Surya kumar yadav: ఆ జెర్సీని పదిసార్లు వేసుకొని మురిసిపోయా!

కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా, 360 డిగ్రీల ప్లేయర్‌గా క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. దేశవాళీ క్రికెట్‌లో ముంబయికి ప్రాతినిధ్యం వహించినా వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్‌లో పాల్గొన్నా.. మైదానంలో దూకుడుతో సత్తా చూపే ఈ ఆటగాడు... తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నాడిలా...

Updated : 14 Aug 2022 12:32 IST

Surya kumar yadav: ఆ జెర్సీని పదిసార్లు వేసుకొని మురిసిపోయా!

కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా, 360 డిగ్రీల ప్లేయర్‌గా క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. దేశవాళీ క్రికెట్‌లో ముంబయికి ప్రాతినిధ్యం వహించినా వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్‌లో పాల్గొన్నా.. మైదానంలో దూకుడుతో సత్తా చూపే ఈ ఆటగాడు... తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నాడిలా...


నాన్న వల్లే క్రికెట్‌

నేను పుట్టిపెరిగింది ముంబయిలోనే. నాన్న అశోక్‌కుమార్‌ యాదవ్‌ బార్క్‌(భాభా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌)లో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌. అమ్మ స్వప్న యాదవ్‌, చెల్లి... ఇదే మా కుటుంబం. చిన్నప్పుడు మా వీధిలో పిల్లలు క్రికెట్‌ ఆడుతుండటంతో నేనూ వాళ్లతో కలిసి సరదాగా ఆడేవాడిని. టీవీలోనూ క్రికెట్‌  టోర్నమెంట్లను చూసేవాడిని. ఓ రోజు మా దగ్గర్లోని గ్రౌండ్‌కు వెళ్తే అక్కడున్న వాళ్లలో కొందరు తెల్లని దుస్తుల్లో వార్మప్‌ చేస్తూ, రన్నింగ్‌చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించారు. అది చూశాక.. క్రీడల్లో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది. అందుకే క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ను ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టా. అయితే ఓ రోజు నాన్న పిలిచి... ‘రెండు పడవలపైనా కాళ్లు పెట్టడం సరికాదు. ఏదో ఒకటే ఎంచుకో. శిక్షణ ఇప్పిస్తా’నని చెప్పారు. నేను బాగా ఆలోచించి క్రికెట్‌వైపు వచ్చా.  


కారు కానుకగా ఇచ్చా 

కొన్నాళ్లక్రితం అమ్మానాన్నలు నాకో కారును కానుకగా ఇచ్చారు. అదే నా మొదటి కారు. సంపాదించడం మొదలుపెట్టాక... నేను వాళ్లకో కారును బహుమతిగా ఇచ్చా. ఆ రోజున మా అమ్మానాన్నల ముఖాల్లో కనిపించిన ఆనందం నాకు ఇప్పటికీ గుర్తే.  


స్టేడియం బయట

చాలా ప్రశాంతంగా ఉంటా. పుస్తకాలు చదవడం, నచ్చిన ఆహారాన్ని తినడం, స్నేహితులతో సరదాగా కాఫీకి వెళ్లడం... వంటివన్నీ చేస్తుంటా.


ఆ ప్రత్యేకతే వేరు

నీలం రంగు జెర్సీలో పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుందనిపిస్తుంది. మొదటిసారి నాకు ఆ జెర్సీని ఇచ్చినప్పుడు దాన్ని రూమ్‌కు తీసుకెళ్లి కనీసం పదిసార్లైనా వేసుకుని అద్దంలో నన్ను నేను చూసుకుని మురిసిపోయి ఉంటా.  


ఆ మాటలు ఇంకా గుర్తే

క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న కొత్తల్లో ఒక్కోసారి కనీసం జోనల్‌ టీమ్‌లోనూ నా పేరు ఉండేది కాదు. దాంతో ఇంటికొచ్చి బాధపడితే నాన్నేమో ‘నువ్వు కష్టపడుతున్నా కానీ గుర్తింపు రావడంలేదంటే ఇంకాస్త ఎక్కువగా కష్టపడాలని అర్థం. సమయం వచ్చినప్పుడు అవకాశాలు అవే వస్తాయి..’ అనే వారు. చివరకు నాన్న చెప్పినట్లుగానే నాకు గుర్తింపు వచ్చింది.  


నా ముద్దుపేరు స్కై 

నేను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఆడినప్పుడు అక్కడున్నవాళ్లంతా నన్ను సూరి అని పిలిచేవాళ్లు. కానీ గంభీర్‌ మాత్రం.. ‘స్కై’ అని పిలిచాడు. మొదట్లో అలా ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కాలేదు కానీ ఆలోచిస్తే నా పేర్లలోని తొలి అక్షరాలని కలిపి స్కైగా మార్చాడని తెలిసింది. క్రమంగా మిగతావాళ్లూ అలానే పిలవడం మొదలుపెట్టారు.


తనే నా ధైర్యం

నా భార్య దేవిషా శెట్టి డాన్సరే కాదు శిక్షకురాలు కూడా. తనకు నా బ్యాటింగ్‌స్టైల్‌ నచ్చితే.. నాకు దేవిషా డాన్స్‌ అంటే చాలా ఇష్టం. ఓ కాలేజీ వేడుకలో మా ఇద్దరికీ పరిచయం అయ్యింది. అదే పెళ్లికి దారితీసింది.


ఆ ఇద్దరే ఆదర్శం

ఎంత ఒత్తిడిగా ఉన్నా సరే.. గౌతమ్‌గంభీర్‌ ప్రశాంతంగా ఉంటూనే తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఇక, ధోని అయితే... ఎన్ని విజయాలను సాధించినా కూడా నిరాడంబరంగా ఓ రుషిలా మౌనంగా ఉంటాడు. ఒత్తిడి లేకుండా ఆడటంలోనూ, విజయాలు సాధించినప్పుడు కామ్‌గా ఉండటంలోనూ నాకు వాళ్లిద్దరే ఆదర్శం.

* ఇష్టమైన క్రికెట్‌ గ్రౌండ్‌: ఈడెన్‌ గార్డెన్స్‌
* నచ్చే ఆహారం: చైనీస్‌ వంటకాలు
* ఇష్టంగా చేసే పని: నిద్రపోవడం
* నచ్చే క్రికెటర్‌: గౌతమ్‌ గంభీర్‌
* నచ్చే నటీనటులు: షారుఖ్‌ఖాన్‌, \దీపికా పదుకొణె


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..