కాఫీ తాగుతున్నారా?

కాఫీ, టీ... మోతాదు మించకుండా తాగితే ఆరోగ్యానికి మంచిదేనని ఇప్పటికే అనేక పరిశోధనలు చెబుతున్నాయి. నిజానికి ఈ రెండింటినీ చాలామంది మెదడు చురుకుగా మారుతుందన్న కారణంతోనే తాగుతుంటారు. పనిలో ఉన్నప్పుడు ఓ కప్పు కాఫీ తాగితే మళ్లీ ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.

Published : 03 Apr 2022 01:12 IST

కాఫీ తాగుతున్నారా?

కాఫీ, టీ... మోతాదు మించకుండా తాగితే ఆరోగ్యానికి మంచిదేనని ఇప్పటికే అనేక పరిశోధనలు చెబుతున్నాయి. నిజానికి ఈ రెండింటినీ చాలామంది మెదడు చురుకుగా మారుతుందన్న కారణంతోనే తాగుతుంటారు. పనిలో ఉన్నప్పుడు ఓ కప్పు కాఫీ తాగితే మళ్లీ ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఇది నూటికి నూరు శాతం నిజం కూడా. ఏ కారణంతో తాగినా కూడా వీటివల్ల పక్షవాతం, మతిమరుపు వచ్చే ప్రమాదం తగ్గుతుంది అంటున్నారు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. ఎందుకంటే వీటిల్లోని కెఫీన్‌ రక్తనాళాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంతోపాటు నాడుల్ని ఉత్తేజితం చేస్తున్నట్లు వాళ్ల పరిశీలనలో తేలిందట. అయితే వీటి వాడకం ఎక్కువైతే మాత్రం ఆందోళన, చికాకు, గుండె రేటు పెరగడం, నిద్ర సమస్యలు, డీహైడ్రేషన్‌,... వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి తగుమోతాదులో- అంటే, రోజుకి రెండుమూడు కప్పులు మించకుండా తాగితే మంచిదని సూచిస్తున్నారు.

 


కిడ్నీల్లోని రాళ్లకి కొత్త చికిత్స!

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే అవి కరగడానికి ముందు దశలో మందులు ఇస్తారు. నీళ్లు ఎక్కువగా తాగమంటారు. అప్పటికీ కరగకపోతే శస్త్రచికిత్స తప్పనిసరి. అయితే మున్ముందు ఆ అవసరం ఉండకపోవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే- అచ్చంగా ధ్వని తరంగాల ద్వారానే రాళ్లను ముక్కలుగా చేయవచ్చట. ఈ కొత్త విధానాన్నే బరస్ట్‌ వేవ్‌ లిథోట్రిప్సీ(బిడబ్ల్యుఎల్‌)అంటున్నారు. అయితే  శబ్ద తరంగాల ద్వారానే- అంటే, ఎక్స్‌ట్రా కార్పొరియల్‌ షాక్‌ వేవ్‌ లిథోట్రిప్సీ(ఇఎస్‌డబ్ల్యుఎల్‌) అనే పద్ధతి ద్వారానే రాళ్లను ముక్కలుగా చేసే పద్ధతి ఇప్పటికే వాడుకలో ఉంది. అయితే ఈ పాత పద్ధతిలో రోగికి అనస్తీషియా తప్పనిసరి. అలాగే లోపలి కణజాలానికి అయిన గాయం పెద్దగా ఉండటంతో అది తగ్గడానికి సమయం పడుతుంది. కానీ కొత్త విధానంలో అనస్తీషియా అవసరం లేకుండానే చేత్తో పట్టుకోగలిగే ఓ చిన్న పరికరం నుంచే శబ్దతరంగాల్ని పంపించి రాళ్లను రెండు మి.మీ. కన్నా తక్కువ పరిమాణంలో ముక్కలయ్యేలా చేయగలరట. ఈ విషయాన్ని కొందరిలో పరిశీలించినప్పడు- ఒక రాయి 90 శాతం వరకూ ముక్కలైపోయిందట. ఇవన్నీ సహజంగా బయటకు వెళ్లిపోతాయి కాబట్టి ఆపై ఎలాంటి చికిత్సా అవసరం లేదనీ పైగా కొత్త బిడబ్ల్యూఎల్‌ విధానంలో కణజాలం దెబ్బతినే ప్రమాదం తక్కువనీ అంటున్నారు.


మగవాళ్లకీ కాంట్రాసెప్టివ్‌!

పిల్లలు పుట్టకుండా వాడే కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ ప్రస్తుతం మహిళలకే ఉన్నాయి. కానీ వాటివల్ల హార్మోన్లలో లోపాలు ఏర్పడి పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఈ మందుల్ని మగవాళ్లకోసం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అవి పూర్తిస్థాయిలో ఫలితాన్ని ఇవ్వడం లేదు. వాళలోనూ అవి హార్మోన్లతో చర్యపొంది తరవాత శుక్రకణాల వృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఆ సమస్యకు చెక్‌ పెడుతూ హార్మోన్లతో ఎలాంటి చర్యా పొందకుండా ఉండే పురుషుల కాంట్రాసెప్టివ్‌ని ఎట్టకేలకు మిన్నెసోటా యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. వైసిటి529గా పిలుస్తున్న ఈ ట్యాబ్లెట్‌ను ఎలుకల్లో పరీక్షించినప్పుడు- సంతానం కలగకపోవడమే కాదు, దీన్ని వాడటం మానేసిన నాలుగైదు వారాలకు శుక్రకణాల విడుదల యథాస్థితికి వచ్చిందట. కాబట్టి త్వరలోనే దీన్ని మనుషుల్లోనూ పరీక్షించి వాడుకలోకి తీసుకురాగలిగితే సంతాన నియంత్రణకు సంబంధించి మహిళలకు కొంతైనా ఊరట లభిస్తుంది అంటున్నారు.


కోపాన్ని తగ్గించే రోబో

స్నేహితుడి రాకకోసం గంటనుంచీ ఎదురుచూస్తున్నారు. రాకపోగా టిక్‌మంటూ ఓ మెసేజ్‌ వస్తుంది... రావడం కుదరలేదు అని. చూడగానే కోపం తన్నుకొస్తుంది. సారీ అని కూడా చెప్పకపోవడమే అందుకు కారణం. ఒకవేళ ఫోన్‌ చేసినా కొందరు ఆ విషయాన్ని సరిగ్గా చెప్పలేరు. అలాంటి సందర్భాల్ని దృష్టిలో పెట్టుకుని సుకుబా యూనివర్సిటీ పరిశోధకులు ఓమోయ్‌ అనే రోబోని కనిపెట్టారు. ఇది సంబంధిత వ్యక్తుల భావోద్వేగాల్ని దృష్టిలో పెట్టుకుని ఆయా మెసేజ్‌లను చదివి, అవతలివాళ్లమీద కోపంరాని విధంగా వినిపిస్తుందట. వ్యక్తులపట్ల నెగెటివ్‌ ఫీలింగ్స్‌ని కలగకుండా చేస్తుంది. అంటే, ఫోన్‌కి వచ్చిన మెసేజ్‌ని యథాతథంగా చదివి చెప్పకుండా గొంతులో భావోద్వేగాల్ని పలికిస్తూ, సందర్భానుసారంగా క్షమాపణని జోడిస్తూ అప్‌సెట్‌ కాకుండా చెబుతుందన్నమాట. చేతులు కదుపుతూ అది చెప్పేతీరుకి కోపం కాస్తా పోతుంది అంటున్నారు పరిశీలకులు. మినియేచర్‌ బొమ్మను తలపించే ఈ రొబోను ఆప్‌ ద్వారా ఫోన్‌కి కనెక్టు చేసుకుని టేబుల్‌మీద పెట్టుకోవచ్చు లేదా చేత్తోనూ పట్టుకోవచ్చట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..