రణ్‌వీర్‌ ఆ ఒక్క విషయంలో నచ్చడు!

స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి దీపికా పదుకొణె. వరుస అవకాశాలూ, విజయాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న దీపిక... త్వరలో తెలుగు తెరమీదా కనిపించనుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను

Updated : 13 May 2022 15:03 IST

రణ్‌వీర్‌ ఆ ఒక్క విషయంలో నచ్చడు!

స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి దీపికా పదుకొణె. వరుస అవకాశాలూ, విజయాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న దీపిక... త్వరలో తెలుగు తెరమీదా కనిపించనుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునే ఈ బాలీవుడ్‌ భామ... తన మనసులోని ముచ్చట్లను వివరిస్తోందిలా..

రెండు నిమిషాల్లోనే...
రణ్‌వీర్‌ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు కానీ... తనపైన నాకు ఒకే ఒక్క విషయంలో కోపం వస్తుంది. చాలా త్వరగా భోజనం పూర్తిచేస్తాడు. నాకేమో కబుర్లు చెప్పుకుంటూ నిదానంగా భోజనం చేయాలని ఉంటుంది కానీ... నేను రెండు ముద్దలు తినేలోపు గబగబా తినేసి ప్లేటు పక్కన పెట్టేస్తాడు. అదే నాకు నచ్చదు. ఆ మూడూ ఉంటాయి... నేనెప్పుడూ నా హ్యాండుబ్యాగులో సూదీ-దారం, పిన్నులూ పెట్టుకుంటా. ఎందుకంటే.. రణ్‌వీర్‌ ఎప్పుడూ రకరకాల ఫ్యాషన్లను ప్రయత్నిస్తుంటాడు. పైగా ఎక్కడికి వెళ్లినా సరదాగా గెంతుతూ, ఏవో ఒక స్టెప్పులు వేస్తూ ఎంజాయ్‌ చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు తన డ్రెస్‌ చిరిగితే కుట్టడానికే ఆ మూడింటినీ నా హ్యాండుబ్యాగులో ఎప్పుడూ ఉంచుకుంటా. అతనితో నటించాలని.. నాకు అవకాశం వస్తే గనుక జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌తో కలిసి సినిమాలు చేయాలని ఉంది. వాళ్ల వ్యక్తిత్వం, నటించే తీరు, డ్యాన్స్‌ చేసే విధానం చూశాక వాళ్లతో కలిసి తెర పంచుకోవాలని ఎవ్వరైనా అనుకుంటారు. నేనూ అదే కోరుకుంటున్నా. చూడాలి మరి.. భవిష్యత్తులోనైనా ఆ అవకాశం వస్తుందో రాదో..

దీపావళి అంటే ఇష్టం
మా ఇంట్లో అందరి పేర్లకూ వెలుగు, దీపం అనే అర్థం వస్తుంది. అందుకే నాకు దీపావళి పండుగంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు దీపావళి రోజున సాయంత్రం చుట్టుపక్కల పిల్లలతో కలిసి బోలెడు టపాకాయలు కాల్చేదాన్ని. ఇప్పటికీ దీపావళి పండుగ వస్తోందంటే నాకు నా చిన్నతనమే గుర్తొస్తుంది.

ఆ రోజులు... అమ్మో!
కొన్నాళ్లక్రితం సంగతి... ఓ రోజు నిద్రలేచిన వెంటనే ఉన్నట్టుండి పెద్దగా ఏడవడం మొదలుపెట్టా. నా ఏడుపు పని ఒత్తిడితోనో లేక మరో కారణంతోనో కాదని గుర్తించిన అమ్మ వెంటనే మానసిక నిపుణుల దగ్గరకు వెళ్ళమంది. అయితే... ఆ సమయంలో ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి. ఆ డాక్టర్లు నా విషయాన్ని రహస్యంగా ఉంచుతారో లేదోననే సందేహం. చివరకు...నా గురించి అందరికీ తెలిసినా ఫరవాలేదనిపించి చికిత్స తీసుకునేందుకు సిద్ధమయ్యా. ఆ డిప్రెషన్‌ నుంచి కాస్త కోలుకున్నాక నా అంతట నేనే ఆ విషయాలను అందరితో పంచుకున్నా. ఇప్పుడు మంచి ఆహారం, వ్యాయామం వంటి విషయాల్లోనే కాదు... ఒత్తిడి నివారణకూ జాగ్రత్తలు తీసుకోవడం నా దినచర్యలో భాగం చేసుకున్నా.


ఇష్టమైన ఆహారం
చారు-అన్నం

ఇష్టమైన నటుడు

ఆమిర్‌ఖాన్‌, షారుఖ్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌. తెలుగులో మాత్రం మహేష్‌బాబు.

ఓ కోరిక...
కాలం ఒక్కసారైనా వెనక్కి వెళ్తే బాగుండనిపిస్తుంది. అదే జరిగితే ‘టైటానిక్‌’ సినిమాలో నటించాలని కోరిక. నాకు ఆ సినిమా అంత నచ్చింది మరి.

మొదటి ప్రకటన
నేను చేసిన మొదటి ప్రకటన లిరిల్‌ సబ్బు. అదే నాకు క్లోజప్‌లోనూ నటించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది.  

నచ్చే ప్రదేశం
మెక్సికో. అక్కడికి ఎన్నిసార్లు వెళ్లినా ఆ ప్రాంతం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఆ తరువాత మా ఇల్లు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..