మహేశ్‌బాబు నో చెప్పారు!

‘గని’ సినిమాలోని ‘రోమియోకి జూలియెట్‌లా... రేడియోకి శాటిలైట్‌లా...’ పాటతో పరిచయమైంది దర్శకుడు శంకర్‌ చిన్న కూతురు అదితీ శంకర్‌. ఈ మధ్యనే ఎంబీబీఎస్‌ పూర్తి చేసి డాక్టర్‌ పట్టా అందుకున్న ఈ అమ్మడు యాక్టర్‌ కూడా.

Published : 24 Apr 2022 00:56 IST

మహేశ్‌బాబు నో చెప్పారు!

‘గని’ సినిమాలోని ‘రోమియోకి జూలియెట్‌లా... రేడియోకి శాటిలైట్‌లా...’ పాటతో పరిచయమైంది దర్శకుడు శంకర్‌ చిన్న కూతురు అదితీ శంకర్‌. ఈ మధ్యనే ఎంబీబీఎస్‌ పూర్తి చేసి డాక్టర్‌ పట్టా అందుకున్న ఈ అమ్మడు యాక్టర్‌ కూడా. కార్తీ, శింబుకి జోడీగా నటిస్తున్న అదితి గురించి ఆసక్తికర విశేషాలివిగో...


‘గని’తో మొదలు...

మా అమ్మకి సంగీతమంటే చాలా ఇష్టం. ఎప్పుడూ కూనిరాగాలు తీస్తుంటుంది. అందుకే నేను సంగీతం నేర్చుకున్నా. ఖాళీగా ఉంటే పాడుతూ ఫోన్‌లో రికార్డ్‌ చేసుకుంటూ ఉండేదాన్ని. ఒకసారి అనుకోకుండా ఆ ట్రాక్‌లు విన్న తమన్‌... ‘గని’లో పాడే అవకాశమిచ్చారు. ఆ పాటే ‘రోమియోకి జూలియెట్‌లా...’. దీనికోసం తమన్‌ ప్రత్యేకంగా కవర్‌ సాంగ్‌ షూట్‌ చేసి నన్ను ప్రేక్షకులకు పరిచయం చేశారు.


ఏడాది సమయం...

చిన్నతనం నుంచీ సినిమా వాతావరణంలో పెరగడం వల్ల హీరోయిన్‌ అవ్వాలనిపించింది. అయితే నాన్నకి ఇష్టమని చదువుపైన దృష్టి పెట్టా. ఎంబీబీఎస్‌లో చేరాకే నేను హీరోయిన్‌ అవ్వాలనుకుంటున్నట్టు నాన్నకి చెప్పా. ‘సినీ రంగంలో నిలదొక్కుకోవడం అంత తేలిక కాదు. నా పేరు వాడుకోకుండా అవకాశాల కోసం నువ్వే ప్రయత్నించు. అందుకు ఏడాది సమయం ఇస్తున్నా. ఈ లోపులో అవకాశాలు వస్తే సరేసరి. లేదంటే ఇండస్ట్రీ పేరెత్త కూడదు’ అని షరతు పెట్టారు.


ఒత్తిడి అనిపిస్తే సినిమా...

నాకు నాన్న సినిమాలన్నీ ఇష్టం. ‘జెంటిల్‌మేన్‌’ బాగా నచ్చుతుంది. అలానే నాన్న తీసిన సినిమాలు దాదాపుగా అన్నీ తెలుగులోనూ విడుదలవుతుంటాయి. ఈ కసరత్తుల్లో భాగంగా నాన్న తెలుగు నేర్చుకున్నారు. తన వల్ల నాకూ వచ్చింది. టాలీవుడ్‌ సినిమాలు బాగా చూస్తా. చదువుకుంటున్నప్పుడు ఒత్తిడిగా అనిపిస్తే ఏదో ఒక సినిమా చూసి రిఫ్రెష్‌ అయ్యేదాన్ని.


డాక్టర్‌ అవ్వాలని...

నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. నాన్నకి చదువంటే చాలా ఇష్టం. ఆయన మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాకే సినిమాల్లోకి వచ్చారు. మనకో డిగ్రీ తప్పకుండా ఉండి తీరాలని ఎప్పుడూ చెబుతుండేవారు. నాకు డాక్టర్ని అయి పేదలకి సేవ చేయాలని చిన్నప్పట్నుంచీ ఉండేది. అందుకే ఎంబీబీఎస్‌ చదివి ఈ మధ్యనే పట్టా తీసుకున్నా. డాక్టర్‌ చదువు చాలా శ్రమతో కూడుకున్నది. రాత్రుళ్లు నిద్రమానేసి కప్పుల కొద్దీ టీ కాఫీలు తాగుతూ మరీ చదువుకునేదాన్ని. అంత కష్టపడి చదువుకున్నా కనుకే ఆ వృత్తిని పూర్తిగా వదల్లేక ఖాళీ సమయాల్లో పేదల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నా.


ముందు భయపడ్డారు...

‘విరుమన్‌’లో కార్తీకి జోడీగా నటించమని దర్శకుడు నన్ను సంప్రదించారు. అంతకంటే ముందు నాన్న అనుమతీ తీసుకున్నారు. అయితే మోడ్రన్‌గా ఉండే నేను పల్లెటూరి అమ్మాయి పాత్రకి నప్పుతానో లేదోనని భయపడ్డారు కార్తీ. స్క్రీన్‌ టెస్ట్‌లో మధురై యాసలో గలగలా మాట్లాడేసరికి ఆ పాత్రకి నన్నే ఓకే చేశారు. సూర్య, జ్యోతికల నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో ఎంబీబీఎస్‌ చదువుతూనే నటించా. ప్రస్తుతం శింబు పక్కన మరో సినిమాలోనూ చేస్తున్నా.


ఆ తీరు నచ్చింది...

నేను మహేశ్‌బాబుకి వీరాభిమానిని. ఒకసారి ముంబయిలో మేము దిగిన హోటల్‌లోనే మహేశ్‌ కూడా దిగారు. ఆ విషయం తెలిసి ఆయన దగ్గరకెళ్లి నాతో ఫొటో దిగమని అడిగాను. ‘టైమ్‌ కాదమ్మా... చూస్తున్నారుగా ఫ్యామిలీతో ఉన్నాను’ అని చాలా సున్నితంగా చెప్పారు. ఆ తత్వం నాకెంతో నచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..