అందుకే సిక్సర్ కొట్టగలిగా!
ఆఖరి బంతికి అయిదు పరుగులు.. ఆ దశలో అద్భుతం జరిగితే తప్ప బ్యాటింగ్ జట్టు గెలవలేదు. తాజా ఐపీఎల్లో ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి అలాంటి అద్భుతమే చేశాడు ఆర్సీబీ బ్యాట్స్‌మన్, తెలుగు యువకుడు... కోన శ్రీకర్ భరత్. తన బ్యాటింగ్, కీపింగ్ నైపుణ్యాలతో టీమ్ ఇండియా వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు ఈ విశాఖ కుర్రాడు.
అప్పుడు వద్దన్నారు!
వైజాగ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగేటపుడు సీనియర్లని నెట్స్‌లో గమనించేవాణ్ని. బాల్‌బాయ్‌గా, స్కోర్‌బోర్డ్ దగ్గరా ఉండేవాణ్ని. సచిన్, సెహ్వాగ్, ధోనీ లాంటి దిగ్గజాల్ని చూసి స్ఫూర్తి పొందేవాణ్ని. సెయింట్ అలోసియస్ స్కూల్లో చదువుకున్నా. బుల్లయ్య కాలేజీ నుంచి డిగ్రీ చేశా. ఎంబీఏ కూడా పూర్తిచేశా. చదువులోనూ ముందుండే వాణ్ని. అయితే క్రికెట్ మీద ఇంకా ఎక్కువ ఇష్టం ఉండేది. అండర్-16లో కొన్ని మ్యాచ్‌లలో రాణించలేకపోయేసరికి జట్టులో స్థానం కోల్పోయా. నాన్న ఆందోళన చెంది... క్రికెట్ మానేయమన్నారు. కోచ్ కృష్ణారావు సర్ నాన్నతో మాట్లాడటంతో కొనసాగనిచ్చారు.
కిట్ అమ్మ తెచ్చేది...
నాన్న శ్రీనివాసరావు విశాఖ నావల్ డాక్‌యార్డ్‌లో ఉద్యోగి. అమ్మ దేవి గృహిణి. అక్క మనోజ్ఞ. చిన్నపుడు గల్లీ క్రికెట్ ఆడేవాణ్ని. ఇరుగుపొరుగు ఇళ్ల కిటికీలకి బంతి తగిలితే వచ్చి అమ్మకి చెప్పేవారు. ఈ తలనొప్పి ఎందుకని ఏడేళ్లపుడు క్రికెట్ అకాడమీలో చేర్పించారు. నెట్స్‌లో ప్రాక్టీసు, పెద్ద గ్రౌండ్లో ఆడటం అప్పట్నుంచీ అలవాటైంది. పదేళ్లప్పుడే జిల్లా, రాష్ట్ర అండర్-13 జట్లకి ఎంపికయ్యా. మా స్కూలు సిటీకి ఒక చివర ఉంటే క్రికెట్ గ్రౌండ్ మరో చివర ఉండేది. మధ్యలో ఇల్లు. రోజూ సాయంత్రం బస్టాప్‌లో అమ్మ క్రికెట్ కిట్‌తో రెడీగా ఉండేది. మూడేళ్లపాటు నాతోపాటు అలా రోజూ వచ్చేది.
వికెట్ కీపింగ్...
నన్ను బాట్స్‌మన్‌గా, కీపర్‌గా తీర్చిదిద్దింది ‘ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్’ కోచ్ కృష్ణారావు. చిన్నప్పట్నుంచీ ఆయన దగ్గరే శిక్షణ తీసుకుంటున్నా. మిడిల్ ఆర్డర్ నుంచి నన్ను టాప్ ఆర్డర్‌కి తెచ్చారు. సిల్లీ పాయింట్, షార్ట్ లెగ్ పొజిషన్లలో ఫీల్డింగ్ చేస్తూ చురుగ్గా కదిలేవాణ్ని. ఇది గమనించి కీపర్‌గానూ ప్రయత్నించమన్నారు. అండర్-19 ఆంధ్ర జట్టుకి ఆడినప్పుడు మొదటిసారి వికెట్ కీపింగ్ చేశా. రంజీ జట్టులో కీపర్‌గా కొనసాగుతున్నా. చిన్నపుడు ఎమ్మెస్కే ప్రసాద్ అన్న కీపింగ్ ప్రాక్టీసుని దగ్గరగా చూసేవాణ్ని. ఎప్పుడైనా సరదాగా గ్లవ్స్ తీసుకుని ప్రాక్టీసు చేస్తుండేవాణ్ని. ఆ అనుభవం తర్వాత పనికొచ్చింది.
ఐపీఎల్ అనుభవం..
విరాట్ భాయ్, ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ లాంటి దిగ్గజాల ఆటను చూస్తూ చాలా నేర్చుకోవచ్చు. అలాంటిది ఈసారి ఐపీఎల్లో వీరితో కలిసి బ్యాటింగ్ చేశా. దిల్లీతో చివరి మ్యాచ్‌లో మూడు బంతులు ఉన్నపుడు ‘సింగిల్ చేసి స్ట్రైకింగ్ ఇవ్వమంటావా’ అని మ్యాక్స్‌వెల్‌ని అడిగితే, ‘వద్దు నువ్వే షాట్‌కి ప్రయత్నించు’ అన్నాడు. స్పిన్‌కంటే ఫాస్ట్ బౌలింగ్ ఆడటానికి ఇష్టపడతాను. స్పిన్ బౌలింగ్‌లో అయితే బంతిని గట్టిగా కొట్టాలి. అదే ఫాస్ట్ బౌలింగ్‌లో అయితే బంతిని సరిగ్గా టైమింగ్ చేస్తే చాలు. అందుకే ఆరోజు ఆఖరి బంతిని సిక్సర్‌గా కొట్టగలిగా. అమ్మానాన్న, అక్క, నా శ్రీమతి అంజలితోపాటు కోచ్ ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోంది.
ఆ ట్రిపుల్ ప్రత్యేకం...
వైజాగ్‌లో మొదటి రంజీ మ్యాచ్ జరిగినపుడు అమ్మానాన్న స్టేడియానికి వచ్చారు. ఆరోజు సెంచరీ చేశాను. జీవితంలో మర్చిపోలేని రోజది. 2015(ఒంగోలు)లో గోవాపైన ట్రిపుల్ సెంచరీ కూడా చాలా ప్రత్యేకం.... రంజీల్లో ఇండియా వికెట్ కీపర్‌కు అది అత్యధిక స్కోర్. ఇండియా-ఎ తరఫున విదేశీ జట్లపైన కొన్ని అద్భుతమైన మ్యాచ్‌లు ఆడా. 2019లో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కి ఎంపికయ్యా. ఆడే అవకాశం రాలేదు కానీ, టీమ్ ఇండియాకి ఎంపికైనందుకు గర్వంగా ఫీలయ్యా. తర్వాత మళ్లీ అంతగా గుర్తుండిపోయేవి ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లే.
ఉత్తుత్తి మైదానంలో అసలైన ఆట!
విశాలమైన క్రికెట్ మైదానంలోకి వెళ్లి ఏక్ దమ్ సిక్సులు కొట్టేయొచ్చు... చేతిలో తుపాకీ పట్టుకుని శత్రువుల్ని కాల్చి పారేయొచ్చు... పెద్దపెద్ద కొండల్ని ఎక్కేస్తూ ట్రెక్కింగ్ చేసేయొచ్చు... అసలు ఉన్నచోటే నిల్చుని ప్రపంచమంతా చుట్టిరావొచ్చు..‘ఏంటీ కలలోనా’ అంటారేమో... అదేంకాదు వీఆర్ గేమింగ్‌తో!
కాస్త సమయం దొరికినా, బోర్కొట్టేసినా మొబైల్ తీసి గేమ్స్ ఆడుకునేవాళ్లే ఎక్కువ. గన్‌తో పరుగులు తీసే షూటింగ్ గేమ్సూ, రంగు రంగుల క్యాండీల్ని కలిపే క్యాండీక్రష్ సాగా, నిజమైన క్రికెట్ టీంతో ఆడే రియల్ క్రికెట్ త్రీడీ... ఇలా ఒకటా రెండా... థ్రిల్‌ను పంచే ఆటలు బోలెడన్ని ఉన్నాయి. అయితే వీటిల్లో ఫోన్తెరపైన చేతితో తాకుతూ ఆడేస్తుంటాం. కానీ అవే ఆటల్ని మనం పూర్తిగా ఆ వాతావరణంలోకి వెళ్లి ఆడితే.. అబ్బ- ఆ ఊహే ఎంత థ్రిల్లింగ్‌గా ఉందో కదూ! ఇప్పుడు కొత్తగా వస్తున్న ‘వీఆర్ గేమింగ్’ అలాంటి అనుభూతినే ఇస్తోంది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ‘వీఆర్ గేమింగ్ కెఫే’కి వెళితే ఆ ఫీల్‌ను మనమూ పొందొచ్చు.
ఇందులోకి అడుగుపెట్టగానే ఓ పక్కన రకరకాల ఫుడ్ ఐటమ్సూ, మరో పక్కన కంప్యూటర్లూ కనిపిస్తూ మామూలు కెఫేలానే ఉంటుంది. కానీ మనకు నచ్చిన ఆటను ఎంచుకుని వీఆర్ గేమింగ్ సెట్ పెట్టుకున్నామంటే పూర్తిగా కొత్తప్రపంచంలోకి వెళ్లిపోతాం.
ఏం చేయొచ్చు..
‘ఎంతో ఎత్తులో ఉండే రోలర్ కోస్టర్ ఎక్కి తిరగాలనుంటుంది. కానీ చాలా భయం, స్పైడర్‌మ్యాన్‌లా పేద్ద పేద్ద భవనాలు ఎక్కాలని కోరిక. బాబోయ్ అది అసలు కుదురుతుందా! సినిమాల్లోలా యుద్ధం చేస్తూ శత్రువులపైన గన్‌తో దాడిచేస్తే మస్త్ మజాగా ఉంటుంది.’ ఇదిగో వీటన్నింటికీ ఈ వీఆర్ గేమింగ్‌తో జవాబు చెప్పేయొచ్చు. వర్చువల్ రియాలిటీ అంటే... కంప్యూటర్ టెక్నాలజీతో లేని వాతావరణం ఉన్నట్టు కనిపించడమన్నమాట. దీంట్లో కంప్యూటర్, వర్చువల్ రియాల్టీ గేమింగ్ హెడ్సెట్, జాయ్‌స్టిక్ ఉంటాయి. హెడ్సెట్ తలకు పెట్టుకుని చేతిలో జాయ్‌స్టిక్ పట్టుకుని బటన్ నొక్కగానే పూర్తిగా మన లోకం మారిపోతుంది. బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, క్రికెట్... ఇలా ఏ ఆట ఎంచుకుంటే ఆ మైదానంలోకి మనం వెళ్లిపోతామన్నమాట. ఉదాహరణకు బాక్సింగ్ చేయాలనుకున్నారంటే.... బాక్సింగ్ రింగూ, మనతో బాక్సింగ్‌కు తలపడే వ్యక్తీ, చుట్టూ జనాలూ... ఇలా అన్నీ త్రీడీ యానిమేషన్స్‌లో ఉంటాయి. చేతిలో పట్టుకున్న జాయ్స్టిక్ని మనం కదిలిస్తుంటే శత్రువుతో తలపడుతుంటాం. అదే క్రికెట్ ఆడితే, జాయ్‌స్టిక్ పట్టుకోగానే క్రికెట్ గ్రౌండ్లోకి దిగినట్టే ఉంటుంది. పెద్ద మైదానంలో చుట్టూ ఫీల్డర్లూ ఉంటారు. ప్రత్యర్థి బాల్ విసురుతూ కనిపిస్తుంటాడు. బంతి వర్చువల్‌గానే మనదగ్గరకు వస్తుంటుంది. మనం బాగా ఆడితే ఫోర్లూ, సిక్సులూ కొట్టొచ్చు. సరిగా ఆడకపోతే ఔట్లూ ఉంటాయి. ఆట వాతావరణంతోపాటూ ప్రేక్షకుల అరుపులూ గోలలతో ఒక్కమాటలో చెప్పాలంటే రియల్ క్రికెట్ ఆడినట్టే ఉంటుంది. అచ్చం మైదానంలో ఆడుతున్న అనుభూతి కలుగుతుంది.
వీఆర్ గేమ్స్‌లో ఈ ఆటలే కాదు, ‘ది క్లైంబ్, థ్రిల్ ఆఫ్ ది ఫైట్, అన్టిల్ యూ ఫాల్, ఈగల్ ఫైట్, పిస్తోల్ విప్’ వంటి రకరకాల అడ్వెంచర్, షూటింగ్ గేమ్సూ ఉంటాయి. అంతరిక్ష వాతావరణాన్ని తీసుకొచ్చే ‘లోన్ ఎకో’ గేమ్‌లో మనం కూడా పైకి తేలుతున్న వింత అనుభూతి కల్గుతుంటుంది. ‘గూగుల్ ఎర్త్ వీఆర్’లో మన కళ్ల ముందు గ్లోబు ప్రత్యక్షమవుతుంది. దాన్ని తిప్పుతూ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లొచ్చు. ఆ పరిసరాలన్నీ నిజంగానే మన కళ్ల ముందు ఉన్నట్టే ఉంటాయి. ఈ కెఫేలో పిల్లలూ, పెద్దల కోసం దాదాపు 100 వరకు వీఆర్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. కావాలంటే ఒక్కరమే ఆడుకోవచ్చు, లేదంటే స్నేహితులతోనూ ఈ గేమ్స్‌లోకి దిగొచ్చు. ఉన్నచోటునుంచే థ్రిల్, ఎగ్జైట్మెంట్ పంచే ఈ గేమ్స్ కెఫే ట్రెండ్ బాగుంది కదూ!
మీకు తెలుసా!
మేరీక్యూరీ నోటు పుస్తకాలు ఇప్పటికీ రేడియో యాక్టివ్గానే ఉన్నాయట. మదర్ ఆఫ్ ద మోడ్రన్ ఫిజిక్స్‌గా పేర్కొనే ఆమె రేడియో యాక్టివ్ మూలకాలైన పొలోనియం, రేడియంని కనిపెట్టింది. కానీ ఆ పరిశోధనల సమయంలో వాటి నుంచి విడుదలైన రేడియోధార్మికత ఆమె ప్రాణాలను బలిగొనడంతో పాటు, ఆమె పుస్తకాలూ దుస్తులూ ఫర్నిచర్... లాంటి వాటిపైనా ప్రభావం చూపింది. ప్రస్తుతం లెడ్ బాక్సుల్లో దాచిన ఆమె పుస్తకాల మీది అణు ధార్మికత మరో పదిహేను వందల ఏళ్ల వరకూ ఉంటుందట.
అండాకారంలో ఎందుకంటే..
విమానం కిటికీ అద్దాలు అండాకారంలో ఉండటాన్ని గమనించే ఉంటారు. అలా ఎందుకు ఉన్నాయన్న సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? అందంగా కనిపించడానికైతే కాదు సుమా! వాటినలా డిజైన్ చేయడం వెనకో ప్రత్యేక కారణం ఉంది. విమానాల్ని డిజైన్ చేసిన మొదటిరోజుల నుంచి 1950ల వరకూ వాటి కిటికీలు చతురస్రాకారంలో ఉండేవి. అప్పటివరకూ విమానాల రద్దీ తక్కువగా ఉండేది. తర్వాత రోజుల్లో విమానయానం ఊపందుకోవడంతో రద్దీ నివారణకు విమానాలు ఆకాశంలో మరింత ఎత్తులో ప్రయాణించేవి. దానివల్ల విమానాల మీద వాతావరణం కలిగించే ఒత్తిడి తగ్గి ఇంధనం ఖర్చు పొదుపయ్యేది కూడా. అయితే ఎత్తు బాగా పెరగడంవల్ల విమానం లోపలి, బయటి వాతావరణాల మధ్య ఉండే ఒత్తిడిలో తీవ్రమైన తేడా వచ్చేది. లోపల ఒత్తిడి ఎక్కువై అది కిటికీల మూలల దగ్గర కేంద్రీకృతం కావడంతో వాటికి పగుళ్లు వచ్చేవి, కొన్నిసార్లు విరిగిపోయి రెండుమూడు విమానాలు కూలిపోయాయి కూడా. ఈ ప్రమాదాల్ని నివారించడానికి కిటికీల్ని అండాకారంలోకి మార్చారు డిజైనర్లు. ఈ మార్పువల్ల మూలలమీద ఒత్తిడి తీవ్రంగా పడకుండా అన్నివైపులా సమానంగా ఉండేది. ఓ చిన్న మార్పు ఎంత పెద్ద సమస్యకు పరిష్కారం చూపిందో కదా!
ఫస్ట్... ఫస్ట్..!
పెర్ఫ్యూమ్ని మొదటి సారి క్రీ.పూ. 3000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్‌లో వాడారట. ఆ పరిమళ ద్రవ్యాన్ని తొలినాళ్లలో మల్లెపువ్వులు, దాల్చిన చెక్కలను కలిపి తయారుచేసేవారు.
Advertisement
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్