Updated : 27 Mar 2022 05:25 IST

మార్పుకోసం.. ఒక్క సంతకం!

వీధిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి... ఫలానా దుకాణంలో అన్నీ కల్తీ సరకులు అమ్ముతున్నారు... ఫ్యాక్టరీ కాలుష్యాన్ని తాగునీటి చెరువులోకి వదులుతున్నారు... తెల్లారి లేస్తే ఎన్నో సమస్యలు. జెండా పట్టుకుని ఉద్యమాలు చేయకుండా, కోర్టు గుమ్మం ఎక్కకుండా, అధికారులకు అర్జీలిస్తూ తిరగనక్కరలేకుండా ఆ సమస్యలను పరిష్కరించుకోగలిగితే ఎంత బాగుంటుంది! చేంజ్‌.ఆర్గ్‌ ఆ పనే చేస్తోంది.

సామాజిక మాధ్యమాలను వాడేవారికి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఈమెయిల్స్‌లో... ‘ఫలానా విషయం మీద నేను ఒక పిటిషన్‌ వేశాను. నా అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లయితే దయచేసి మీరూ సంతకం చేయండి...’ అంటూ వచ్చే అభ్యర్థనలు సుపరిచితమే. వాళ్లు పంపిన లింక్‌ తెరిచి విషయం తెలుసుకుని నచ్చితే ‘సంతకం’ అని ఉన్నచోట పేరు రాస్తే చాలు... ఆ విషయాన్ని బలపరిచే వేలాది మందిలో మనమూ ఒకరిమవుతాం.

ఒకటీ రెండూ కాదు... అలాంటి పిటిషన్లు నెలకి కనీసం ఆరు వేల పైచిలుకు మనదేశంలోనే ప్రారంభమవుతున్నాయి. వాటిల్లో చాలావరకూ కోరుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నాయి. సమస్యలంటే సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నవో, చట్టాలతో ముడిపడివున్నవో మాత్రమే కానక్కరలేదు. ఊరికీ వీధికీ సంబంధించిన హైపర్‌ లోకల్‌ సమస్యలకు కూడా ‘చేంజ్‌.ఆర్గ్‌’ అనే ఈ ఆన్‌లైన్‌ వేదిక మీద చోటుంది. వినియోగదారుల సమస్య కావచ్చు, పాలనావిధానాల విషయం కావచ్చు, అవినీతి, మానవహక్కులు, లైంగిక వేధింపులు లాంటి సీరియస్‌ సమస్యలే కావచ్చు... ఆఖరికి సినిమాలూ టీవీ సీరియళ్లలో కోరుకుంటున్న మార్పులైనా పర్వాలేదు, నిస్సంకోచంగా ఇక్కడ ప్రస్తావించవచ్చు.

ఈ వేదికమీదికి వచ్చిన విషయం ఏదైనా వేలాది మందిని చేరుతుంది, ఆలోచింపజేస్తుంది. ఆ విషయాన్ని సంబంధిత నిర్ణయాధికారం ఉన్న వ్యక్తుల దాకా తీసుకెళ్తుంది. ఎన్నో విషయాల్లో అలాంటి మార్పు వచ్చింది.

ఇంటర్నెట్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు ఏ అసభ్యదృశ్యాలో తెరమీద కన్పిస్తే చప్పున స్క్రోల్‌ చేసి మరో సైట్‌లోకి వెళ్లిపోతాం. బాలీవుడ్‌లో సహాయ దర్శకురాలిగా పనిచేస్తున్న తేజస్విని అలా చేయలేదు. యూట్యూబ్‌లో పాత సినిమాలు వెతుకుతుండగా చిన్న పిల్లలు అసభ్య, అశ్లీల సంభాషణలు చెబుతున్న వీడియోలు ఆమె కంటబడ్డాయి. ఆరాతీస్తే ఒక వ్యక్తి తన యూట్యూబ్‌ ఛానల్‌ని ప్రమోట్‌ చేసుకోవడానికి పిల్లలచేత ఆ పనులు చేయిస్తున్నాడని తెలిసింది. ఆ వీడియోల కింద కామెంట్లు కూడా అంతే అసహ్యంగా ఉండడంతో కోపం పట్టలేకపోయిన ఆమె చేంజ్‌.ఆర్గ్‌లో పిటిషన్‌ వేసింది. పిల్లల హక్కులకు భంగం కలిగిస్తున్న ఆ వీడియోలను వెంటనే తొలగించాలనీ, ఆ ఛానల్‌ మీద చర్యలు తీసుకోవాలనీ యూట్యూబ్‌ని డిమాండ్‌ చేసింది. రెండు రోజుల్లోనే యాభైవేల మందికి పైగా ఆ పిటిషన్‌కి ఆమోదం తెలిపేసరికి యూట్యూబ్‌ స్పందించి ఆమె అభ్యంతరం లేవనెత్తిన వీడియోలన్నిటినీ తొలగించింది. ఈ విజయం తేజస్వినికి ఉత్సాహాన్నిచ్చింది. అప్పటివరకూ తాను మౌనంగా భరిస్తున్న వేధింపులకు కూడా ఈ మార్గంలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకుంది.

ఫుడ్‌ డెలివరీ కోసం ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ తీసుకుని కొందరు డెలివరీ బాయ్స్‌ అసభ్య సందేశాలు పంపుతూ, రాత్రిళ్లు ఫోన్లు చేస్తూ తేజస్వినిని వేధించేవారట. దాని గురించి పోలీసులకు ఫిర్యాదుచేయాలంటే పని మానుకుని స్టేషన్‌ చుట్టూ తిరగాలి. అప్పుడైనా తన ఒక్కదాని సమస్యే పరిష్కారమవుతుంది. అసలు మొత్తంగా అలా జరగకుండా చూడాలంటే డెలివరీ బాయ్స్‌ని నియమించుకునే సంస్థల దృష్టికే విషయం తేవాలి- అనుకున్న తేజస్విని ఆ విషయం మీద పిటిషన్‌ని వేసింది. డెలివరీ బాయ్స్‌ని ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా జొమాటో వారికి సూచిస్తూ వేసిన ఈ పిటిషన్‌కి కూడా కొద్ది గంటల్లోనే 30 వేలమంది స్పందించారు. జొమాటోనే కాదు, నేషనల్‌ రెస్టరెంట్స్‌ అసోసియేషన్‌ కూడా ముందుకొచ్చి తగు చర్యలు తీసుకుంటామనీ డెలివరీ బాయ్స్‌వల్ల మరోసారి ఈ తరహా సమస్య రాకుండా చూసుకుంటామనీ హామీ ఇచ్చాయి. ఆచరణలోనూ పెట్టాయి.

చిన్న ప్రయత్నం...

సంచితా ఝా బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లే దారిలో ఒక చెరువు ఉంది. అది కలుషిత రసాయనాల నురగలతో, దుర్వాసన వెదజల్లుతూ ఉండేది. దాని గురించి ఎవరిని కదిలించినా ‘పాతికేళ్లుగా అదంతే, ఎవరూ పట్టించుకోరు’ అనేవారు. అన్నేళ్ల నుంచీ ఉన్న సమస్య నగరపాలక సంస్థ అధికారులకు తెలియదనుకోవడానికి లేదు. కాబట్టి వారి దగ్గరికి వెళ్లడం అనవసరమనుకున్న సంచితా చేంజ్‌.ఆర్గ్‌ మంచి ప్రత్యామ్నాయంగా భావించింది. నివాస సముదాయాల దగ్గర్లో చెరువు అలా ఉండడం వల్ల ప్రజారోగ్యానికి ఎంత ప్రమాదమో చెబుతూ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని దాన్ని శుభ్రపరచాలని కోరుతూ పిటిషన్‌ వేసింది. ఆమె స్నేహితులంతా దాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. వారం తిరిగేసరికల్లా అదో ఉద్యమంగా మారిపోయింది. బెంగళూరులో ఒక కాలనీ సమస్య గురించి దేశంలోనే కాక విదేశాల వారు కూడా స్పందించి సంతకాలు చేసేసరికి రోజురోజుకీ సంఖ్య పెరిగిపోయింది. సహజంగానే ముఖ్యమంత్రి దృష్టికీ వెళ్లింది. చెరువును బాగుచేయించమని మున్సిపల్‌ కార్పొరేషన్‌కి ఆదేశాలుఇచ్చానని ఆయన ట్విటర్‌లో చెప్పారు.  ఆ వెంటనే అధికారులు పని కూడా మొదలుపెట్టారు. ఐదేళ్ల క్రితం సంచితా వేసిన ఈ పిటిషన్‌ ఆ తర్వాత ఇలాంటి సామాజిక సమస్యలకు సంబంధించి మరెన్నో
పిటిషన్లకు స్ఫూర్తిగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు.

మంత్రులూ స్పందించారు

సైనికులు దేశం కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తుంటారని అందరికీ తెలుసు. కానీ ఆ సైనికుల భద్రత గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదనిపించింది ఒక న్యాయవాదికి. పఠాన్‌కోట్‌ సంఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన వార్త విని- సైనికులంతా బులెట్‌ప్రూఫ్‌ జాకెట్లు ధరించి ఉంటే ప్రాణనష్టం జరిగివుండేది కాదనుకుంది సగీనా వలయత్‌. వెంటనే ఆమె ‘మాకు బులెట్‌ రైళ్లు అక్కర్లేదు, సైనికులకు బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఇవ్వండి చాలు’ అంటూ రక్షణ శాఖ మంత్రిని అభ్యర్థిస్తూ చేంజ్‌.ఆర్గ్‌ ద్వారా పిటిషన్‌ వేసింది. నిజానికి బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్ల అంశం రక్షణశాఖలో అంతకు పదేళ్ల ముందునుంచే నానుతోంది. కొన్ని కంపెనీల ఉత్పత్తుల్ని పరీక్షించి నాణ్యత లేదని తిరస్కరించారు. కానీ తర్వాత ఆ ప్రక్రియను వేగవంతం చేయలేదు. ఆ నేపథ్యంలో సగీనా పిటిషన్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఏకంగా లక్ష మందికి పైగా సంతకాలు చేశారు. అది రక్షణశాఖ దృష్టికి వెళ్లడమూ వారు చకచకా చర్యలు తీసుకుని బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు కొనడమూ జరిగిపోయింది. పిటిషన్‌ ఇంకా సర్క్యులేషన్‌లో ఉండగానే 50వేల మంది సైనికులకు బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు అందడం విశేషం.

మహిళల కష్టం తీరింది!

ఏటా వరదలతో సతమతమయ్యే రాష్ట్రం అస్సాం. వరదొచ్చిందంటే కొన్ని వారాలపాటు ఇల్లూవాకిలీ వదిలి పోవాల్సిందే. అలాంటి సమయంలో లోతట్టు ప్రాంతాలవారంతా ప్రభుత్వ పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటారు. కిక్కిరిసి ఉండే ఆ శిబిరాల్లో స్త్రీల కష్టాలు ఇన్నీ అన్నీ కావు. మరుగుదొడ్లు అందరికీ కలిపి ఉండటంతో ప్రైవసీ లేక నెలసరిలో ఉన్న మహిళలు నరకం చూసేవారు. దానికి తోడు మగవాళ్ల
వేధింపులు. అందుకని తరచూ వరదలు వచ్చే ప్రాంతాల్లో అచ్చంగా మహిళల కోసమే యాభై పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతూ పిటిషన్‌ వేసింది మయూరి భట్టాచార్జీ.
లక్షా 30 వేలకు పైగా సంతకాలు వచ్చాక ఈ పిటిషన్‌కి ప్రభుత్వం స్పందించింది. స్త్రీ పురుషులకు వేర్వేరు మరుగుదొడ్లు ఉండేలా మల్టీపర్పస్‌ ఫ్లడ్‌ షెల్టర్‌ని నిర్మించింది. అదే కాకుండా అన్ని పునరావాస కేంద్రాల్లోనూ శానిటరీ ప్యాడ్‌లతో వెండింగ్‌ మెషీన్లను ఏర్పాటుచేసింది.

మసీదులో ప్రార్థన సమయంలో మతపెద్దలు నీతి వాక్యాలు చెప్పేటప్పుడు గృహహింస మంచిది కాదని కూడా చెప్పాలని గుజరాత్‌లో ఒక మహిళ పిటిషన్‌ వేసింది. అది చూసి స్పందించిన ఒక మతపెద్ద తాను అలా చెప్పడమే కాక అందరూ దాన్ని అనుసరించాలని సూచించారు. చెబుతూ పోతే ఇలాంటి విజయగాథలు ఎన్నో!

రేపో మాపో ఇవి కూడా...

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న పిటిషన్లూ ఆసక్తికరంగా ఉన్నాయి. మచ్చుకు కొన్ని...

* గంగా, బ్రహ్మపుత్ర నదులు ప్రవహించే పశ్చిమబెంగాల్‌లో తొమ్మిది జిల్లాల భూగర్భజలాల్లో ఆర్సెనిక్‌, ఫ్లోరైడ్‌లు ప్రమాదకర స్థాయుల్లో ఉన్నాయి. ఆ నీటినే తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు
ఎదుర్కొంటున్నారనీ అక్కడివారికి సురక్షిత తాగునీరు సరఫరా చేయాలని కోరుతూ పిటిషన్‌ వేశారు కోల్‌కతా వాసి ఒకరు.

* ఇంట్లో ఉండే పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేయండి, నెలకు 50వేలు సంపాదించండి అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనల్ని నమ్మి తనలాగా చాలామంది నష్టపోతున్నారనీ ఆ సంస్థల మీద చర్య తీసుకోవాలనీ కోరుతూ ఒక వ్యక్తి పిటిషన్‌ వేయగా తామూ అలా మోసపోయామంటూ పలువురు గొంతు కలిపారు.

* అర్జంటుగా బయటకి వెళ్లాలని క్యాబ్‌ బుక్‌ చేసుకుంటే చివరిక్షణంలో డ్రైవర్లు క్యాన్సిల్‌ చేస్తున్నారనీ దీనివల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతోందనీ ఒకసారి బుక్‌ చేసుకున్నాక రద్దు చేయకుండా చర్యలు తీసుకోవాలనీ కోరుతూ పిటిషన్‌ వేశారు కవిత.

* ప్రవాస భారతీయుల వివాహాలను తప్పనిసరిగా నమోదుచేసేందుకూ, భార్యను వదిలేసినవారి కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్‌ విచారణ జరిపేందుకూ ప్రత్యేక చట్టం చేయాలని కోరుతూ ఒక మహిళ పిటిషన్‌ వేసింది. గర్భిణిగా ఉన్న తనని మెట్టినింటివారు నడిరోడ్డున వదిలేశారనీ తనలాంటి మహిళలందరికీ అండగా ఉండేలా చట్టం చేయాలనీ ఆమె కోరుతున్నారు.

* హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతంలో ప్రధాన రహదారిని ఆనుకుని అయిదు పెద్ద పాఠశాలలు ఉన్నాయనీ, ఆ రోడ్డుమీద భారీ ట్రాఫిక్‌ వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనీ ఆరోపిస్తూ, నాచారం- పిల్లలకు సురక్షిత ప్రాంతంలా ఉండేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ పిటిషన్‌ వేశారు అంజన.

* నేర చరిత్ర ఉన్నవారు ప్రజాప్రతినిధులుగా పోటీ చేస్తున్నట్లయితే ప్రచార పోస్టర్లలో వాళ్ల మీద ఉన్న నేరారోపణల గురించి కూడా పేర్కొనేలా ఆదేశించాలని ఎన్నికల కమిషన్‌ని కోరుతూ పిటిషన్‌ వేశారు గౌరవ్‌ బక్షీ. తెలిసి తెలిసీ నేరస్తులను ఎవరూ ఎన్నుకోరు కాబట్టి చట్టసభలకి సచ్ఛీలురు వచ్చే అవకాశం ఉంటుందన్నది అతడి ఉద్దేశం.

* బిడ్డల నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులకి న్యాయం జరిగేలా చూడడానికి ప్రత్యేక, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటుచేయాలని కోరుతూ పిటిషన్‌ వేశారు శీలం శ్రీకృష్ణ.

ఫుడ్‌ డెలివరీ కంపెనీలు ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్‌ వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆదిత్య దూబె. ద్రవ్యోల్బణాన్ని బట్టి ఆదాయపన్ను స్లాబ్‌ మార్చాలనీ, వైజాగ్‌ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలనీ, ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటుచేయాలనీ... ఇలాంటి పిటిషన్లెన్నో ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్నాయి. మరి మీ దృష్టిలోనూ అలాంటి సమస్యలేమైనా ఉన్నాయా..? పిటిషన్‌ ఎలా వేయాలీ... అనుకుంటున్నారా..!

సమయం సందర్భం చూసి...

చేంజ్‌.ఆర్గ్‌లో ఎవరైనా పిటిషన్‌ వేయొచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే ‘స్టార్ట్‌ ఎ పిటిషన్‌’ అన్న కాలమ్‌ క్లిక్‌ చేస్తే కింద 15 సబ్జెక్టులు వస్తాయి. మనం వేయాలనుకున్న పిటిషన్‌ ఏ సబ్జెక్టు కిందికి వస్తుందో చూసి దాన్ని ఎంచుకుంటే దరఖాస్తు ఫారం వస్తుంది. దాని ప్రకారం వివరాలన్నీ క్లుప్తంగా రాయాలి. అంశం మీద స్పష్టత ఉంటే అవి రాయడం తేలికే. సరైన సమయంలో సరైన విషయాన్ని ప్రస్తావిస్తే అది త్వరగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇక, ఆ విషయానికి సంబంధించి మనం కోరుకుంటున్న మార్పు ఏమిటో, పిటిషన్‌ ఎవరిని చేరాలో... వివరంగా పేర్కొనాలి. ప్రస్తావించిన సమస్యకు సంబంధించి కచ్చితమైన సమాచారాన్నీ, గణాంకాల్నీ ఇస్తూ ఒక ఫొటో కూడా జతచేయాలి. దీనికి పదినిమిషాలకు మించి పట్టదు. ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో దాన్ని పంచుకుంటే అందరి దృష్టికీ వెళ్తుంది. నచ్చినవారంతా షేర్‌చేస్తూ ఉండటం వల్ల సంతకాలు పెరుగుతాయి.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే- ఎక్కువ సంతకాలు సాధించడం ముఖ్యమే కానీ అవి మాత్రమే పిటిషన్‌ విజయానికి కొలమానం కాదు. మానవీయ, వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా హృదయాలను దోచుకుంటున్నాయని విజయం సాధిస్తున్న పిటిషన్లను చూస్తే అర్థమవుతుంది. పిటిషన్‌ని ప్రారంభించిన వ్యక్తి తమ ఆశయం నెరవేరిందని ప్రకటించినా, నిర్ణయం తీసుకోవాల్సిన స్థానంలో ఉన్నవారి దృష్టికి విషయం వెళ్లిందని తెలిసినా అప్పుడు ఆ దరఖాస్తు విజయం సాధించినట్లుగా వెబ్‌సైట్‌లో పెడతారు.

స్త్రీలదే పైచేయి

సాంకేతికతను పౌర సమాజానికి ఉపయోగపడేలా వాడుకోవడంలో చేంజ్‌.ఆర్గ్‌ పోషిస్తున్న పాత్ర గురించి పరిశోధన కూడా జరుగుతోంది. ఇది సాధారణపౌరులకి తమ సంఘటిత శక్తి ఏమిటో తెలియజేస్తోందనీ, సానుకూల భావోద్వేగాలకు సంబంధించిన పిటిషన్స్‌ ఎక్కువగా విజయం సాధిస్తున్నాయనీ, అలాగే చాలా అంశాల్లో స్త్రీ పురుషుల ప్రాధాన్యాల్లో తేడా ఉంటోందనీ, సంఖ్యాపరంగా స్త్రీలు ప్రారంభిస్తున్న పిటిషన్లు తక్కువైనా విజయం సాధించడంలో వారిదే పైచేయనీ ఈ పరిశోధనల్లో తేలింది. ఇప్పుడీ వేదికని యువత ఎక్కువగా వాడుకుంటున్నట్లూ, స్థానిక సమస్యల ప్రస్తావన ఎక్కువగా ఉంటున్నట్లూ గతేడాది పిటిషన్లపై జరిగిన విశ్లేషణ చెబుతోంది. మనదేశంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా పలు దేశాల్లో పిటిషన్లు వేయగా లక్షలాది మంది సంతకాలు చేయడం విశేషం. చేంజ్‌.ఆర్గ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్తే ఏయే అంశం మీద ఎన్నెన్ని పిటిషన్లు ఉన్నాయో చూడవచ్చు. పదిమందికీ ఉపయోగపడే ఒక మార్పును తెచ్చే శక్తి ఆ రంగంలో నిర్ణయాధికారం ఉన్నవారికే ఉంటుంది. వారిదాకా ఆ అంశాన్ని తీసుకెళ్లాలంటే ఒకప్పుడు నెలల తరబడి సొంతపనులన్నీ త్యాగం చేసి ఉద్యమించాల్సి వచ్చేది. ఆ అవసరం లేకుండా అదే పనిని వలం సంతకాల సేకరణతో కొన్ని గంటల్లోనో రోజుల్లోనో చేసి చూపించడమే ఈ వెబ్‌సైట్‌ తెచ్చిన మార్పు..!


అనుకోకుండా మొదలైంది!

సంఘసేవ చేయడానికి ఒక నెట్‌వర్క్‌లా వాడుకుందామని 2007లో చేంజ్‌.ఆర్గ్‌ని ప్రారంభించాడు ఇరవయ్యేడేళ్ల బెన్‌ రాటరే. దాన్ని క్రమంగా మార్చుకుంటూ వచ్చి 2016 వరకూ వ్యాపార సంస్థలకు స్పాన్సర్డ్‌ క్యాంపెయిన్స్‌ నిర్వహించాడు. ఆ తర్వాతే ఇప్పుడున్న పిటిషన్ల వేదికగా మార్చాడు. దానిద్వారా సామాన్య ప్రజలకీ పెద్ద పెద్ద సంస్థలకీ మధ్య అధికారాన్ని సమన్వయం చేయాలన్నది బెన్‌ ఆశయం. ప్రారంభించిన తొలినాళ్లలోనే వేలల్లో పిటిషన్లు వచ్చేవి. క్రమంగా పెట్టుబడులు అందడంతో సంస్థను విస్తరిస్తూ దాదాపు ప్రపంచ దేశాలన్నిటికీ ఈ విధానాన్ని పరిచయం చేశాడు బెన్‌.

ఆ క్రమంలో సమస్యలూ ఎదుర్కొనక తప్పలేదు. ఓ కళాకారుడిని నిర్బంధం నుంచి వదిలిపెట్టమన్నందుకు చైనా హ్యాకర్లు ఈ వెబ్‌సైట్‌ మీద దాడిచేశారు. ట్యూషన్‌ ఫీజు పెంపుని వ్యతిరేకిస్తూ ఒక విద్యార్థి పిటిషన్‌ వేసినందుకు అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ చేంజ్‌.ఆర్గ్‌ని బ్లాక్‌ చేయాలని ప్రయత్నించింది. ఎవరేం చేసినా అది ఆగలేదు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన సోషల్‌ యాక్షన్‌ వేదికగా నిలిచింది. బిల్‌గేట్స్‌,
రీడ్‌ హాఫ్‌మన్‌, రిచర్డ్‌ బ్రాన్సన్‌, రే డాలియో, అరియాన్నా హఫింగ్‌టన్‌... లాంటి 50 మంది వ్యాపారవేత్తలు ఇందులో పెట్టుబడి పెట్టారు. అయితే ఇది లాభాపేక్షలేని సంస్థ కాదు. వినియోగదారులకు ఉచిత సేవలు అందిస్తూనే వ్యాపార సంస్థల స్పాన్సర్డ్‌ పిటిషన్ల ద్వారా ఆదాయాన్ని పొందుతుంది.


అన్ని దేశాల్లోనూ...

చేంజ్‌.ఆర్గ్‌ సంతకాల ప్రభావం దాదాపు అన్ని దేశాల్లోనూ ఉంది. అమెరికాలో ‘జస్టిస్‌ ఫర్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌’ పేరుతో పదిహేనేళ్ల కెలెన్‌ ప్రారంభించిన పిటిషన్‌కి అత్యధికంగా దాదాపు రెండు కోట్ల సంతకాలు వచ్చాయి. బ్రెజిల్‌లో 2016లో ప్రెసిడెంట్‌ దిల్మాపై అభిశంసన తీర్మానం పెట్టాలని కోరుతూ వేసిన పిటిషన్‌కి 22 లక్షల సంతకాలు వచ్చాయి. కెనడాలో పదమూడేళ్ల అమ్మాయిలిద్దరు కలిసి వేసిన ఒక పిటిషన్‌ ఫలితంగా అక్కడ స్కూల్లో సెక్స్‌ఎడ్యుకేషన్‌ సిలబస్‌లో ‘స్త్రీల అంగీకారం’ అన్న అంశాన్ని కూడా చేర్చారు. హెరాయిన్‌ స్మగ్లింగ్‌కి పాల్పడినందుకు ఇండొనేషియాలో మరణశిక్ష పడిన ఫిలిప్పీన్స్‌ మహిళను క్షమించి విడుదల చేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌కి అత్యంత తక్కువ సమయంలో 125 దేశాలనుంచి సంతకాలు వెల్లువెత్తాయి. ఆమె మరణశిక్ష రద్దయింది. ఆస్ట్రేలియాలో గృహహింస గురించి చైతన్యం తేవాలని వేసిన పిటిషన్‌ ఫలితంగా స్కూల్‌ సిలబస్‌లో ఆ అంశాన్ని చేర్చారు. ఇలా దాదాపు అన్ని దేశాల్లోనూ చేంజ్‌.ఆర్గ్‌ సామాన్యుల గొంతు వినిపిస్తూనే ఉంది. ఐపిటిషన్స్‌, గో పిటిషన్‌, ఆవాజ్‌, క్యాలీ కాల్‌, యూకే గవర్నమెంట్‌ అండ్‌ పార్లమెంట్‌ పిటిషన్స్‌, కాజెస్‌... లాంటి ఇతర ఆన్‌లైన్‌ వేదికలు ఉన్నప్పటికీ చేంజ్‌.ఆర్గ్‌ అత్యధికంగా ఆదరణ పొందుతోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని