ఆ రాత్రి... బతికి బయటపడతామనుకోలేదు!
‘కంఫర్ట్ జోన్ అన్న పదం ఇప్పుడు జీవితానికీ, కెరీర్‌కే కాదు... పర్యటనలకీ వర్తిస్తుంది. బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతాలకి ప్యాకేజ్డ్ టూర్‌ల సాయంతో వెళ్ళడాన్ని ఇలా కంఫర్ట్‌జోన్ పర్యటనలు అనొచ్చు.
ఆ రాత్రి... బతికి బయటపడతామనుకోలేదు!
‘కంఫర్ట్ జోన్ అన్న పదం ఇప్పుడు జీవితానికీ, కెరీర్‌కే కాదు... పర్యటనలకీ వర్తిస్తుంది. బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతాలకి ప్యాకేజ్డ్ టూర్‌ల సాయంతో వెళ్ళడాన్ని ఇలా కంఫర్ట్‌జోన్ పర్యటనలు అనొచ్చు. ఈసారి అందుకు భిన్నంగా పోవాలనుకున్నాను. లద్దాఖ్‌లోని- ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుమార్గం ఖర్దుంగ్లా పాస్‌కి వెళ్ళాను. తిరుగు ప్రయాణంలో ప్రాణభీతి వేధించినా... జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని సొంతం చేసుకున్నాను...’ అంటారు హైదరాబాద్‌వాసి సుతారపు సోమశేఖర్. ఆయన ప్రయాణంలో ఉద్విగ్న అనుభవాలివి...
లద్దాఖ్‌కి ఓ సాహసయాత్రగా వెళ్ళాలని పదేళ్ళుగా అనుకుంటున్నా... అది ఇన్నాళ్ళకి నెరవేరింది. అన్నీ కలిసొచ్చి మార్చి చివర్లో బయల్దేరాలనుకున్నాను. కానీ ‘లద్దాఖ్‌లో జూన్ తర్వాతే సీజను. ఇప్పుడు వెళితే మైనస్ 15 డిగ్రీల చలి ఉంటుంది’ అని బంధుమిత్రులందరూ హెచ్చరించారు. ‘మంచు కరిగాక వెళితే మిగిలేది మట్టి కొండలే. వాటినేం చూస్తాం. పైగా పర్యాటకుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలుంటాయి. కాబట్టి రొటీన్‌కు భిన్నంగా వెళ్దాం’ అని భావించాను. దాంతో- చలి పులిని ఎదుర్కొనేందుకు స్వెట్టర్లూ, గ్లవ్స్, మౌంటెన్ సిక్‌నెస్‌ని తట్టుకునేందుకు ఔషధాలు తీసుకున్నాను. సన్‌గ్లాసెస్, సన్‌స్క్రీన్ లోషన్ కూడా తప్పనిసరని చెప్పడంతో... అవి ఎందుకో అప్పటికి అర్థంకాకున్నా వెంటపట్టుకెళ్ళాను...
హైదరాబాద్ నుంచి దిల్లీకి విమానంలో చేరుకున్నాను. అక్కడి నుంచి లేహ్ విమానం ఎక్కాను. గంట ప్రయాణం తర్వాత కిటికీలోంచి కిందికి చూడగానే సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాను.
పొరలుపొరల మంచుదుప్పటిని చుట్టుకుని సూర్యరశ్మికి చలికాచుకుంటున్న అద్భుత సౌందర్య రాశుల్లా కనిపించాయి పర్వతాలు! వాళ్ళ అందాల మోముల్లా వెలిగిపోతున్నాయి కొండ శిఖరాలు!
వాటిని చూస్తూ ప్రపంచాన్ని మరచిపోయాను. ఆ కొండల మధ్య ఉన్న ఓ మైదాన ప్రాంతం చుట్టూ విమానం చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాకే మళ్లీ ప్రపంచంలోకి వచ్చాను. ఆ మైదాన ప్రాంతమే మేం చేరుకోవాల్సిన ‘లేహ్’ అని అర్థమైంది. విమానాశ్రయంలో దిగి నేరుగా హోటల్‌కు చేరుకున్నాను. అది మధ్యాహ్నం. సాయంత్రం వరకూ చుట్టుపక్కల పర్యటక ప్రాంతాలు చుట్టేసి వద్దామనిపించింది. కానీ 11 వేల అడుగుల ఎత్తున ఉన్న లేహ్‌కి వచ్చాక కనీసం ఒకరోజైనా విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరని హోటల్‌వాళ్ళు చెప్పారు. వెళ్ళితీరతానని పట్టుబడితే ‘ఆసుపత్రి పాలవుతారు జాగ్రత్త!’ అని హెచ్చరించారు. దాంతో ఆగిపోయాను. లేహ్‌లో సూర్యాస్తమయం సాయంత్రం ఏడుకి మొదలవుతుంది. అందుకోసం ఆరున్నర నుంచే కిటికీ తెరిచి చూడటం ప్రారంభించాను...
జీవితంలో మరచిపోలేని అనుభవాన్ని సొంతం చేసుకున్నాను. మన ప్రాంతంలోలా అరుణిమదాల్చే అసుర సంధ్యకాదు అది! అప్పటిదాకా మామూలుగా ఉన్న సూర్యుడు ఒక్కసారిగా మంచుకొండల్ని ధగధగలాడించి... అంతలోనే- తెల్లటి బంతిలా మారి అదృశ్యమయ్యే వింత అది! ఇంతలో రాత్రయింది. గదిలోంచి కారిడార్‌లోకి వచ్చి తిరుగుతూ ఉంటే... చుక్కలు పూసిన ఆకాశం కాస్త ఎగిరితే చేతికి అందుతుందేమోన్నంత దగ్గరగా కనిపించింది.
ఖర్దుంగ్లా...
ఉదయం సూర్యోదయాన్ని చూద్దామని కిటికీ తెరిస్తే... బంగారాన్ని కరిగించి పోస్తున్నట్టు- మంచుకొండల నడుమ ప్రవహిస్తున్న వెలుగుని కళ్ళు తట్టుకోలేకపోయాయి. సన్‌గ్లాసెస్ అవసరమేంటో అప్పుడు అర్థమైంది. వాటిని ధరించే సూర్యోదయాన్ని తనివితీరా ఆస్వాదించాను. ఆ తర్వాత ఖర్దుంగ్లా పాస్‌కి ప్రయాణం. ప్రపంచంలోనే అతి ఎత్తైన రోడ్డు మార్గం అది... 17,982 అడుగుల ఎత్తున ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతి పత్రంతోపాటూ ఎండలు బాగా ఉండటంతో డజను నీళ్ల సీసాలూ, ఎందుకైనా మంచిదని ఆక్సిజన్ సిలిండరూ తీసుకెళ్ళాను. సుమారు నాలుగుగంటల ప్రయాణం తరువాత ఖర్దుంగ్లా పాస్ చేరుకున్నాను. అక్కడి సైనికుల్లో తెలుగువాళ్ళూ ఉంటే మాటలు కలిపాను. అంత ఎత్తులో పదినిమిషాలకంటే ఎక్కువ సేపుంటే శ్వాస ఇబ్బందులు వస్తాయి. కానీ అక్కడి హిమగిరుల సౌందర్యం కదలనీయకుండా కట్టిపడేసింది. 20 నిమిషాలు అక్కడ గడిపాక... ఇక వెళ్ళడం తప్పదన్నట్టు వెనుదిరిగాను. అక్కడి నుంచి కిందికి నూబ్రా వ్యాలీ వైపు ప్రయాణం. మధ్యాహ్నానికల్లా ఆ వ్యాలీలోని డిస్కిట్ ప్రాంతానికి చేరుకున్నాను. కాసేపు విశ్రాంతి తర్వాత హుండర్‌కి వెళ్లాను. మంచు కొండల నడుమ అదో ఎడారి ప్రాంతం. అక్కడ లేహ్‌కే ప్రత్యేకమైన రెండు మూపురాల ఒంటెలపైన... కాసేపు ప్రయాణం చేశాను. మరుసటి రోజు ఉదయమే ఖల్సర్, దుర్బుక్ మీదుగా ప్యాంగ్యాంగ్ లేక్‌కి బయల్దేరాను. దాదాపు 160 కి.మీ. దూరం. మధ్యలో లోతైన లోయలకి సమీపాన... కొండల అంచున ప్రయాణం. మార్గమధ్యంలో ఓ చోట మంచు వర్షం కురిస్తే వాహనంలోంచి దిగి ఆ తెల్లటి వర్షంలో తడిచాను. కానీ ఆ మంచు వర్షంతో ఆనందమే కాదు... పెద్ద ప్రమాదమూ పొంచి ఉంటుందని ఆ సాయంత్రమే అర్థమైంది...
ప్యాంగ్యాంగ్ లేక్...
నూబ్రా వ్యాలీ నుంచి ప్యాంగ్యాంగ్ లేక్‌కి చేరుకున్నాను. పేరుకే అది లేక్ కానీ... దాని పొడవు 120 కిలోమీటర్లు! అందులో మూడింట ఒక వంతు భారతదేశంలో ఉంటే... మిగతా భాగం చైనా అధీనంలో ఉంది. అక్కడ వాహనం ఆపి... కాళ్ళు కింద పెడితే చలి మామూలుగా లేదు. శరీరం కొంకర్లు పోసాగింది. అయినా సరే ‘మనం వచ్చింది... ఇలాంటి అనుభూతి కోసమే కదా!’ అనుకుంటూ ధైర్యంగానే ముందుకు అడుగేశాను. చలికాలం కాబట్టి ఆ సరస్సు గడ్డకట్టుకుపోయుంది. దాని దగ్గరగా వెళ్ళాక ‘గడ్డకట్టిన ఆ నదిపైన నడిస్తే..!’ అన్న ఆలోచన వచ్చింది. అంతలోనే- ‘అమ్మో ఎక్కడైనా పగులు ఉండి పడిపోతేనో!’ అన్న భయం ఆపింది. అయినా సరే - ‘సాహసం చేయరా డింభకా!’ అనుకుంటూ ఒక్కో అడుగూ వేయడం మొదలుపెట్టాను. నన్ను చూసి మిగతా పర్యటకులూ రావడం మొదలుపెట్టారు. ఇంకేం- కనుచూపుమేరా అద్దంలా గడ్డకట్టిన ఆ నదిమీద ఆటలూపాటలతో సందడిగా గడిచింది. గంట తర్వాత ప్యాంగ్యాంగ్ నుంచి వీడ్కోలు తీసుకుని లెహ్ బయల్దేరాను...
ప్రాణాల ఉక్కిరిబిక్కిరి...
మేము లేహ్‌కి చేరుకోవడానికి మధ్యలో 17,500 అడుగుల ఎత్తున్న చాంగ్‌లా పాస్‌కి వెళ్ళాలి. సాయంత్రం ఆరులోపు అక్కడి చెక్‌పోస్టుని దాటితేనే లేహ్‌కి వెళ్ళడానికి అనుమతిస్తారు. ప్యాంగ్యాంగ్ నుంచి తొలి 40 కిలోమీటర్ల దాకా మట్టిరోడ్డులో చాలా మెల్లగా సాగింది మా ప్రయాణం. చూస్తుండగానే వాతావరణం మారి హిమపాతం మొదలైంది. ‘ఇవాళ మనం లెహ్‌కి సురక్షితంగా చేరడం దేవుడి దయ’ అన్నాడు మా డ్రైవర్. మంచు భారీగా పడి రోడ్డుమీద పేరుకుపోయి వాహనాలు కదలకపోతే రాత్రి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది! రాత్రివేళల్లో ఇక్కడ మైనస్ 20 డిగ్రీల చలి ఉంటుంది... ఆక్సిజన్ తగ్గుతుంది. ఆ రాత్రి ఏమైనా కావొచ్చు... ఆ ఆలోచనలతో నాకు గుండెలో గుబులు మొదలైంది. మేం కొంతదూరం వెళ్లాక ఆర్మీ క్యాంపు కనిపించింది. ఆ రాత్రికి అక్కడ ఆగుదామా అన్నాను కానీ... డ్రైవర్ ‘వద్దండి, మనం వెళ్ళిపోవచ్చు’ అన్నాడు నమ్మకంగా. కొంత ప్రయాణించామో లేదో హిమవర్షం పెరిగింది. పొద్దున మేం ఆనందించినా అదే మంచు... ఇప్పుడు వాహనాల చక్రాలని కదలనీయడం లేదు. అతికష్టంపైన ఏడు కిలోమీటర్లు దాటాం. మేం వెళ్ళాల్సిన చాంగ్‌లాపాస్ మరో ఆరేడు కిలోమీటర్లే ఉందనగా... పిడుగులాంటి వార్త అందింది. ముందెక్కడో మంచుచరియ విరిగిపడి మా రోడ్డుని మూసేసిందని తెలిసింది. దాంతో మా ముందూ వెనకా వాహనాలన్నీ ఆగిపోయాయి. దానికి తోడు హిమపాతంతో రోడ్డుపైన మూడు అడుగుల మేర మంచు పేరుకుపోసాగింది.
సమయం కరిగిపోతోంది...
మేం వాహనంలో ఉండగానే సాయంత్రం ఏడు దాటింది. సూర్యాస్తమయమైంది... చలి పెరగడం మొదలైంది. ఆ రాత్రి దారిలో ఉండిపోవాల్సి వస్తే...? ఆ ఆలోచనే వణికించింది. చలి ఎక్కువయ్యేకొద్దీ ఆందోళనతో నాకు శ్వాస ఆడటంలేదు. వాహనంలోనే ఉండి ఆక్సిజన్ పెట్టుకోవడం ప్రారంభించాను. ఇంతలో మాకు ముందున్న వాహనంలో ఎవరో సైనికాధికారి ఉన్నారని తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు... చాంగ్‌లాపాస్ నుంచి ఓ డోజర్ వాహనం విరిగిపడ్డ చరియల్నీ, దట్టంగా పేరుకుపోయిన మంచునీ తొలగించుకుంటూ మావైపు రాసాగింది. ఏడున్నర గంటల సమయంలో వాహనాలు ముందుకు కదిలాయి. ఇంత జరిగినా మేం ‘హమ్మయ్య’ అని ఊపిరిపీల్చుకోవడానికి లేదు... చాంగ్‌లా పాస్‌కి వెళ్ళే దారీ, అక్కడి నుంచి లేహ్ వైపు దిగే దారీ... పూర్తిగా లోయల మయం. ఒక్క అడుగు అటూఇటూ అయినా... ఎముకలు కూడా దొరకవు. పగటిపూట వెళ్ళడమే అక్కడ కష్టం. అలాంటిది రాత్రివేళ ప్రయాణమంటే సాహసంతో కూడుకున్న పని. నేను ఇక వెనక్కి వెళ్ళి ఆర్మీక్యాంపులో ఉండే అవకాశమూ లేదు. రోడ్డుపైన పేరుకున్న మంచు కారణంగా బ్రేక్‌లు పడటం లేదు. ‘ఫర్వాలేదు సార్... నాకిక్కడ పదేళ్ళ అనుభవం ఉంది’ అని డ్రైవర్ చెబుతున్నా గుబులు పోలేదు. చుట్టూ చిమ్మచీకటి. పోనుపోను ఏది రోడ్డో, ఏది లోయో తెలియని పరిస్థితి. మూలిగే నక్కపైన తాడిపండన్నట్టు... మా జీపు హెడ్‌లైట్ల వెలుగు తగ్గసాగింది. మా సెల్‌ఫోన్ల నుంచి లైట్లూ వేసి మెల్లగా తీసుకెళ్ళాం. అలా రెండు గంటల ప్రయాణం తర్వాత మైదాన ప్రాంతంలోకి వచ్చాను. మరో గంటన్నరలో లేహ్ చేరుకుని... ‘బతుకు జీవుడా!’ అనుకున్నాను.
అద్భుత సంగమం...
మరుసటి రోజు ఉదయం లేహ్ పట్టణంలోని మ్యాగ్నటిక్ హిల్, గురుద్వారా సాహిబ్, సంగం వ్యూ పాయింట్... చూస్తుంటే ఒక్కోటీ ఒక్కో అద్భుతం. చైనా, పాకిస్థాన్ యుద్ధాల్లో చనిపోయిన సైనికుల జ్ఞాపకార్థం ‘హాల్ ఆఫ్ ఫేం’ నిర్మించారు. లోపలికి వెళ్లిన మాకు అక్కడి సైనికుల త్యాగాలు... కార్గిల్ సహా యుద్ధ విశేషాలు వివరించారు. అక్కడ్నుంచి ‘సంగం వ్యూపాయింట్’ చేరుకున్నాను. నీలి రంగు సింధునదీ, బూడిదరంగు జన్‌స్కర్ నదులు కలిసి తెల్లటి గాజు తెరలాంటి నీళ్ళుగా మారడం... ఓ అద్భుత దృశ్యకావ్యం. ఆ స్వచ్ఛజలాల్లో అడుగుపెట్టడం మరచిపోలేని అనుభవం. అలా ఈ పర్యటనతో జీవితానికి సరిపడా సంతృప్తిని నింపుకుని మరుసటి రోజు హైదరాబాద్ తిరిగి వచ్చాను.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్