కపిల్ దేవ్‌కి కథ చెప్పాలని.. 15 నెలలు వెయిట్ చేశా!
విష్ణువర్థన్ ఇందూరి... ఆయన కలలు చాలా పెద్దవి, సినిమా పరిభాషలో చెప్పాలంటే భారీవి. దేశంలోనే తొలి సినిమా క్రికెట్ లీగ్‌లూ (సీసీఎల్), దక్షిణాదికి పేరుతెచ్చిన సైమా అవార్డులూ, ఎన్టీఆర్ జయలలితల జీవిత చిత్రాలూ, తాజా సంచలనం ‘1983’... ఇవన్నీ చెబుతాయి ఆ కలలస్థాయి ఏమిటో! మరి ఈ స్థాయి స్వాప్నికుడికి అంతేస్థాయి ఆర్థికబలం కూడా ఉంటుందని మనం అనుకోవడం సహజమే కానీ... అది నిజం కాదంటారు ఆయన. ఓ మామూలు కుటుంబం నుంచి వచ్చిన విష్ణువర్థన్ ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభాలూ, వాటిని గెలిచి నిలిచిన సంధర్భాలూ ఎన్నో ఉన్నాయి. ఆ కలల ప్రస్థానం ఆయన మాటల్లోనే...
మాది విజయవాడ. నాన్న ఇందూరి సుబ్బారావు సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్‌గా ఉండేవారు. మామూలు మధ్యతరగతి కుటుంబం మాది... ముగ్గురు పిల్లల్లో నేను పెద్దవాణ్ణి. చదువుల్లో ఎబౌ యావరేజ్ స్టూడెంట్‌నని చెప్పుకోవచ్చు. కానీ చదువులని దాటి నాలో మరో పెద్ద స్కిల్ ఉందన్న విషయం ఇంజినీరింగ్‌లో చేరాకే నాకు తెలిసింది. అది... ఈవెంట్ మేనేజ్మెంట్. కాలేజీలో చేరిన మొదటి ఏడాది నుంచే అక్కడ వివిధ కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతలు తీసుకున్నాను.
‘మిస్ ఆంధ్రప్రదేశ్’ వంటి భారీ కార్యక్రమాన్నీ ఏర్పాటుచేయగలిగాను. వీవీఐపీలని రప్పించి... వాళ్లకీ కాలేజీ విద్యార్థులకీ మధ్య మంచి ఇంటరాక్షన్ ఉండేలా ఏ సమస్యారాకుండా అందర్నీ మెప్పించేవాణ్ణి. కాకపోతే ఇది కూడా ఓ ప్రతిభేననీ... భవిష్యత్తులో ఇదే నాకు అన్నం పెడుతుందనీ అస్సలు ఊహించనేలేదు. దాంతో అందరు యువకుల్లాగే నేనూ అప్పట్లో ఐటీ బాటపట్టాను. ఇంజినీరింగ్ కాగానే ఎమ్మెస్ చేయడానికని... అమెరికా ఫ్లైటెక్కాను. చదువయ్యాక అక్కడే ఐదంకెల జీతం సాధిద్దామనే లక్ష్యంతో షికాగోలోని ఇలినాయి ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో చేరాను. మొదటి సెమిస్టర్ పరీక్షలు చాలా బాగా రాశాను కానీ, రెండో సెమిస్టర్‌కి హాజరు కాకుండానే చదువుకి స్వస్తి చెప్పేశాను. ఎందుకలా చేశానో చెబుతాను...
బిజినెస్‌మ్యాన్‌ని మరి!
ఇంగ్లిషులో ‘బజింగ్’ అనే పదం ఉంటుంది. దాన్ని రకరకాలుగా వాడుతున్నా... అసలు అర్థం తేనెటీగ ఝుంకారమని. 2000 నాటి అమెరికాలో యువతీయువకుల మధ్య అలాంటి ఝుంకారమే వినిపిస్తుండేది. ఈ యువతీయువకులు... తమ ఆవిష్కరణలతో అద్భుతాలు చేయాలని తపిస్తున్నవాళ్లు. ఆ ఆవిష్కరణలతో ప్రపంచాన్ని మార్చేసే కంపెనీలు స్థాపించి ఆర్థిక ప్రగతిని అందుకోవాలని కలలుకంటున్నవాళ్లు. ఫేస్బుక్ లాంటి సంస్థలు కేవలం ఆలోచనలుగా మొగ్గతొడుగుతున్న రోజులవి. ఈ యువ ఆవిష్కర్తల ‘బజింగ్’... నాలోనూ కొత్త కలల్ని రేపింది. చదువునలా పక్కనపెట్టి నాకు వచ్చిన ఓ ఆలోచనని బిజినెస్ మోడల్‌గా మార్చడం మొదలుపెట్టాను. భారతదేశం నుంచి అమెరికా రావాలనుకుంటున్న యువకులకి అన్ని రకాలా సాయపడే వెబ్సైట్ పెట్టాలనుకున్నాను. యూఎస్‌లోని విశ్వవిద్యాలయాలు తమదగ్గరున్న సీట్ల వివరాలని మాకు చెబితే... దాన్ని మన విద్యార్థులకి చేరవేయడం మా సేవల్లో మొదటిది. చదువుకోసమని అమెరికా వచ్చే యువతని విమానాశ్రయంలో పికప్ చేసుకోవడం దగ్గర్నుంచీ బస, పార్ట్‌టైమ్ ఉద్యోగాలూ కల్పించేవాళ్ల వివరాలనీ ఇవ్వాలన్నది రెండోది. వీటి కోసమే ‘భారత్ స్టూడెంట్ డాట్ కామ్’ అన్న వెబ్‌సైట్‌ని ఎమ్మెస్ మొదటి సెమిస్టర్ అప్పుడే మొదలుపెట్టేశాను. ఆ పరిశ్రమ పనుల కోసం ఎక్కువ సెలవులు పెట్టాల్సి రావడం వల్లే చదువుకి శాశ్వతంగా గుడ్ బై చెప్పేశాను. మా సంస్థ కేవలం సాంకేతికత ఆధారంగా నడిచేదే కాబట్టి... నాకు పెద్దగా పెట్టుబడుల అవసరం రాలేదు. ఐదుగురితో సంస్థని మొదలుపెట్టి... ఐదారేళ్లలోనే సిబ్బంది సంఖ్యని 120కి చేర్చగలిగాను. ఈ సమయంలోనే నాకు బృందతో పరిచయమైంది. పెద్దల సమ్మతితో పెళ్ళి చేసుకున్నాం. బృందతో కలిసి వేసిన ఆ ఏడడుగులే... కెరీర్‌పరంగా ఎన్నో కొత్తరంగాలవైపు నన్ను తీసుకెళ్లాయి.
ఫేస్బుక్ రాకతో...
మా ‘భారత్ డాట్ కామ్’ సంస్థని విద్యార్థుల కోసమే మొదలుపెట్టినా వాళ్ల నుంచి ఏ ఫీజూ తీసుకునేవాళ్లం కాదు. ఈ పద్ధతి మమ్మల్ని యువతకి దగ్గర చేయడంతో మంచి ఆదరణ అందుకున్నాం. లాభాలూ బాగానే వస్తుండేవి. కాకపోతే, అప్పుడే ఫేస్బుక్ రాక మొదలైంది. అది ప్రపంచంలో ఉన్నవాళ్లందరినీ కలిపేసి... కొత్త స్నేహాలకి అవకాశమిస్తుంది కదా! భారతదేశంలోని విద్యార్థులకి అది కలిసొచ్చింది. ప్రపంచంలోని వర్సిటీలూ, వసతుల గురించి ఆరాతీసే వెసులుబాటుని ఫేస్బుక్కే అందించేది. అలాంటప్పుడు మాలాంటి వెబ్సైట్ల అవసరం ఏముంటుంది...? ఈ విషయాన్ని ముందే గ్రహించి మంచి లాభాల్లో ఉన్నప్పుడే మా కంపెనీని ఓ బహుళజాతి సంస్థకి అమ్మేశాను. తర్వాతేం చేద్దాం అన్న ప్రశ్న వచ్చినప్పుడే టీవీకి మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచన వచ్చింది. కొత్త కాన్సెప్ట్‌లతో వెళ్లగలిగితే ఆ రంగంలో బాగా సక్సెస్ అవుతామని భావించాను. అలా ‘గోల్డ్ రష్- నీ ఇల్లు బంగారం కాను’ అన్న టీవీ కార్యక్రమాన్ని నిర్మించి ఓ ప్రయివేటు ఛానెల్కిస్తే అది మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మేం చేసిన ‘మాయాబజార్’ కూడా హిట్టయింది. ఈ కార్యక్రమాలతోనే మాకు సినీ నటీనటులతో పరిచయమైంది. ఆ పరిచయాలతోనే ‘మూవీ ఆర్ట్స్ అసోసియేషన్’(మా) అభివృద్ధిపనుల కోసం స్టార్ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటుచేసి విజయం సాధించాం. అది అందించిన ఉత్సాహంతోనే ‘ఐపీఎల్’లాగానే నటీనటుల కోసం ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) ప్రారంభించాలనిపించింది. దక్షిణాది నటీనటులందరినీ ఒక గొడుగు కిందకు తేవాలనుకున్నాను. ‘అంతంత పెద్ద స్టార్లు ముక్కూమొహం తెలియని నా కోసం గ్రౌండుకి వస్తారా..?’ అన్న తటపటాయింపు తోనే పనులు మొదలుపెట్టాను కానీ అనూహ్యంగా అందరూ ఒప్పుకున్నారు.
కష్టాలు తప్పలేదు...
సీసీఎల్ మొదలుపెట్టాక- కొన్ని టీమ్‌లు నిర్వాహకులమైన మాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేవి కావు. అలాంటి టీమ్‌లను ఆడొద్దని చెప్పలేక- ఆ నష్టాన్ని నేనే భరించాల్సి వచ్చింది. ఒకట్రెండు కాదు... మూడు జట్లు అలా చేశాయి. అప్పటికప్పుడు అప్పులు చేసి ఆ సమస్యని అధిగమించగలిగాను. ఇలా ఢక్కామొక్కీలు తిన్నాకే సీసీఎల్‌లు మాకు లాభాలనివ్వడం మొదలుపెట్టాయి. ఆ తర్వాతే ఎప్పట్నుంచో నాకున్న ఓ చిన్న కలకి వాస్తవరూపం తేవాలనుకున్నాను. అదే... సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా). మనకి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లాంటివి ఉన్నా... కేవలం దక్షిణాది సినిమావాళ్ల కోసమే ఓ అవార్డుని అందించాలనిపించింది. ముఖ్యంగా ప్రవాస దక్షిణభారతీయుల మధ్యే దీన్ని నిర్వహించాలన్న ఆలోచన వచ్చింది. ఇందుకోసమే నేనూ, మా ఆవిడ బృందా కలిసి ఇద్దరి పేరు మీద ‘విబ్రి’ అన్న సంస్థని ఏర్పాటుచేశాం. సైమా అవార్డులకీ నాలుగు భాషల నటీనటులు ఉత్సాహంగా ముందుకొచ్చారు కానీ... ఈసారి వచ్చిన సమస్యలు కేవలం తలబొప్పి కట్టించడంతో ఆగలేదు... తలపగిలిపోయే పరిస్థితిని తెచ్చాయి. మా మూడో ‘సైమా ఈవెంట్’ అది. దాన్ని ఓ పరాయిదేశంలో నిర్వహించడానికి అక్కడివాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మనదేశం నుంచి సుమారు నాలుగువందల మంది కళాకారుల్ని ఫ్లైట్‌లో తీసుకెళ్లాం. అందరం ఉత్సాహంగా ఆ దేశంలో ల్యాండ్ అయ్యేసరికి... అక్కడ కనీసం కార్యక్రమానికి సంబంధించిన వేదిక కూడా బుక్ చేయలేదు! ఇదేమిటని అడిగితే ‘మేం చేయలేమండీ’ అంటూ చేతులెత్తేశారు. అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయాలంటే కనీసం నాలుగుకోట్ల రూపాయలు కావాలి! ఒక్కసారిగా మాకు అంతడబ్బు ఎలా వస్తుంది... దాంతో దిక్కుతోచక నలిగిపోయాను. అప్పుడే, మా ఆవిడవాళ్ల అక్క తన ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు ఇచ్చారు. దాంతోనే... పనులు మొదలుపెట్టి ఆ ఈవెంట్‌ని సక్సెస్ చేశాం. ఆ గుణపాఠంతో ఈవెంట్ ముందు నుంచీ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాను. చూస్తుండగానే దక్షిణాదిలో అతిపెద్ద ఈవెంట్‌గా మారింది!
‘1983’ అప్పుడు మొదలైందే...
మేం సీసీఎల్ నిర్వహిస్తున్నప్పుడే 1983 ప్రపంచకప్ గురించి లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. కపిల్‌దేవ్ జీవితాన్ని స్పృశిస్తూ ఆ ప్రపంచకప్ విజయంపైన ఓ సినిమా తీద్దామనుకున్నాను. 2012లోనే దిల్లీ వెళ్లి కపిల్‌ని కలిస్తే ఆయన నన్ను ఎగాదిగా చూసి ‘అవసరం లేదు’ అన్నారు. ఆ మాటతో నేనేమీ డీలాపడిపోలేదు. సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ అనే బాలీవుడ్ కథారచయితని పట్టుకుని... నా బేసిక్ ఐడియా చెప్పి దాని ఆధారంగా కథ రాయమన్నాను. అది రెడీ అయి 15 నెలలు ఓపిగ్గా ప్రయత్నించాక కానీ కపిల్ చూడలేదు. చూసిన ఐదు నిమిషాల్లోనే ‘1983’ ఘటనలో ఇంత నాటకీయతా, ఉద్వేగాలూ ఉన్నాయా! సూపర్బ్... గో ఎహెడ్’ అన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ కబీర్‌ఖాన్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణెలు ప్రాజెక్టులోకి రావడంతో ఇదో జాతీయస్థాయి సినిమాగా మారిపోయింది. టీజర్, ట్రైలర్ అన్నీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక, సినిమా... ఒక్క తెలుగులోనే కాదు జాతీయస్థాయిలోనూ నిర్మాతగా నాకు మంచి పేరు తెస్తోంది.
అదో పెద్ద సంక్షోభమే...
‘1983’ ఆలస్యమవుతుందని తెలిశాక... ఎన్టీఆర్ జీవితాన్నే చిత్రంగా తీయాలన్న ఆలోచన వచ్చింది. ప్రాథమికంగా నేనే ఓ స్క్రిప్ట్‌ని రాసుకుని... బాలయ్యకి వినిపిస్తే వెంటనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు క్రిష్ ఆ కథనీ, సినిమానీ మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకున్నా... ఎన్టీఆర్ అభిమానిగా ఆయనకి నా పరిధిలో మంచి నివాళినే అందించానన్న తృప్తి మిగిలింది. ఇక, తలైవి విషయానికి వస్తే... మా ఆవిడ బృంద పుట్టిపెరిగింది చెన్నైలోనే. తనకి జయలలిత అంటే వల్లమాలిన అభిమానం. ఆమె చనిపోయినప్పుడు... మూడురోజులపాటు దుఃఖంలోనే ఉండిపోయింది. జయలలిత గురించి సినిమా తీయాలన్న ఆలోచన తనదే. అలా- తననే క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పెట్టి దేశంలోని బెస్ట్ ఆర్టిస్టులతో ‘తలైవి’ని మొదలుపెట్టాం. 2020 మార్చిదాకా అంతా అనుకున్నట్టే సాగిందికానీ...షూటింగ్ ఆగిపోయింది. తెచ్చిన అప్పులపైన వడ్డీలు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. బడ్జెట్... 70 కోట్లకి చేరింది. థియేటర్లు మూతపడటంతో సినిమాని కొనడానికి పంపిణీదారులెవరూ ముందుకు రాలేదు. మరోవైపు ఈ సినిమాని వీలున్నంత తొందరగా పూర్తిచేయాలంటూ నటీనటులూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఓ వైపు ఈ ఒత్తిడీ, మరోవైపు ఆర్థిక ఇబ్బందులూ... వీటితో ‘అసలు సినిమా నిర్మాణంవైపు ఎందుకొచ్చానబ్బా!’ అని తలపట్టుకున్నాను. అప్పుడే నా మిత్రుడు తిరుమల్‌రెడ్డి నన్ను ఆర్థికంగా ఆదుకున్నాడు. మేము టీవీ ప్రొడక్షన్లో ఉన్నప్పటి నుంచే మాతో కలిసి జర్నీ చేస్తున్నాడు తను. తన దన్నుతోనే ఈ సంక్షోభం నుంచి బయటపడి ఎలాగోలా రిలీజ్ చేశాను! నెట్‌ఫ్లిక్స్‌లో వరసగా మూడువారాలపాటు నంబర్‌వన్‌గా నిలిచి రికార్డు సృష్టించిందీ చిత్రం.
కథానాయకుడు, తలైవి, తాజాగా 1983.. ఈ బయోపిక్‌ల తర్వాత మరింత దూకుడుగా వెళ్లాలనుకుంటున్నాను. ‘అజాద్ హింద్’ పేరుతో వరసగా దేశభక్తుల చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాను. దాంతోపాటూ కొత్తతరం కథలతో మూడు కథలను సిద్ధం చేశాను. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ‘డబ్బుల్లేనివాడివి ఏదో నీ స్థాయిలో తెలుగు సినిమాలు చేసుకుంటే పోలా! అప్పులు చేసి మరీ పాన్ ఇండియా సినిమాలు ఎందుకు?’ అని ఇప్పటికీ నన్ను వెక్కిరించేవాళ్లున్నారు. ‘నా కలల్ని నేనలా కుదించుకోలేను’ అన్నదే వాళ్లకి నేనిచ్చే జవాబు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్