పనసతో ప్రయోగాలు!

పశ్చిమ కనుమల వాతావరణం పనసకు బాగా అనుకూలం. అందుకే కేరళలో పనస ఎక్కువగా కనిపిస్తుంది. అది ఆ రాష్ట్ర ఫలం కూడా. అక్కడ పనసపైన రైతులూ, సామాన్యులూ, వ్యాపారులూ నిత్యం రకరకాల ప్రయోగాలు చేస్తారు.

Published : 25 Feb 2023 23:04 IST

పనసతో ప్రయోగాలు!

పశ్చిమ కనుమల వాతావరణం పనసకు బాగా అనుకూలం. అందుకే కేరళలో పనస ఎక్కువగా కనిపిస్తుంది. అది ఆ రాష్ట్ర ఫలం కూడా. అక్కడ పనసపైన రైతులూ, సామాన్యులూ, వ్యాపారులూ నిత్యం రకరకాల ప్రయోగాలు చేస్తారు. పనసని తమ జీవితంలో భాగం చేసుకుని అద్భుతాలు చేస్తున్న వ్యక్తులు వీళ్లు...


చేతికి అందేంత ఎత్తులో...

తిరుచ్చూర్‌ జిల్లా వెల్లూర్‌కు చెందిన వర్గీస్‌ తారకన్‌... ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి ఆపైన వ్యవసాయం బాట పట్టాడు. ఆయన అత్తారింటి దగ్గరుండే పనస చెట్టు తక్కువ ఎత్తులో ఉండి... ఏడాదికి రెండు సార్లు కాసేది. రోడ్డు విస్తరణలో భాగంగా దాన్ని తొలగించాల్సి వస్తే.. తీసుకొచ్చి తన పొలంలో నాటాడు. అది బతికింది. దాని కొమ్మల్ని కత్తిరించి అంటుకడుతూ మరి కొన్ని మొక్కల్ని పెంచి వాటినీ నాటాడు. ఈ మొక్కల ఎత్తు ఆరేడు అడుగులే! నాటిన రెండు మూడేళ్లకే కాపు వస్తుంది. అవి కూడా చేతికి అందే ఎత్తులో ఉంటాయి. ఈ ప్రత్యేకతల్ని గుర్తించాక... తన అయిదెకరాల రబ్బరు తోటని కొట్టించి అక్కడ పనస మొక్కల్ని నాటాడు. వీటికి ‘ఆయుర్‌జాక్‌’ అని పేరు పెట్టాడు. అది పర్వత ప్రాంతం. వర్షం పడితే నీరు ఆగదు. అదే సమయంలో భూగర్భ జలాలూ తక్కువే. అందుకని మొక్కల వరసల మధ్యన కందకాలు తవ్వించి నీరు భూమిలోకి ఇంకేలా చేశాడు. ఈ మార్పులతో మంచి దిగుబడి వచ్చింది. ఈయన వ్యవసాయ క్షేత్రంలో వెయ్యికిపైగా పనస చెట్లున్నాయి. మరోచోట ఎనిమిది ఎకరాల్లో భిన్నరకాల పనసను సాగు చేస్తున్నాడు. రెండు చోట్లా నర్సరీ ఏర్పాటు చేసి వేల సంఖ్యలో మొక్కల్ని అమ్ముతున్నాడు. కొద్ది  స్థలంలోనే పెరగడం, ఏడు అడుగులకు మించి ఎత్తు లేకపోవడంతో ఆయుర్‌జాక్‌ రకాన్ని ఇరుగుపొరుగు రాష్ట్రాల వారూ తీసుకువెళ్తున్నారు.


వందల రకాల ఉత్పత్తులు...

అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి... కేరళలో పనస సాగుకి వచ్చే సమస్య. వేసవిలో పనస దిగుబడి విపరీతంగా ఉంటుంది. చాలావరకూ పండ్లు కోయకుండా వదిలేస్తారు. మిగతా కాలంలో మాత్రం కావాలన్నా ఆ రుచి దొరకదు. ఈ విషయాన్నే గమనించింది తిరువనంతపురానికి చెందిన రాజశ్రీ. అందుకని కాయంకుళం-కృషి విజ్ఞాన్‌ కేంద్రంలో పనసతో ఆహార ఉత్పత్తుల తయారీపైన శిక్షణ తీసుకుంది. ఆపైన ఆలప్పుళ సమీపంలో యూనిట్‌ని పెట్టి... ‘ఫ్రూట్‌ అండ్‌ రూట్‌’ పేరుతో ఆహారోత్పత్తులు తెస్తోంది. పనస విత్తనాలూ, తొనలూ, పొట్టు... వీటితో వివిధ రకాల ఉత్పత్తులు తయారుచేసి ఆ రుచి ఏడాది పొడుగునా నాలుకపైన ఉండేట్టు చేస్తున్నారు. మలయాళీ కుటుంబాల్లో చేసుకునే పనస కూరలూ, సూప్‌లూ, స్నాక్స్‌తోపాటు లేత పనస, పచ్చి పనసతోనూ బర్గర్లూ, పాస్తా, నూడుల్స్‌, సేమియా, చిప్స్‌, బిస్కెట్స్‌, జెల్లీ, పచ్చళ్లు, చాకొలెట్‌; వరి పిండి, గోధుమ పిండిలో పనస పిండిని కలిపి ఇడ్లీ, చపాతీ, పూరీ చేసుకునేలా సరికొత్త పిండినీ; ఇలా వందకుపైగా ఉత్పత్తుల్ని మార్కెట్‌లోకి తెచ్చారీమె.


ఇంటి పేరే పనస...

కర్ణాటకలో దారికి ఇరువైపులా మర్రి చెట్లు నాటిన సాలుమరద తిమ్మక్క... గుర్తున్నారుగా! అలాంటి వ్యక్తే కేరళకు చెందిన కేఆర్‌ జయన్‌. ఆయన ఇప్పటివరకూ 20వేలకు పైగా పనస మొక్కలు నాటాడు. జయన్‌ సొంతూరు తిరుచ్చూర్‌ జిల్లా, ఇరింజాలకూడ. కేరళలోని కుటుంబశ్రీ సంఘాలు తయారుచేసే సబ్బులూ, అగరు బత్తీలూ, కొవ్వొత్తుల్ని గ్రామాల్లో ఆటోలో తిరుగుతూ అమ్ముతుంటాడు. అలా వెళ్లినప్పుడు ఎక్కడైనా అరుదైన జాతికి చెందిన పనస రకాలు కనిపిస్తే వాటి విత్తనాలు తెస్తాడు. తనకున్న పన్నెండు సెంట్ల స్థలంలో వాటిని నాటుతాడు. అవి మొక్కలు అయ్యాక రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో పెంచుతాడు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆయనకి ‘అరుదైన వృక్ష జాతుల సంరక్షకుడు’ అవార్డునీ అందించింది. జయన్‌కి పనస చెట్టుతో ప్రత్యేక అనుబంధం ఉంది. తనతోపాటు ఏడుగురు తోబుట్టువులూ పెరట్లోని పనస చెట్టు పండ్లు తింటూ ఆకలి తీర్చుకునేవారట. చిన్నప్పుడు స్కూల్లోనూ పనస చెట్టు నాటాడు. అప్పుడే స్నేహితులు అతనికి ‘పళావు (పనస) జయన్‌’ అని పేరు పెట్టారు. పెద్దయ్యాక ఆ పేరు నిలబెట్టుకున్నాడు. ఇంటర్‌ వరకూ చదువుకున్న జయన్‌ 1995లో గల్ఫ్‌ వెళ్లాడు. 2006లో తిరిగొచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. అప్పట్నుంచీ పనస మొక్కల్ని నాటుతున్నాడు. షోరనూర్‌ రైల్వే జంక్షన్‌, తిరుచ్చూర్‌ మెడికల్‌ కాలేజీ, పాలక్కాడ్‌ ప్రభుత్వ కాలేజీ.. లాంటిచోట్ల వందల సంఖ్యలో మొక్కలు నాటి తోటల్ని అభివృద్ధి చేశాడు. గ్రామాల్ని ఎంచుకుని అక్కడి రోడ్ల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటుతాడు. పనసతో తన ప్రయాణంపైన పుస్తకమూ రాశాడు. అందులో కొన్ని పేజీల్ని కేరళ ప్రభుత్వం ఏడో తరగతిలో పాఠంగానూ పెట్టింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..