ఎక్కడ ఉన్నా... తన ఆలోచనలే!

పుష్పతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రశ్మిక మందన్న... ఆ తరువాత బాలీవుడ్‌లోనూ అడుగులు వేసింది.

Updated : 08 Jan 2023 12:31 IST

ఎక్కడ ఉన్నా... తన ఆలోచనలే!

పుష్పతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రశ్మిక మందన్న... ఆ తరువాత బాలీవుడ్‌లోనూ అడుగులు వేసింది. త్వరలో తన అభిమాన నటుడు విజయ్‌తో కలిసి.. ‘వారసుడు’తో అలరించనున్న ఈ కూర్గ్‌భామ... తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటోందిలా...  


మొదట్లో ఒప్పుకోలేదు

కాలేజీలో ఉన్నప్పుడే నాకు సినిమా అవకాశం వచ్చింది. అమ్మానాన్నా అది తెలిసి ఆనందించలేదు. ‘హీరోయిన్లంటే చిన్నచూపు ఉంటుంది... నీ వల్ల కాదు’ అంటూ భయపెట్టారు. నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో వివరించాకే ఇటువైపు వచ్చా. ఒకవిధంగా మా ఇంట్లోవాళ్లను ఒప్పించడమే నేను సాధించిన మొదటి విజయం. అయితే ఇప్పుడు కూడా నేను వేరే ప్రాంతంలో ఉండి షూటింగ్‌లతో బాగా అలసిపోయానంటూ ఫోన్‌లో చెబితే చాలు... అమ్మ ఇంటికొచ్చేయమంటుంది. నేను సినిమాల్లోకి వచ్చాక అమ్మానాన్నా మా చెల్లిని అన్నింట్లో ప్రోత్సహిస్తున్నారు కానీ... నా విషయంలో వాళ్లు ఏది చెబితే దానికి తలాడించేదాన్ని అంతే.


వండటం వచ్చు

ఇప్పుడిప్పుడు.. కాస్త ఖాళీ దొరికినప్పుడు వంటల్లో ప్రయోగాలు చేస్తున్నా. ఓ వంటకాన్ని బాగా చేసినప్పుడు ఏదో సాధించినట్లుగా అనిపిస్తుంది.


ఎక్కువగా ప్రయాణిస్తా...

కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు కేవలం ఆ ప్రాంతాలనే కాదు... అక్కడున్న సంస్కృతీ సంప్రదాయాలూ, కొత్త వ్యక్తులూ, ఆహారపుటలవాట్లూ అన్నీ తెలుస్తాయి. అవన్నీ మనల్ని మనం ఇంకా బాగా అర్థంచేసుకునేందుకు ఉపయోగపడతాయనేది నా అభిప్రాయం. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా నేను చూడని ప్రాంతాలను చుట్టొచ్చేందుకు సమయం పెట్టుకుంటా.  ఎక్కువగా చూడాలనుకునే ప్రాంతాల్లో మొదట ఉండేది ప్యారిస్‌. అయితే... అన్నింటికంటే ఇష్టమైన ప్రాంతం ఏదయినా ఉందంటే అది కూర్గ్‌లోని మా ఇల్లే.  


ఆ రోజులు గుర్తుంటాయి
నాకు ఉన్న మంచి జ్ఞాపకాలంటే నా హాస్టల్‌ రోజులే. ఒకటి, రెండు నెలలు సెలవులు ఇచ్చినప్పుడు అమ్మానాన్నా నన్ను తీసుకెళ్లేందుకు వచ్చేవారు. ఆ రోజున మాత్రం చాలా ఆనందంగా అనిపించి ఎగిరి గంతేసినంత పనిచేసేదాన్ని మరి.


అతడికి వీరాభిమానిని

నాకు చిన్నప్పటినుంచీ తమిళ నటుడు విజయ్‌ అంటే చెప్పలేనంత ఇష్టం. ‘పుష్ప’ తరువాత కాస్త వైవిధ్యమైన కథలు ఎంచుకోవాలనుకుంటున్న సమయంలో విజయ్‌ సినిమా అవకాశం వచ్చింది. మొదటిసారి తన పక్కన నిల్చుని ముహూర్తపు షాట్‌లో పాల్గొన్నప్పుడు ఎంత ఆనందించానో చెప్పలేను. ఆ ఆనందంలో విజయ్‌కి దిష్టి కూడా తీశా తెలుసా...


అక్క కాదు అమ్మని...

మా చెల్లి షిమన్‌కూ నాకూ మధ్య పదహారు సంవత్సరాల తేడా ఉంది. ఒకప్పుడు తన పనులన్నీ నేనే చేసేదాన్ని. అందుకే తను నన్ను అమ్మలా భావిస్తుంది. నేను కూడా తన విషయంలో అలాగే ఉంటా. ఎక్కడ, ఎంత బిజీగా ఉన్నా... షిమన్‌ బాగా చదువుకుంటోందా... తన అవసరాలేమిటి... ఇలా అన్నింటినీ అడిగి తెలుసుకుంటా. ఇంటికొస్తే మాత్రం తనతోనే ఎక్కువ సమయం గడపాలని చూస్తుంటా.


* నా మొదటి కారు  
ఆడీ... ఆ తరువాత రేంజ్‌ రోవర్‌.

దినచర్యలో భాగంగా...
రోజును మంచినీళ్లు తాగడంతో మొదలుపెడతా. ఆ తరువాత వ్యాయామాలు చేయాల్సిందే.

* ఒత్తిడిగా అనిపించినప్పుడు...
సంగీతం ఎక్కువగా వింటా. స్నేహితులతో గడిపేందుకు ప్రయత్నిస్తా.  

* నచ్చే ఆహారం
తీపి పదార్థాలు. ముఖ్యంగా ఐస్‌క్రీమ్‌, చాక్లెట్లు, మిఠాయిలు. నా చీట్‌మీల్‌లో అవి తప్పనిసరిగా ఉంటాయి.

* తీరిక దొరికితే...
వ్యాయామాలు ఇంకాస్త ఎక్కువగా చేయాలనుకుంటా. హాయిగా ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటా. లేదంటే నచ్చిన చోటికి టూర్‌ వెళ్లిపోతా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..