ఎప్పుడూ పెద్దవాళ్లతోనే ఆడేవాణ్ని!

టీమ్‌ ఇండియాలో యువ కెరటాలు దూసుకొస్తున్నాయి. అందుకు నిదర్శనం ఈ మధ్య వన్డేల్లో వరుసగా ఇద్దరు యువకులు డబుల్‌ సెంచరీలు చేయడం.

Updated : 16 Apr 2023 11:14 IST

ఎప్పుడూ పెద్దవాళ్లతోనే ఆడేవాణ్ని!

టీమ్‌ ఇండియాలో యువ కెరటాలు దూసుకొస్తున్నాయి. అందుకు నిదర్శనం ఈ మధ్య వన్డేల్లో వరుసగా ఇద్దరు యువకులు డబుల్‌ సెంచరీలు చేయడం. వారిలో శుభ్‌మన్‌ గిల్‌ ఒకడు. 23 ఏళ్లకే... ఆ రికార్డు సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు గిల్‌. పంజాబ్‌లోని ఓ గ్రామం నుంచి మొదలైన అతడి కథ ఇది!

చెక్కబ్యాట్‌... ప్లాస్టిక్‌ బాల్‌...

మాది పంజాబ్‌, ఫజిల్కా జిల్లాలోని చిన్న గ్రామం. వ్యవసాయ కుటుంబం. నాన్న క్రికెట్‌ అభిమాని. చిన్నప్పుడు ఆయనతోపాటు టీవీలో క్రికెట్‌ ఎక్కువగా చూసేవాణ్ని. మూడేళ్లనుంచే ప్లాస్టిక్‌ బ్యాట్‌, బాల్‌తో ఆడేవాణ్ని. నా ఆసక్తి చూసి తాతయ్య చెక్క బ్యాట్‌ చేసిచ్చారు. ప్లాస్టిక్‌ బంతిని గోడకి కొట్టి అది తిరిగి వస్తే బ్యాట్‌తో కొట్టేవాణ్ని. తిన్నగా కొట్టడంతో నేరుగా నా దగ్గరకే వచ్చేది. అలా కొన్ని నిమిషాలపాటు నిరంతరాయంగా ఆడటాన్ని గమనించారు నాన్న. తర్వాత బ్యాటింగ్‌లో ప్రాథమిక అంశాలు నేర్పారు.


అండర్‌-19 దారే మేలని..
పదకొండేళ్లకే పంజాబ్‌ అండర్‌-16 జట్టుకి ఎంపికయ్యా. 16 ఏళ్లకే అండర్‌-19... ఇలా ఎప్పుడూ నాకంటే వయసులో పెద్దవాళ్లతో ఆడేవాణ్ని. దాంతో నా ఆత్మవిశ్వాసమూ పెరిగింది. జాతీయ జట్టులో స్థానానికి రెండు దారులున్నాయి... అవి అండర్‌-19 ప్రపంచకప్‌ లేదా రంజీలు ఆడటం. రంజీలంటే సుదీర్ఘమైన ప్రక్రియ. అందుకే అండర్‌-19ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. 2018లో జరిగిన ప్రపంచకప్‌లో అయిదు ఇన్నింగ్స్‌లో 372 రన్స్‌ చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’ అవార్డు అందుకున్నా. అదే సమయంలో ఐపీఎల్‌ వేలం జరగ్గా.. కోల్‌కతా జట్టు నన్ను రూ.1.8 కోట్లకు కొంది. 2019లో ఇండియా వన్డే జట్టులోకీ 2020 చివర్లో టెస్టుల్లోకీ ఎంపికయ్యా.


సచిన్‌ స్ఫూర్తితో..

నాన్న సచిన్‌కి పెద్ద అభిమాని. నా చిన్నప్పుడు నాన్న పక్కనే కూర్చొని సచిన్‌ బ్యాటింగ్‌ హైలెట్స్‌ టీవీలో చూసేవాణ్ని. తెలియకుండానే సచిన్‌లా కవర్‌ డ్రైవ్‌, స్ట్రయిట్‌ డ్రైవ్‌, బ్యాక్‌ ఫుట్‌ పంచ్‌... ఆడేవాణ్ని.వాటిలో బ్యాక్‌ ఫుట్‌ పంచ్‌ నేను ఆడుతుంటే చాలా సంతృప్తిగా ఉండేది. టీనేజ్‌కి వచ్చేసరికి అదే నా సిగ్నేచర్‌ షాట్‌ అయ్యింది. సచిన్‌ తర్వాత ఎక్కువగా అనుకరించేది విరాట్‌ కొహ్లీనే... ముఖ్యంగా దూకుడుగా ఆడటంలో.


ప్రపంచకప్‌ లక్ష్యం..

ఎప్పుడూ ఆటపైనే నా దృష్టి. నా చిన్నప్పుడు పొలంలో చిన్న గ్రౌండ్‌ తయారుచేశారు నాన్న. అక్కడికి ఊళ్లోని పిల్లల్ని పిలిచి నాకు బౌలింగ్‌ చేయమనేవారు. ఔట్‌ చేస్తే రూ.100 ఇస్తాననేవారు. డబ్బు పోకూడదని వికెట్‌ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడేవాణ్ని. దానివల్ల చిన్నప్పుడే వికెట్‌ విలువ ఏంటో అర్థమైంది. కెరియర్‌ ప్రారంభంలో 40-50 పరుగులు చేస్తుంటే.. ‘నీ బ్యాట్‌ నుంచి చిరుజల్లు తప్పించి జడివాన కురవదా’ అనేవారు నాన్న. వరుసగా సెంచరీలూ, ఓ డబుల్‌ సెంచరీ చేశాకే ఆయన ముఖంలో సంతోషం కనిపించింది. ప్రపంచకప్‌ గెలవడం నా లక్ష్యం.


ఆటవిడుపు కోసం..

వీడియో గేమ్‌లు... ముఖ్యంగా ఫిఫా, ప్లేస్టేషన్‌ ఎక్కువగా ఆడుతుంటా. పంజాబీ పాటలు వింటుంటా.


నాకోసం మొహాలీకి...

2006లో ఇండియా- ఇంగ్లాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ చూడ్డానికి మొహాలీ వచ్చాం. స్టేడియం పరిసరాల్లో క్రికెట్‌ వాతావరణం చూసి... అక్కడ ఉంటే నేను క్రికెటర్‌గా ఎదిగేందుకు వీలుగా ఉంటుందనుకున్నారు నాన్న. 2007లో అమ్మ(కీరత్‌), నాన్న(లఖ్వీందర్‌ సింగ్‌) అక్క(షహ్నీల్‌) నేనూ మొహాలీ వచ్చేశాం. చదువుకుంటూనే మొహాలీ క్రికెట్‌ అసోసియేషన్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నా. ఉదయం నాలుగింటికి అకాడమీకి చేరేవాణ్ని. రెండు గంటల ప్రాక్టీసు తర్వాత స్కూల్‌... అక్కణ్నుంచి వచ్చాక మధ్యాహ్నం నాన్న పర్యవేక్షణలో ఓ గంట, ఆపైన అకాడమీలో మరో మూడు గంటలు ప్రాక్టీసు చేసేవాణ్ని.


సైంటిస్ట్‌ అయ్యేవాణ్నేమో!

చదువు విషయంలో ఇంట్లోనే కాదు, టీచర్లూ ఒత్తిడి చేసేవారు కాదు. చిన్నప్పుడు ప్రతి సబ్జెక్టులో 90 శాతం మార్కులు వచ్చేవి. ఏడో తరగతి వరకూ అలాగే చదివేవాణ్ని. తర్వాత క్రికెట్‌ మ్యాచ్‌లు పెరగడంతో చదువుకు తగిన సమయం కేటాయించలేకపోయా. నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్‌ సైన్స్‌. క్రికెటర్‌ కాకపోయుంటే సైంటిస్ట్‌ అయ్యేవాణ్నేమో.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..