నా ఆలోచన నాన్నకు ఎంతో నచ్చింది

ఆకాశ్‌ అంబానీ... నిన్నమొన్నటివరకూ అపర కుబేరుడైన తండ్రి చాటు తనయుడిగానే పెరిగిన ఈ అంబానీల వారసుడు ఇప్పుడు రిలయన్స్‌ జియోకు ఛైర్మన్‌గా కీలక బాధ్యతలు చేపట్టాడు. జియోను

Updated : 10 Jul 2022 05:29 IST

నా ఆలోచన నాన్నకు ఎంతో నచ్చింది

ఆకాశ్‌ అంబానీ... నిన్నమొన్నటివరకూ అపర కుబేరుడైన తండ్రి చాటు తనయుడిగానే పెరిగిన ఈ అంబానీల వారసుడు ఇప్పుడు రిలయన్స్‌ జియోకు ఛైర్మన్‌గా కీలక బాధ్యతలు చేపట్టాడు. జియోను వేగంగా విస్తరించే దిశగా ప్రణాళికలు వేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్న ఈ యువ వ్యాపార దిగ్గజం తనకు సంబంధించిన కొన్ని విషయాలను చెబుతున్నాడిలా...

నేను రిలయన్స్‌ జియోకు ఛైర్మన్‌ కాకముందే... నాన్న నుంచి ఎన్నో వ్యాపార సూత్రాలనూ విలువలనూ నేర్చుకున్నా. నాన్న ఓ బిజినెస్‌ మ్యాన్‌గా వ్యాపారంలో ఎలా ఎదగాలో చెబితే, అమ్మ నీతా జీవిత విలువల్ని నేర్పించింది. ఆ పాఠాలన్నీ నాకు ఇప్పుడు ఉపయోగపడతాయని అనుకుంటున్నా. నిజానికి నాన్న నాకు ఆకాశ్‌ అనే పేరు పెట్టడం వెనుక చిన్న కారణం ఉంది. అమ్మావాళ్లకు నేనూ ఈశా కవలలుగా ఐవీఎఫ్‌ పద్ధతిలో పుట్టాం. మేమిద్దరం పుట్టే సమయానికి నాన్న వస్తున్న విమానం ఆకాశంలో పర్వతాల మధ్య ప్రయాణిస్తోందట. మాకు ఆకాశ్‌, ఈశా అని పేరు పెట్టాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారట. నేను ఆకాశమైతే... ఈశా అంటే - పర్వతాలకు దేవత అని అర్థం. మా తరువాత అనంత్‌.

అమ్మ ఓ టైగర్‌మామ్‌...
మేం చాలా ధనవంతులమనీ, మా నాన్నకు వ్యాపార రంగంలో పెద్ద పేరుందనీ అమ్మ మాకు ఎప్పుడూ చెప్పేది కాదు. చిన్నప్పుడు ప్రతి శుక్రవారం స్కూలు క్యాంటీన్లో కొనుక్కునేందుకు మా ముగ్గురికీ తలో అయిదురూపాయలు ఇచ్చేది. స్కూలుకు వెళ్లాక జేబులోంచి అయిదు రూపాయలు తీస్తే ఫ్రెండ్సంతా ‘మీరు నిజంగా అంబానీ పిల్లలేనా’ అనేవారు. వాళ్లలో చాలామంది ఇంకా ఎక్కువ డబ్బు తెచ్చుకునేవారు మరి. ఓసారి అనంత్‌ ఇదే విషయాన్ని అమ్మకు చెప్పి ఇంకో అయిదురూపాయలు ఎక్కువ కావాలని అడిగినా అమ్మ నవ్విందే తప్ప ఇవ్వలేదు. నేను పదకొండో తరగతిలో ఉన్నప్పుడు రిలయన్స్‌మీద ఓ వ్యాసం రాయాల్సి వచ్చింది. అప్పుడే మేమెంత ధనవంతులమో నాకు తెలిసింది. అయినా కూడా ఆ ఛాయలేవీ మాపైన పడనిచ్చేది కాదు అమ్మ. నేను బ్రౌన్‌ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కూడా నా ఖర్చులూ, చదువూ, స్నేహితులూ, దినచర్య... ఇలా ప్రతిదీ ఎప్పటికప్పుడు తెలుసుకుని చిన్న పొరపాటు జరిగినట్లు తెలిసినా వెంటనే హెచ్చరించేది. అందుకే అమ్మకు టైగర్‌మామ్‌ అని పేరు.

తాతగారితో ఆ రోజులు గుర్తే...
నా చిన్నప్పుడే మా తాతగారు చనిపోయినా... ఆయనతో గడిపిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి. ప్రతి ఆదివారం మా కజిన్స్‌ అందరం ఆయన దగ్గర చేరేవాళ్లం. తాతగారు మాతో కబుర్లు చెబుతూనే ఎన్నో నేర్పించేవారు. ఆయన తోటలో నడుస్తుంటే నేను ఆయన పక్కనే తిరిగేవాడిని. ఆయన ఎప్పుడూ ‘డబ్బు పోయినా మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ సమయం పోతే మాత్రం తిరిగి రాదు. అందుకే సమయాన్ని గౌరవించాల’ని చెప్పేవారు. అన్నట్టు... మా ఇద్దరికీ గుర్‌ పాప్‌డీ అంటే చాలా ఇష్టం.

మొదటిసారి కోప్పడ్డారు
నాన్న తన వ్యాపారాలతో బిజీగా ఉన్నా సరే... మా ముగ్గురినీ ఓ కంట కనిపెడుతూనే ఉండేవారు. అలా గమనించే నన్ను తిట్టారోసారి. ఏమయ్యిందంటే... ఏదో చిన్న విషయంపైన ఓసారి మా సెక్యూరిటీ అతనిమీద గట్టిగా అరిచేశాను. నాన్న అది దూరం నుంచి చూసి... గబగబా వచ్చి నన్ను కోప్పడి అతనికి సారీ చెప్పమన్నారు. ఆ తరువాత - ఎంత ధనవంతులమైనా సాటివాళ్లను - ముఖ్యంగా పెద్దవాళ్లను గౌరవించాలని చెప్పి మరోసారి ఆ తప్పు చేయొద్దంటూ హెచ్చరించారు.

ప్రేమకథ మొదలైందలా...
నా భార్య శ్లోకా, నేనూ చిన్నప్పటినుంచీ ఒకే క్లాస్‌. మొదటినుంచీ నాకు తనంటే ఇష్టమే కానీ.. చెప్పలేకపోయేవాడిని. పన్నెండో తరగతి పరీక్షలు అయిపోయాక ధైర్యం చేసి ‘ఐ లవ్యూ’ అని చెప్పా. బహుశ తనకూ నేనంటే ఇష్టమనుకుంటా. వెంటనే ‘ఎస్‌’ అనేసింది. అప్పుడే మా ఇళ్లల్లో ఈ విషయాన్ని చెప్పడం, వాళ్లూ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం జరిగిపోయింది.

ఆ తరువాత మేమిద్దరం పై చదువుల కోసం అమెరికా వెళ్లాం. నేను బ్రౌన్‌ యూనివర్సిటీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ చదివితే.. శ్లోక ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో ఆంత్రోపాలజీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో న్యాయవిద్యలో మాస్టర్స్‌ చేసింది. చదువైపోయాక తను ఇండియా వచ్చేసి వాళ్ల నాన్నగారి వజ్రాల వ్యాపారంలో డైరెక్టర్‌గా చేరింది.

భారత్‌కు వచ్చా..
శ్లోక భారత్‌కు వచ్చేసినా.. నేను మాత్రం అమెరికాలోనే స్థిరపడాలనుకునేవాడిని. అలాంటి సమయంలో నన్ను కలిసేందుకు అమెరికా వచ్చిన నాన్న... కంప్యూటరు ముందు కూర్చుని ఏదో పని చేస్తున్న నాతో... ‘నీకు టెక్నాలజీ అంటే ఇష్టం కదా... అసలు కంప్యూటరు నీకెలా ఉపయోగపడుతుంద’ని అడిగారు. నేను వెంటనే కంప్యూటరు వల్ల కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, ఏదయినా చదువుకోవచ్చు, పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు.. అంటూ నాకు తెలిసినవన్నీ చెప్పా. దాంతో నాన్న ‘నీకు తెలిసిన ఆ విషయాలన్నింటినీ భారతీయులకూ తెలియజేసేందుకు సిద్ధంగా ఉండు..’ అంటూనే తన ఆలోచనల్లో ఉన్న జియో ప్రాజెక్టు గురించి వివరించారు. అందులో నేనూ కీలకపాత్ర పోషించాలన్నారు. దాంతో కొద్ది రోజుల్లోనే నేనూ ఇండియా వచ్చేశా. ఆ తరువాత నేనూ, ఈశా కలిసి రిలయన్స్‌ జియో ప్రాజెక్టులో భాగం అయ్యాం.

ఆ మార్పులు చేశా...
మా కంపెనీలో చేరిన కొత్తల్లో కొన్నాళ్లు కేవలం సంస్థ పనితీరును గమనించా. జియోలో పనిచేయడం మొదలుపెట్టాక నాన్న నన్ను నాన్‌ - ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, హెడ్‌ ఆఫ్‌ స్ట్రాటజీగా నియమించారు. మేమంతా కలిసి ఎన్నో ప్రయోగాలు చేసి, రాత్రింబగళ్లు కష్టపడ్డాక జియో ఫోన్‌ను విడుదల చేశాం. క్రమంగా 4జి, 4జి ప్లస్‌, ఇంటర్నెట్‌ సేవలు, టెలివిజన్‌... వంటివన్నీ అందుబాటులోకి తెచ్చాం. ఓ వైపు జియో సేవల్ని మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు మా సంస్థలోనూ కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధమయ్యా. ఒకప్పుడు మా ఉద్యోగులు తమతమ క్యాబిన్లలో కూర్చుని పనిచేసేవారు. నేను వచ్చాక మా సంస్థను ఓపెన్‌ ఆఫీసు పద్ధతిలోకి మార్చా. అంటే... ఉద్యోగులంతా ఎదురెదురుగా కూర్చుని పనిచేసేలా... అందరూ అందరికీ కనపించేలా అన్నమాట. నేను కూడా ఓ సగటు ఉద్యోగిలానే కూర్చుని పనిచేయడం మొదలుపెట్టా. నాన్నకు ఈ ఆలోచన ఎంతో నచ్చి.. ఇతర రిలయన్స్‌ ఆఫీసుల్లోనూ ఓపెన్‌ ఆఫీస్‌ పద్ధతిని తీసుకొచ్చారు.

నాన్న నుంచి ఎంతో నేర్చుకున్నా...
నేను సంస్థలో చేరిన కొత్తల్లో ఏ మీటింగ్‌ జరుగుతున్నా సరే... నాన్న తన పక్కన నన్ను కూర్చోబెట్టుకునేవారు. మీటింగ్‌ అయ్యాక ప్రతి అంశాన్నీ విశ్లేషించి చెబుతూ నా సందేహాలన్నీ తీర్చేవారు. అనుభవపూర్వకంగా తెలుసుకునే విషయాల వల్ల ఎంతో జ్ఞానం వస్తుందని చెప్పేవారు. సంస్థను అభివృద్ధి చేయాలంటే... మనమీద మనకు నమ్మకం, ఎదుటివారిపట్ల గౌరవం ఉండాలనేవారు. మనం ఆకాశాన్ని అందుకున్నా.. కాళ్లు మాత్రం భూమిమీదే ఉండాలని వివరించేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే మమ్మల్ని సగటు మధ్యతరగతి వాళ్లలా ఉండమనేవారు.

ఖాళీ సమయం ఇంట్లోవాళ్లతోనే...
నాకూ, మా నాన్నకూ ఏ మాత్రం ఖాళీ దొరికినా ఇద్దరం కలిసి సినిమాలు చూస్తాం. లేదంటే మిగిలిన కుటుంబసభ్యులతో గడపడానికి ఇష్టపడతా. ముఖ్యంగా ఆదివారాలు మేమంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తాం.

ఆ రెండూ ఇష్టమే...
నాకు చిన్నప్పటినుంచీ క్రికెట్‌, ఫుట్‌బాల్‌ అంటే చెప్పలేనంత ఇష్టం. వాటిపైన ఇష్టంతోనే ఐపిఎల్‌ ముంబయి ఇండియన్స్‌లో, ఇండియన్‌ సూపర్‌లీగ్‌లో భాగస్వామినయ్యా. నేను చదువుకుంటున్నప్పుడు దాదాపు అయిదేళ్లపాటు మా స్కూల్‌ ఫుట్‌బాల్‌ టీంలో ఆడాను. అలాగే మా రిలయన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌తో అనుసంధానమై... ఇప్పటివరకూ సుమారు పదిలక్షలమందికి బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇప్పించాం. వాళ్లల్లో కొందరు జాతీయస్థాయి పోటీలకు వెళ్లి పతకాలు కూడా అందుకున్నారు. క్రీడలపైన ఉన్న ఆ ఇష్టంతోనే 1983 వరల్డ్‌కప్‌లో సునీల్‌ గవాస్కర్‌ ఆడిన క్రికెట్‌ బ్యాటును సొంతం చేసుకున్నా. క్రీడలు కాకుండా సెయిలింగ్‌, డాక్యుమెంటరీలు చూడటం, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ అన్నా ఇష్టమే. అందుకే అప్పుడప్పుడూ కుటుంబసభ్యులతో కలిసి అడవుల్లోకి వెళ్లి... నాకు నచ్చిన వాటిని క్లిక్‌మనిపిస్తుంటాను.

ముగ్గురం ఒకటే..
ఈశా, నేనూ అనంత్‌  ఒకేలా ఆలోచిస్తాం. మేం ముగ్గురం ఇంట్లో ఉన్నామంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జాలీగా గడిపేస్తాం.

ఆ పేరు వెనుక..
మా అబ్బాయి పేరు పృథ్వి ఆకాశ్‌ అంబానీ. ఇప్పుడిప్పుడే స్కూలుకు వెళ్తున్నాడు. వాడికి ఆ పేరు పెట్టడం వెనుకా చిన్న కారణం లేకపోలేదు. నా పేరు ఆకాశ్‌.. అంటే ఆకాశం కాబట్టి.. పక్కనే భూమి కూడా ఉండాలనే ఉద్దేశంతో వాడికి పృథ్వి అని పెట్టాం.

కార్లు కొంటుంటా
నాకు కార్లంటే చాలా మోజు. నా దగ్గర మర్సిడేజ్‌ బెంజ్‌ - జి వాగన్‌, బెంట్లీ బెంటెగా, రేంజ్‌రోవర్‌ వోగ్‌, రోల్స్‌రాయ్స్‌, మేబాక్‌ 62, బీఎండబ్ల్యూ 5 సిరీస్‌, లాంబోర్గిని...  వంటివెన్నో ఉన్నాయి. వాటిలో లాంబోర్గిని నడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతా. ఒకవేళ నేనూ అనంత్‌ కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే బెంట్లీ బెంటెగాను ఎంచుకుంటాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..