Updated : 26 Dec 2021 05:49 IST

ఆ ఆవిష్కరణలకి కేంద్రం.. గుంటూరే!

మధ్య నాసాకి చెందిన పార్కర్‌ అన్న అంతరిక్ష నౌక ఒకటి... తొలిసారి సూర్యుడి ఉపరితలందాకా వెళ్లి, భస్మమైపోకుండా అక్కడున్న వాయువుల్ని సేకరించింది. సూర్యుడికి సంబంధించిన మానవ పరిశోధనలో ఇదో పెద్ద మలుపని చెబుతున్నారు. కానీ ఈ మలుపు అందుకోవడానికి ఓ ముందడుగు సుమారు 152 ఏళ్ల కిందట... మన గుంటూరులోనే పడింది. 1868వ సంవత్సరం అది. ‘సూర్యుడు అసలు ఏ పదార్థంతో తయారయ్యాడు?’ అన్న ప్రశ్నతో ఐరోపాలో తొలిదశ పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ విషయాలన్నీ తేల్చుకోవడానికి ‘స్పెక్ట్రోస్కోప్‌’ అన్న పరికరాన్ని తయారుచేశాడు ఫ్రాన్స్‌కి చెందిన పియర్రీ జేసన్‌ అనే పరిశోధకుడు. ఈ పరికరం ద్వారా సూర్యుడి రంగుల్ని విభజించి... ఆ రంగులకి కారణమైన వాయువుల్ని విశ్లేషించవచ్చు. ఆ విశ్లేషణకి సంపూర్ణ సూర్యగ్రహణమే సరైన సమయం అనుకున్నాడు జేసన్‌. 1868 ఆగస్టు 18న ఆ సూర్యగ్రహణం ఆంధ్రప్రదేశ్‌లోనే పూర్తిస్థాయిలో కనిపిస్తుందని అంచనాకి వచ్చాడు. అందుకని గుంటూరుకొచ్చి మకాం వేశాడు. అనుకున్నట్టే ఉదయం తొమ్మిది నుంచి గ్రహణం మొదలైంది. రెండు గంటలపాటు దాన్ని పరిశీలించిన జేసన్‌ సూర్యుడి వాయువుల్ని విశ్లేషించడానికి గ్రహణాలదాకా ఆగాల్సిన అవసరం లేదని తేల్చాడు! ఇందుకోసం ఓ కొత్త పద్ధతిని కనిపెట్టాడు. ఆ పద్ధతి ఆధారంగానే తర్వాతి కాలం శాస్త్రవేత్తలు సూర్యుడిలోని వాయువులన్నింటినీ దాదాపు అంచనా వేయగలిగారు. ఆ అంచనానే నేటి పార్కర్‌ యాత్ర దాకా మనల్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అంతేకాదు... గుంటూరులోని జేసన్‌ పరిశోధనలో ఇంకో పెద్ద ఆవిష్కరణ కూడా చోటుచేసుకుంది. సూర్యుడి చుట్టూ పసుపురంగు గీతలు కొన్ని జేసన్‌కి కనిపించాయి. ఆ గీతలకి కారణం ఓ కొత్తరకం వాయువని తేల్చాడు. అదే హీలియం! గ్యాస్‌ బెలూన్‌లూ, ఎమ్మారై స్కాన్‌లలో ఉపయోగించేది ఈ వాయువునే.


సామాన్యులకోసం.. ‘సూపర్‌’ విమానాలు!

కంకార్డ్‌... శబ్దంకంటే వేగంగా వెళ్లే ప్రయాణికుల విమానం! ఆ సూపర్‌సోనిక్‌ విమానాల్లో ప్రయాణాన్ని ఒకప్పుడు కోటీశ్వరులు తమ స్టేటస్‌ సింబల్‌గా భావించేవారు.  2003లో ఆగిపోయిన ఆ తరహా విమానాలని మళ్లీ తెస్తాం అంటున్నాయి నేటి స్టార్టప్‌లు.  ఒకప్పటిలా కేవలం కుబేరులకే కాకుండా సామాన్యులకీ వాటిని చేరువచేస్తాం అంటున్నాయి..!

మనదేశం నుంచి అమెరికాలోని న్యూయార్క్‌ నగరానికి విమాన ప్రయాణం... సుమారు పదహారు గంటలు పడుతుంది. అదే సూపర్‌సోనిక్‌ విమానమైతే కేవలం ఐదారుగంటల్లో వెళ్లొచ్చు. ఈ విమానాలు శబ్దంకంటే వేగంగా వెళతాయి కాబట్టే... అంత తొందరగా మనల్ని గమ్యం చేర్చగలుగుతాయి. ప్రస్తుతం మనదగ్గరున్న జెట్‌ విమానాలన్నీ శబ్దం ప్రయాణించే వేగంలో 80 శాతాన్ని మాత్రమే అందుకోగలవు. శబ్దంకంటే తక్కువ వేగంతో ప్రయాణించే ఈ విమానాలని ‘సబ్‌’ సోనిక్‌ అని పిలుస్తారు. శబ్దాన్ని మించిన వేగంతో ప్రయాణించేవాటిని ‘సూపర్‌’ సోనిక్‌ అంటారు(సోనిక్‌ అంటే శబ్దానికి చెందినదని అర్థం). 1950ల నుంచే ఈ విమానాలని సైన్యంలో యుద్ధవిమానాలుగా వాడుతుండేవారు. వాటిని మామూలు ప్యాసింజర్‌ ఫ్లైట్‌లుగా వాడిన తొలిదేశం రష్యా. ఆ దేశం రూపొందించిన తుపులేవ్‌-టీయూ-144 విమానాలు... 1960లలో సంచలనం సృష్టించాయి. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే యూకేకి చెందిన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, ఫ్రాన్స్‌లోని ఎయిరో స్పాటియల్‌ సంస్థలు సంయుక్తంగా ‘కంకార్డ్‌’ని రూపొందించాయి! అసలు మామూలు విమాన ప్రయాణమే ఓ పెద్ద విలాసం అనుకుంటున్న రోజుల్లో... ఆ విలాసానికి రాజసాన్నీ అద్దాయి.

అది ‘పుష్పక’మే!
సుమారు 120 మంది ప్రయాణికులతో పురాణాల్లోని పుష్పకవిమానం అంటే ఇదేనేమో అనిపించేది కంకార్డ్‌. టికెట్టు ధర మామూలు విమానాలకంటే ముప్పైరెట్లు ఎక్కువుండేది. అందుకే అందులో కేవలం పారిశ్రామికవేత్తలూ, సినిమావాళ్లూ, రాజకీయనాయకులు మాత్రమే వెళ్లగలిగేవాళ్లు. అందులోని వసతులూ ఆ స్థాయిలోనే ఉండేవి. అలా పాతికేళ్లపాటు తనకి సరిసాటి లేవనిపించుకున్న కంకార్డ్‌ విమానాలు తమ ప్రభని కోల్పోయాయి. శబ్దం కంటే రెండురెట్లు ఎక్కువ వేగంతో(మ్యాక్‌ 2.0 అంటారు) ప్రయాణిస్తుంది కాబట్టి... ఇంధన వినియోగం భారీగా ఉండేది. ప్రతి సీటుకీ ఒక టన్ను ఇంధనం ఖర్చయ్యేదని చెబుతారు. మామూలు బోయింగ్‌ 747తో పోల్చుకుంటే ఇది రెండురెట్లు ఎక్కువ. అంతేకాదు, ఈ విమానం వెళుతుంటే వచ్చే శబ్దం కూడా భారీగా ఉండేది. ఎంతగా అంటే... కాస్త తక్కువ ఎత్తులో వెళితే ఆ శబ్దానికి భవనాల్లోని అద్దాలు పగిలిపోయేంతగా! దాంతో ఈ విమానాలు జనావాసాలపైన ఎగరడాన్ని పలుదేశాలు నిషేధించి... సముద్రాలపైన వెళ్లే రూట్‌లలోనే అనుమతించాయి. వీటన్నింటి మూలంగా 2003లో కంకార్డ్‌కి లక్షన్నర కోట్ల రూపాయల నష్టం వచ్చింది! దాంతో కంపెనీ శాశ్వతంగా మూతపడిపోయింది. ఆ తర్వాత ఎవరూ ఆ ప్రయత్నాలు చేయలేదు. కానీ నేటితరం స్టార్టప్‌లు ఆ సాహసానికి ఇప్పుడు సై అంటున్నాయి!

ప్రవాస భారతీయుడి సంస్థ కూడా!
సూపర్‌సోనిక్‌ విమానాలని మళ్లీ తేవాలని నడుంబిగించిన తొలి అంకుర సంస్థ ‘బూమ్‌ ఓవర్చర్స్‌’. నేటి విమానాల్లా కాకుండా పూర్తిగా పర్యావరణహిత ఇంధనాన్నే వాడతామంటోంది ఈ సంస్థ. తాము తయారుచేసే నయాతరహా విమాన ఇంజిన్‌ల కారణంగా అతితక్కువ శబ్దమే వస్తుందనీ చెబుతోంది. అంతేకాదు, కంకార్డ్‌ కంటే 95 శాతం తక్కువ టికెట్టు ధరకే తమ విమానాలు నడపొచ్చనీ అంటోంది. ఎక్కడ ఎక్కినా ప్రయాణికులకి ఏడువేల రూపాయలే టికెట్టు ఖర్చయ్యేలా చూడాలన్నదే ఈ సంస్థ లక్ష్యమట. అమెరికాలోని ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఇప్పటికే వీళ్లతో 15 సూపర్‌సోనిక్‌ విమానాలకి ఒప్పందం కుదుర్చుకుంది! ఇక, ప్రవాసభారతీయుడు విక్‌ కచీరియా స్థాపించిన ‘స్పైక్‌ ఎయిరోస్పేస్‌’ ఈ సంస్థతో పోటీపడుతోంది. ఫ్లైట్‌ వేగాన్ని భారీగా పెంచేలా ఈ సంస్థ కిటికీల్లేని విమానాలు తెస్తోంది! కాకపోతే, కిటికీల్లేని లోపం తెలియకుండా విమానం బయటున్న కెమెరాలు వెలుపలి దృశ్యాలని ఎప్పటికప్పుడు క్యాప్చర్‌ చేసి లోపలున్న తెరలపైకి పంపిస్తాయట. ఈ సంస్థలో ఆనంద్‌ మహీంద్రా కూడా పెట్టుబడులు పెట్టడం విశేషం. ఈ రెండింటితోపాటూ ఎగ్జోసోనిక్‌, హెర్మెనియస్‌ అన్న సంస్థలూ సూపర్‌సోనిక్‌ బరిలో ఉన్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడి కోసం ప్రత్యేక విమానాలు చేసివ్వడానికి ఒప్పందం ఖరారు చేసుకున్నాయివి. ఇదిలా ఉంటే సౌదీ అరేబియాకి చెందిన ముబదల అనే సంస్థ కూడా రష్యాతో కలిసి మళ్లీ సూపర్‌సోనిక్‌ ప్యాసింజర్‌ ఫ్లైట్‌లు తెచ్చే పనిలో ఉంది. మొత్తానికి... హైదరాబాద్‌ నుంచి అన్నవరానికి వెళ్లినంత సమయంలోనే ఏకంగా అమెరికాకీ వెళ్లే రోజులు ఎంతో దూరంలో లేవనే చెప్పాలి!


ఫస్ట్‌.. ఫస్ట్‌..!

ఆధునిక అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం మొదలైంది ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌ నగరంలోనే! 18వ శతాబ్దం మధ్యలో అక్కడ ప్రారంభమైన ఈ సంస్కృతి వందేళ్లలో ఐరోపా అంతటా వ్యాపించింది.


మీకు తెలుసా!

భారతదేశం లోని సీలింగ్‌ ఫ్యాన్‌లు సాధారణంగా ఒకవైపే తిరుగుతాయి కదా! అదే ఆస్ట్రేలియా, అమెరికాల్లోని ఫ్యాన్‌లని అవసరమైతే ఎటువైపైనా తిరిగేలా చేయొచ్చు. చలికాలంలో ఇవి సవ్యదిశలో తిరిగి వేడినీ... వేసవిలో మన ఫ్యాన్‌లలాగే అపసవ్య దిశలో తిరిగి చల్లదనాన్నీ ఇస్తాయట!


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని