Arshdeep singh: ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగా...
ఎడమచేతి బౌలింగ్.. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం. యార్కర్లే కాదు, స్లో బంతినీ వేయగల నైపుణ్యం. ఆరడుగులపైనే ఎత్తు కావడంతో సులభంగా బౌన్సర్లు సంధించగల సత్తా... తన అమ్ములపొదిలో ఇన్ని ఆయుధాలున్నాయి కాబట్టే టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు అర్ష్‌దీప్ సింగ్.
Arshdeep singh: ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగా...
ఎడమచేతి బౌలింగ్.. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం. యార్కర్లే కాదు, స్లో బంతినీ వేయగల నైపుణ్యం. ఆరడుగులపైనే ఎత్తు కావడంతో సులభంగా బౌన్సర్లు సంధించగల సత్తా... తన అమ్ములపొదిలో ఇన్ని ఆయుధాలున్నాయి కాబట్టే టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు అర్ష్‌దీప్ సింగ్. స్వల్ప వ్యవధిలోనే టీమిండియాలో కీలక ఆటగాడైపోయాడు.
తండ్రి ప్రోత్సాహంతో..
నాన్న దర్శన్‌సింగ్, రిటైర్డ్ సీఐఎస్‌ఎఫ్ జవాన్. అమ్మ బల్జీత్‌కౌర్ గృహిణి. అన్నయ్య అక్ష్‌దీప్, చెల్లెలు గర్లీన్. చండీగఢ్‌లో స్థిరపడ్డారు. దర్శన్ ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తూ.. ఇప్పటికీ క్లబ్ క్రికెట్ ఆడతారు. ఓరోజు పిల్లలతో సరదాగా గ్రౌండ్‌కి వెళ్లినప్పుడు ఎనిమిదేళ్ల అర్ష్ బౌలింగ్ ప్రతిభని గుర్తించి అతణ్ని క్రికెటర్‌గా చూడాలనుకున్నారు. ముగ్గురు పిల్లల భవిష్యత్తు గురించీ ఆలోచించి శిక్షణ సంస్థలో చేర్చలేక మొదట తనే ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించారు.
సైకిల్‌పైనే అకాడమీకి
అక్ష్ పైచదువులకు కెనడా వెళ్లి పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ తండ్రిపైన ఆధారపడకుండా ఉండటంతో అర్ష్‌కి ఆర్థికంగా అండగా నిలిచే అవకాశం దర్శన్‌కు వచ్చింది. 13 ఏళ్లప్పుడు ఎస్డీ స్కూల్ గ్రౌండ్స్‌లో రంజీ మాజీ ఆటగాడు జశ్వంత్ రాయ్ దగ్గర శిక్షణకు చేర్పించారు. అకాడమీకి రానూపోనూ 20కి.మీ.సైకిల్‌పైన రోజూ రెండుసార్లు వెళ్లొచ్చేవాడు. ఓసారి సైకిల్ రిపేరైతే అంత దూరం నడిచే వెళ్లాడు. చెల్లి, కోచ్.. వీళ్లిద్దరూ ఏం అడిగినా, ఏం చెప్పినా.. అభ్యంతరం చెప్పడు అర్ష్. జశ్వంత్ శిష్యరికంలో కఠోర శ్రమతో తనను నిత్యం మెరుగుపర్చుకుంటూ పంజాబ్ జట్టులో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.
ఒకే ఒక్క ఛాన్స్
అండర్-16లో ఉన్నప్పుడు ఓ ఏడాది రాష్ట్ర జట్టుకి ఆడాడు. తర్వాత సంవత్సరం ఎంపికలేదు. ఇక క్రికెట్లో రాణించడం కష్టమేనని అర్ష్‌నీ కెనడా పంపించేద్దామనుకుని.. ఆ మాట కోచ్‌కీ అర్ష్‌కీ చెప్పారు దర్శన్. ‘ఒక్క ఛాన్స్- అంటే, ఏడాది సమయం- ఇవ్వండి. అప్పటికీ రాష్ట్ర జట్టులో స్థానం దొరక్కపోతే కెనడా వెళ్లడానికి సిద్ధమే’ అని చెప్పాడు అర్ష్.. తర్వాత ఎప్పుడూ వారి మధ్య ఆ ప్రస్తావనే రాలేదు.
పంజాబ్ కింగ్స్‌లో చోటు
2018లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2019లో ఐపీఎల్ పంజాబ్ జట్టుకి ఎంపికయ్యాడు. అప్పట్నుంచీ ఆ జట్టు తరఫున ఆడుతున్నాడు. గత సీజన్లో రూ.4 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఇతణ్ని దక్కించుకుంది. సీనియర్లు ఉన్నా.. అక్కడ తనే బౌలింగ్ లీడ్. మరోవైపు ఈ ఏడాది రంజీల్లో పంజాబ్‌ను క్వార్టర్స్‌కు చేర్చడంలోనూ కీలక పాత్ర పోషించాడు.
అన్నీ తింటా
పంజాబీ కుటుంబంలో డైట్‌ని పాటించడం కష్టమంటూ, ఇంటి దగ్గర అన్ని రకాల వంటకాలూ తినేస్తాననీ చెబుతాడు అర్ష్. ఫిట్‌నెస్ కోసం రోజూ ఎనిమిది గంటలు నిద్రపోవడం, ఎక్కువగా నీళ్లు తాగడం, క్రమం తప్పని వ్యాయామం.. ఈ నియమాలు పాటిస్తాడు.
ఒత్తిడి తెలీదు
తనకు ఛాలెంజ్‌లూ, ఒత్తిళ్లూ ఉండవనీ కేవలం గేమ్‌ని ఎంజాయ్ చేస్తూ మిగతావన్నీ మర్చిపోతాననీ చెప్పే అర్ష్‌దీప్.. ఖాళీ దొరికితే పంజాబీ పాటలు వింటాడు. ఇంగ్లిష్‌లో కవితలు రాస్తాడు. ‘మ్యాచ్ ఫలితం గురించి అతిగా ఆలోచించను. ఆటను ఆస్వాదించాలని చూస్తా’నని చెబుతాడు.
ఆరంభం అదిరింది
టీమిండియాకు నెట్ బౌలర్‌గా 2021 శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు. 2022 ఐపీఎల్‌లో చివరి మ్యాచ్ ఉండగానే స్వదేశంలో జూన్లో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌కి ఎంపికయ్యాడు. 2022 జులై ఇంగ్లాండ్ పర్యటనలో మొదటి మ్యాచ్ ఆడాడు. జులన్ గోస్వామి, అజిత్ అగార్కర్‌ల తర్వాత టీ20ల్లో మొదటి ఓవర్ మెయిడెన్ వేసిన మూడో భారతీయ బౌలర్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. 19,550 ఎగువన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె