Updated : 30 Oct 2022 03:24 IST

ఇక్కడ రాహుల్‌... అక్కడ రాల్‌విన్సీ!

రాహుల్‌ గాంధీ... దేశానికి ముగ్గురు ప్రధానులను అందించిన కుటుంబ వారసుడు. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన పార్టీకి ప్రధాన నాయకుడు. మరి ఒక వ్యక్తిగా తనేంటో తరచి చూస్తే..!


లోటు

దిల్లీ, దేహ్రాదూన్‌లలో ప్రాథమిక విద్యను అభ్యసించిన రాహుల్‌ నానమ్మ మరణం తరవాత భద్రతా కారణాల దృష్ట్యా ఇంట్లోనే చదువుకోవాల్సి వచ్చింది. బాల్యంలో స్కూల్‌డేస్‌నూ, స్నేహితుల్నీ, సరదాల్నీ మిస్‌ అయిన లోటు ఎప్పటికీ అలానే ఉంటుంది అంటుంటాడు.


పేరు మార్చి...

ఉన్నత విద్యకోసం ఫ్లోరిడాలోని రోలిన్స్‌ కళాశాలకు వెళ్లినా.. అక్కడ ఎవరికీ తన గురించి తెలియకూడదనే ఉద్దేశంతో రాహుల్‌ పేరును రాల్‌విన్సీగా మార్చుకున్నాడు.


మొదటి వృత్తి

కేంబ్రిడ్జిలో ‘అంతర్జాతీయ వ్యవహారాలు’, ‘అభివృద్ధి అధ్యయనం’తదితర సబ్జెక్టులు చదివి పట్టా అందుకున్నాడు. ఆ తరవాత  మూడేళ్లపాటు లండన్‌లో ఓ కన్సల్టింగ్‌ సంస్థలో ఉద్యోగం చేసిన రాహుల్‌- కొంత కాలానికి ముంబయి వచ్చి సొంతంగా ఓ సంస్థనీ నడిపాడు.


స్ఫూర్తి

స్వామి వివేకానంద రచనలు ఇష్టపడే రాహుల్‌ పుస్తకాల పురుగు. రాజకీయాలూ, అర్థశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలూ చదువుతాడు. థామస్‌ ఫ్రైౖడ్‌మన్‌ రాసిన ‘హాట్‌ ఫ్లాట్‌ అండ్‌ క్రౌడెడ్‌’, ఆన్‌ పాచెట్‌ నవల ‘కామన్‌వెల్త్‌’ నచ్చే పుస్తకాలు.


ఆరోగ్య రహస్యం

ఫిట్‌నెస్‌పైన శ్రద్ధ ఎక్కువ. ఆరోగ్యం, సిక్స్‌ప్యాక్‌ బాడీకోసం వ్యాయామంలో భాగంగా బ్యాడ్మింటన్‌ ఆడుతుంటాడు. ఈత కొడుతుంటాడు. పర్యటనల్లో సైతం ఓ గంట జాగింగ్‌ చేయాల్సిందే.


యుద్ధ విద్యల్లో...

జపనీస్‌ మార్షల్‌ ఆర్ట్‌ ఐకిడోలో రాహుల్‌ బ్లాక్‌ బెల్ట్‌ హోల్డర్‌. కత్తి సాము, బ్రెజిలియన్‌ యుద్ధ విద్యలు, రైఫిల్‌ షూటింగ్‌లలోనూ ప్రావీణ్యముంది.


అలా చూడాలని...

ఫుట్‌బాల్‌ క్రీడాకారుల్ని ప్రోత్సహించే రాహుల్‌కి క్రికెట్‌ చాలా ఇష్టం. అలాగని తెర మీద చూడ్డానికి ఇష్టపడడు. నేరుగా చూస్తేనే కిక్‌ అని చెబుతుంటాడు.


ఓ అలవాటు

ప్రయాణాలు చేసేటప్పుడు చాక్లెట్లూ చిప్స్‌ వెంట తీసుకెళ్లడం అలవాటు. తన పక్కనున్న ప్రయాణికులకూ ఇస్తుంటాడు.


ఇష్టంగా తినేది

మోమోస్‌ అంటే రాహుల్‌కి చాలా ఇష్టం. బిర్యానీ, ఐస్‌క్రీమ్‌, నూడుల్స్‌ వంటివి రెస్టరంట్‌కి వెళ్లి తింటుంటాడు. అప్పుడప్పుడూ సామాన్యుడిలా కాకా హోటళ్లకీ వెళ్లి మరీ తనకి ఇష్టమైనవి తింటూ మీడియా కెమెరాల కంటపడుతుంటాడు.


అమ్మతో రయ్‌మంటూ...

డ్రైవర్‌ అందుబాటులో లేకపోతే తనే కారు నడుపుతూ వెళతాడు. టాటా సఫారీ, లాండ్‌ క్రూయిజర్‌ నడపడం రాహుల్‌కి మహా సరదా. అమ్మని పక్కన కూర్చోబెట్టుకుని లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లాలనేది అతడి తీరని కోరిక.


చెల్లికోసం

రాహుల్‌కు అభిమాన నటులెవరూ లేరు. మంచి పెర్ఫార్మెన్స్‌ ఎవరు ఇచ్చినా అభిమానిస్తాడు. చెల్లి ప్రియాంక కోసం ఆమెతో కలిసి సినిమాలు చూడటం చిన్నప్పట్నుంచీ రాహుల్‌కి ఇష్టమైన వ్యాపకం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు