Published : 29 May 2022 00:59 IST

అన్నదాతల కోసం ఆవిష్కర్తలయ్యారు!

ఒక ప్రాంతమని కాదు... ఒక రాష్ట్రమని లేదు.. దేశంలో రైతులందరూ కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. కారణాలు ఏమైనా మునుపటిలా పొలం పనులు చేసేవాళ్లు కరవైపోతున్నారు. ఉన్నవాళ్లూ రైతుల ఆదాయాన్ని మించి కూలిని ఆశిస్తున్నారు. రైతుల్ని ఈ సమస్యల నుంచి బయటపడేసేందుకు సరికొత్త పరికరాలని కనిపెట్టారు ఈ నలుగురు..

ఎలక్ట్రిక్‌ ఎద్దు సృష్టికర్తలు..!

కరోనా లాక్‌డౌన్‌ కాలంలో అందరు కార్పొరేట్‌ ఉద్యోగుల్లాగానే తుకారాం, సోనాలీ దంపతులు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ చేయాల్సి వచ్చింది. అందుకోసం తమ స్వగ్రామానికే వచ్చారు ఇద్దరూ. ఇక్కడి కొచ్చాక కూలీలు దొరక్క సన్నకారు రైతులు పడుతున్న ఇబ్బందులు వాళ్ల దృష్టికొచ్చాయి. కూలీలు అడిగే మొత్తం ఇచ్చుకోలేక, ఒకవేళ ఇచ్చినా వాళ్ళు సకాలంలో పనులకి రాక రైతులు ఇబ్బంది పడుతుండేవారు. మహారాష్ట్ర రైతులైతే కూలీలు చేసే కొన్ని పనులు- అంటే విత్తనాలు నాటడం, కలుపు తీయడం వంటివాటిని ఎద్దుల సాయంతోనూ చేస్తుంటారు. కాకపోతే, ఈ గ్రామానికి ఎద్దులూ సరిపడా లేక పక్క ఊర్నుంచి ఎక్కువ మొత్తానికి అద్దెకు తెచ్చుకునేవారు. వాళ్లు ఎదుర్కొంటున్న  సమస్యలకి పరిష్కారం చూపాలనుకున్నారు ఈ దంపతులు. ఇద్దరూ ఓ సరికొత్త యంత్రాన్ని రూపొందించారు. ఎద్దు చేసే అన్ని పనులూ చేసిపెడుతుంది కాబట్టి దీనికి ‘ఎలక్ట్రిక్‌ బుల్‌’ అని పేరుపెట్టారు. ఇందులోని బ్యాటరీకి రెండుగంటలు ఛార్జిచేస్తే రోజంతా దీంతో పనిచేయించుకోవచ్చు. ట్రాక్టర్‌లా కాకుండా ఒకటి, రెండు ఎకరా పొలం ఉన్నా ఇది సమర్థంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు తుకారాం దంపతులు. ఈ ‘ఎలక్ట్రిక్‌ ఎద్దు’తో, సంప్రదాయ విధానంలో 50 వేలయ్యే పంట ఉత్పత్తి ఖర్చు... ఐదు వేలకి తగ్గుతుందంటున్నారు. ఈ యంత్రాల్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మోషన్‌- సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ సంస్థ ఈ దంపతులకి నిధులని అందించింది. ఆ నిధులతో కృషిగతి ప్రయివేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ స్టార్టప్‌ని ఏర్పాటుచేసి తక్కువ ధరకే వీటిని అందిస్తున్నారు తుకారాం దంపతులు! 


పోక చెట్లెక్కే బైకు ఇది!

కోనసీమకి కొబ్బరితోటలు ఎలాగో... కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి పోక చెట్లు అలాగ. అక్కడి కోమలె గ్రామానికి చెందిన గణపతి భట్‌ అలాంటి ఓ రైతు. పద్నాలుగు ఎకరాల్లో పోక తోటని సాగుచేస్తున్న ఆయన 2017లో గడ్డుపరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. మామూలుగా కొబ్బరి, తాటిచెట్లకి వాటి గెల పక్వానికి వచ్చాకే కూలీల అవసరం వస్తుంది... అదీ చెట్లెక్కి కాయల్ని తెంపడానికి. కానీ పోకచెట్లకి అలాకాదు. దానికి ఎరువులూ, పురుగు మందులూ గెలల దగ్గరే వేయాలి. ఇందువల్ల ప్రతి దశలోనూ కూలీల అవసరం ఎక్కువ. వాళ్లు రోజుకి రెండువేల రూపాయలకన్నా తక్కువకి రారు. అలా రోజుకి నలుగురు అవసరమై... వారం తిరిగేసరికల్లా 35 వేల రూపాయలు ఖర్చయ్యేవట గణపతికి. మూడేళ్లకిందట ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆయన అంత మొత్తాన్ని ఖర్చుచేయలేకపోయారు. అప్పుడే తన స్నేహితుడు మొబిన్‌తో కలిసి ఎలక్ట్రిక్‌ బైకుని కనిపెట్టాడు. స్త్రీలూ వృద్ధులూ కూడా ఉపయోగించేంత సురక్షితంగా దీన్ని రూపొందించారు. ఈ బైకు వల్ల నలుగురు కూలీలు చేయాల్సిన పనికి ఒక్కరిని నియమించుకుంటేనే సరిపోతోందని చెబుతున్నారు గణపతి భట్‌. ఈ బైకుల్ని లాభాపేక్ష లేకుండా కేవలం ఉత్పత్తి 
ఖర్చులతోనే రైతులకి అమ్ముతున్నారాయన.


కాడిపట్టి మరీ కనిపెట్టారు! 

ప్రొఫెసర్‌ ముప్పా లక్ష్మణరావు మదనపల్లె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(మిట్స్‌)లో మెకానికల్‌ విభాగాధిపతి. ఆయనకి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని సొంతూరు తూర్పునాయుడు పాళెంలో రెండెకరాల భూమి ఉంది. ఆ భూమిలో అప్పుడప్పుడూ తానే కాడిపట్టి దుక్కిదున్నుతుండేవారు. రైతుల కష్టాల్ని అలా స్వయంగా అనుభవించాక తనకున్న ‘మెకానికల్‌ డిజైనింగ్‌’ అనుభవంతో కొత్త పరికరాలని రూపొందించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఆయన కనిపెట్టిన మూడు పరికరాలకి ఈ మధ్యే పేటెంట్‌ కూడా వచ్చింది. ఎరువులూ, విత్తనాలూ చల్లేందుకు ఉపయోగించే సౌరవిద్యుత్తుతో పనిచేసే ప్రత్యేక యంత్రం అందులో మొదటిది. రెండోది- కుండతో తయారుచేసిన కోల్డ్‌ స్టోరేజి. ఓ సాదాసీదా కుండకి సౌరవిద్యుత్తుతో పనిచేసే బుల్లి ఫ్యాన్‌ని అమర్చి, ఆ ఫ్యాను తిరగడం ద్వారా కుండలో నీళ్లు మామూలుకన్నా వేగంగా చల్లబడేలా చేస్తారు. కుండలో అలా చల్లదనం పెరిగి పెరిగి... లోపల ఓ ఫ్రిజ్‌లా అతిశీతలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ శీతల గాలుల్ని చిన్నపైపుల ద్వారా థర్మాకోల్‌ బాక్సులోకి పంపిస్తారు. ఆ బాక్సులో రైతులు తమ ఉత్పత్తుల్ని ఎన్నిరోజులైనా నిల్వ చేసుకోవచ్చు. ఆయనకి మూడో పేటెంట్‌ని అందించిన పరికరం-విష్ణు సికిల్‌. కలుపుతీతకి ఉపయోగపడే పరికరం అది. ఇందుకోసం పెద్ద పరికరాలు మార్కెట్‌లో ఉన్నా ఎకరాలోపు సాగుకి అవసరమైన చిన్నవి మార్కెట్‌లో లేవు. ‘విష్ణుసికెల్‌’ ఆ లోటుని భర్తీచేస్తుంది. ఈ మూడు పరికరాలనీ ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకి చెందిన రైతులు వేల సంఖ్యలో కొంటున్నారట. 
 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని