అతనిలా బ్యాటింగ్‌ చేయలేకపోయా!

మైదానంలో మాంచి జోరుమీదున్నోడు... ఫ్యాషన్‌పై పట్టున్నోడు... ఐపీఎల్‌ 15వ సీజన్‌ విజేతగా నిలిచినోడు... క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య. తనదైన బ్యాటింగ్‌తో క్రికెట్‌ అభిమానుల మనసుదోచుకున్న హార్దిక్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలు కొన్ని...

Updated : 26 Jun 2022 11:13 IST

అతనిలా బ్యాటింగ్‌ చేయలేకపోయా!


మైదానంలో మాంచి జోరుమీదున్నోడు... ఫ్యాషన్‌పై పట్టున్నోడు... ఐపీఎల్‌ 15వ సీజన్‌ విజేతగా నిలిచినోడు... క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య. తనదైన బ్యాటింగ్‌తో క్రికెట్‌ అభిమానుల మనసుదోచుకున్న హార్దిక్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలు కొన్ని...

ఎక్కువగా కొనేవి కార్లూ, వాచీలంటే ఎంతిష్టమో. నా దగ్గర అత్యంత ఖరీదైన మెర్సిడెజ్‌ జీ63 ఏఎమ్‌జీ, రేంజ్‌రోవర్‌, లాంబోర్గిని కార్లున్నాయి. ఒకసారి దుబాయ్‌ వెళ్లినప్పుడు వాచీల మీద ఇష్టంతో కోటి రూపాయల విలువ చేసే రోలెక్స్‌ వాచీని కొన్నా. ఇండియాకి తిరిగొచ్చేప్పుడు ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు ఆ వాచీని చూసి నన్ను ఆపేశారు. దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తేనేగానీ వదల్లేదు.    


ఒత్తిడి అనిపిస్తే

గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని హోమ్‌థియేటర్‌లో సినిమా చూస్తా. ఆ సమయంలో ఓ పెద్ద గిన్నె నిండా పాప్‌కార్న్‌ నింపుకుని సినిమా చూస్తున్నంత సేపూ నోరాడిస్తుంటా. అలా చేయడం వల్ల ఒత్తిడి దూరమై మనసు తేలికపడుతుంది. చిన్నప్పట్నుంచీ ఇలానే చేస్తుంటా.  


బాధ కలిగించేది

నా జీవితం మైదానంలోనే ఎక్కువ గడిచింది. స్నేహితులంతా కాలేజీ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తుంది. క్రికెట్‌ మీదున్న ఇష్టంతో తొమ్మిదో తరగతి మధ్యలోనే చదువు మానేసి ఆటే ధ్యాసగా బతికాను. అప్పటి నుంచీ తాజాగా ఐపీఎల్‌ 15వ సీజన్‌ విజేతగా కప్పును అందుకునే వరకూ నేను సాధించిన విజయాలన్నీ గర్వంగా అనిపిస్తాయి కానీ, పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాలకోసం ఎదురు చూసే సందర్భాన్నీ, కాలేజీ రోజుల్నీ మిస్‌ అవ్వడం నాకు ఎప్పటికీ లోటే!


అభిమాన క్రికెటర్‌

నాకు చిన్నతనం నుంచీ క్రికెట్‌ అంటే పిచ్చి. ముంబయికి చెందిన మాజీ ఓపెనర్‌, 2000-2008 మధ్య కాలంలో భారత క్రికెట్‌ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన వసీం జాఫర్‌ నా అభిమాన క్రికెటర్‌. వసీం బ్యాటింగ్‌ స్టైల్‌ నాకెంతో నచ్చుతుంది. మైదానంలో అతను బ్యాటింగ్‌ చేస్తుంటే అలా చూస్తుండిపోయేవాణ్ని. క్రికెటర్ని అయ్యాక అతడిలా బ్యాటింగ్‌ చేయడానికి ఎన్నో సార్లు ప్రయత్నించి విఫలమయ్యా. ఏదో ఒకరోజు ఆ స్టైల్‌ని తప్పకుండా కాపీ చేస్తా.  


  క్రష్‌

దీపికా పదుకొణెకి వీరాభిమానిని. తన సినిమాలన్నీ తప్పకుండా చూస్తా. ఒక్కమాటలో చెప్పాలంటే తనే నా ఫస్ట్‌ క్రష్‌. అలానే అక్షయ్‌కుమార్‌ సినిమాలు కూడా బాగా నచ్చుతాయి. ఆయన నటించిన ‘రోబో-2’లో పక్షిరాజు పాత్ర నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. హాలీవుడ్‌ హీరో విల్‌స్మిత్‌ నటించిన ‘ది పర్స్యూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ మూవీ.


ప్రేమా పెళ్లీ

నా భార్య నటాషాది సెర్బియా. ‘సత్యాగ్రహ’ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌తోపాటు కొన్ని వెబ్‌సిరీస్‌ చేసింది. హిందీ ‘బిగ్‌బాస్‌-8’లోనూ పాల్గొంది. ఓ పార్టీలో మొదటిసారి ఆమెని చూడగానే ప్రేమలో పడిపోయాను. నేను క్రికెటర్ని అని అప్పటికి తనకి తెలియదు. కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా పరిచయం చేసుకుని చాలా తక్కువ సమయంలోనే తన మనసు గెలుచుకున్నా. లాక్‌డౌన్‌ సమయంలో పెళ్లి చేసుకున్నాం. మాకో అబ్బాయి. వాడి పేరు అగస్త్య పాండ్య. ఇంట్లో ఉంటే వాడి పనులన్నీ నేనే చేస్తుంటా.    


తినేవి

పండ్ల రసంతో నా దినచర్య మొదలుపెడతాను. తరవాత కిస్‌మిస్‌, బాదం, ఉడికించిన గుడ్లు- చికెన్‌- కూరగాయలు తీసుకుంటాను. మధ్యాహ్నం సూప్‌, సలాడ్‌, పప్పన్నం, పెరుగు తింటాను. పనీర్‌ లేదా చికెన్‌తో చేసిన ఏదో ఒక వెరైటీ డిన్నర్‌లో ఉండాల్సిందే. ఇష్టంగా తినేవంటే...ఫలుదా, గుజరాతీ కిచిడీ, క్రిస్పీ మష్రూమ్స్‌. డైటింగ్‌ వల్ల అవన్నీ పక్కన పెట్టాల్సి వస్తోంది. ఏవైనా పండగలూ ప్రత్యేక సందర్భాలప్పుడే వాటిని తింటా.


పిజా, బర్గర్‌... చిన్నగా, చటుక్కున తినేసేలా!

పిల్లలైనా, పెద్దవాళ్లైనా సరే... బర్గర్‌ను జాగ్రత్తగా పట్టుకుని తినకపోతే అందులోని కూరగాయ ముక్కలన్నీ కిందపడిపోవడం ఖాయం. నలుగురి కోసం ఓ లార్జ్‌ పిజా ఆర్డరిచ్చుకున్నాక అన్ని ముక్కలు తినలేకపోతే వృథా అవుతుంది. ఎగ్‌లేదా కర్రీపఫ్‌ తినాలనుకుంటే.. పఫ్‌పైన ఉన్న పొరలన్నీ విడిపోతుంటాయి. పాకశాస్త్ర నిపుణులు ఇవన్నీ గుర్తించే ఇప్పుడు వాటన్నింటినీ మినీ-బైట్‌ సైజ్‌ రూపంలో వీలైనంత చిన్నగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఫుడ్‌ట్రెండ్‌ ఇదే మరి.

వేడుకలకు వెళ్లినప్పుడు విందుకు ముందు... మంచూరియా, టిక్కా వంటివాటికి టూత్‌పిక్స్‌ గుచ్చి అతిథుల దగ్గరకే తీసుకురావడం... వాటిని చటుక్కున తినేసి టూత్‌పిక్‌ను పక్కన పెట్టేయడం చాలామందికి అనుభవమే. ప్లేటు, ఫోర్కుతో పనిలేకుండా, చేతికి మసాలా అంటుకోకుండా ఇట్టే తినేయాలనే వాటిని అలా టూత్‌పిక్స్‌కు గుచ్చి ఇస్తుంటారు. ఆ తరహాలోనే ఇప్పుడు పిజా, బర్గర్‌, శాండ్‌విచ్‌, వెజ్‌పఫ్‌ వంటివీ తయారు చేస్తున్నారు. అంటే... ఎలాంటి అసౌకర్యం లేకుండా తినేలా చిన్నచిన్న సైజుల్లో ఉండటమే వీటి ప్రత్యేకత. అందుకే వీటిని మినీ- బైట్‌సైజ్‌ ఫుడ్‌ అంటున్నారు. నిజానికి మినీపుడ్‌ అనేది ఎప్పటినుంచో ఉన్నదే. పిల్లలు ఎలాంటి పేచీ పెట్టకుండా తినాలనే ఆలోచనతో ఇడ్లీలను బటన్‌ ఇడ్లీల పేరుతో వేయడం... దోశ, చపాతీ, ఊతప్పం వంటివి వీలైనంత చిన్నగా చేయడం ఇళ్లల్లో తల్లులు చేసేదే. ఇప్పుడు వాటి పక్కన బర్గర్‌, పిజా వంటివి చేరాయి.

ఎలా చేస్తారంటే...

సాధారణంగా ఒక పిజాను స్మాల్‌, మీడియం, లార్జ్‌ పద్ధతిలో చేస్తారు. సైజును బట్టి... నాలుగు నుంచి ఎనిమిది లేదా పది వరకూ కాస్త పెద్ద ముక్కలు వస్తాయి. బర్గర్‌ కూడా అంతే. రెండు పెద్ద బన్నుల మధ్యలో వెజ్‌ లేదా నాన్‌వెజ్‌తో చేసిన పాటీతోపాటు కీరదోశ, టొమాటో, ఉల్లిపాయముక్కలు, చీజ్‌స్లైస్‌, సలాడ్‌ఆకులు అంటూ బోలెడు పెడతారు. శాండ్‌విచ్‌ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. వాటన్నింటినే వీలైనంత చిన్న సైజుల్లో చేసి తినేందుకు వీలుగా టూత్‌పిక్‌ను గుచ్చి ఇవ్వడమే ఈ మినీ ఫుడ్‌ ప్రత్యేకత. ఉదాహరణకు పిజాను తీసుకుంటే... ఇందుకోసం పిండిని ఓ బిస్కెట్‌ పరిమాణంలో చేసి దానిపైనే ఇతర పదార్థాలన్నీ వేసి బేక్‌ చేస్తారు. శాండ్‌విచ్‌ కూడా అంతే. బ్రెడ్‌స్లైసుల్ని నాలుగు ముక్కల్లా కోసి వాటి మధ్యలో స్టఫింగ్‌ చేస్తారు. ఐస్‌క్రీమ్‌ కోసం... చిన్న సైజుల్లో కోన్‌లు తయారుచేసి.. వాటిల్లోనే ఐస్‌క్రీమ్‌ను పెట్టి ఇస్తారు. ఇలా తయారుచేసే మినీఫుడ్స్‌ వల్ల లాభాలు లేకపోలేదు. ఎలాగంటే... స్నేహితులతో కలిసి సరదాగా బేకరీకి వెళ్లి బర్గర్‌
ఆర్డరిచ్చి... ఆ స్టఫింగ్‌ అంతా కిందపడిపోకుండా తినలేక అవస్థ పడేకన్నా ఇలాంటి మినీ బర్గర్‌ని తింటే సరిపోతుంది. అదేవిధంగా పిజాను ఆర్డరిచ్చుకుని ఒకేసారి మొత్తం తినలేక పక్కన పెట్టేసి వృథా అయ్యిందని బాధపడే బదులు... బిస్కెట్‌ పరిమాణంలో ఉండే పిజాను రెండుమూడు ఒకేసారి తినేయొచ్చు. ఐస్‌క్రీమ్‌ అడిగే పిల్లలకు ఓ పెద్ద కోన్‌ను కొనిచ్చే కన్నా... రకరకాల ఫ్లేవర్లలో తయారుచేసే మినీ ఐస్‌క్రీమ్‌ కోన్లను చేతికిస్తే ఒకేసారి రెండు లేదా మూడు రకాలను తినిపించినట్లుగా ఉంటుంది. వాళ్లకూ కాస్త వెరైటీగా అనిపిస్తుంది. ఇలా... ఏవి తీసుకున్నా మినీఫుడ్‌ వల్ల లాభమే కాబట్టి ఆలస్యం చేయకుండా వీటిని ఓ పట్టుపట్టేస్తే సరి. 


ఆరు పదుల వాళ్లకి ఆటవిడుపు క్లబ్‌!

కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసి రిటైర్‌ అయినవాళ్లూ, బాధ్యతలన్నీ తీరిపోయినవాళ్లూ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ రోజులు గడిపేస్తారనేది పాతమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్లు కూడా తమకు నచ్చినట్లుగా జీవితాన్ని ఆనందించాలనుకుంటున్నారు మరి. అలాంటివాళ్లకోసమే కొత్తగా ‘సీనియర్‌ సిటిజన్స్‌/ఎల్డర్స్‌ క్లబ్‌’లు ఏర్పాటవుతున్నాయి. పెద్దవాళ్లు తమ అభిరుచులనూ, ఇష్టాయిష్టాలనూ ఆచరణలో పెడుతూ శేషజీవితాన్ని హాయిగా ఆనందించే అడ్డాలివి మరి.

స్కూలు నుంచి వచ్చే పిల్లలు సాయంత్రాలు ట్యూషన్‌కో, హాబీక్లాసులకో వెళ్లడం ఈ రోజుల్లో మామూలే. కాలేజీ విద్యార్థులకూ రకరకాల క్లబ్‌లు ఉంటాయి. ఉద్యోగుల్లో చాలామందికి అంత సమయం ఉండదు కాబట్టి వాళ్లు తమ అభిరుచుల్నీ, కోరికల్నీ పక్కన పెట్టేసి రిటైర్‌ అయ్యాక చూడొచ్చనుకుంటారు. తీరా ఉద్యోగ విరమణ పొందాక ఏం చేయాలో తెలియదు. టీవీ, వాకింగ్‌, వార్తాపత్రికలతోనే రోజంతా కాలక్షేపం చేయలేరు. ఇవన్నీ ఆలోచించే ‘సీనియర్‌ సిటిజన్స్‌/ఎల్డర్స్‌ క్లబ్‌’లను అందుబాటులోకి తెస్తున్నాయి కొన్ని సంస్థలు. ఇక్కడ పెద్దవారు తమ సమవయస్కులతో కలిసి... నచ్చిన పనుల్ని చేస్తూ హాయిగా కాలం గడపొచ్చు. ఒకప్పుడు వయసుపైబడినవారు విశ్రాంతి పేరుతో కేవలం నాలుగ్గోడలకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ఓపిక ఉన్నంతవరకూ ఏదో ఒకటి చేస్తూ జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలనుకునేవారే ఎక్కువ. అలాంటివాళ్లకోసమే ఈ క్లబ్‌లు అందుబాటులోకి వచ్చాయి.  

ఏంటి వీటి ప్రత్యేకత...
ఇంట్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పిల్లల్ని పొద్దుటిపూట డే-కేర్‌ సెంటర్‌లో వదిలేసి సాయంత్రం తెచ్చుకోవడం తెలుసుగా.. ఈ క్లబ్‌లు కూడా అదేవిధంగా పనిచేస్తాయి. అయితే... ఇక్కడ పొద్దుటి నుంచి సాయంత్రం వరకూ ఉండాలనే నియమం లేదు. రోజులో ఒకటిరెండు గంటలు తోటివారితో సరదాగా గడిపి వెళ్లిపోవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ‘ఎల్డర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌’ వయసుపైబడినవారికి ఎన్నోరకాల సదుపాయాల్ని కల్పిస్తోంది. అందులో ‘ఎల్డర్స్‌క్లబ్‌’ కూడా ఒకటి. ‘వయసుపైబడిన వారికి సమాజంలో గుర్తింపునీ, గౌరవాన్నీ కలిగించాలనే ఉద్దేశంతో కొన్నేళ్లక్రితం ఈ సంస్థను ప్రారంభించాం. మేం నిర్వహించే కార్యక్రమాల్లో ‘సీనియర్స్‌ /ఎల్డర్స్‌ క్లబ్‌’ కూడా ఒకటి. పొద్దుటి నుంచి సాయంత్రం వరకూ తెరిచి ఉంచే ఈ క్లబ్‌లో పెద్దవాళ్లకోసం రకరకాల ఆటలూ-పాటలూ... వ్యక్తిగత ప్రతిభను వెలికి తీసే కార్యక్రమాలూ, నెలలో ఒకటిరెండుసార్లు గెట్‌ టు గెదర్‌లూ, చదువుకునేందుకు పుస్తకాలూ... ఇలా ఎన్నో ఉంటాయి. అదేవిధంగా ఆసక్తి ఉన్న బృందాలను అన్నిరకాల జాగ్రత్తలతో ఇతర ప్రాంతాలకూ, పుణ్యక్షేత్రాలకూ విహారయాత్ర పేరుతో తీసుకెళ్తుంటాం. క్రీడాకారులుంటే పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంటాం. అప్పుడప్పుడూ ఉచిత ఆరోగ్య శిబిరాలనూ నిర్వహిస్తుంటామ’ని వివరిస్తారు ఈ సంస్థ నిర్వాహకులు. అంతర్జాతీయస్థాయిలో శాఖలున్న ఈ సంస్థలో లక్షలమంది సభ్యులుండటం విశేషం. ఇది కాకుండా... ‘డిగ్నిటీ’, ‘సమర్థ్‌ కమ్యూనిటీ’, ‘50 ప్లస్‌ వాయేజర్స్‌’, ‘ద అధాతా ట్రస్ట్‌’, ‘సిల్వర్‌ సర్ఫర్స్‌ క్లబ్‌’... వంటి మరికొన్ని కూడా ఇలాంటి సేవల్నే అందిస్తున్నాయి. ఇవన్నీ కూడా పెద్దవారి అవసరాలకు తగినట్లుగా యోగా, సరదాగా గడిపేందుకు చిన్నచిన్న పార్టీలూ, హాబీ క్లాస్‌లూ, నైపుణ్యాల్ని పెంచే వర్క్‌షాప్‌లూ, విహారయాత్రలూ.. ఇలా ఎన్నో అంశాల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారంతా ఓ బృందంగా ఏర్పడి సేవా కార్యక్రమాలు నిర్వహించేలా, పేదపిల్లలకు ట్యూషన్లు చెప్పేలా కూడా ప్రోత్సహిస్తున్నాయి. వీటన్నింటి లక్ష్యం ఒకటే... రిటైరైన వాళ్లు ఒకప్పుడు చేయకుండా వదిలేసిన పనుల్నీ, నేర్చుకోవాలనుకున్నవాటినీ హాయిగా నేర్చేసుకుంటూ.. మలిదశకూ ఓ అర్థాన్నిచ్చేలా ప్రోత్సహించడమే. కాబట్టి.. తమ ఉద్యోగానుభవాలను పంచుకుంటూ హాయిగా చెస్‌/క్యారంబోర్డ్‌ వంటివి ఆడుకోవాలనుకున్నా, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరదాగా ముచ్చట్లు చెబుతూ కాలక్షేపం చేయాలనుకున్నా, ఒకప్పుడు వెళ్లాలనుకున్న ప్రాంతాలను జాలీగా చూసి రావాలనుకున్నా... ఇలాంటి క్లబ్‌లలో సభ్యత్వం తీసుకుంటే సరి. ఆలస్యమెందుకూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు