అయిదంతస్తుల గుడిసెలివి!

పల్లెటూళ్లల్లో పూరిళ్లు కొత్తేమీ కాదు కానీ దూరం నుంచి చూస్తే.. కోన్‌ ఆకారంలో రాతి నిర్మాణాల్లా కనిపిస్తున్న ఈ గుడిసెలు వాటికి పూర్తిగా భిన్నం.

Updated : 13 Apr 2024 15:44 IST

పల్లెటూళ్లల్లో పూరిళ్లు కొత్తేమీ కాదు కానీ దూరం నుంచి చూస్తే.. కోన్‌ ఆకారంలో రాతి నిర్మాణాల్లా కనిపిస్తున్న ఈ గుడిసెలు వాటికి పూర్తిగా భిన్నం. వీటి నిర్మాణంతోపాటు ఈ గుడిసెల్లో నివసించే వ్యక్తుల వెనుక ఓ చిన్న కథే ఉంది. వే రెబో అనేది ఇండోనేషియాలోని మంగారాయ్‌ అనే జిల్లాలో ఓ కుగ్రామం. ఈ ఊళ్లో పట్టుమని పది పాకలైనా ఉండవు కానీ ఇవన్నీ పై నుంచి కిందికి పూర్తిగా కోన్‌ ఆకారంలో భూమి మీద బోర్లించినట్లుగా ఉంటాయి. ఒక్క మేకు కూడా వాడకుండా చెక్క, తాటాకులతో నిర్మించిన ఈ గుడిసెలోపలికి వెళ్తే అటకల తరహాలో అయిదు వరుసల్లో ప్రత్యేక నిర్మాణం ఉంటుందట. ఆ అటకల్లోనే ఆహారపదార్థాలూ, విత్తనాలూ, ఇతర వస్తువుల్ని నిల్వ చేసుకుంటారు. గాలీ, వెలుతురు కోసం అక్కడక్కడా చిన్నచిన్న కిటికీల్లాంటివీ ఉంటాయి. ఈ ఊరిని దాదాపు 110 సంవత్సరాల క్రితం ఎంపుమారో అనే వ్యక్తి నిర్మించాడని స్థానికులు చెబుతారు. ఊళ్లో ఉండే దాదాపు వెయ్యికి పైచిలుకు జనాభా కూడా ఎంపుమారో వంశీకులే కావడంతో అంతా కలిసి కాఫీ, దాల్చినచెక్క, వెనిల్లా వంటివి పండించి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతారు. ఇక్కడ విద్యుత్తు సదుపాయమూ అంతంతమాత్రమే అయినా... ఈ గుడిసెల ఆకారం, ఇక్కడి వాతావరణం పర్యటకుల్ని ఆకట్టుకోవడంతో చాలామంది రెండుమూడురోజులు ఈ ఊళ్లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారిప్పుడు. స్థానికులూ వాళ్లకు ఆతిథ్యమిచ్చేందుకు ముందుకురావడంతో ఇదో పర్యటక ప్రాంతంగా మారిపోయింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..