poorna: వాల్‌పేపర్‌గా బాలకృష్ణ ఫొటో..!
అసలు పేరు షమ్నా కాసిం అయినా తెలుగు ప్రజలకు పూర్ణగా పరిచయం అయిందామె. విభిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ... అభినయంతో ఎందరో అభిమానులను సంపాదించుకుందీ కేరళ కుట్టి. వరస సినిమాలతో పాటు రియాల్టీ షోలూ, వెబ్‌సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. తాజాగా ‘అఖండ’తో మళ్లీ తెలుగు తెరమీద మెరిసిన పూర్ణ తన మనసులోని ముచ్చట్లను పంచుకుంటోందిలా..
మొదటి క్రష్
రోజూ బడికి వెళ్లే మార్గంలో అబ్బాయిల స్కూల్ ఉండేది. వ్యాన్‌లో వెళ్తున్నప్పుడల్లా ఓ అబ్బాయి తన స్కూలు బయట నిల్చొని నన్ను అదేపనిగా చూసేవాడు. అలా ఏడాదిపాటు అతను నన్నూ, నేను అతన్నీ చూసుకున్నాం. చివరకు ప్రేమికుల రోజున అతను నా దగ్గరకు వచ్చి గులాబీలూ, చాక్లెట్లూ ఇచ్చి... ఐలవ్యూ అనేశాడు. కానీ... ఆ తరువాత మళ్లీ కనిపించలేదు. ఏమయ్యాడో తెలియదు.
భోజన ప్రియురాలిని
నియమాలేం లేకుండా అన్నీ ఇష్టంగా తింటా. ముఖ్యంగా స్వీట్లు ఎదురుగా ఉన్నాయంటే అస్సలు ఆగలేను. రోజుకో చాక్లెట్ తినకుండా ఉండలేను. అలాగని రోజూ వ్యాయామాలు కూడా చేయను. డాన్స్ చేస్తానంతే.
పేరు ఎందుకు మారిందంటే...
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తమిళంలో ఓ సినిమా చేశా. ఆ చిత్ర బృందానికి నా పేరు పలకడం కష్టంగా ఉండేది. అది చూసిన దర్శకుడు...పేరు మార్చుకోమని సూచించారు. దాంతో చాలా పేర్లే వెతికా కానీ ఏదీ నచ్చలేదు. సరిగ్గా ఆ సమయంలోనే నా మేనేజర్‌కు పాప పుట్టింది. తనకు పూర్ణ అని పేరు పెట్టడం... నాకూ అదే నచ్చడంతో దానికే ఫిక్సయ్యా.
కొత్త ఉత్సాహం
‘అఖండ’లో బాలకృష్ణ గారితో నటించడం నా అదృష్టం. సెట్లో అంతా అలసి పోయినా ఆయన మాత్రం ఎనర్జెటిక్‌గా ఉండేవారు. అందుకే, అప్పుడప్పుడూ ఆయన ఫొటోను మొబైల్ వాల్‌పేపర్‌గా పెట్టుకుంటా. అది చూడగానే నాలో కొత్త ఉత్సాహం వస్తుంది.
ఒత్తిడికి గురయ్యా
వరసగా పవర్ ప్లే, సుందరి, తలైవి, దృశ్యం-2, అఖండ, బ్యాక్ డోర్ చిత్రాలు విడుదలవడంతో ఒత్తిడికి గురయ్యా.
సంప్రదాయ దుస్తులకే ఓటు
చీరలు, చుడీదార్లే ఇష్టపడతా. మోడ్రన్ దుస్తులు నాకు అంతగా నప్పవు.
ఛానల్ ఉంది...
ఇంట్లో నన్ను ముద్దుగా పిలిచే ‘చిన్నాట్టి’ పేరుతోనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించా.
నా లక్ష్యం సినిమా కాదు
మా స్వస్థలం కేరళ... నాన్నది చేపల వ్యాపారం. అమ్మ గృహిణి. అన్న, ముగ్గురు అక్కల తరువాత నేను. పెద్ద ఉద్యోగం చేయాలనేది నా కల. సినిమా అవకాశాలు రావడంతో బీఏ (ఆంగ్లం)తోనే ఆపేశా.
నచ్చే నటుడు
సల్మాన్‌ఖాన్... చిన్నప్పటి నుంచీ అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకునేదాన్ని. ఒక్క సారైనా దగ్గరనుంచి చూసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. తెలుగులో అయితే విజయ్ దేవరకొండ, ప్రభాస్ ఇష్టం.
‘ఢీ’తోనే తెలుగు నేర్చుకున్నా
నేను ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నానంటే కారణం ఈటీవీ ‘ఢీ’ కార్యక్రమమే. శేఖర్ మాస్టర్, యాంకర్లూ పదాల అర్థాలు ఓపికగా వివరించడంతో భాషను నేర్చుకోగలిగా.
ఇంట్లోవాళ్లు బాధపడ్డారు
‘సీమ టపాకాయ్’ సినిమాలో లిప్‌లాక్ సన్నివేశం ఉంది. అది చూశాక మా అన్నయ్య నటనలో కొన్ని పరిమితులు పెట్టుకోవాలని హెచ్చరించాడు. అప్పటినుంచీ నా సినిమాల వల్ల ఇంట్లో వాళ్లకి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతున్నా
60కి పైగా సినిమాలు
క్లాసికల్ డ్యాన్సర్‌గా చేస్తూ 2004లో మలయాళ సినిమాల్లోకి అడుగుపెట్టా. తెలుగులో తొలి రెండు చిత్రాలతో రాని గుర్తింపు ‘అవును’తో వచ్చింది. ఇప్పటివరకూ మలయాళం, తమిళం, కన్నడం, తెలుగు భాషల్లో కలిపి 60కి పైగా చిత్రాల్లో నటించా.
అదే నా కల...
కుటుంబమంతా కొచ్చిలో స్థిరపడింది. నేనేమో అటూఇటూ తిరుగుతూ... హోటళ్లలో ఉండటం కాస్త ఇబ్బందిగానే ఉంది. అందుకే హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నా.
చీకటంటే భయం
చీకటన్నా, దెయ్యాలన్నా, దొంగలన్నా నాకు ముందునుంచీ చాలా భయం. ‘అవును’ షూటింగ్ పూర్తయిన తరువాత నెల రోజులు సరిగా నిద్ర కూడా పోలేదు.
Advertisement
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్