sai pallavi: అప్పట్నుంచే ఆ అనుమానం!

నెమలిలా నాట్యం చేస్తూ... నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ... పోషించిన ప్రతి పాత్రలోనూ చక్కగా ఒదిగిపోతుంది సాయి పల్లవి. ప్రస్తుతం ‘విరాటపర్వం’లో వెన్నెలగా సామాజిక స్పృహ కలిగించే పాత్రలో అడవిబాట పట్టిన ఈ ముద్దుగుమ్మ చెప్పే ముచ్చట్లేంటంటే...

Updated : 12 Jun 2022 08:38 IST

sai pallavi: అప్పట్నుంచే ఆ అనుమానం!

నెమలిలా నాట్యం చేస్తూ... నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ... పోషించిన ప్రతి పాత్రలోనూ చక్కగా ఒదిగిపోతుంది సాయి పల్లవి. ప్రస్తుతం ‘విరాటపర్వం’లో వెన్నెలగా సామాజిక స్పృహ కలిగించే పాత్రలో అడవిబాట పట్టిన ఈ ముద్దుగుమ్మ చెప్పే ముచ్చట్లేంటంటే...


ఇష్టంగా చేసేది

నాకు థియేటర్‌లో సినిమాలు చూడ్డం చాలా ఇష్టం. నా సినిమాలు కాకపోయినా బుర్ఖా వేసుకునో, ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకునో థియేటర్‌కి వెళ్లి జనాల మధ్యలో కూర్చుని సినిమాల్ని ఎంజాయ్‌ చేస్తుంటా. ఈ మధ్య ‘సర్కారువారి పాట’ కూడా అలానే చూశా.


మర్చిపోలేను

చిన్నప్పుడు చిరంజీవిగారి ‘ముఠామేస్త్రీ’ తెగ చూసేదాన్ని. అందులో ఆయన డాన్స్‌కి ఫిదా అయిపోయి నేనూ డాన్సర్ని కావాలనుకున్నా. ఈ మధ్య ఓ కార్యక్రమంలో ‘నాతో కలిసి ఒక స్టెప్పు వేస్తావా’ అని ఆయన అడిగి మరీ డాన్స్‌ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం.


చేయాలనుకునే పాత్ర

‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’లాంటి పౌరాణిక చిత్రాల్లో నటించాలి. అలానే రన్నింగ్‌ కూడా ఇష్టం. ఆ నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తే చేయాలనుంది.


నిబద్ధతంటే...

‘విరాట పర్వం’లో కళ్లు లోపలికెళ్లిపోయి.. ముఖం పీక్కుపోయినట్టు కనిపించాల్సిన దృశ్యం ఒకటుంది. అది సహజంగా రావాలని ఒకరోజంతా ఆహారం, నీళ్లూ తీసుకోవడం మానేశా.


సమయం దొరికితే

ఖాళీ సమయాల్లో డ్రైవింగ్‌ చేస్తా. మా పెరట్లో సీతాకోక చిలుకల్ని పట్టి వదిలేస్తుంటా. పూలతో రంగోలీలూ ప్రయత్నిస్తుంటా.


కష్టపడింది

‘ఫిదా’లో బురదలో ట్రాక్టర్‌ నడుపుతూ సహజ హావభావాలతో నటించడానికి ఎంతో కష్టపడ్డా. చాలాసార్లు నియంత్రణ కోల్పోయా. నా కెరీర్‌లోనే అత్యంత కష్టంగా అనిపించిన సన్నివేశం అదే.


మాట్లాడే భాషలు

నా మాతృభాష బడగ. మా తెగవారంతా అదే భాషలో మాట్లాడతారు కానీ దానికి లిపిలేదు. అలానే ఇంకా తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లిషు, హిందీ, జార్జియన్‌ భాషలూ మాట్లాడతా.


ప్రశంస

అల్లు అర్జున్‌ సినిమాల్నీ, పాటల్నీ జనాలు పడీపడీ చూస్తారు. అలాంటిది ‘ఫిదా’లోని ‘వచ్చిండే...’ పాటను ఎన్ని సార్లు చూశానో- అని అర్జున్‌ చెప్పడం ఎప్పటికీ మర్చిపోలేని ప్రశంస.


ఫేవరెట్‌ హాలిడే స్పాట్‌

గోవా, దుబాయ్‌


క్రష్‌...

నాకు చిన్నతనం నుంచీ సూర్య అంటే క్రష్‌. ఆయనతో ఒక్క సినిమాలో అయినా నటించాలనుండేది. ‘ఎన్‌జీకే’తో ఆ కోరిక తీరింది.


నమ్మకం

తాతయ్య ఇచ్చిన జపమాల ధరిస్తే మంచి జరుగుతుందని నమ్ముతా. అందుకే దాన్ని మెడకో చేతికో ధరిస్తుంటా.


ఫిట్‌నెస్‌ కోసం

పెద్దగా వర్కవుట్లు చేయను గానీ, వారంలో మూడుసార్లు బ్యాడ్మింటన్‌ ఆడతా. కుదిరినప్పుడల్లా డాన్స్‌ చేస్తుంటా.


అనుమానం

‘అమృత’ సినిమా చూసినప్పట్నుంచీ మా అమ్మానాన్నలు కూడా నన్ను దత్తత తీసుకున్నారేమోననే అనుమానం కలుగుతుంటుంది. అప్పుడప్పుడూ అడుగుతుంటాను కూడా.


నచ్చే ఆహారం

పెప్పర్‌ చికెన్‌, చాక్లెట్లు, స్వీట్లు చాలా ఇష్టం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..