. తర్వాత మన దగ్గరా వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుంది. నిజానికి 1950ల నుంచి రెండు దేశాలూ జనాభా నియంత్రణ కార్యక్రమాలు చేపడుతున్నాయి. పెళ్లీ, పిల్లలు కనడాన్నీ ఆలస్యం చేయాలనీ, పిల్లల మధ్య ఎడం ఉండాలనీ, తక్కువ మందిని కనాలనీ... చైనా 1960ల నుంచీ చెబుతూ వచ్చింది. 1980ల్లో ‘ఏకైక సంతానం’ అనే నినాదాన్నీ తెచ్చింది. ఫలితంగా పిల్లలూ, వృద్ధులూ తక్కువగా, యువత ఎక్కువగా ఉండటంతో 1970-2000 మధ్య అది వారికి లాభించింది. చైనాలో సగటు రిటైర్మెంట్‌ వయసు 54 ఏళ్లు. దాంతో పనిచేసేవారికంటే వారిపై ఆధారపడ్డవారు పెరుగుతున్నారిపుడు. ఆ సంఖ్య పెరిగి ప్రభుత్వంపై పెన్షన్ల భారం ఎక్కువవుతోంది. రిటైర్మెంట్‌ వయసు పెంచే ఆలోచనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 2016లో ఏక సంతాన నిబంధనకు చైనా వీడ్కోలు పలికింది. 2020లో ముగ్గురు పిల్లల వరకూ పరిమితి పెంచింది. అయినా పోషణ భారం, మారిన జీవనశైలి కారణంగా పిల్లల్ని కనేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు.


బలమా భారమా...

ప్రపంచంలో కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టిన మొదటి దేశం మనదే. 1952లోనే దీన్ని తెచ్చారు. మొదట్లో సానుకూల స్పందన రాకపోయినా.. విద్య, ఆరోగ్య ప్రమాణాలు పెరగడంతో మన దగ్గరా రెండు దశాబ్దాలుగా జనాభా పెరుగుదల రేటు తగ్గుతోంది.  2021లో విడుదలైన నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌సర్వే-5 ప్రకారం దేశంలో సంతాన సాఫల్య రేటు 2.0గా ఉంది. ఇది 2.1గా ఉంటే జనన, మరణాల రేటు సవ్యంగా ఉన్నట్టు. అన్ని వయసుల వారూ తగు నిష్పత్తుల్లో ఉంటారు. మనదేశంలో బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మణిపూర్‌, మేఘాలయల్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో సంతాన సాఫల్య రేటు 2.1, అంతకంటే తక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 1.6గా ఉంది. కేరళ, తమిళనాడుల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఉత్తరాది నుంచి దక్షిణాదికి వలసలు మరింత పెరిగే ఆస్కారం ఉంది.  కొవిడ్‌ కారణంగా 2021లో చేపట్టాల్సిన జనాభా గణన ఆగిపోవడంతో కచ్చితమైన గణంకాలు అందుబాటులో లేవు. ఈ ఏడాదైనా జన గణన జరిగితేనే జనాభా పెరుగుదల శైలిపైన మరింత స్పష్టత వస్తుంది. అధిక జనాభా బలమా భారమా అంటే... అది మన చేతుల్లోనే ఉంది. యువతకు నైపుణాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగితేనే జన భారత్‌ ఘన భారత్‌ అయ్యేది!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు