పందెం కోడి... పండక్కి రెడీ..!

సంక్రాంతి వచ్చిందంటే చాలు... సందడే సందడి... మట్టివాసన పిలుస్తోందని కొందరూ ఊరికి తిరిగిచ్చేద్దామని మరికొందరూ పండుగ సరదాలకోసం ఇంకొందరూ సూట్‌కేసులు సర్దుకుని సొంతూరికి చేరుకుంటారు.

Published : 14 Jan 2023 23:55 IST

పందెం కోడి... పండక్కి రెడీ..!

సంక్రాంతి వచ్చిందంటే చాలు... సందడే సందడి... మట్టివాసన పిలుస్తోందని కొందరూ ఊరికి తిరిగిచ్చేద్దామని మరికొందరూ పండుగ సరదాలకోసం ఇంకొందరూ సూట్‌కేసులు సర్దుకుని సొంతూరికి చేరుకుంటారు. ఆ సరదాల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా ఎక్కువమందిని ఆకర్షించే సంప్రదాయ వేడుకే కోడిపందేలు. అందుకే ‘అవి లేకుండా పండుగేంటీ...’ అనుకుంటూ పందెంకోళ్లతో రెడీ అయిపోతుంటారు పందేలరాయుళ్లు. వాటిల్లోని ఆ కిక్కేంటో ఓ లుక్కేస్తే..!

సంక్రాంతి దగ్గర పడుతుంటే... పందేలరాయుళ్లు బెట్టింగులకు రెడీ అవుతుంటే, కోడిపుంజులు కయ్యానికి కాలుదువ్వుతుంటాయి. శిక్షణ శిబిరాల్లో నిరంతర సాధనతో రాటుదేలుతూ చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంటాయి.

‘అదిగో వస్తోంది... రాఖీ... ఆ కళ్లు చూశారా... ఎంత తీక్షణంగా ఉన్నాయో... ఎలాంటి పుంజునయినా సరే... పది నిమిషాల్లో పడగొట్టేస్తుంది...’

‘నా పందెం... వంద... వెయ్యి... పది వేలు...’ ఇలా సాగుతుంటాయి ఊళ్లలోని కోడిపందేలు... పుంజుల్ని తీసుకొచ్చినవాళ్లకన్నా చూడ్డానికి వచ్చినవాళ్లు కాసే పందేలే వందరెట్లు ఎక్కువట. అందుకే సంక్రాంతి సీజన్‌లో రెండు లక్షల పుంజులు బరిలోకి దిగుతాయనీ గోదావరి జిల్లాల్లోనే సుమారు రూ.1200 కోట్లు చేతులు మారతాయనేది ఓ అంచనా. నిషేధం ఉన్నా అధికారులు హెచ్చరిస్తున్నా పందేల జోరు సాగుతూనే ఉంది. ఐపీఎల్‌ వేలం పాటల్లా పందెం బరుల కోసం లక్షల్లో అగ్రిమెంట్లు జరుగుతున్నాయట. అయితే తెలుగునాట గోదావరి జిల్లాల్లోనే ఈ సరదా ఎక్కువ. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈమధ్య పెరిగింది. చిత్తూరు, నెల్లూరు, ఉత్తరాంధ్రలోనూ వేస్తుంటారు. కానీ భీమవరం, పాలకొల్లు, నరసాపురం, గణపవరం, వీరవాసరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, భీమడోలుతోపాటు కోనసీమలోని ఊళ్లన్నీ పండగ రోజుల్లో జాతరను తలపిస్తాయి. అక్కడి పందేలు చూడ్డానికి పొరుగు రాష్ట్రాలనుంచే కాక ఎన్నారైలూ రావడం విశేషం!


పలనాటి పౌరుషం!

కోడిపందేలు ఈనాటివి కావు. సుమారు ఆరువేల ఏళ్ల క్రితమే పర్షియన్లు వేసినట్లు తెలుస్తోంది. పూర్వం తినడానికి కాకుండా పోటీలకోసమే కోళ్లను పెంచేవారట. అడవికోళ్లూ ఇంటికోళ్ల మధ్య పోరాటాలు... ప్రాచీన కాలంలో వినోదంగా ఉండేవి. అప్పట్లో ఆంధ్ర క్షత్రియులు తమ పౌరుషాన్ని చాటుకునేందుకు కుక్కుట శాస్త్రాన్ని ఆచరిస్తూ కోడి పందేలు నిర్వహించేవారట. నాయకురాలు నాగమ్మ కోడిపందేల్లో బ్రహ్మనాయుడుని ఓడించడమే పల్నాటి యుద్ధానికి దారితీసింది. అదేవిధంగా బొబ్బిలి, విజయనగర రాజులు వేసిన పోటీలో బొబ్బిలి పుంజు గెలవడంతో విజయనగరరాజుల అహం దెబ్బతింది. అదే బొబ్బిలి యుద్ధానికి కారణమైంది. యుద్ధాల సంగతెలా ఉన్నా అప్పట్లో ఇదో సంప్రదాయ సంబరం. అనేక దేశాల్లోనూ మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనూ కోడిపందేలు జరిగేవి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, బెంగాల్‌ల్లో ఇప్పటికీ జరుగుతున్నాయి. 1960లో ఈ పందేలపైన పూర్తి నిషేధం విధించినప్పటికీ 2018లో కోళ్లకు కత్తులు కట్టకుండా సంప్రదాయ వేడుకగా నిర్వహించుకోమని సుప్రీంకోర్టు చెప్పడంతో పందేల హోరు ఈమధ్య ఇంకాస్త
పెరిగిందని చెప్పాలి.


ఏది... పందెం కోడి!

పౌరుషానికి ప్రతిరూపాలే పందెం కోళ్లు... కత్తి కట్టి బరిలోకి దించితే యజమానికోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంది. తగ్గేదేలే... అంటూ సమరానికి సై అంటుంది. కాలు విరిగినా మెడమీద గాయమైనా బరిలోకి దిగిన పుంజు వెనుతిరగదు. నువ్వా నేనా అన్నట్లుగా శత్రువుమీద పోరాడుతుంది. అయితే అన్నిపుంజులూ అదే పోరాట పటిమను చూపిస్తాయని చెప్పలేం. అందుకే ఏరికోరి కొన్నింటినే పందేలకు రెడీ చేస్తారు. ఈకల రంగుల్ని బట్టి కాకి, డేగ, నెమలి, కొక్కిరాయి, శేహువ... అంటూ పుంజు రకాల్ని గుర్తించి మరీ పెంచుతారు.


పుంజు వైభోగం!

పోటీకి వెళ్లే పందెం కోడిని పెంచడమంటే అల్లాటప్పా విషయం కాదు. చాలా తెలుసుండాలి అంటారు పెంపకందారులు. ఆహారంలో ఎంతో శ్రద్ధ తీసుకోవాలట. గంట్లు, రాగులు, మెరికల్ని మేతగా వేయడంతోపాటు గుడ్డు, కీమా, బాదం పెడతారు. రెండు రోజులకోసారి కిస్‌మిస్‌లు, దానిమ్మ గింజలు, ఖర్జూరం ఇస్తారు. క్యారట్‌, తోటకూర, కొత్తిమీర ఉడికించి మరీ తినిపిస్తారు. డ్రైఫ్రూట్‌ లడ్డూలు కూడా ఇస్తారట. అయితే ఏది పెట్టినా ఓ లెక్క ఉంటుంది. వైద్య పరీక్షలూ బలానికి బి-కాంప్లెక్స్‌ ట్యాబ్లెట్లూ, ఇన్ఫెక్షన్లు రాకుండా వ్యాక్సిన్లూ, జ్వరాలకు యాంటీబయోటిక్‌లూ షరా మామూలే.

వీటికిచ్చే శిక్షణ గురించి చెప్పమంటే ‘అయ్యబాబోయ్‌... అంత ఈజీ కాదండోయ్‌’ అనేస్తారు గోదారోళ్లు. రెండు నెలల వయసున్నప్పటి నుంచే పుంజులకు శిక్షణ మొదలుపెట్టి 16-18 నెలలు వచ్చాక పోటీకి దించుతారు. శిక్షణ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7వరకూ కొనసాగుతుందట. ముందుగా గొంతులో నీళ్లు పోసి, కఫం పోయేలా కళ్లి కొట్టడం, నోట్లో నీరు పోసుకుని ఊదడం చేస్తారట. పెనంమీద నీరు చల్లి, వచ్చే ఆవిరిని బట్టతో కోడి శరీరానికి అద్దుతారట. దీనివల్ల కొవ్వు పేరుకోదట. ఇక, ఒళ్లు గట్టిపడి, కత్తిపోట్లు తట్టుకునేందుకు- పసుపు, పిప్పళ్లు, వట్టివేర్లు, ఉక్కిసాయిలం, యూకలిప్టస్‌, కుంకుళ్లు... ఇలా 20 రకాల ఆకులతో మరిగించిన నీటితో కడుగుతారట. దీన్నే నీటిపోతలు అంటారు. బరిలో అలసిపోకుండా ఉండేందుకు రోజూ వ్యాయామం, 2-4 నిమిషాలపాటు ఇసుకలో నడక, ఈత కొట్టించడం, రెండుపూటలా మసాజ్‌ తప్పనిసరి. అప్పుడే అది బరిలో ఆవేశపడకుండా పోరాడుతుందట. తరచూ వేరే కోళ్లతో పందేలు వేసి ఎలా పోరాడుతుందో పరీక్షిస్తుంటారట. శిక్షణ పూర్తిచేసుకున్న పందెం కోడి ధర 10 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు పలుకుతుంది.


ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు

కోడిపందేలకున్న క్రేజును చూసి కొందరు టెకీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే మేలుజాతి పుంజుల్ని బ్రీడ్‌ చేసి పెంచడం ఖరీదుతో కూడుకున్న వ్యాపారమే అంటున్నారు. ఎందుకంటే రెండు కోళ్లూ, ఒక పుంజూ ఉన్న బ్రీడింగ్‌ కిట్‌ల ధర మూడున్నర లక్షల పైనే. అయినప్పటికీ ఐటీ ఉద్యోగాల్ని సైతం వీడి ఈ వ్యాపారంలోకి వచ్చి ప్రత్యేకంగా స్థలం లీజుకు తీసుకుని మరీ పెంచుతున్నారట. 20 నుంచి 200 వరకూ పుంజులను పెంచి ఆన్‌లైన్‌లోనూ అమ్ముతున్నారు. ఒక్కో పుంజుమీదా పది వేల నుంచి ముప్ఫై వేలు ఖర్చుపెడుతున్నారట. పుంజు ఆహారానికే రోజుకి రూ.200 ఖర్చు అవుతుందట. కాబట్టి పందెం వేయాలనుకునేవాళ్లు అడ్వాన్స్‌ ఇచ్చి బుక్‌ చేసుకుని పందెం రోజున మొత్తం సొమ్ము ఇచ్చి దాన్ని తీసుకెళతారట.


ఒక్కోటీ ఒక్కో ధర!

పుంజు రకాన్ని బట్టి ధర ఉంటుంది. సేతువా జాతికి చెందిన పుంజయితే లక్ష వరకూ పలుకుతుంది. నెమలి-60, పర్ల-50, ఎర్రకెక్కిరాయి- 40, కాగిడేగ- 30 వేల రూపాయలు ఉంటాయట. ఇంకా రసంగి, కెక్కరి, పూల, అబ్రాసు, పండుడేగ, మైలా, సింగాలి, పెట్టమారు, పింగళి రకాలన్నీ రూ.30 వేలలోనే వస్తాయి. కొన్నిసార్లు పుంజు సామర్థ్యం, పోరాట పటిమను బట్టి కూడా ఎక్కువ ధర పెడుతుంటారు. గత మూడేళ్లుగా పెరూవియన్‌ జాతినీ తెచ్చి పెంచుతున్నారు. వీటికి వేగం ఎక్కువ. అయితే సైజు చిన్నగా ఉండటంతో వీటిని స్వదేశీ వాటితో సంకరీకరించి రెండు, మూడో తరంలోని వాటిని పందేలకు సిద్ధం చేస్తున్నారు.


శిక్షణ కేంద్రాలు!

పందెం వేయాలనే కోరికున్నా వాటికి సరైన శిక్షణ ఇవ్వలేం అనుకున్నవాళ్లకోసం ఆచంట, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం,
పెదవేగి, భీమవరం, పోడూరు, పోలవరం... ఇలా చాలాచోట్ల శిక్షణ కేంద్రాలూ ఉన్నాయి. ఒక్క ప.గో.లోనే వందకు పైగా ఉన్నాయట. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా చేపల చెరువుల సమీపంలో కోళ్ల దొడ్లను నిర్వహిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 150 వరకూ పుంజులు ఉంటాయి. రావులపాలెంలో అయితే శిక్షకుల్ని కోల్‌కతా నుంచి తీసుకొస్తున్నారు. కొందరైతే హైదరాబాద్‌లోని బార్కాస్‌లో పహిల్వాన్ల వద్దే కొని అక్కడే శిక్షణ ఇప్పిస్తారట. శిక్షకులకు నెలకు 15 నుంచి 25 వేల జీతం ఉంటుంది. ఈ కేంద్రాల్లో బ్రీడ్‌లమీదా ప్రయోగాలు చేస్తున్నారట. థాయ్‌లాండ్‌, పెరూ దేశాలనుంచే కాక తమిళనాడులోని సేలం, కోయంబత్తూరుల నుంచీ రకాలను తీసుకొచ్చి వాటిని గెలిచిన పుంజులతో సంకరీకరించి బలమైన కొత్త రకాలను సృష్టిస్తున్నారు.


పందేలకు మారుపేరు!

టుసైని... హరియాణాలోని మెవాత్‌ జిల్లాలో ఉందీ ఊరు. నెలలోని చివరి ఆదివారం వచ్చిందంటే చాలు... జనాలతో నిండిపోతుంది. ఆ రోజు చుట్టుపక్కలవాళ్లే కాదు ఇతర రాష్ట్రాలవాళ్లూ ఆ ఊళ్లో కనిపిస్తారు. అక్కడ వేసే కోడిపందేల్లో కాయ్‌ రాజ్‌ కాయ్‌... అంటూ వంద నుంచి రెండు లక్షల రూపాయల వరకూ పందేలు కాసేస్తుంటారు. అందుకే ఆ గ్రామంలోని వాళ్లంతా ఈ పోటీలకోసం రంగం సిద్ధం చేసే పనిలోనే బిజీగా ఉంటారట. ఆడవాళ్లు పుంజులకు ఆహారం సిద్ధం చేస్తూ అబ్బాయిలు వాటికి శిక్షణ ఇస్తూ కనిపిస్తుంటారు. పోటీ రోజున మాత్రం మగవాళ్లంతా పందెంరాయుళ్లకి గైడ్‌లుగా మారిపోతారు. మొదట్లో పండగ రోజుల్లోనే వీటిని నిర్వహించినా ఆదరణ గమనించి ఏడాదిపొడవునా వేయసాగారట. కొన్నాళ్లకు ఇది ఐపీఎల్‌ను మించిపోయినా ఆశ్చర్యం లేదు అంటూ సమర్థించుకుంటున్నారా ఊరి ప్రజలు.


కుక్కుట శాస్త్రం!

పందెం కోడి పుంజులకోసం రాసిన పంచాంగమే కుక్కుటశాస్త్రం. కోడిపుంజుల వర్గీకరణ, జన్మనక్షత్రం, జాతకం, పందెం ఎప్పుడు వేయాలీ ... అన్నీ అందులో ఉంటాయి. కోళ్ల రక్తప్రసరణపై గ్రహ ప్రభావం ఉంటుందనీ; వారాలూ, పక్షాలను బట్టి కొన్ని జాతుల పుంజుల జీర్ణశక్తి మందగిస్తుందనీ శాస్త్రం చెబుతుంది. ఆ సమయంలో కోడిని దింపితే ఓడిపోతుందట. శుక్లపక్షంలో ఆదివారం పింగళి రకానికీ; కృష్ణపక్షంలో సోమవారంనాడు నెమలికి జీర్ణశక్తి లోపిస్తుందట. పందెం కట్టేవాళ్లు ఇంటికి బరి ఏ దిక్కున ఉందో చూసుకోవడంతోపాటు పేరులోని మొదటి అక్షరాన్నిబట్టీ దిక్కుని నిర్ణయించుకుంటారు. అశ్వినీ నక్షత్ర సమయంలో నెమలి, డేగ పుంజులమీద కాకి గెలుస్తుందట. అందుకే... పందెంరాయుళ్లు... కుక్కుటశాస్త్రాన్ని ఔపోసనపట్టి ఆ ఏడాది ఏ కోడి కొడుతుందో చూసుకునిగానీ బరిలోకి దిగరు. పందెం కాసేవాళ్లూ అంతే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..