Updated : 08 Mar 2022 14:51 IST

ఖాళీ దొరికితే వంట చేస్తా!

‘కాలా’తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది హ్యూమా ఖురేషీ. తాజాగా విడుదలైన ‘వలిమై’లో అజిత్‌ సరసన మెరిసిన ఈ అమ్మడు తన కుటుంబం, చదువు, సినిమాల గురించి ఏం చెబుతోందంటే...

పుట్టి పెరిగింది...

మాది దిల్లీ. నాన్నకి అక్కడ సలీమ్‌ పేరుతో పది రెస్టరంట్లు ఉన్నాయి. అమ్మ గృహిణి. నాకు ముగ్గురు అన్నయ్యలు. నేను దిల్లీలోని గార్గి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశా. నాకు చదువుకునే రోజుల్లోనే సినిమాలపైన ఆసక్తి కలిగింది. థియేటర్‌ఆర్టిస్టుగా చేస్తే అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో కాలేజీ రోజుల్లోనే ఆ దిశగా అడుగులేేశా.


తొలి అవకాశం...

థియేటర్‌ ఆర్టిస్టుగా చేస్తూనే ముంబయికి మకాం మార్చా. తరవాత మోడలింగ్‌లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు హిందుస్థాన్‌ యూనీలివర్‌ ఉత్పత్తుల వాణిజ్యప్రకటనల్లో నటించే అవకాశం దొరికింది. కొన్నాళ్లకి ఆమిర్‌ఖాన్‌తో కలిసి శాంసంగ్‌ ప్రకటనలో నటించా. ఆ యాడ్‌ షూటింగ్‌లోనే దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ నా నటన చూసి ‘నీకు తప్పకుండా నా సినిమాలో అవకాశమిస్తా...’ అని చెప్పారు. ఇలా ఎంతో మంది చెబుతుంటారులే అని నేను తేలిగ్గా తీసుకున్నా. కానీ ఆయన మాటిచ్చినట్టే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసీపుర్‌’లో నటించే అవకాశమిచ్చారు. అందులో నా నటన నచ్చడంతో కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లోనూ ఛాన్స్‌ ఇచ్చారు. క్రమంగా ఇతర సినిమా అవకాశాలూ వచ్చాయి.


కాలా ఎలా...

తమిళ హీరో ధనుష్‌ నాకు మంచి స్నేహితుడు. తరచూ మాట్లాడుతూ ఉంటాడు. ఒకరోజు ఫోన్‌ చేసి ‘‘నువ్వు ఉన్నపళంగా చెన్నైకి రావాలి. ‘కాలా’లో నటిస్తున్నావ్‌ అంతే...’’ అన్నాడు. తనే హీరోనేమో అనుకుని చెన్నై వెళ్లి కలిశా. అప్పుడు తెలిసింది ఆ సినిమాకి ధనుష్‌ నిర్మాతనీ,  రజినీ కాంత్‌ హీరో అనీ. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషమనిపించింది. సెట్‌లో ఎప్పుడూ నవ్వుతూ చాలా ప్రశాంతంగా ఉండేవారు. ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ చెబుతుండేవారు. షూటింగ్‌ మధ్యలో డైలాగులు ప్రాక్టీసు చేస్తుంటే ‘ఇది సినిమా, పబ్లిక్‌ పరీక్ష కాదు’ అనేవారు రజినీ. ఇక, ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకీ చేరువయ్యాను.


వలిమై గురించి...

తమిళంలో నా అభిమాన నటుల్లో అజిత్‌ ముందుంటారు. ఆయన సినిమాలు చాలానే చూశా. ‘కాలా’లో నా నటన నచ్చడంతో ‘వలిమె’iలో అవకాశమిచ్చారు. అందులో నాది పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర. అజిత్‌తో కలిసి నేర పరిశోధన చేస్తుంటా. రాత్రిపూటే షూటింగ్‌ జరిగింది. కొన్ని సీన్లలో లారీ కూడా నడపాల్సి వచ్చింది. అప్పటి వరకూ లారీ నడిపింది లేదు, కానీ అచ్చం కారు డ్రైవింగ్‌లాగే అని దర్శకుడు ధైర్యం చెప్పడంతో స్టీరింగ్‌ పట్టుకున్నా. ఆ సమయంలో చాలా భయమేసింది. కాసేపు నడిపాక మామూలయ్యా.


ఖాళీగా ఉంటే...

నాకు వంటంటే ఇష్టం. నాన్నకు రెస్టరంట్లు ఉండటం వల్లనేమో వంట మీద ఆసక్తి కలిగింది. షూటింగ్‌ లేనప్పుడు ఇంట్లో ఉంటే అమ్మతో కలిసి ఏదో ఒక ప్రయోగం చేస్తుంటా. అలానే పుస్తకం పట్టుకున్నానంటే ఎన్ని గంటలైనా దాన్ని వదిలిపెట్టాలనిపించదు. బాస్కెట్‌బాల్‌ బాగా ఆడతా. చదువుకునే రోజుల నుంచీ అలవాటుంది. దూర ప్రయాణాలు చేయడం బాగా ఇష్టం.


ఇష్టమైన ఆహారం...

నాకు హైదరాబాదీ బిర్యానీ, హలీమ్‌, సుషీ, షామీ కబాబ్‌, మలై టిక్కా చాలా ఇష్టం. అవి కనిపించాయంటే డైటింగ్‌ను కూడా పక్కన పెట్టేసి కడుపునిండా తినేస్తా. రంజాన్‌ సమయంలో అయితే నా ఫ్రెండ్స్‌ చాలామంది హలీమ్‌ పంపుతుంటారు.  హలీమ్‌ అంటే హైదరాబాద్‌లో చేసిందే తినాలి. మరే ప్రాంతంలో చేసింది తిన్నా తిన్నట్టే ఉండదు.
Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts