Updated : 20 Feb 2022 04:20 IST

ఆ ఫొటోలు చూసి షాకయ్యా!

‘అ ఆ’తో తెలుగు తెరకు పరిచయమై... వరుస అవకాశాలు అందుకుంటూ... సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపించుకున్న మలయాళ నటి అనుపమా పరమేశ్వరన్‌. త్వరలో ‘కార్తికేయ 2’, ‘హెలెన్‌’, ‘18 పేజెస్‌’ సిని మాలతో మళ్లీ తెలుగు అభిమానుల్ని పలకరించబోతున్న అను... తన మనసులోని ముచ్చట్లను చెబుతోందిలా...

మొదటి అవకాశం అప్పుడే

నేను మొదటిసారి మలయాళ ‘ప్రేమమ్‌’లో మేరీ జార్జ్‌ పాత్రలో నటించాననేది అందరికీ తెలిసిందే. నిజానికి అప్పుడు నాకు పందొమ్మిదేళ్లంతే. కొట్టాయంలోని సీఎంఎస్‌ కాలేజీలో కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌లో డిగ్రీ చేస్తున్నా. సినిమా అవకాశం గురించి తెలియడంతో ప్రయత్నిద్దామని ఆడిషన్‌కు వెళ్తే... అవకాశం ఇచ్చారు. అది పూర్తయ్యాక మరికొన్ని సినిమాలు రావడంతో చదువును ఆపేయాల్సి వచ్చింది. ఆ అవకాశాల్లో భాగంగానే తెలుగులో మొదటిసారి ‘అ ఆ’లో నటించా. తరువాత డిగ్రీని పూర్తిచేశాననుకోండీ.

జంతు ప్రేమికురాలిని

నాకు చిన్నప్పటినుంచీ కుక్కలంటే చాలా ఇష్టం. మా ఇంట్లోనూ మూడు కుక్కపిల్లలు ఉండేవి. కొన్నిరోజుల క్రితం పార్వోవైరస్‌ కారణంగా రెండు చనిపోయాయి. ఆ బాధ నుంచి కోలుకున్నాక పార్వో వైరస్‌ గురించి జంతు ప్రేమికులకు సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పించడం మొదలుపెట్టా.


సహాయ దర్శకురాలిగానూ..

మొదటి సినిమా తరువాత ఇదే నా కెరీర్‌ అనుకుని నన్ను నేను ఎప్పటికప్పుడు నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నా. అయితే కొన్నాళ్లక్రితం మలయాళంలో ‘మనియరయిలే అశోకన్‌’ అనే సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసే అవకాశం వచ్చింది. నిజానికి ఈ సినిమాకు దుల్కర్‌ సల్మాన్‌ నిర్మాత. అందులో నేను నటించా కూడా. అయితే.. దుల్కర్‌ ఓసారి సరదాగా ‘సహాయ దర్శకురాలిగానూ ట్రై చేయొచ్చు కదా’ అనడంతో ప్రయత్నించా. ఇప్పుడు నాకు అందులోనూ ప్రావీణ్యం వచ్చేసింది.
 

ఇష్టపడే ఆహారం

మా కేరళ సాద్య. నేను ఎక్కువగా పోషకాహారానికే ప్రాధాన్యం ఇస్తా కానీ.. చీట్‌ మీల్‌ రోజున మాత్రం పిజా, చాక్లెట్‌, ఐస్‌క్రీమ్‌ వంటివి ఇష్టంగా లాగించేస్తుంటా.


ఫొటోలు మార్చారు...

రెండేళ్లక్రితం అనుకుంటా.. నా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ని హ్యాక్‌ చేసి.. నా ఫొటోలను మార్ఫింగ్‌ చేశారెవరో. దాంతో ఆ ఫొటోలన్నీ వైరల్‌ అయ్యాయి. మొదట వాటిని చూసినప్పుడు ఒక్కక్షణం షాకయ్యా కానీ.. వెంటనే తేరుకుని సైబర్‌క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేశా. ఆ తరువాత సామాజికమాధ్యమాల్లో ఘాటుగా పోస్ట్‌ పెట్టేసరికి.. అప్పటివరకూ నామీద వచ్చిన కామెంట్లన్నీ ఆగిపోయాయి.


మెసేజ్‌లు చదువుతా

నాకు తరచూ అభిమానుల నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. నేను అవన్నీ చూడటమే కాదు... చాలా వాటికి సమాధానం కూడా ఇస్తుంటా. వాళ్లు టైం తీసుకుని నాకు మెసేజ్‌లు చేస్తారు కాబట్టి.. నేను ఆ టైంకు విలువ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటా.
 

సినిమాల్లోకి ఎలా వచ్చానంటే..
మాది కేరళలోని మధ్యతరగతి కుటుంబం. అమ్మ ఎల్‌.ఐ.సి ఉద్యోగిని. నాకో తమ్ముడు. చిన్నప్పటినుంచీ నాకు పెయింటింగ్‌ అంటే ఇష్టం. నాకు అసలు సినిమాల్లోకి రావాలనే ఆలోచనే లేదు. అయితే మా ప్రాంతంలో ఓ డ్రామా గ్రూప్‌ ఉండేది. చిన్నప్పుడే అందులో సభ్యురాలినయ్యా. ఆ గ్రూప్‌ రకరకాల వర్క్‌షాప్‌లు నిర్వహించేది. అలా కొన్ని స్కిట్‌లు కూడా వేశా. అవన్నీ చేస్తున్నప్పుడే సినిమాలపైన ఆసక్తి పెరిగింది.

నచ్చే ప్రాంతం

 పారిస్‌, వార్సా


అదే నా బలహీనతా బలం కూడా..

నాకు చాలా త్వరగా కోపం వస్తుంది.. కానీ అంతే త్వరగా పోతుంది కూడా. నేను జీవితంలో ఎక్కువగా ప్రశాంతతను కోరుకుంటా. హాయిగా నవ్వుతూ, ఆనందంగా ఉండటమే నాకు ఇష్టం. అందుకే వీలైనంతవరకూ ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తుంటా.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts