Dheekshitha Venkadeshan: ‘చమ్కీల అంగీలేసి’ ... ఇంత గుర్తింపు తెస్తుందనుకోలేదు!

యూట్యూబ్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ‘చమ్కీల అంగీలేసి ఓ వదినే’ పాటే వినిపిస్తోంది.

Updated : 02 Apr 2023 09:32 IST

‘చమ్కీల అంగీలేసి’ ... ఇంత గుర్తింపు తెస్తుందనుకోలేదు!

యూట్యూబ్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ‘చమ్కీల అంగీలేసి ఓ వదినే’ పాటే వినిపిస్తోంది. ఎంతగానో వైరల్‌ అయిన ఈ వీడియోలో కీర్తి సురేశ్‌ డాన్స్‌కు తగినట్టు..  పాటను ఆలపించిన ఆ అమ్మాయిని చూస్తే ఎవరో విదేశీయురాలు అనుకుంటారు. కానీ, ఆమె మరెవరో కాదు దీక్షితా వెంకటేశన్‌. ‘ధీ’గా అందరికీ సుపరిచితురాలైన ఈ అమ్మాయి మనకు తెలిసిన ఎన్నో పాటలు పాడింది.


దసరాలో అవకాశం ఎలాగంటే...

మా నాన్న పనిచేసే ప్రతి సినిమాలో నాకు అవకాశం ఇస్తారని చాలామంది అనుకుంటారు కానీ... కాదు. ఓ పాటను నేను పాడితేనే బాగుంటుందని ఆయన గట్టిగా నమ్మినప్పుడే నన్ను పిలుస్తారు. ఈ మధ్య విడుదలైన ‘దసరా’లోని ‘చమ్కీల అంగీలేసి ఓ వదినే’... పాటను నాన్న నా చేత అలా పాడించిందే. తెలంగాణ యాసలో పాడటం నాకు నిజంగా ఓ సవాలే కానీ...అది ఇంత గుర్తింపు తెస్తుందని అస్సలు ఊహించలేదు. ఆ పాట విడుదలైన అతి తక్కువ సమయంలోనే లక్షల్లోవ్యూస్‌ వచ్చాయనీ, ఎక్కడ చూసినా అదే వినబడుతోందనీ తెలిసి చాలా ఆనందంగా అనిపించింది.


ఆయన తిట్టినా సంతోషమే

ప్రపంచంలో నాకు ఇష్టమైన సంగీత దర్శకుల్లో మా నాన్న సంతోష్‌ నారాయణన్‌ ఒకరు. ఆయన దగ్గర పనిచేయడం నాకు దొరికిన అదృష్టంగా భావిస్తా. ఆయన నాకు సవతి తండ్రే అయినా... చిన్నప్పటినుంచీ సొంత కూతురిలానే చూసుకున్నారు. నాన్న ఇతర గాయకులతో సరదాగా, నవ్వుతూ పనిచేస్తారు కానీ నేను ఏ చిన్న పొరపాటు చేసినా వెంటనే అరిచేస్తారు. చూసేవాళ్లకు ఆయన నిజంగా కోప్పడుతున్నారని అనిపిస్తుంది కానీ... నేను పట్టించుకోను. ఎందుకంటే నేను పాడే ప్రతిపాటలో నా శ్రమ వందశాతం కనిపించాలనేదే ఆయన కోపానికి కారణం!


సంగీత ప్రపంచంలోనే పెరిగా..

మేం శ్రీలంక తమిళులమే అయినా... నేను పుట్టి పెరిగింది మాత్రం సిడ్నీలో. మా అమ్మమ్మకు కర్ణాటక సంగీతం వచ్చు. మా అమ్మ మీనాక్షి అయ్యర్‌ కూడా సంగీతం నేర్పించేది, పాటలూ పాడేది. అలాగని నేనెప్పుడూ కూర్చుని సాధన చేయలేదు కానీ... శ్రద్ధగా వినేదాన్ని. తోచినట్లుగా పాడేదాన్ని. నా పదిహేనో ఏట అనుకుంటా... మా నాన్న ‘పిజ్జా2-విల్లా’లో ‘డిస్కో ఉమన్‌’ అనే పాటను నాచేత పాడించారు. ఆ తరువాతి నుంచీ నాకు సంగీతంపైన ఇష్టం పెరిగింది. దాంతో రకరకాల పాటలు వినడం, పాడటం.. ప్రాక్టీస్‌ చేయడం.. ఇలా నా ప్రపంచంలో సంగీతం తప్ప ఏమీ లేదు. రోజుకు అయిదు రకాల ఆల్బమ్‌లు వింటూ... నన్ను నేను మార్చుకునేందుకు ప్రయత్నించా.  


సుధా ఆంటీని మర్చిపోను

ఇండస్ట్రీలోకి వచ్చి నాన్న దగ్గర  పాడుతున్నా... నా గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రం ‘గురు’లోని ‘ఓ సక్కనోడా’ పాటతోనే. ఈ విషయంలో దర్శకురాలు సుధా ఆంటీకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఆ తరువాత మళ్లీ ‘ఆకాశం నీ హద్దురా’ లోనూ ‘కాటుక కనులే మెరిసిపోయే’ పాటనూ నాచేతే పాడించారు. ఈ రెండూ నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక, ‘మారి 2’ లోని  ‘రౌడీ బేబీ’ గురించయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


* సంగీతంలో స్ఫూర్తి
అమెరికాకు చెందిన జాజ్‌ గాయని ఎల్లా ఫిట్జ్‌రాల్డ్‌.

* పాటలు కాకుండా...
రాయడం, చదవడం, దుస్తుల్ని డిజైన్‌ చేయడం అంటే ఇష్టం.

* ఇష్టపడే గాయనీ గాయకులు
ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి, పీబీ శ్రీనివాస్‌ల గాత్రం నచ్చుతుంది.

* గాయని కాకపోయి ఉంటే...
కళలకు సంబంధించిన ఏదో ఒక రంగంలోనే స్థిరపడి ఉండేదాన్ని.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..