Updated : 05 Feb 2023 12:22 IST

dev mohan: దాదాపు రెండేళ్లు రహస్యంగా ఉంచా!

జిమ్‌... అతడికి మోడలింగ్‌ చేసే అవకాశాలను కల్పిస్తే... ఆ రంగం ద్వారా సినిమాల్లోకి ప్రవేశం లభించింది. అలా మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసి, చాలా తక్కువ సమయంలోనే తెలుగు తెరకూ పరిచయమవుతున్నాడు ‘శాకుంతలం’లోని దుష్యంతుడు దేవ్‌మోహన్‌


అనుకోకుండా మోడలింగ్‌లోకి...

మా స్వస్థలం కేరళలోని తిరుచ్చూర్‌. అమ్మానాన్నా, అక్కా నేను.. ఇదీ మా కుటుంబం. సినిమాల్లోకి రావాలనే ఆలోచన నాకు మొదట్లో లేదు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాక ఓ కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం రావడంతో బెంగళూరుకు వెళ్లిపోయా. మొదటినుంచీ నాకు వ్యాయామం చేయడం అలవాటు. అలా బెంగళూరులోనూ రోజూ జిమ్‌కు వెళ్లేవాడిని. అక్కడే నాకు ఓ మోడల్‌ పరిచయమై మోడలింగ్‌ చేయమనీ... మిస్టర్‌ ఇండియా పోటీల్లో పాల్గొనమనీ సలహా ఇచ్చాడు.  నాకూ ప్రయత్నించాలనిపించి ఆ పోటీలకు వెళ్లి... ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యా. ఆ తరువాత ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వారాంతాల్లో ఫ్యాషన్‌ షోలల్లో పాల్గొనేవాడిని.


తొలి అవకాశం...

మోడలింగ్‌ చేస్తున్నప్పుడే... నా ఫ్రెండ్‌ ఒకరు ఓ నిర్మాణ సంస్థ కొత్త హీరోలను వెతుకుతోందని చెప్పి... నన్ను ప్రయత్నించమన్నాడు. తీరా  వెళ్తే నాలుగువందల మందికి పైగా అభ్యర్థులు ఉన్నారక్కడ. అందరిలానే నేనూ ఆడిషన్‌ ఇచ్చేసి వచ్చేశా. కొన్నిరోజులకే నన్ను సెలక్ట్‌ చేసినట్లు చెప్పారు. అయితే...  ఎంతకీ షూటింగ్‌ మొదలుపెట్టేవారు కాదు. దాంతో ఆగలేక దర్శకుడికి తరచూ ఫోన్లు చేసేవాడిని. ఆయనేమో...  సినిమా అంటూ తీస్తే నన్నే హీరోగా పెట్టుకుంటానని చెప్పేవారు. ఆ సినిమా షూటింగ్‌ మొదలయ్యాక కానీ.. నేను హీరోనవుతున్నాననే నమ్మకం నాకు కలగలేదు. చివరకు ఆ సినిమా ఓటీటీలో విడుదలై.. మంచి గుర్తింపు తెచ్చిందనుకోండీ.  అదే ‘సూఫియుం సుజాతయుం’.


ఎవ్వరికీ చెప్పలేదు

సినిమాలో నటిస్తున్నానని మా ఆఫీసులో ఎవ్వరికీ చెప్పేవాడిని కాదు. అలా దాదాపు రెండేళ్లు రహస్యంగా ఉంచా. అయితే గడ్డం, జుట్టు పెంచుకోవడం మొదలుపెట్టడంతో మా కొలీగ్స్‌కి విషయం అర్థమయ్యేది కాదు. చివరకు సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పుడు కొందరు నన్ను ఆ సినిమాలో హీరోలా ఉన్నావని అంటే... మరికొందరికి విషయం తెలిసింది.


చాలా నేర్చుకున్నా

‘సూఫియుం సుజాతయుం’లో సూఫీ గురువుగా నటించే ముందు ఎంతో సాధన చేశా. వాళ్ల హావభావాలు, సూఫీ ప్రత్యేకమైన నాట్యం, కొద్దిగా అరబిక్‌, ధ్యానం... ఇలా ఎన్నో నేర్చుకున్నా. ఖురాన్‌ నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నా. శాకుంతలం నిర్మాత ఆ సినిమా చూశాకే... నేను దుష్యంతుడి పాత్రకు సరిపోతానన్న నమ్మకంతో నన్ను సంప్రదించారట.


మొదటిరోజే చెప్పా...

తొలి తెలుగు సినిమా... అదీ సమంతతో చేయడమంటే ఆనందమే కానీ... నాకు ఇక్కడి వాతావరణం, తెలుగు భాష అన్నీ కొత్తే. అందుకే మొదటిరోజే సమంతతో- షూటింగ్‌లో ఎలాంటి సందేహాలున్నా అడుగుతానని, నటనలో తన సహకారం కూడా కావాలనీ చెప్పా. షూటింగ్‌ జరిగినన్ని రోజులూ తన నుంచి ఎన్నో విషయాలూ, మెలకువలూ నేర్చుకున్నా.


* ఇష్టమైన ఆహారం బిర్యానీ

* నచ్చే ప్రదేశం ప్రశాంతంగా, మనుషులు తక్కువగా ఉండే ప్రదేశం ఏదయినా నచ్చుతుంది.

* హాబీలు సంగీతం ఎక్కువగా వింటా

* మెచ్చే సినిమా ఫ్యామిలీ డ్రామా సినిమాలను ఎక్కువగా ఇష్టపడతా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..