ఆటకు ముందు చన్నీళ్ల స్నానం చేయాల్సిందే!

ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 21 గ్రాండ్‌స్లామ్‌లు సొంతం చేసుకుని టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్లను గెలిచిన ఆటగాడిగా రికార్డు సాధించాడు రఫెల్‌నాదల్‌.

Published : 06 Feb 2022 00:28 IST

ఆటకు ముందు చన్నీళ్ల స్నానం చేయాల్సిందే!

ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 21 గ్రాండ్‌స్లామ్‌లు సొంతం చేసుకుని టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్లను గెలిచిన ఆటగాడిగా రికార్డు సాధించాడు రఫెల్‌నాదల్‌. వరస విజయాలతో ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకుంటున్న ఈ స్పెయిన్‌ క్రీడాకారుడి ఇష్టాయిష్టాల గురించి...!


అప్పుడు ప్రోత్సహించలేదు

క్రీడాకారులకు ఆర్థికంగా వెన్నుదన్ను ఉంటే.. ఎక్కడికైనా వెళ్లి ఆడగలరు. కానీ నేను టీనేజీలో ఉన్నప్పుడు నాకు మా స్పెయిన్‌ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. ఎందుకో తెలుసా... వాళ్లేమో నన్ను బార్సిలోనాకు వెళ్లి శిక్షణ తీసుకోవాలని సూచించారు. కానీ... అలా వెళ్తే నా చదువుకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఇంట్లోవాళ్లు వద్దన్నారు. దాంతో మా దేశంలో క్రీడాకారులకు ఇచ్చే చాలా ప్రోత్సాహకాలను నేను పొందలేకపోయా.


అవి కచ్చితంగా పాటిస్తా

కోర్టులోకి అడుగుపెట్టాక... ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో శాయశక్తులా పోరాడతా కానీ... బరిలో దిగేముందు చిన్నచిన్న నమ్మకాలను పాటిస్తా. పోటీకి వెళ్లే ముందు తప్పనిసరిగా చన్నీళ్ల స్నానమే చేస్తా. అదేవిధంగా కోర్టులోకి వచ్చాక నాకు సంబంధించిన నీళ్ల సీసాలన్నీ వరసగా ఓ పద్ధతి ప్రకారం పెట్టుకుంటా. ఆటంతా పూర్తయ్యే వరకూ అవి అలాగే ఉండాలంతే. ఇక గెలిచి, ట్రోఫీ అందుకున్నాక నేలమీద పడుకోవడం, ట్రోఫీని కొరకడం నాకు మొదటినుంచీ ఓ అలవాటుగా మారింది. చాలామంది నేను అతి చేస్తున్నాననుకుంటారు. నేను మాత్రం అవేమీ పట్టించుకోను.


చెల్లెలితో మాట్లాడతా

మా చెల్లి పేరు మారియా ఇసాబెల్‌. మొదటినుంచీ మా ఇద్దరికీ అనుబంధం ఎక్కువ. అందుకే నేనెంత బిజీగా ఉన్నా సరే.. రోజూ తనతో మాట్లాడాల్సిందే. ఒకవేళ మాట్లాడే తీరిక లేకపోతే మెసేజ్‌ అయినా చేస్తా. ఇలా రోజులో పదిసార్లు ఏదో ఒక రూపంలో మేమిద్దరం మాట్లాడుకుంటాం.


ఎందుకో నచ్చవు

చాలా మంది ‘ప్రముఖులు కుక్కపిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు మీరెందుకు పెంచుకోవడంలేద’ని అడుగుతుంటారు. నాకు ఎందుకో కుక్కలు నచ్చవు. అవంటే భయం కూడా... అందుకే వాటికి దూరంగా ఉంటా. వాటితోపాటు నాకు చీకటన్నా భయమే.


తీరిక దొరికితే...

నాకు గోల్ఫ్‌, ఫుట్‌బాల్‌, పోకర్‌ అంటే ఇష్టం. వీటిని చూడటమే కాదు ఆడుతుంటా కూడా. ఇవి కాకుండా ప్లేస్టేషన్‌ ముందు ఎక్కువసేపు గడుపుతుంటా.


అప్పుడప్పుడూ వంటింట్లోకి

ఆటకు సంబంధించి ఏదయినా ఒత్తిడిగా అనిపించినప్పుడు... ఏం చేయాలో తెలియకపోతే వంటింట్లోకి దూరిపోయి ఏదో ఒకటి వండేస్తుంటా. అలా వండటం వల్ల నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. వంట నాకు మంచి స్ట్రెస్‌ బస్టర్‌గా పని చేస్తుంది.

ఇష్టపడే సినిమాలు: గ్లాడియేటర్‌, టైటానిక్‌


ప్రేమ మొదలైందలా...

నా భార్య మారియా ఫ్రాన్సిస్కా పెరెల్లో మా చెల్లెలికి ఫ్రెండ్‌. ఆ పరిచయమే ప్రేమకు దారితీసింది. మూడేళ్లక్రితమే ఇద్దరం పెళ్లిచేసుకున్నాం. తను నాకు మంచి స్నేహితురాలు కూడా.


స్కూలు ప్రారంభించా

నా వంతుగా సమాజానికి ఏదో ఒకటి చేయాలని అనిపించింది. దాంతో రఫా నాదల్‌ ఫౌండేషన్‌ను నెలకొల్పి సేవా కార్యక్రమాలను ప్రారంభించా. ఆ ఫౌండేషన్‌లో భాగంగానే 2010లో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో ‘నాదల్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ టెన్నిస్‌ స్కూల్‌’ను నేనూ అమ్మా కలిసి ప్రారంభించాం. పేద పిల్లలకు క్రీడల్లో తర్ఫీదు ఇవ్వడం ప్రధాన ఉద్దేశమైనా చదువూ, ఆరోగ్యం, ఆహారం... ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..