తెలివైన కాకి!

కుండలో అడుగున ఉన్న నీళ్లకోసం రాళ్లను వేసి కాకి ఎలా దాహం తీర్చుకుందో చెప్పే కథ అందరికీ తెలిసిందే. కాకులు నిజంగానే తెలివైనవనీ అవి చిన్న చిన్న సాధనాలను ఉపయోగించగలవనీ తమకెదురయ్యే అవరోధాల్నీ అధిగమించగలవనీ ...

Published : 19 Jun 2022 00:35 IST

తెలివైన కాకి!

కుండలో అడుగున ఉన్న నీళ్లకోసం రాళ్లను వేసి కాకి ఎలా దాహం తీర్చుకుందో చెప్పే కథ అందరికీ తెలిసిందే. కాకులు నిజంగానే తెలివైనవనీ అవి చిన్న చిన్న సాధనాలను ఉపయోగించగలవనీ తమకెదురయ్యే అవరోధాల్నీ అధిగమించగలవనీ ఇప్పటికే కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కార్విడే కుటుంబానికి చెందిన ఇతర పక్షులతో పోలిస్తే కాకులకీ వీటిని పోలిన రావన్‌ పక్షులకీ మెదడు, శరీర పరిమాణం పెద్దగా ఉండటంతోపాటు రెక్కల పొడవూ కండరాల దృఢత్వం ఎక్కువనీ, అందుకే అవి ఎంత దూరమైనా అలుపు లేకుండా ఎగరగలవనీ, కొత్త వాతావరణానికీ త్వరగా అలవాటుపడగలవనీ పేర్కొంటున్నారు వాషింగ్టన్‌ యూనివర్సిటీ నిపుణులు. అందుకే ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలిగాయట. ఇందుకోసం వీళ్లు ఉష్ణమండల అరణ్యాల్లో నివసించేవాటిని ఆర్కిటిక్‌ ప్రాంతానికి తీసుకెళ్లినప్పుడు అవి అక్కడి పరిస్థితుల్ని సైతం తట్టుకుని అలవాటు పడ్డాయట. కాకి జాతికే చెందిన రావన్‌ పక్షులకి అయితే కోతులకి ఉండే తెలివితేటలన్నీ ఉన్నాయనీ అవి మనిషి స్వరాన్ని సైతం అనుకరించగలవనీ తెలుసుకోగలిగారు. కాకులకి మనిషిని గుర్తుపట్టే శక్తీ ఉన్నట్లు వాళ్ల పరిశీలనలో స్పష్టమైందట. అందుకేనేమో ఇంటికొచ్చే చుట్టాల కబురు కాకులు మోసుకొస్తాయి అంటుంటారు పెద్దవాళ్లు. కాబట్టి... ఏదో అరుస్తున్నాయి కదాని వాటిమీదకి గభాల్న ఏ రాయో విసరకండి... అవి పది కాకులతో వచ్చి మరీ పగ తీర్చుకోగలవు అంటున్నారు పరిశీలకులు.


కొత్త రకం బ్యాండేజీ!

యాంటీబయోటిక్స్‌ని అతిగా వాడటం వల్ల ఆయా బ్యాక్టీరియా లేదా వైరస్‌లకు వాటిని తట్టుకునే శక్తి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. అందుకే బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు హైడ్రోజెల్‌ పేరుతో ఓ కొత్త పదార్థాన్ని రూపొందించారు. ఇది యాంటీబయోటిక్‌ని చిన్న చిన్న నానో రేణువుల రూపంలో పట్టి ఉంచుతుంది. కాబట్టి దీన్ని గాయానికి బ్యాండేజీగా కడితే అది గాయం లోపల బ్యాక్టీరియాని గుర్తించినప్పుడు మాత్రమే యాంటీబయోటిక్‌ను విడుదల చేస్తుందట. అంటే- పుండులోని బ్యాక్టీరియా విడుదల చేసే బీటా-ల్యాక్టమేజెస్‌ అనే పదార్థాన్ని గుర్తించినప్పుడే విడుదల అవుతుంది. ఈ విషయాన్ని పరీక్షించినప్పుడు-  ఫ్లోరసెంట్‌ రంగుల్లో నానోపార్టికల్స్‌ రూపంలో ఉంచిన మందు విడుదల కావడం స్పష్టంగా కనిపించిందట. కాబట్టి యాంటీబయోటిక్స్‌ వాడకాన్ని తగ్గించేందుకే కాదు, ఈ విధానాన్నే క్యాన్సర్‌ నివారణలోనూ పరిశీలించవచ్చు అంటున్నారు.


ప్లాస్టిక్కుని తినే పురుగులు!

టన్నులకొద్దీ ప్లాస్టిక్కుని నేలమీదా సముద్రంలోనూ పారేస్తున్నాం. కొంతవరకూ దాన్ని రీసైక్లింగ్‌ కూడా చేస్తున్నాం. కానీ ఇంకా చాలా ప్లాస్టిక్కు మిగిలే ఉంటుంది. అయితే దాన్ని సైతం తిని అరిగించుకుని బలంగా పెరిగే కొన్ని రకాల క్రిములు ఉన్నాయని గుర్తించారు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ పరిశోధకులు. వీటినే వాళ్లు సూపర్‌ వార్మ్స్‌గా పిలుస్తున్నారు. వాటి పొట్టలోని బ్యాక్టీరియాని పరిశీలించినప్పుడు- అందులోని కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్స్‌ ప్లాస్టిక్కుని శక్తిలా మార్చుకుంటున్నాయి అని గుర్తించారు. పైగా అవి కేవలం ఆకలి తీర్చుకోవడానికే పాలీస్టైరీన్‌ను తిన్నప్పటికీ వాటిని జీర్ణం చేసుకుని శక్తిలా మార్చుకుని బరువు పెరగడం నిపుణుల్ని చకితుల్ని చేసింది. దీని ఆధారంగా ప్లాస్టిక్కుతో చర్యపొందే ఆ ఎంజైమ్‌ల్ని నిశితంగా పరిశీలించి, ఆయా పదార్థాల్ని కృత్రిమంగా రూపొందిస్తే నేలమీద ఉన్న ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని వేగంగా తగ్గించగలం అని భావిస్తున్నారు.


రోబో... సహజంగా!

మనిషికి చిరకాలం నుంచీ ఓ ఫ్యాంటసీ ఉంది... కృత్రిమ మేధతో తాను సృష్టించే మరమనిషి కూడా అచ్చం తనలానే ఉండాలనీ మనుషుల మధ్య తిరగాలనీ. అందుకే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో అలాంటి రోబో విలన్లనీ హీరోల్నీ సృష్టించి తన ఆసక్తిని ప్రదర్శిస్తుంటాడు. అయితే ఆ రోజు మరెంతో దూరంలో లేదనీ ఒక్కో అడుగూ వేసుకుంటూ వెళుతున్నామనీ అంటున్నారు జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. అందులో భాగంగా వీళ్లు గ్రాఫ్టింగ్‌ విధానం ద్వారా మానవ చర్మకణాల్ని రోబోకి అతికించగలిగారు. పైగా గాయమైనా దానంతటదే తగ్గిపోయే గుణాన్నీ కలిగి ఉండేలా చేయగలిగారు. ఇప్పటికే హెల్త్‌ కేర్‌ సేవల్లో హ్యూమనాయిడ్‌ రోబోలకు అమర్చే సిలికాన్‌ చర్మం చాలావరకూ మనిషి చర్మాన్ని పోలి ఉంటుంది. అది మనిషే అనిపించేలా దానికి ముడుతలు సైతం వచ్చేలా చేయగలిగారు. అయితే ఏమి చేసినా అది ప్లాస్టిక్కు చర్మమే. అందుకే టిష్యూ మోల్డింగ్‌ పద్ధతి ద్వారా జీవకణాలతో కూడిన చర్మాన్ని రోబోకి అమర్చగలిగిందట జపాన్‌ శాస్త్రవేత్తల బృందం. ఇక్కడితోనే అయిపోలేదనీ న్యూరాన్లూ వెంట్రుకలూ స్వేదగ్రంథులూ ఇలా అన్నింటినీ కూడా అందులోకి చొప్పించి మరింత సహజంగా ఉండేలా చేయాలన్నదే తమ ప్రయత్నం అంటోంది నిపుణుల వర్గం. మొత్తమ్మీద జీవంతో కళకళలాడే రోబోలు రావడానికి మరెంతో కాలం పట్టదన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..